మిస్టర్ ప్రెసిడెంట్, సంపూర్ణ స్నేహభావంతో నాకు, నా ప్రతినిధివర్గానికి హార్థిక స్వాగతం పలికినందుకు మొదట మీకు నా కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నాను.
మిస్టర్ ప్రెసిడెంట్, 2016లోను, అంతకు ముందు 2014లోను సవివరంగా మాట్లాడే అవకాశం మనకి లభించింది. మిస్టర్ ప్రెసిడెంట్ భారత, అమెరికా సంబంధాలపై మీరు అప్పట్లో మీ విజన్ ను ఆవిష్కరించడమే కాకుండా దాన్ని కూలంకషంగా వివరించారు. అదే విజన్ ఈ రోజుకీ స్ఫూర్తిదాయకంగా ఉంది. మిస్టర్ ప్రెసిడెంట్, ఇప్పుడు అధ్యక్షుడుగా మీరు ఆ విజన్ ను ముందుకు నడిపించేందుకు, అమలు పరిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. దాన్ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
మిస్టర్ ప్రెసిడెంట్, ఇండియాలో బైడెన్ ఇంటి పేరు గురించి మీరు ఎంతో వివరంగా మాట్లాడారు, నాతో కూడా ఒక సారి ప్రస్తావించారు. మీరు ఆ విషయం తెలియచేసిన తర్వాత అందుకు సంబంధించిన పత్రాల గురించి నేను వెతికాను, కొన్ని పత్రాలు కూడా ఇప్పుడు తెచ్చాను. మేము ఆ విషయంలో మరింత ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పత్రాలు మీకు కూడా ఉపయోగకరం కావచ్చు.
మిస్టర్ ప్రెసిడెంట్, ఈ రోజు మన శిఖరాగ్ర చర్చలు, శిఖరాగ్ర సమావేశం అత్యంత కీలకమైనదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది 21వ శతాబ్దిలో మూడో దశాబ్ది మొదటి సంవత్సరం. మన ముందున్న ఆ దశాబ్దిలో భారత-అమెరికా సంబంధాల్లో మీరు నాటిన విత్తనాలు మీ నాయకత్వంలో మరింతగా విస్తరిస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ప్రపంచంలోని ప్రజాస్వామిక దేశాలన్నింటికీ ఇది పరివర్తిత కాలం. ఈ వాస్తవాన్ని నేను వీక్షించగలుగుతున్నాను. ధన్యవాదాలు.
భారత-అమెరికా సంబంధాల్లో ఈ పరివర్తిత కాలంలో మన ఉభయ దేశాలు పాటిస్తున్న సాంప్రదాయాలు, ప్రత్యేకించి ప్రజాస్వామిక విలువలు, సాంప్రదాయాలు అత్యంత ప్రధానమైనవని నేను గుర్తించాను.
అలాగే అమెరికా పురోగతికి తమ వంతు కృషి చేస్తున్న భారతీయ సంతతి అమెరికన్ల గురించి మీరు ప్రస్తావించారు. ఈ దశాబ్దిలో ప్రతిభావంతులైన ఆ భారతీయ అమెరికన్లు మరింత ప్రధాన పాత్ర పోషించనున్నారు. వారి ప్రతిభ మరింత విస్తరిస్తుంది. వారికి భారతీయ ప్రతిభావంతులు కూడా సహభాగస్వాములుగా చేరే అవకాశం లభిస్తుంది. ఇందులో మీ సహకారం మరింత కీలకం అవుతుంది.
మిస్టర్ ప్రెసిడెంట్, నేటి ప్రపంచంలో టెక్నాలజీ అత్యంత ప్రధానమైన చోదకశక్తిగా ఉంది. సేవకు, మానవత్వానికి కూడా టెక్నాలజీ కీలకం కానుంది. రాబోయే టెక్నాలజీకి మరింత అద్భుతమైన అవకాశాలున్నాయి.
అలాగే మిస్టర్ ప్రెసిడెంట్, భారత, అమెరికా సంబంధాల్లో వాణిజ్యం కూడా కీలక ప్రాధాన్యం కలిగి ఉంది. ఉభయ దేశాల వాణిజ్యం పరస్పర ప్రయోజనకరంగా ఉంది. మీ దగ్గర కొన్ని ఉన్నాయి, మా దగ్గర కొన్ని ఉన్నాయి, అవి ఉభయులకు ప్రయోజనకరమైనవి. రాబోయే దశాబ్ది కాలంలో ఈ వాణిజ్యానికి కూడా అద్భుత ప్రాధాన్యం ఉంది.
మిస్టర్ ప్రెసిడెంట్, మీరు ఇప్పుడే అక్టోబరు 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి గురించి ప్రస్తావించారు. మహాత్మాగాంధీ ఎప్పుడూ భూగోళానికి ట్రస్టీ సిద్ధాంతం గురించి మాట్లాడే వారు. ఇప్పుడు ఈ దశాబ్దిలో ఆ ట్రస్టీ సిద్ధాంతానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మనం నివశిస్తున్న భూగోళం, భవిష్యత్ తరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ట్రస్టీ సెంటిమెంట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా భారత, అమెరికా సంబంధాలకు, ప్రపంచానికి కూడా దాని ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. మహాత్మాగాంధీ ప్రవచించిన ఈ ట్రస్టీ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే ప్రపంచ పౌరుల బాధ్యత మరింతగా పెరుగుతుంది.
మిస్టర్ ప్రెసిడెంట్, మీరు చాలా ప్రధానమైన అంశాలు ప్రస్తావించారు. కోవిడ్-19 కావచ్చు, వాతావరణ మార్పులు, క్వాడ్ వంటి అంశాలేవైనా కావచ్చు అన్నింటిలోనూ మీ విజన్ ను అమలు పరిచేందుకు మీరు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేశారు. ఈ రోజు వీటన్నింటి పైన సవివరంగా చర్చించే అవకాశం వచ్చింది. ఈ చర్చల అనంతరం మన ఉభయ దేశాల కోసమే కాకుండా యావత్ ప్రపంచం కోసం మనం సానుకూల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ నాయకత్వంలో మనం ఏమి చేసినా అది యావత్ ప్రపంచానికి ఎంతో అవసరమని నేను విశ్వసిస్తున్నాను.
మిస్టర్ ప్రెసిడెంట్ సాదర స్వాగతం పలికినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
The Quad- a force for global good. pic.twitter.com/L6RtzUa5Dl
— PMO India (@PMOIndia) September 24, 2021