నమస్కార్!
రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్రాజీ, ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ జీ, రాజస్థాన్ పత్రిక కు చెందిన శ్రీ గులాబ్ కొఠారిజీ, పత్రిక గ్రూప్ కు చెందిన ఉద్యోగులారా, మీడియా స్నేహితులారా, లేడీస్ అండ్ జెంటిల్మాన్
సంవాద్ ఉపనిషత్, అక్షర యాత్ర పుస్తకాలను వెలువరించినందుకు పత్రికా గ్రూప్‌కు , శ్రీ గులాబ్ కొఠారిజీకి నా హృదయపూర్వక అభినందనలు. సాహిత్యానికి, సంస్కృతికి ఈ రెండు పుస్తకాలు విశిష్టమైన కానుకలని నేను భావిస్తున్నాను. రాజస్థాన్ సంస్కృతిని ప్రతిఫలిస్తున్న పత్రికా గేట్ ను అంకితం చేసే అవకాశం ఈరోజున నాకు లభించింది. ఇది స్థానిక ప్రజలకే కాకుండా పర్యాటకులను కూడా ఆకర్షించే కేంద్రంగా ఎదుగుతుంది. ఈ కృషి చేసినందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను
స్నేహితులారా,
ఏ సమాజంలోనైనా, సమాజంలోని మేధావులు, సాహిత్యవేత్తలు, రచయితలు ఆ సమాజానికి మార్గదర్శకులు, ఉపాధ్యాయుల్లాంటివారు. మన స్కూలు విద్య అయిపోవచ్చు. కానీ జీవితాంతం, ప్రతిరోజూ నేర్చుకునే పని మాత్రం కొనసాగుతూనే వుంటుంది. ఈ విషయంలో పుస్తకాలది, వాటి రచయితలది ప్రత్యేకమైన పాత్ర అని చెప్పవచ్చు. మన దేశంలో రచనా రంగంలో ప్రగతి అనేది భారతీయత, జాతీయతతో కూడుకొని ఎదిగింది.
మన దేశ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న మహామహుల్లో దాదాపుగా ప్రతి ఒక్కరూ రచయితే. మనకున్న ప్రసిద్ద సాధువులు, శాస్త్రవేత్తలు కూడా గ్రంధకర్తలుగా, రచయితలుగా పేరు సంపాదించుకున్నవారే. ఆ సంప్రదాయాన్ని సజీవంగా వుంచడానికి మీరు నిరంతరం కృషి చేస్తుండడం నాకు సంతోషాన్నిస్తోంది. విదేశాలను గుడ్డిగా అనుసరించే పరుగు పందెంలో మేము లేము అని ఎంతో ధైర్యంగా రాజస్థాన్ పత్రిక గ్రూప్ చెప్పడం చాలా గొప్ప విషయం. భారతీయ సంస్కృతి, నాగరికతలను ముందుకు తీసుకుపోవడానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. విలువల్ని పరిరక్షిస్తున్నారు.
స్నేహితులారా,
గులాబ్ కొఠారిజీ రచించిన పుస్తకాలు సంవాద్ ఉపనిషత్, అక్షర యాత్ర అనేవి దీనికి స్పష్టమైన నిదర్శనాలు. ఈ రోజున గులాబ్ కొఠారిజీ కొనసాగిస్తున్న సంప్రదాయం, ఈ సంప్రదాయాలతో కూడుకొని ఈ రోజున పత్రిక ప్రారంభం జరుగుతోంది. భారతీయత, భారతదేశానికి సేవలు అందించాలనే నిర్ణయాలతో కర్పూర్ కులిష్ జీ పత్రికను ప్రారంభించారు. మనందరికీ తెలుసు ఆయన పత్రికా ప్రపంచానికి చేసిన సేవలు ఎలాంటివో. వేదాల్లోని విజ్ఞానాన్ని నేటి సమాజంలోకి తీసుకుపోవడానికిగాను కులిష్ జీ చేస్తున్న శ్రమ నిజంగా ఎంతో అద్భుతమైనది. స్వర్గీయ కులిష్ జీని కలుసుకునే అదృష్టం అనేక సార్లు నాకు కలిగింది. ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడేవారు. సానుకూల దృక్పథం కలిగి వుంటే జర్నలిజానికి ఆదరణ, గుర్తింపు లభిస్తాయని ఆయన తరచూ అనేవారు.
