ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీ 80వ జన్మదిన వేడుకలను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ శుభ సందర్బంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీ మరియు ఆయన అనుచరులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 'హనుమత్-ద్వార్' ప్రవేశ తోరణాన్ని సాధువులు, ప్రత్యేక అతిథులు అంకితం చేయడాన్ని కూడా శ్రీ మోదీ గుర్తించారు.
పవిత్ర గ్రంథాలను ఉటంకిస్తూ, మానవాళి సంక్షేమం కోసం సాధువులు ఉద్భవిస్తారనడానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జీవితమే సజీవ ఉదాహరణ అని, వారి జీవితం సామాజిక అభ్యున్నతి, మానవ సంక్షేమం తో ముడిపడి ఉందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. దత్త పీఠంలో ఆధ్యాత్మికతతో పాటు ఆధునికత కూడా పెంపొందుతోందని, ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. 3డి మ్యాపింగ్ తో కూడిన హనుమాన్ ఆలయాన్ని, ఆధునిక నిర్వహణతో ఏర్పాటుచేసిన "లైట్ అండ్ సౌండ్ షో" మరియు "బర్డ్-పార్క్" ను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. దత్త పీఠం వేదాలతో కూడిన గొప్ప అధ్యయన కేంద్రంగానే కాక, ఆరోగ్య ప్రయోజనాల కోసం సంగీతాన్ని ఉపయోగించడం కోసం ప్రభావవంతమైన ఆవిష్కరణలను చేపడుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “ఈ విధంగా ప్రకృతి కోసం శాస్త్ర పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఆధ్యాత్మికతతో సాంకేతికతను జోడించడం క్రియాశీల భారతీయ సిద్ధాంతం. స్వామీజీ వంటి సాధువుల కృషికి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు దేశంలోని యువత తమ సంప్రదాయాల శక్తిని తెలుసుకుని, వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు.” అని శ్రీ మోదీ అన్నారు.
ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో వచ్చిన ఈ శుభ సందర్భంగా, స్వప్రయోజనం కంటే ముందు విశ్వ ప్రయోజనాన్ని పరిగణించాలని చెప్పే సాధువుల బోధనలను ప్రధానమంత్రి గుర్తు చేశారు.
"దేశం ఈరోజు ‘సబ్-కా-సాత్, సబ్-కా-వికాస్, సబ్-కా-విశ్వాస్, సబ్-కా-ప్రయాస్’ అనే మంత్రంతో సామూహిక ప్రతిజ్ఞలకు పిలుపునిస్తోంది. ఈ రోజు దేశం తన ప్రాచీనతను కాపాడుకుంటూ, ప్రచారం చేస్తోంది. అదే సమయంలో, దాని ఆవిష్కరణ, ఆధునికతకు బలాన్నిస్తోంది. ఈ రోజు యోగా మరియు యువత భారతదేశ గుర్తింపుగా నిలిచాయి. ఈ రోజు ప్రపంచం మొత్తం మన అంకుర సంస్థలను తన భవిష్యత్తు గా భావిస్తోంది. మన పరిశ్రమ, మన 'మేక్-ఇన్-ఇండియా' ప్రపంచ వృద్ధికి ఆశాకిరణంగా మారుతున్నాయి. ఈ తీర్మానాల సాధనకు మనం కృషి చేయాలి. ఈ దిశగా, మన ఆధ్యాత్మిక కేంద్రాలు, స్ఫూర్తి కేంద్రాలుగా సేవలందించాలని నేను కోరుకుంటున్నాను." అని ప్రధానమంత్రి సూచించారు.
ప్రకృతి సంరక్షణ, పక్షుల సేవలో వారు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రధానమంత్రి, దత్త పీఠం నీరు మరియు నదుల సంరక్షణ కోసం కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు అభివృద్ధి చేసే కార్యక్రమంలో తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం అమలులో వారు అందిస్తున్న వారి సహకారాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.