హరహర మహాదేవ్!
మీ అందరి అనుమతితో నేను ప్రారంభిస్తున్నాను. హర హర మహాదేవ్, బాబా విశ్వనాథ్, మాతా అన్నపూర్ణల పవిత్ర భూమి అయిన కాశీకి చెందిన సోదర సోదరీమణులందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ హాపీ దీవాళి, దేవ్ దీపావళి, అన్నకూట్, భాయి దూజ్, ప్రకాశోత్సవ్, చాత్ శుభాకాంక్షలు.
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ జీ, ఉత్సాహవంతమైన యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి మన్ సుఖ్ మాండవీయజీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, కేంద్రలోని నా సహచరుడు శ్రీ మహేంద్రనాథ్ పాండేజీ, రాష్ట్ర మంత్రులు అనిల్ రాజ్ భర్ జీ, నీలకంఠ్ తివారీజీ, రవీంద్ర జైస్వాల్ జీ, ఇతర మంత్రులు, నా పార్లమెంటు సహచరులు శ్రీమతి సీమా ద్వివేదిజీ, శ్రీమతి బిపి సరోజ్ జీ, వారణాసి మేయర్ శ్రీమతి మృదుల జైస్వాల్ జీ, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా ఆస్పత్రులు, దేశంలోని వైద్య సంస్థలకు చెందిన ఆరోగ్య వృత్తి నిపుణులు, బెనారస్ కు చెందిన నా సోదర సోదరీమణులారా,
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా మన దేశం 100 కోట్ల వ్యాక్సిన్ల మైలురాయిని చేరింది. బాబా విశ్వనాథ్ ఆశీస్సులు, గంగా మాత చెక్కుచెదరని వైభవం, కాశీ ప్రజల ఎనలేని విశ్వాసంతో ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పురోగమిస్తోంది. నేను మీ అందరికీ గౌరవంతో అభివాదం చేస్తున్నాను. నేడు కొద్ది సమయం ముందు ఉత్తర ప్రదేశ్ లోని 9 వైద్య కళాశాలలను ప్రజలకు అంకితం చేశాను. ఇవి కోట్లాది మంది పేదలు, దళిత, వెనుకబడిన, దోపిడీకి, నిరాదరణకు గురవుతున్న పూర్వాంచల్ ప్రజలు, యావత్ ఉత్తర ప్రదేశ్, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరం అవుతాయి. నగరాల్లోని పెద్ద ఆస్పత్రులకు వెళ్లలేని వారి ఇక్కట్లు తీరిపోతాయి.
మిత్రులారా,
ఒక పద్యం ఉంది.
శివ, శక్తి కాశీలో నివాసం ఉంటారు. జ్ఞానానికి ఆలవాలం అయిన కాశీ నగరం మనకి నొప్పి, బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాంటప్పుడు వ్యాధులు, బాధల నుంచి ప్రజలకు విముక్తి కలిగించే మహా సంకల్పంతో చేపట్టిన ఇంత పెద్ద ఆరోగ్య కార్యక్రమం ప్రారంభించడానికి కాశీని మించిన మంచి ప్రదేశం ఏమి ఉంటుంది? కాశీకి చెందిన నా సోదర సోదరీమణులారా, ఈ వేదిక నుంచి రెండు ప్రధాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రూ.64,000 కోట్లకు పైబడిన భారీ ప్రణాళికతో దేశ ప్రజల కోసం కాశీ కేంద్రంగా భారత ప్రభుత్వం ప్రారంభిస్తున్న తొలి భారీ ఆరోగ్య కార్యక్రమం ఒకటి కాగా రెండోది కాశీ, పూర్వాంచల్ అభివృద్ధి కోసం వేలాది కోట్ల రూపాయలతో చేపడుతున్న ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమం. ఈ రెండు పథకాలను కలిపితే సుమారు రూ.75,000 కోట్ల విలువ గల ప్రాజెక్టులు ప్రారంభించడం లేదా అంకితం చేయడం జరుగుతోంది. కాశీ నుంచి ప్రారంభిస్తున్న ఈ పథకాలకు మహాదేవుని ఆశీస్సులు కూడా ఉంటాయి. అప్పుడే సంక్షేమం, విజయం రెండూ లభిస్తాయి. మహాదేవుని ఆశీస్సులున్నప్పుడు బాధల నునంచి విముక్తి కలగడం కూడా తప్పనిసరి.
