ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు రజతోత్సవ సంవత్సరం ఈ రోజే ప్రారంభమవుతున్నదని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తవుతుండడాన్ని గుర్తుచేస్తూ... రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు. వచ్చే 25 ఏళ్ల ఉత్తరాఖండ్ ప్రస్థాన సమయానికి భారత్ అమృత కాల్ కు కూడా 25 ఏళ్లు నిండబోతుండడం శుభసూచకమన్నారు. వికసిత భారత్ లో వికసిత ఉత్తరాఖండ్ సంకల్పం నెరవేరబోతుండడాన్ని అది సూచిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లకు పలు తీర్మానాలతో అనేక కార్యక్రమాలను ప్రజలు చేపట్టారని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ఉత్తరాఖండ్ ఘనతను చాటుతాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఎదిగి ఆ ఫలితాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని అన్నారు. ఈ సంకల్పాన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్’ను గుర్తుచేసిన ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉత్తరాఖండ్ ప్రజల కృషి అటల్ నేతృత్వంలో ఫలించిందని గుర్తు చేశారు. నేడు ప్రజల కలలు, ఆకాంక్షలు సాకారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం ఏ అవకాశాన్నీ తమ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని ఆయన స్పష్టంచేశారు.
ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ దేనని తాను విశ్వసిస్తున్నానని, కొన్నేళ్లుగా అది నిరూపితమైందని ప్రధాని పునరుద్ఘాటించారు. అభివృద్ధిలో ఉత్తరాఖండ్ కొత్త రికార్డులు సృష్టిస్తోందని, కొత్త మైలురాళ్లను అధిగమిస్తోందని వ్యాఖ్యానించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రధాని తెలిపారు. సులభతర వ్యాపార (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) విభాగంలో ఉత్తరాఖండ్ ‘విజేత’గా, అంకుర సంస్థల విభాగంలో ‘లీడర్స్’గా నిలిచిందన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు 1.25 రెట్లు పెరిగిందని, జీఎస్టీ వసూళ్లు 14 శాతం పెరిగాయని, తలసరి ఆదాయం 2014లో ఏటా రూ.1.25 లక్షలుగా ఉండగా అదిప్పుడు రూ.2.60 లక్షలకు పెరిగిందని, స్థూల దేశీయోత్పత్తి 2014లో రూ.1 లక్షా 50 వేల కోట్లు ఉండగా నేడు దాదాపు రూ. 3 లక్షల 50 వేలకు పెరిగిందని ఆయన వివరించారు. యువతకు కొత్త అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి, మహిళలు-చిన్నారులకు మెరుగైన జీవన సదుపాయాలను గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయన్నారు. 2014లో 5 శాతం కుటుంబాలకే కుళాయి నీరు అందేదని, అదిప్పుడు 96 శాతానికి పెరిగిందని తెలిపారు. గ్రామీణ రహదారుల నిర్మాణం 6,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్లకు పెరిగిందని తెలిపారు. లక్షలాది టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ యోజన ద్వారా ఉచిత చికిత్స వంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
కేంద్రం ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అందించే నిధులు దాదాపు రెట్టింపయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. ఏఐఐఎంఎస్ కోసం ఉపగ్రహ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, డ్రోన్ ప్రయోగ పరిశోధన కేంద్రం, ఉద్ధంసింగ్ నగర్ లో చిన్న పరిశ్రమల టౌన్ షిప్ వంటి అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ. 2 లక్షల కోట్లతో కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అనుసంధాన ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని 11 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని, ఎక్స్ ప్రెస్ మార్గం పూర్తయిన తర్వాత ఢిల్లీ - డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం 2.5 గంటలకు తగ్గుతుందని ఆయన తెలిపారు. అభివృద్ధి... వలసలను కూడా నియంత్రించిందన్నారు.
