జపాన్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు, నేను 2022 మే నెల 23, 24 తేదీలలో జపాన్ లో పర్యటిస్తున్నాను.
14వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, 2022 మార్చి నెలలో, ప్రధానమంత్రి కిషిదాకు ఆతిథ్యం ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నా టోక్యో పర్యటనలో భాగంగా, భారత-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో. మా సంభాషణను మరింత కొనసాగించాలని ఎదురుచూస్తున్నాను.
జపాన్ లో, క్వాడ్ నాయకులతో జరిగే రెండవ వ్యక్తిగత సదస్సు లో కూడా పాల్గొంటాను. ఇది క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి నాలుగు క్వాడ్ దేశాల నాయకులకు అవకాశం కల్పిస్తుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలు, పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యల గురించి కూడా ఈ సందర్భంగా మేము పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకుంటాము.
నేను అధ్యక్షుడు జోసెఫ్ బిడెన్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తాను. అక్కడ మేము అమెరికాతో మా బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడం గురించి చర్చిస్తాము. ప్రాంతీయ అభివృద్ధి, సమకాలీన ప్రపంచ సమస్యలపై కూడా మేము మా సంభాషణను కొనసాగిస్తాము.
కొత్తగా ఎన్నికైన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తొలిసారిగా క్వాడ్ నాయకుల సదస్సులో పాల్గొంటున్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద భారత-ఆస్ట్రేలియా దేశాల మధ్య బహుముఖ సహకారం, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలను ఆయనతో చర్చించే అవకాశమున్న ద్వైపాక్షిక సమావేశం కోసం నేను ఎదురుచూస్తున్నాను.
భారత, జపాన్ దేశాల మధ్య ఆర్థిక సహకారం మా ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశం. మార్చి లో జరిగిన సమావేశం సందర్భంగా, ప్రధానమంత్రి కిషిడా మరియు నేను జపాన్ నుండి భారతదేశానికి వచ్చే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ల జపాన్ ఎన్ ల మేర, ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు, ఆర్ధిక సహకారం సాధించాలనే మా ఉద్దేశాన్ని ప్రకటించాము. రేపు జరిగే పర్యటన సందర్భంగా, ఈ లక్ష్య సాధనలో, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నేను జపాన్ వ్యాపారవేత్తలతో సమావేశమవుతాను.
జపాన్ తో మన సంబంధాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న దాదాపు 40,000 మంది భారతీయ సంతతి సభ్యులు జపాన్ లో ఉన్నారు. వారితో సంభాషించడానికి నేను ఎదురుచూస్తున్నాను.