మిత్రులారా,
ఉత్తర ప్రదేశ్ తో సహా దేశం మొత్తంలో ఆరోగ్య మౌలిక వసతుల పటిష్ఠతకు రూ.64,000 కోట్ల విలువ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కార్యక్రమం కాశీ నుంచి దేశప్రజలకు అంకితం చేసే భాగ్యం నాకు కలిగింది. రాబోయే కాలంలో ఎలాంటి మహమ్మారులనైనా దీటుగా ఎదుర్కొనగల; గ్రామ, బ్లాక్ స్థాయి వరకు మన ఆరోగ్య వ్యవస్థను స్వయం సమృద్ధం చేయడంతో పాటు విశ్వాసాన్ని పాదుగొల్పగల సమర్థతను ఈ ప్రాజెక్టు మనకి అందిస్తుంది. అదే విధంగా కాశీ నగరం కోసం రూ.5,000 కోట్ల విలువ గల మౌలిక వసతుల ప్రాజెక్టులు కూడా ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఘాట్ల సుందరీకరణ; గంగ, వరుణ నదుల శుద్ధి, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు, బిహెచ్ యులో ఇతర వసతుల కల్పన పనులు ఇందులో భాగంగా జరుగుతాయి. పండుగల సీజన్ లో కాశీ నుంచి ఈ అభివృద్ధి వేడుకలు జరగడం వల్ల జీవితం సరళం, ఆరోగ్యవంతం, సంపన్నవంతమై దేశం యావత్తుకు కొత్త శక్తి, బలం, విశ్వాసం చేకూరుతాయి. కాశీ సహా దేశంలోని అన్ని గ్రామాలు, నగరాల్లో నివశిస్తున్న 130 కోట్ల మంది భారతీయులకు అభినందనలు తెలియచేస్తున్నాను.
సోదర సోదరీమణులారా,
దేశంలో జరిగే ప్రతీ ఒక్క చర్యకి మౌలిక అవసరం ఆరోగ్యమని భావిస్తారు. ఆరోగ్యవంతమైన శరీరం కోసం పెట్టే పెట్టుబడిని మంచి పెట్టుబడిగా ఎల్లప్పుడూ పరిగణిస్తారు. కాని స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సుదీర్ఘ కాలం ఆరోగ్య వసతులపై అవసరమైనంత శ్రద్ధ చూపించలేదు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి బదులు నిర్లక్ష్యం చేశాయి. గ్రామాల్లో ఆస్పత్రులే ఉండేవి కావు, ఉన్నా చికిత్స చేసేందుకు ఎవరూ ఉండేవారు కారు. బ్లాక్ స్థాయి ఆస్పత్రుల్లో ఆరోగ్య పరీక్షల వసతులే లేవు. ఒకవేళ వైద్య పరీక్షలు నిర్వహించినా అవి ఎంత నిఖార్సైనవి అనే నమ్మకం ఉండేది కాదు. జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే సర్జరీ అవసరమైన తీవ్ర వ్యాధిగా నిర్ధారణ అయ్యేది. కాని అక్కడ శస్త్రచికిత్స వసతులు లేనందు వల్ల రోగులు ఎల్లవేళలా రద్దీగా ఉండే పెద్ద ఆస్పత్రులకు వెళ్లి దీర్ఘకాలం వేచి ఉండాల్సివచ్చేది. వ్యాధి తీవ్రత ముదిరి పేదలపై ఆర్థిక భారం పడిన, ఎన్నో కష్టాలపాలైన రోగులు, వారి కుటుంబాలను మనందరం చూస్తూనే ఉన్నాం.