స్నేహితులారా,
జర్నలిస్టుగానో లేదా రచయితగా మాత్రమే ఈ సమాజానికి సానుకూల దృక్పథం కలగజేస్తామని అనుకోవడం సబబు కాదు. ఈ సానుకూల దృక్పథం అనేది ఈ నమ్మకం అనేది వ్యక్తిగా మన వ్యక్తిత్వానికి చాలా ముఖ్యం. కులిష్ జీ తాత్వికతను, ఆయన నిబద్దతను పత్రికా గ్రూప్, గులాబ్ కొఠారిజీ కొనసాగిస్తుండడం నాకు సంతృప్తినిస్తోంది. గులాబ్ కొఠారీజీ మీరు ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోగలరు. కరోనా కట్టడికి సంబంధించి మాట్లాడడానికిగాను నేను పత్రికా స్నేహితుల సమావేశం పెట్టినప్పడు మిమ్మల్ని కూడా సూచనలు సలహాలు ఇవ్వమని అడిగాను. అప్పుడు మీరు కనబర్చిన స్పందన మీ తండ్రిగారిని గుర్తు చేసింది. మీ తండ్రిగారి వేద వారసత్వాన్ని మీరు ఎంతో గొప్పగా ముందుకు తీసుకుపోతున్నారనడానికి సంవాద్ ఉపనిషత్, అక్షర యాత్ర గ్రంధాలే నిదర్శనం.
స్నేహితులారా,
గులాబ్ జీ పుస్తకాలను చదువుతున్నప్పుడు ఆయన రాసిన ఒక సంపాదకీయం నాకు గుర్తుకొచ్చింది. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నేను ఇచ్చిన మొదటి ఉపన్యాసంపై స్తుత్య సంకల్ప్ ను కొఠారీజీ రాశారు. నా ప్రసంగం విన్న తర్వాత నేను 130 కోట్ల మంది ప్రజలనుద్దేశించి తన మనసులో మాటల్ని తెలియజేసినట్టుగా అందులోరాశారు. కొఠారిజీ ఎప్పుడైనా సరే మీ పుస్తకాల్లోని ఉపనిషత్, వేదిక్ ఉపన్యాసాలను చదివినప్పుడు నా స్వంత భావాలను చదివినట్టుగా నాకు అనిపిస్తుంది.
మానవుల సంక్షేమం కోసం, సామాన్య ప్రజలకు సేవలందించడంకోసం రాసిన అక్షరాలు అవి ఎవరివైనప్పటికీ అవి అందరి హృదయాలకు సంబంధించినవి. అందుకే మన వేదాలు, అందులోని భావాలు అనంతమైనవి. వాటికి మరణం లేదు. వేద మంత్రాలను రాసిన దార్శనికులైన సాధువులు ఎవరోగానీ వారు కనబరిచిన స్ఫూర్తి , తాత్వికత అనేవి మానవులందరి కోసమే అని చెప్పగలను. భారతీయ తాత్వికత ఎలాగైతో ప్రజల్లోకి చొచ్చుకుపోయిందో అలాగే ఉపనిషత్ సంవాద్, అక్షర యాత్ర గ్రంధాలు కూడా ప్రజలను చేరుకుంటాయని నేను భావిస్తున్నాను. చాటింగులు, ట్వీట్లకు ఆదరణ ఎక్కువగా వున్న ఈ తరుణంలో ఎంతో విలువైన విజ్ఞానానికి మన నూతన తరం దూరంకాకుండా వుండడమనేది చాలా ముఖ్యం.
