రష్యా ఫెడరేషన్ అధ్యక్షుడు మాననీయ వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సహకారంలో ప్రగతిపై సమీక్షించారు. దీంతోపాటు పరస్పర ప్రయోజనంగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. రష్యాలో ఇటీవలి పరిణామాల గురించి అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రికి వివరించారు.
ఉక్రెయిన్‌లో పరిస్థితిపై చర్చించిన సమయంలో చర్చలు, దౌత్యం ద్వారా సమస్య పరిష్కారంపై భారత్ వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కృషిని, తదనుగుణంగా పరస్పర సంభాషణను కొనసాగించాలని వారిద్దరూ నిర్ణయించారు.