మిత్రులారా,
మన ఆరోగ్య వ్యవస్థలోని ఈ పెద్ద లోటు పేదలు, మధ్యతరగతి వర్గాలకు చికిత్సల విషయంలో ఎనలేని ఆందోళనకు కారణమవుతోంది. దేశ ఆరోగ్య వ్యవస్థలోని ఈ లోపాలన్నింటికీ పరిష్కారం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కార్యక్రమం. ఈ రోజు రూపు దిద్దుకుంటున్న మన ఆరోగ్య వ్యవస్థ భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను దీటుగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది. వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు, వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఎలాంటి జాప్యం లేకుండా చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే నాలుగైదు సంవత్సరాల కాలంలో గ్రామం నుంచి బ్లాక్, జిల్లా, ప్రాంతం, జాతీయ స్థాయి వరకు అత్యంత అవసరమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను శక్తివంతం చేయడం దీని లక్ష్యం. దేశంలో ఆరోగ్య వసతులు అంతగా అందుబాటులో లేని ప్రాంతాలు, ప్రత్యేకించి ఈశాన్యం, ఉత్తరాఖండ్, హిమాచల్ వంటి కొండ ప్రాంత రాష్ర్టాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది.
మిత్రులారా,
దేశంలోని ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్న విభిన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కార్యక్రమంలో మూడు ప్రధానాంశాలున్నాయి. ఈ పథకం కింద దేశంలోని గ్రామాలు, నగరాల్లో వ్యాధులను తొలి దశలోనే గుర్తించగల వసతులతో ఆరోగ్యం, వెల్ నెస్ కేంద్రాలు ప్రారంభిస్తారు. ఉచిత వైద్య కన్సల్టేషన్, ఉచిత పరీక్షలు, ఉచిత మందులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. వ్యాధిని తొలి దశలోనే గుర్తించినట్టయితే అది ప్రాణాంతకం అయ్యే అవకాశాలు తక్కువ. 600 పైగా జిల్లాల్లో తీవ్ర వ్యాధులకు చికిత్స చేసేందుకు 35,000 పైగా కొత్త పడకలు ఏర్పాటు చేస్తారు. మిగతా 125 జిల్లాల్లో రిఫరల్ సదుపాయం ఉంటుంది. జాతీయ స్థాయిలో 12 కేంద్రీయ ఆస్పత్రుల్లో శిక్షణ, సామర్థ్యాల నిర్మాణ వసతుల ఏర్పాటు ఆలోచన కూడా ఉంది. అలాగే సర్జరీ నెట్ వర్క్ ను పటిష్ఠం చేసేందుకు నిరంతరం పని చేసే 15 ఎమర్జెన్సీ ఆపరేషన్‌సెంటర్లు కూడా ఈ పథకం కింద ఏర్పాటవుతాయి.
మిత్రులారా,
వ్యాధుల నిర్ధారణకు టెస్టింగ్ సదుపాయాల కల్పన ఈ పథకంలోని రెండో అంశం. వ్యాధి పరీక్షలు, పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. 730 జిల్లా స్థాయి ప్రభుత్వ ఆరోగ్య లాబ్ లు, 3,500 బ్లాక్ స్థాయి ప్రజారోగ్య యూనిట్లు సమీకృతం చేస్తారు. అలాగే ప్రాంతీయ స్థాయిలు ఐదు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాలు, 20 మెట్రోపాలిటన్ యూనిట్లు,15 బిఎస్ఎల్ లాబ్ లతో ఈ నెట్ వర్క్ మరింత పటిష్ఠం అవుతుంది.
మిత్రులారా,
ఈ పథకంలో మూడో ప్రధానాంశం మహమ్మారి సంబంధిత పరిశోధన వసతుల విస్తరణ, సాధికారత. ప్రస్తుతం దేశంలో 80 వైరల్ వ్యాధుల డయాగ్నస్టిక్, పరిశోధన లాబ్ లున్నాయి. వాటిని మరింత మెరుగుపరుస్తారు. మహమ్మారుల కోసం బయో సేఫ్టీ లెవెల్ -3 లాబ్ ల అవసరం ఉంది. ఈ లక్ష్యంతో అలాంటివి 15 కొత్త లాబ్ లు అందుబాటులోకి తెస్తారు. ఇవి కాకుండా నాలుగు కొత్త నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ వైరాలజీ, ఒక నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ కూడా ఏర్పాటవుతాయి. దక్షిణాసియా ప్రాంతీయ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఈ పరిశోధన నెట్ వర్క్ ను పటిష్ఠం చేస్తుంది. సూక్ష్మంగా చెప్పాలంటే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కార్యక్రమం కింద దేశంలోని ప్రతీ ఒక్క భాగంలోనూ చికిత్స నుంచి కీలకమైన పరిశోధన వరకు అన్ని వసతులు గల చక్కని వాతావరణం అభివృద్ధి అవుతుంది.
