శ్రీరామ నవమి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని జునాగఢ్‌లోగల గథిలవద్ద ఉమియా మాత ఆలయ 14వ సంస్థాపన వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ముందుగా పవిత్ర శ్రీరామ నవమి, ఆలయ సంస్థాపన దినోత్సవాల నేపథ్యంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చైత్య నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధిధాత్రి మాత భక్తులందరి మనోభీష్టం నెరవేర్చాలని ప్రార్థించారు. అంతేకాకుండా పవిత్ర గిర్నార్ గడ్డకు శిరసాభివందనం ఆచరించారు.
దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలన్న ప్రజాకాంక్ష మేరకు వారి సామూహిక శక్తి, అభీష్టం తనలో సదా ప్రతిబింబిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని అయోధ్యసహా దేశమంతటా ఘనంగా నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆలయానికి 2008లో ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించే అవకాశం లభించడంతోపాటు కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఉమియా మాత దర్శనభాగ్యం లభించడంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గథిలలోని ఉమియా మాత ఆలయం ఆధ్యాత్మిక, దైవిక ప్రాధాన్యంగలది మాత్రమేగాక సామాజిక స్పృహ, పర్యాటక పాముఖ్యంగల ప్రదేశంగా రూపాంతరం చెందడంపై ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. ఉమియా మాత దయతో స్థానిక సమాజం, భక్తులు ఎన్నో విశిష్ట కార్యక్రమాలు చేపట్టారని ప్రధాని అభినందించారు.
ఉమియా మాత భక్తులైన వారెవరూ భూమాతకు ఎలాంటి నష్టం కలిగించడానికి ఇచ్చగించరని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మన తల్లికి మనం అవనసరంగా ఔషధాలు వినియోగించని రీతిలోనే రసాయనాలతో మన భూమాతను కలుషితం చేయరాదని ఆయన సూచించారు. భూ పరిరక్షణతోపాటు ‘ప్రతి నీటిచుక్కకూ మరింత ఫలితం’ వంటి జల సంరక్షణ పథకాల అమలు గురించి ఆయన ప్రస్తావించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన హయాంలో చేపట్టిన ప్రజా ఉద్యమాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో జల సంరక్షణ ఉద్యమం విషయంలో మనం ఉపేక్ష వహించరాదని ఆయన పిలుపునిచ్చారు. భూమాతను విష రసాయనాల నుంచి రక్షించాలని, ఈ దిశగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని పునరుద్ఘాటించారు. ఆనాడు తాను, కేశూభాయ్ జల సంరక్షణ కోసం కృషిచేయగా, ప్రస్తుత ముఖ్యమంత్రి భూమాత పరిరక్షణకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఉమియా మాతసహా ఇతర దేవతలందరి కరుణాకటాక్షాలతో, ప్రభుత్వ కృషి ఫలితంగా ‘బేటీ బచావో’ ఉద్యమం సత్ఫలితాలిచ్చి లింగ నిష్పత్తి మెరుగుపడిందని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఒలింపిక్ క్రీడల్లో గుజరాత్ నుంచి బాలికలు పెద్ద సంఖ్యలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చిన్నారులు, బాలికల్లో పోషకాహార లోపం నిర్మూలనపై క్రియాశీల చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. గర్భిణులకు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. పౌష్టికాహార లోపం బెడదను పూర్తిగా రూపుమాపాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందన్నారు. గ్రామాల్లో ఆరోగ్యకర శిశువుల పోటీల నిర్వహించాలని ఆలయ ధర్మకర్తల మండలిని శ్రీ మోదీ కోరారు. పేద విద్యార్థులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, ఆలయానికి చెందిన ప్రదేశాలు, మందిరాలను యోగా శిబిరాలు, తరగతులకు కూడా ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు.
స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, అమృత కాలం ప్రాముఖ్యం గురించి ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశం, గ్రామం, సమాజ రూపాన్ని మదిలో నిలబెట్టుకునే విధంగా ప్రజల్లో చైతన్యం, దృఢ సంకల్పాలను ప్రోది చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలపై తన దృక్పథాన్ని ఆయన నొక్కిచెప్పారు. వేలాది ఊటకట్టలు నిర్మించిన అనుభవంగల గుజరాత్ ప్రజలకు ఇదేమీ కష్టంకాకపోయినా, వారి కృషి ప్రభావం భారీగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు 2023 ఆగస్టు 15నాటికి ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలని పిలుపునిచ్చారు. దీన్నొక సామాజిక ఉద్యమంగా చేపట్టాలని, ఇందుకు సామాజిక చైతన్యం చోదకశక్తిగా ఉండాలని ఆయన సూచించారు.
శ్రీరామ నవమి పర్వదినాన్ని ప్రస్తావిస్తూ- శ్రీరాముని గురించి మనం తలపోసినపుడు శబరి, కేవతుడు, నిషాద రాజు కూడా గుర్తుకొస్తారని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల హృదయాల్లో వారు చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఏ ఒక్కరినీ నిర్లక్ష్యం చేయరాదన్న నీతి మనకు అవగతమవుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మహమ్మారి సమయంలో ప్రభుత్వ కృషిని ప్రస్తావిస్తూ- మహా మాయలాడి అయిన కోవిడ్ వైరస్ విషయంలో మనమంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ వైరస్‌తో పోరాటంలో భాగంగా 185 కోట్ల టీకా మోతాదులు వేయడం ద్వారా భారత్ అద్భుత ఘనతను సాధించిందని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో సామాజిక చైతన్యం, స్వచ్ఛత, ఒకసారి వాడే ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి ఉద్యమాలు ఇందుకు తోడ్పడ్డాయని కొనియాడారు. కాగా, ఆధ్యాత్మిక కోణంతోపాటు సామాజిక చైతన్య వ్యాప్తిలో విశ్వాస కేంద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2008లో ఆలయ
ప్రారంభోత్సవం చేశారు. ఆనాడు ఆయన చేసిన సూచనలకు అనుగుణంగా ఆలయ ధర్మకర్తల మండలి తమ కార్యకలాపాల పరిధిని వివిధ కార్యక్రమాలకు విస్తరించింది. ఈ మేరకు సామాజిక, ఆరోగ్య సంబంధ కార్యక్రమాలుసహా కంటి శుక్లాల ఉచిత శస్త్రచికిత్స, ఆర్థిక స్థోమతలేని రోగులకు ఉచితంగా ఆయుర్వేద మందుల పంపిణీ వంటి ధార్మిక కార్యకలాపాలు చేపట్టింది.