యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం టెలిఫోన్ లో సంభాషించారు.
ఈ ఏడాది ప్రారంభంలో తమ వర్చువల్ సమావేశం అనంతరం ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని ఉభయ నాయకులు సమీక్షించారు. తమ వర్చువల్ సమావేశంలో ఆమోదించిన రోడ్ మ్యాప్ 2030 కింద ఇప్పటికే చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి ప్రకటించారు. అలాగే వాణిజ్య భాగస్వామ్యం విస్తరణలో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించి ఉభయ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి బంధాలను పటిష్ఠం చేసుకునే అవకాశాలున్నాయని అంగీకరించారు.
నవంబర్ నెల ప్రారంభంలో గ్లాస్గోలో జరగబోయే యుఎన్ఎఫ్ సిసిసి-సిఓపి-26 సమావేశాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలపై కూడా ఉభయులు విస్తృతంగా చర్చించారు. వాతావరణ కార్యాచరణకు భారతదేశం కట్టుబాటును ప్రధానమంత్రి మరోసారి తెలియచేస్తూ పునరుత్పాదక ఇంధనం విస్తరణకు ఆకాంక్షాపూరిత లక్ష్యాలు, ఇటీవల ప్రకటించిన జాతీయ హైడ్రోజెన్ మిషన్ రెండింటిలోనూ అది ప్రతిబింబిస్తున్నదని ఆయన తెలిపారు.
ప్రాంతీయ పరిణామాలు... ప్రత్యేకించి ఆఫ్ఘన్ లో తాజా పరిస్థితిపై కూడా వారు పరస్పరం అభిప్రాయాలు తెలియచేసుకున్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం; మహిళలు, మైనారిటీల హక్కులు, మానవ హక్కుల విభాగాల్లో ఉమ్మడి అంతర్జాతీయ విధానం రూపొందించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.