మిత్రులారా,
దశాబ్దాల క్రితమే ఈ కృషి జరిగి ఉంటే నేటి పరిస్థితి గురించి నేను వివరించాల్సివచ్చేది కాదు. గత ఏడు సంవత్సరాలుగా మేం పరిస్థితుల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాన్ని మరింత భారీగా, ఉదృతంగా చేయాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజుల క్రితం నేను దేశవ్యాప్తంగా అమలు పరచగల గతిశక్తి అతి భారీ మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టు గతిశక్తిని ఢిల్లీ నుంచి ప్రారంభించాను. ఈ రోజు దేశంలోని ప్రతీ ఒక్క పౌరుని ఆరోగ్యంగా ఉంచేందుకు రూ.64,000 కోట్ల విలువ గల మరో భారీ ప్రాజెక్టును పవిత్ర భూమి కాశీ నుంచి ప్రారంభిస్తున్నాను.
మిత్రులారా,
ఆరోగ్య మౌలిక వసతులకు సంబంధించిన ఇంత భారీ ప్రాజెక్టు అభివృద్ధి అయితే ఆరోగ్య సేవలు మెరుగుపడడమే కాదు, దేశంలో పరిపూర్ణమైన ఉపాధి వాతావరణం కూడా ఏర్పడుతుంది. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, లాబ్ లు, ఫార్మసీలు, పారిశుధ్యం, కార్యాలయాలు, ప్రయాణ రవాణా వసతులు, ఆహార ఔట్ లెట్లు...ఇంకా ఎన్నో ఇతర ఉద్యోగాలను ఈ స్కీమ్ సృష్టిస్తుంది. ఒక పెద్ద ఆస్పత్రి ఏర్పాటైనప్పుడు నగరం మొత్తం దాని చుట్టూనే అభివృద్ధి కావడం, ఆస్పత్రికి చెందిన జీవనోపాధి కార్యకలాపాలన్నింటికీ ఆ ప్రాంతం కేంద్రం కావడం మనందరం చూస్తూనే ఉన్నాం. అది ఆర్థిక కార్యకలాపాలకు పెద్ద కేంద్రం అవుతుంది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల ప్రాజెక్టునే తీసుకుంటే అది ఆరోగ్యానికే కాదు, ఆర్థిక స్వావలంబనకు కూడా ఒక మాధ్యమం అవుతుంది. సమగ్ర ఆరోగ్యరక్షణ రంగానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది కూడా భాగం. సమగ్ర ఆరోగ్య రక్షణ రంగం అంటే తక్కువ వ్యయాలతో అందరికీ అందుబాటులో ఉండేది. అంతే కాదు, ఆరోగ్యం, వెల్ నెస్ రెండింటి మీద సమానంగా దృష్టి పెట్టేది. ఇప్పటికే స్వచ్ఛ భారత్ అభియాన్, జల్ జీవన్ కార్యక్రమం, ఉజ్వల యోజన, పోషణ్ అభియాన్, మిషన్ ఇంద్రధనుష్ వంటి ఎన్నో కార్యక్రమాలు కోట్లాది మంది పేద ప్రజలను వ్యాధుల నుంచి కాపాడాయి. ఆయుష్మాన్ భారత్ పథకం రెండు కోట్ల మంది పైగా పేద ప్రజలకు ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స కల్పించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్యక్రమం ద్వారా చికిత్సకు సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయి.