అభివృద్ధితో పాటు వారసత్వ సంపదను పరిరక్షించడంపై ప్రభుత్వం అంకితభావంతో ఉందని ప్రముఖంగా పేర్కొన్న శ్రీ మోదీ.. కేదార్‌నాథ్ ఆలయాన్ని గొప్పగా, దివ్యంగా పునర్నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. భద్రీనాథ్ ధామ్‌లో కూడా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మానస్ ఖండ్ మందిర్ మిషన్ మాల పథకంలో మొదటి దశలో 16 ప్రాచీన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. “అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అనువుగా ఉండే రహదారులు చార్ ధామ్ యాత్రను సులభతరం చేశాయి’’ అని శ్రీ మోదీ వివరించారు. పర్వత మాల పథకం కింద మతపరమైన, పర్యాటక ప్రదేశాలను రోప్ వేల ద్వారా అనుసంధానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘వైబ్రంట్ విలేజ్’ పథకాన్ని మనా గ్రామం నుంచి ప్రారంభించిన విషయాన్ని శ్రీ మోదీ గుర్తు చేశారు. గతంలో సరిహద్దు గ్రామాలను శివారు గ్రామాలుగా భావించేవారని, ప్రస్తుతం ప్రభుత్వం వాటిని దేశానికి ‘తొలి గ్రామాలు’గా గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా 25 గ్రామాలను అభివృద్ధి చేశామని, ఆ చర్యలు ఉత్తరాఖండ్‌లో పర్యాటక సంబంధిత అవకాశాలను మెరుగుపరిచాయని అన్నారు. తద్వారా ఉత్తరాఖండ్ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. ఒక నివేదికను ఉటంకిస్తూ, ఈ సంవత్సరంలో 6 కోట్ల మంది పర్యాటకులు, యాత్రికులు ఉత్తరాఖండ్‌ను సందర్శించినట్లు శ్రీ మోదీ వెల్లడించారు. 2014కు ముందు చార్ ధామ్ యాత్రికుల సంఖ్య 24 లక్షలుగా ఉండగా, గతేడాది 54 లక్షల మంది సందర్శించారని తెలిపారు. హోటళ్లు, వసతి గృహాలు, రవాణా మధ్యవర్తులు, క్యాబ్ డ్రైవర్లు, తదితరులకు లాభాలను చేకూర్చిందన్నారు. గత కొన్నేళ్లలో 5000కు పైగా హోమ్ స్టేలు నమోదయ్యాయని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉమ్మడి పౌర స్మృతి అమలు, యువతను రక్షించడం కోసం ఉద్యోగ నియామక పరీక్షల్లో కాపీయింగ్ ను నిరోధిస్తూ తెచ్చిన చట్టాలను ప్రస్తావిస్తూ.. ఉత్తరాఖండ్ నిర్ణయాలు, విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి 9 అభ్యర్థనలు చేశారు. అందులో 5 ఉత్తరాఖండ్ ప్రజలకు ఉద్దేశించినవి కాగా, మిగతా 4 అభ్యర్థనలు... యాత్రికులు, పర్యాటకులనుద్దేశించి చేసినవి. ఘర్వాలి, కుమవోని, జౌన్సారి వంటి భాషల పరిరక్షణ ఆవశ్యకతను పేర్కొన్న ప్రధాని.. భావి తరాలకు ఆ భాషలను నేర్పాలని రాష్ట్ర ప్రజలను కోరారు. రెండోది, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. మూడోది, జల వనరులను సంరక్షించాలని, జల పరిశుభ్రత ప్రచారాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. నాలుగోది, పౌరులు తమ మూలాలతో అనుసంధితం కావాలని, గ్రామాలను సందర్శించాలని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. అయిదవది రాష్ట్రంలోని సంప్రదాయ గృహాల పరిరక్షణ ఆవశ్యకతను చెప్పిన ప్రధాని.. వాటిని హోమ్ స్టేలుగా మార్చాలని సూచించారు.
రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకులు, యాత్రికుల సంఖ్య పెరుగుతున్న దృష్యా, వారికి ప్రధానమంత్రి నాలుగు అభ్యర్థనలు చేశారు. పరిశుభ్రత పాటించాలని, పునర్వినియోగ రహిత (సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని కోరారు. ‘స్థానికత కోసం గొంతెత్తుదాం (వోకల్ ఫర్ లోకల్)’ను మంత్రప్రదంగా భావించి మొత్తం ఖర్చులో కనీసం 5 శాతాన్ని స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులపై ఖర్చు చేయాలని అభ్యర్థించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. చివరిగా, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల మర్యాదలు పాటించాలని కోరారు. దేవభూమి ఉత్తరాఖండ్ అస్తిత్వాన్ని బలోపేతం చేయడంలో ఈ 9 అభ్యర్థనలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. దేశ సంకల్పాలను నెరవేర్చడంలో ఉత్తరాఖండ్ విశేషమైన పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.