యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ కీర్ స్టార్మర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాట్లాడారు.
యుకె కు ప్రధానిగా పదవీబాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆయనకు, ఎన్నికలలో అసాధారణమైన గెలుపును సాధించిన లేబర్ పార్టీకి అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
రెండు దేశాల మధ్య గల చరిత్రాత్మక సంబంధాలను నేతలు ఇరువురు గుర్తుకు తెచ్చుకొన్నారు. భారతదేశానికి, యుకెకు మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతపరచడం తో పాటు ముందుకు తీసుకుపోవాలన్న వారి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. భారతదేశం-యుకె స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాన్ని ఉభయ పక్షాలకు ప్రయోజనకరం గా ఉండే విధంగా త్వరగా కొలిక్కి తీసుకు వచ్చే దిశ లో కృషి చేద్దామంటూ నేతలు ఇద్దరూ వారి అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
యుకె లో సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కై భారతీయ సముదాయం అందిస్తున్నటువంటి సకారాత్మకమైన తోడ్పాటులను ప్రశంసిస్తూ, ఇరు పక్షాలు ప్రజల మధ్య పరస్పర సంబంధాలను ప్రోత్సహించడాన్ని ఇకమీదట కూడా కొనసాగించడానికి సమ్మతి ని తెలిపాయి.
భారతదేశాన్ని సందర్శించేందుకు వీలయినంత త్వరలో బయలుదేరి రావాలంటూ ప్రధాని శ్రీ కీర్ స్టార్మర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
ఇద్దరు నేతలు ఒకరితో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండడాన్ని ఇకమీదట కూడా కొనసాగించాలని అంగీకరించారు.