సోదర సోదరీమణులారా,
మా ముందు ప్రభుత్వ సారథ్యం వహించిన వారికి ఆరోగ్య రక్షణ అంటే డబ్బు సంపాదన, స్కామ్ లు. వారు పేదల కష్టాల నుంచి దూరంగా పారిపోయే వారు. కాని ఇప్పుడు కేంద్రంలోను, రాష్ట్రంలోను కూడా పేదలు, నిమ్న జాతులు, అణచివేతకు గురవుతున్న వర్గాలు, వెనుకబడిన తరగతులు, మధ్యతరగతి ప్రజలు...ఇలా ప్రతీ ఒక్కరి బాధలు అర్ధం చేసుకోగల ప్రభుత్వం ఉంది. దేశంలో ఆరోగ్య వసతుల మెరుగుదలకు మేమందరం కృషి చేస్తున్నాం. గతంలో ప్రజాధనం స్కామ్ లలోకి, అలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారి బీరువాల్లోకి ప్రవహించేది. కాని ఇప్పుడది మెగా ప్రాజెక్టుల కోసం ఖర్చవుతోంది. ఇప్పుడు దేశం చరిత్రలోనే అతి పెద్ద మహమ్మారిని కూడా దీటుగా ఎదుర్కొంటోంది. స్వయం సమృద్ధ భారత్ కోసం లక్షల కోట్ల రూపాయల విలువ గల మౌలిక వసతుల నిర్మాణం జరుగుతోంది.
సోదర సోదరీమణులారా,
రాబోయే 10-12 సంవత్సరాల కాలంలో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 70 సంవత్సరాల కాలంలో అందుబాటులోకి వచ్చిన వైద్యల కన్నా ఎన్నో రెట్లు అధికంగా వైద్యులు అందుబాటులోకి వస్తారు. దేశంలో వైద్య రంగంలో జరుగుతున్న కృషిని మీరు అర్ధం చేసుకోవచ్చు. మరింత మంది వైద్యులు అందుబాటులోకి వచ్చినప్పుడు వారు దేశ నలుమూలలా, ప్రతీ ఒక్క మారుమూల ప్రాంతంలోనూ తేలిగ్గా అందుబాటులోకి వస్తారు. కొరతలను అధిగమించి కదులుతూ ప్రతీ ఒక్కరి ఆశలను తీర్చగల స్థితిలోకి దేశం కదులుతోంది.
మిత్రులారా,
వైద్య వసతులు పెరుగుతున్నాయంటే వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని కూడా అదే దామాషాలో పెంచాలి. యుపిలో కొత్త వైద్య కళాశాలలు ప్రారంభిస్తున్న వేగానికి దీటుగానే వైద్య విద్యా సీట్లు, డాక్టర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. సీట్ల పెరుగుదల వల్ల పేద తల్లిదండ్రుల సంతానం కూడా డాక్టర్ కావాలన్న తమ కల సాకారం చేసుకోగలుగుతారు.
సోదర సోదరీమణులారా,
ఈ రోజు కాశీ పరిస్థితి చూడండి. గతంలో దేశంలో గాని, ఉత్తర ప్రదేశ్ లో గాని ఇదే వేగంతో పనులు జరిగాయా? మన సాంస్కృతిక వైభవ చిహ్నం అయిన ప్రపంచంలోనే అది ప్రాచీనమైన కాశీ నగరాన్ని వారు దాని కర్మకి వదలివేశారు. వేలాడుతున్న విద్యుత్ వైర్లు, గతుకుల రోడ్లు; గంగా నది, ఘాట్ల అపరిశుభ్రత, ట్రాఫిక్ జామ్ లు, కాలుష్యం, ఎక్కడ చూసినా ఒక సంక్షోభం తాండవం చేసేది. కాని నేడు కాశీ అసలు స్వభావం చెక్కు చెదరకుండానే దాని రూపు రేఖలు మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోంది. గత ఏడు సంవత్సరాల్లో వారణాసిలో జరిగిన పనులు గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ జరగలేదు.
