నేపాల్‌లో ఒకరోజు పర్యటనలో భాగంగా 2022 మే 16న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందుగా అక్కడి లుంబినీలోగల మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. గౌరవనీయులైన నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్‌బా కూడా ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుద్ధుని కచ్చితమైన జన్మస్థలాన్ని సూచించే ఆలయ ప్రాంగణంలోని శిలవద్ద దేశాధినేతలిద్దరూ నివాళి అర్పించారు. అటుపైన బౌద్ధ సంప్రదాయాల ప్రకారం నిర్వహించిన పూజా కార్యక్రమాలకూ వారు హాజరయ్యారు.
ఆలయానికి సమీపంలోని అశోక స్తంభం వద్ద ప్రధానమంత్రులు ఇద్దరూ దీపారాధన చేశారు. క్రీస్తుపూర్వం 249లో అశోక చక్రవర్తి ప్రతిష్టించిన ఈ స్తంభం, లుంబినీ బుద్ధుని జన్మస్థలమని తెలిపే తొలి శిలాశాసనం ఇక్కడ కనిపిస్తుంది. ఈ కార్యక్రమం అనంతరం 2014లో బోధ్‌గయ నుంచి ప్రధాని మోదీ తీసుకెళ్లి బహూకరించగా లుంబినిలో నాటిన బోధి మొక్కకు ప్రధానులిద్దరూ నీరు పోశారు. చివరగా ఆలయంలోని సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు.