ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన జి-20 కూటమి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా సమావేశానికి హాజరైన ప్రముఖులు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ- విజ్ఞానం, సాంకేతికత, వ్యవస్థాపన స్ఫూర్తికి పుట్టినిల్లు వంటి బెంగళూరు నగరం ప్రాశస్త్యాన్ని కొనియాడారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై చర్చించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
భారత దేశంలో గత 9 సంవత్సరాలుగా చోటుచేసుకున్న అద్భుత డిజిటల్ పరివర్తన ఘనత 2015లో శ్రీకారం చుట్టిన ‘డిజిటల్ భారతం’ కార్యక్రమానిదేనని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఆవిష్కరణలపై భారత్‌కుగల అచంచల విశ్వాసం.. వాటి సత్వర అమలుపై నిబద్ధతసహా ఏ ఒక్కరూ వెనుకబడరాదన్న సార్వజనీనత స్ఫూర్తి వల్లనే దేశంలో డిజిటల్ పరివర్తన సాధ్యమైందని ఆయన నొక్కిచెప్పారు. ఈ డిజిటల్ పరివర్తన పరిమాణం, పరిధి, వేగం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దేశంలో 85 కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదారులకు ప్రపంచంలోనే అత్యంత చౌకగా డేటా లభిస్తుండటం ఇందుకు నిదర్శమన్నారు. పరిపాలనలో పరివర్తనసహా దాన్ని మరింత సమర్థం, సమగ్రం, వేగవంతం, పారదర్శకంగా రూపొందించడంలో భారత దేశం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నదని చెప్పారు. ఇందులో భాగంగా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక డిజిటల్ గుర్తింపు వేదిక ‘ఆధార్’ ద్వారా 130 కోట్లమంది ప్రజలకు విశిష్ట గుర్తింపు లభించడాన్ని ఈ సందర్భంగా ప్రధాని ఉదాహరించారు.
అదేవిధంగా జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్ సహిత ‘జామ్’ త్రయం అమలుతో ఆర్థిక సార్వజననీతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. మరోవైపు ‘యూపీఐ’ చెల్లింపు వ్యవస్థ విస్తృతిని ప్రస్తావిస్తూ- భారత్‌లో ప్రతి నెలలోనూ దాదాపు వెయ్యికోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. అంతేగాక ప్రపంచస్థాయిలో ప్రత్యక్ష చెల్లింపులకు సంబంధించి భారత్ వాటా 45శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రత్యక్ష లబ్ధి బదిలీ వ్యవస్థలోని దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు 33100 కోట్ల డాలర్లకుపైగా ప్రజా ధనం ఆదా గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు. మరోవైపు భారత కోవిడ్ టీకాల కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ‘కో-విన్’ పోర్టల్ ద్వారా 200 కోట్లకుపైగా టీకాలు పూర్తిచేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ టీకాలకు ప్రపంచవ్యాప్త చెల్లుబాటుగల ధ్రువీకరణ పత్రాలను కూడా ఈ పోర్టల్ ద్వారా జారీచేసినట్లు పేర్కొన్నారు. అలాగే మౌలిక సదుపాయాలు, రవాణా సదుపాయాల విస్తృత కల్పనలో సాంకేతికత, ప్రాదేశిక ప్రణాళికలను ఉపయోగించే గతి-శక్తి వేదిక గురించి కూడా ప్రధాని వివరించారు. దీనిద్వారా ప్రణాళిక రూపకల్పన వ్యయం తగ్గింపుతోపాటు సేవల వేగం పెంచే వీలుంటుందని తెలిపారు.
ప్రభుత్వ కొనుగోళ్లకు ఉద్దేశించిన ఇ-మార్కెట్ ప్లేస్ వేదిక ద్వారా పారదర్శకత, నిజాయితీకి పెద్దపీట వేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు. అదే సమయంలో ఇ-కామర్స్ వేదికను ప్రజాస్వామ్యీకరిస్తున్న సార్వత్రిక డిజిటల్ నెట్‌వర్క్ గురించి మరింత ప్రముఖంగా వివరించారు. మరోవైపు “పూర్తిగా డిజిటలీకరించబడిన పన్ను వ్యవస్థలు పారదర్శకతను, ఇ-పరిపాలనను ప్రోత్సహిస్తున్నాయి” అని ఆయన అన్నారు. దేశంలోని అన్ని వేర్వేరు ప్రాంతీయ భాషల్లో డిజిటల్ సార్వజనీనతకు తోడ్పడే కృత్రిమ మేధస్సు (ఎఐ) ఆధారిత భాషానువాద వేదిక ‘భాషిణి’ రూపకల్పన గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు “ప్రపంచ సవాళ్లను అధిగమించగల సురక్షిత, సమగ్ర మార్గాలను భారత ప్రజా డిజిటల్ మౌలిక సదుపాయాలు చూపగలవు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
భారత్‌లో అపురూప వైవిధ్యం గురించి వివరిస్తూ- ఈ దేశంలో లెక్కలేనన్ని భాషలు, వందలాది మాండలికాలు ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి మతానికి, అసంఖ్యాక సాంస్కృతిక సంప్రదాయాలకు భారత్ నిలయమని ప్రధాని పేర్కొన్నారు. “ప్రాచీన సంప్రదాయాల నుంచి తాజా సాంకేతిక పరిజ్ఞానాలదాకా భారత్ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రయోజనం అందించింది” అని ఆయన నొక్కి చెప్పారు. ఇంతటి వైవిధ్యంగల భారత్ పరిష్కారాల నిగ్గుతేల్చగల ఆదర్శ ప్రయోగశాల కాగలదని పేర్కొన్నారు. ఈ దేశంలో విజయవంతమైన ఏ పరిష్కారాన్నైనా ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా అమలు చేయవచ్చునని చెప్పారు. స్వీయానుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి భారత్ సదా సిద్ధంగా ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు కోవిడ్ మహమ్మారి వేళ ప్రపంచ ప్రయోజనాల కోసం ‘కో-విన్’ వేదికను సమకూర్చిందని ఉదాహరించారు. భారత్ ఒక ఆన్‌లైన్ అంతర్జాతీయ ప్రజా సదుపాయాల భాండాగారం ‘ఇండియా శ్టాక్’ను సృష్టించిందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలో... ముఖ్యంగా దక్షిణార్థ గోళ దేశాల్లో ఏ ఒక్కరూ వెనుకబడకుండా చూడటంలో ఇది ఎంతగానో దోహదం చేయగలదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జి-20 వర్చువల్ అంతర్జాతీయ డిజిటల్ ప్రజా సదుపాయాల భాండాగారం రూపొందించేందుకు కార్యాచరణ బృందం కృషి చేస్తుండటంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల దిశగా ఉమ్మడి చట్రంలో పురోగమనం ఆశావహంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. అన్ని దేశాల్లోనూ పారదర్శక, జవాబుదారీ, సమన్యాయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ రూపకల్పనలో ఇది తోడ్పడగలదని నొక్కిచెప్పారు. వివిధ దేశాల మధ్య డిజిటల్ నైపుణ్యాలను సరిపోల్చే ప్రణాళికను రూపొందించే కృషిని ఆయన ప్రశంసించారు. అలాగే ‘వర్చువల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు తగిన మార్గ ప్రణాళిక తయారుచేసే ప్రయత్నాలపైనా హర్షం ప్రకటించారు. భవిష్యత్ సంసిద్ధ కార్మిశక్తి అవసరాలను తీర్చడంలో దీనికి చాలా ప్రాముఖ్యం ఉందన్నారు. ప్రపంచమంతటా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తృతి నేపథ్యంలో భద్రతపరంగా ఎదురయ్యే ముప్పులు, సవాళ్ల ప్రమాదాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సురక్షిత, విశ్వసనీయ, స్థితిస్థాపక డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం
ఉన్నతస్థాయి సూత్రాలపై జి-20 ఏకాభిప్రాయ సాధన అత్యంత ప్రధానమని సూచించారు.
ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- సాంకేతిక పరిజ్ఞానం మునుపెన్నడూలేని రీతిలో మనను అనుసంధానించింది. అందరికీ సుస్థిర, సార్వజనీన ప్రగతికి ఇది భరోసా ఇవ్వగలదు” అని ఉద్ఘాటించారు. తదనుగుణంగా సమ్మిళిత, సుసంపన్న, సురక్షిత డిజిటల్ ప్రపంచ భవిష్యత్తుకు పునాది వేయడంలో జి-20 దేశాలకు ఇదొక అద్వితీయమైన అవకాశం ఇస్తున్నదని వివరించారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఆర్థిక సార్వజనీనత, ఉత్పాదకత వృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. రైతులతోపాటు చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం వాడుకునేలా ప్రోత్సహించాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు ప్రపంచ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ రూపకల్పన దిశగా ఒక చట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు కృత్రిమ మేధస్సు (ఎఐ)ను సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించేలా పటిష్ట చట్రాన్ని కూడా రూపొందించాల్సి ఉందన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం కోసం సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కార
పర్యావరణ వ్యవస్థ మొత్తాన్నీ నిర్మించవచ్చునని శ్రీ మోదీ సూచించారు. “ఇందుకుగాను మన వైపునుంచి ‘దృఢ విశ్వాసం, నిబద్ధత, సమన్వయం, సహకారం’ అనే నాలుగు అంశాలు మాత్రమే కావాల్సి ఉంటుంది” అని ఆయన నొక్కిచెప్పారు. ప్రస్తుత సమావేశం నిర్వహిస్తున్న కార్యాచరణ బృందం మనను ఆ దిశగా ముందుకు నడిపించగలదని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.