సోదర సోదరీమణులారా,
రింగ్ రోడ్డు లేని కారణంగా గతంలో కాశీలో ట్రాఫిక్ జామ్ నిత్యం కనిపించేది. నో ఎంట్రీ బోర్డులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూడడం బెనారస్ ప్రజలకు ఒక అలవాటయిపోయింది. కాని ఇప్పుడు రింగ్ రోడ్డు తెరవడంతో ప్రయాగ్ రాజ్, లక్నో, సుల్తాన్ పూర్, అజాంగఢ్, ఘాజీపూర్, గోరఖ్ పూర్, ఢిల్లీ, కోల్కతా సహా దేశంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించే వారు కాశీ ప్రజలను ఇబ్బంది పెట్టే అవసరం లేకుండా సాగిపోతున్నారు. పైగా ఇప్పుడు ఈ రింగ్ రోడ్డు ఘాజీపూర్ లోని బిర్నాన్ వద్ద నాలుగు లేన్ల జాతీయ రహదారితో అనుసంధానం అయింది. పలు ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాంతంలోని పలు గ్రామాలు, ప్రయాగ్ రాజ్, లక్నో, గోరఖ్ పూర్, బిహార్, నేపాల్ ప్రజల కదలికలు తేలికైపోయాయి. దీని వల్ల ప్రయాణం, వ్యాపారాలకు సరళమైన వాతావరణం ఏర్పడడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి.
సోదరసోదరీమణులారా,
దేశంలో సరైన మౌలిక వసతులు లేకపోతే అభివృద్ధి అసంపూర్ణం అయిపోతుంది. వరుణ నదిపై కొత్త వంతెనలు రావడంతో పలు గ్రామాల ప్రజలు నగరానికి రాకపోకలు సాగించడం తేలికయింది. ప్రయాగ్ రాజ్, భాదోహి, మీర్జాపూర్ ప్రజలు విమానాశ్రయానికి రాకపోకలు సాగించడం కూడా తేలికయింది. తివాచీల పరిశ్రమపై ఆధారపడుతున్నవారికి కూడా ఇది ప్రయోజనకరం అవుతుంది. అలాగే విమానాశ్రయం నుంచి నేరుగా మీర్జాపూర్ చేరి వింధ్యవాసినిని దర్శించుకోవాలని ఆకాంక్షించే వారికి కూడా మార్గం సుగమంగా మారుతుంది. నేడు కాశీ ప్రజలకు పలు రోడ్లు, వంతెనలు, పార్కింగ్ లాట్లు అంకితం చేస్తున్నాం. దీని వల్ల నగరం చుట్టుపక్కల వారికి జీవనం సరళం అవుతుంది. రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఆధునిక ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్రయాణికులకు సౌకర్యాన్ని పెంచుతుంది.
మిత్రులారా,
గంగా మాత స్వచ్ఛతకు గత కొద్ది సంవత్సరాల కాలంలో అసాధారణమైన కృషి జరిగింది. దాని ఫలితం ఇప్పుడు మీ అందరి కళ్ల ముందు కనిపిస్తోంది. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు గంగానదిలో కలవకుండా నిరోధించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఐదు మురుగుకాల్వల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ రామ్ నగర్ లో పని చేయడం ప్రారంభించింది. దీని వల్ల 50,000 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారు. గంగా మాతతో పాటు వరుణ నది స్వచ్ఛతను కూడా ప్రాధాన్యతా క్రమంలో నిలిపాం. దీర్ఘ కాలంగా నిర్లక్ష్యానికి గురైన వరుణ నది అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. వరుణ నదిని కాపాడేందుకు కాల్వల తవ్వకం పని చేపట్టడం జరిగింది. నేడు స్వచ్ఛమైన జలాలు వరుణ నదిలో ప్రవేశిస్తున్నాయి. ఆ నదికి చుట్టుపక్కల ఉన్న 13 పెద్ద, చిన్న మురుగుకాల్వల నీటి శుద్ధి కూడా జరుగుతోంది. వరుణ నదికి రెండు వైపులా దారులు, రైలింగ్, లైటింగ్, పక్కా ఘాట్లు, మెట్లు...ఇంకా ఎన్నో వసతులు పూర్తవుతున్నాయి.