మానవుల సంక్షేమం కోసం, సామాన్య ప్రజలకు సేవలందించడంకోసం రాసిన అక్షరాలు అవి ఎవరివైనప్పటికీ అవి అందరి హృదయాలకు సంబంధించినవి. అందుకే మన వేదాలు, అందులోని భావాలు అనంతమైనవి. వాటికి మరణం లేదు. వేద మంత్రాలను రాసిన దార్శనికులైన సాధువులు ఎవరోగానీ వారు కనబరిచిన స్ఫూర్తి , తాత్వికత అనేవి మానవులందరి కోసమే అని చెప్పగలను. భారతీయ తాత్వికత ఎలాగైతో ప్రజల్లోకి చొచ్చుకుపోయిందో అలాగే ఉపనిషత్ సంవాద్, అక్షర యాత్ర గ్రంధాలు కూడా ప్రజలను చేరుకుంటాయని నేను భావిస్తున్నాను. చాటింగులు, ట్వీట్లకు ఆదరణ ఎక్కువగా వున్న ఈ తరుణంలో ఎంతో విలువైన విజ్ఞానానికి మన నూతన తరం దూరంకాకుండా వుండడమనేది చాలా ముఖ్యం.
స్నేహితులారా,
ఉపనిషత్తులకు సంబంధించిన ఈ అవగాహన, వేదాల తాత్వికత అనేవి ఆధ్యాత్మికమైన లేదా తాత్వికమైన ఆకర్షణ ప్రపంచాలు మాత్రమే కాదు. వీటిలో సృష్టికి సంబంధించిన తాత్విక వుంది. వేదవేదాంగాల్లో శాస్త్రం వుంది. అది అనేక మంది శాస్త్రవేత్తలను ఆకట్టుకుంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు దీని గురించి తెలుసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మనందరమూ నికోలా టెస్లా పేరు వినే వున్నాం. టెస్లా లేకుంటే మనం చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచం ఇలా వుండేది కాదు. ఒక శతాబ్దం క్రితం స్వామి వివేకానందులవారు అమెరికాకు వెళ్లినప్పుడు ఆయన నికోలా టెస్లాను కలుసుకున్నారు. ఉపనిషత్తుల సారాంశం గురించి వేదాల్లో దాగిన విశ్వరహస్యాల గురించి స్వామీ వివేకానందులవారు టెస్లాకు వివరించినప్పుడు ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
సంస్కృత పదాలైన ఆకాశ్, ప్రాణ్ లాంటివి వుపయోగించి విశ్వం గురించి వివరంగా చర్చించినప్పుడు దాన్నంతా ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోని గణిత సూత్రాల రూపంలోకి తీసుకువస్తానని టెస్లా అన్నారు. వివేకానందులవారు అందించిన విజ్ఞానం సాయంతో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు రహస్యాల అంతు తేల్చవచ్చని ఆయన భావించారు. ఆ తర్వాత అనేక పరిశోధనల జరిగాయి. స్వామి వివేకానందులువారికి టెస్లాకు మధ్యన చర్చలు జరిగిన తర్వాత మన ముందుకు అనేక అంశాలు వివిధ మార్గాల్లో వచ్చాయి. ఇప్పటికీ అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి.అయితే వీటిలో ఈ అంశం మాత్రం మనకు స్ఫూర్తిఇస్తూ మన విజ్ఞానం గురించి పునరాలోచించమని చెబుతుంది. ఈ దృష్టితోనే మన యువత తెలుసుకోవాల్సిన అవసరం వుంది, ఆలోచించాల్సిన, అవగాహన చేసుకోవాల్సిన అవసరం వుంది. కాబట్టి సంవాద్ ఉపనిషత్, అక్షర యాత్ర గ్రంధాలను లోతుగా అధ్యయనం చేస్తే అది మన యువతకు సరికొత్త కోణాలను ఇవ్వడమే కాకుండా వారిలో సిద్ధాంతపరంగా లోతైన అవగాహనను కల్పిస్తుంది.