మిత్రులారా,
కాశీ ఆధ్యాత్మిక, గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం. కాశీ సహా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన రైతుల పంటలు మార్కెట్ కు, విదేశాలకు తరలించుకునేందుకు గత కొద్ది సంవత్సరాల కాలంలో ఎన్నో సదుపాయాల అభివృద్ధి జరిగింది. త్వరితంగా చెడిపోయే స్వభావం ఉన్న వస్తువుల నిల్వ కేంద్రాలను ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ కేంద్రాలకు చేర్చేందుకు ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి తేవడం జరిగింది. ఇందులో భాగంగా లాల్ బహదూర్ శాస్ర్తి పళ్లు, కూరగాయల మార్కెట్ ను పునర్నిర్మించి ఆధునికీకరించాం. ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. షహరాన్ పూర్ లో బయో సిఎన్ జి ప్లాంట్ నిర్మాణంతో బయోగ్యాస్ తో పాటు రైతులకు ఆర్గానిక్ ఎరువు కూడా అందుతోంది.
సోదర సోదరీమణులారా,
ప్రపంచంలోనే అత్యంత మేథోసంపత్తి నిలయంగా బిహెచ్ యును అభివృద్ధి చేయడం కాశీ సాధించిన మరో పెద్ద విజయం. ఆ విశ్వవిద్యాలయంలో టెక్నాలజీ నుంచి ఆరోగ్య వసతులన్నీ ముందెన్నడూ కనివిని ఎరుగనంతగా ఏర్పడ్డాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వందలాది మంది యువతీ యువకులు విద్యాభ్యాసం కోసం ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ నిర్మించిన నివాస సదుపాయాలు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హాస్టల్ వసతులు మాలవీయ విజన్ ను సాకారం చేయడంలో కొత్త ఉత్తేజంగా నిలుస్తాయి. మన కుమార్తెలకు ఆధునిక, ఉన్నత విద్యా సదుపాయాలు అందుబాటులోకి తేవాలన్న ఆయన కల సాకారం చేయడంలో మనకి అవి ఎంతో ఉపయోగకరం.
సోదర సోదరీమణులారా,
ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ మా స్వయం సమృద్ధ సంకల్పం నెరవేరేందుకు దోహదపడతాయి. మట్టితో చక్కని కళాఖండాలు చేసే కళాకారులు, హస్తకళాకారులు, వస్ర్తాలపై అద్భుతాలు ఆవిష్కరించే చేనేతకారులకు కాశీ, చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతో సుప్రసిద్ధం. గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ కృషి కారణంగా వారణాసికి చెందిన కుటీర పరిశ్రమలు, ఖాదీ ఉత్పత్తి 60 శాతం, అమ్మకాలు 90 శాతం పెరిగాయి. దీపావళి సమయంలో ఈ సహజీవుల గురించి కూడా శ్రద్ధ తీసుకోవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. ఇళ్ల అలంకరణ నుంచి దుస్తులు, దీవాళి దీపాల వరకు అన్నీ స్థానికంగా తయారైనవే కొందాం. ధంతేరస్ నుంచి దీవాళి వరకు అవసరమైన వస్తువులన్నీ స్థానికంగా తయారుచేసినవి కొన్నట్టయితే ప్రతీ ఒక్కరి దీవాళి ఆనందపు వెలుగులు చిమ్ముతుంది. నేను స్థానికం కోసం నినాదం గురించి మాట్లాడినప్పుడల్లా మన టివి చానెళ్లలో మట్టి ప్రమిదలు చూపడం అలవాటయింది. అది మట్టి ప్రమిదలకే పరిమితం కాదు, కష్టజీవులు తమ స్వేదాన్ని చిందిచి, దేశీయ సుగంధం గుభాళించే విధంగా తయారుచేసిన ఉత్పత్తులన్నీ అందులోకి వస్తాయి. దేశీయంగా తయారైన వస్తువులు కొనడం ఒక సారి అలవాటైతే ఉత్పత్తి కూడా పెరుగుతుంది. నిరుపేదలకు పని దొరుకుతుంది. మనందరం కలిసి ఈ పని చేద్దాం, ప్రతీ ఒక్కరి జీవితంలోను పెను మార్పు తీసుకువద్దాం.
మిత్రులారా,
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల ప్రాజెక్టు, కాశీ అభివృద్ధికి పలు ప్రాజెక్టులు ప్రారంభమైన సందర్భంగా దేశవాసులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాబోయే పండుగలను పురస్కరించుకుని మీ అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
గమనిక : ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం ఇది.