ప్రముఖులారా
అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి ఈ రోజు విన్నాం. నిన్న వారిని కలిశాను కూడా. ప్రస్తుత పరిస్థితిని నేను రాజకీయాలు లేదా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యగా పరిగణించను. ఇది మానవత్వానికి సంబంధించిన విషయం, మానవీయ విలువలకు సంబంధించిన విషయం అని నేను నమ్ముతాను. చర్చలు, దౌత్యం ఒక్కటే మార్గమని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి భారతదేశం తన చేతనైనంత సహకారం అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము.
ప్రముఖులారా
ప్రపంచ శాంతి, సుస్థిరత, సౌభాగ్యమే మన ఉమ్మడి లక్ష్యం. నేటి పరస్పర అనుసంధాన ప్రపంచంలో, ఏదైనా ఒక ప్రాంతంలో ఏర్పడే సంక్షోభాలు అన్ని దేశాలను ప్రభావితం చేస్తాయి. పరిమిత వనరులున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత తీవ్రంగా ప్రభావిత మవుతున్నాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో, ఈ దేశాలు ఆహారం, ఇంధనం , ఎరువుల సంక్షోభ గరిష్ట, అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
ప్రముఖులారా
శాంతి, సుస్థిరతలకు సంబంధించిన అంశాలను వేర్వేరు వేదికల్లో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నకు ఇది తావిచ్చింది. శాంతి స్థాపనే ధ్యేయంగా ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి (ఐరాస) నేడు ఘర్షణలను నివారించడంలో ఎందుకు విఫలమవుతోంది? ఉగ్రవాదానికి నిర్వచనం కూడా ఐక్యరాజ్యసమితిలో ఇంకా ఎందుకు ఆమోదించలేదు? ఆత్మపరిశీలన చేసుకుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. గత శతాబ్దంలో సృష్టించబడిన సంస్థలు ఇరవై ఒకటవ శతాబ్దపు వ్యవస్థకు అనుగుణంగా లేవు. అవి వర్తమాన వాస్తవాలను ప్రతిబింబించవు. అందుకే ఐక్యరాజ్యసమితి వంటి పెద్ద సంస్థల్లో సంస్కరణలకు గట్టి రూపం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ సౌత్ వాయిస్ గా కూడా మారాల్సి ఉంటుంది. లేదంటే సంఘర్షణకు ముగింపు పలకడం గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి కేవలం టాక్ షాప్ గా మారిపోతాయి.
ప్రముఖులారా
ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, అన్ని దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. యథాతథ స్థితిని మార్చే ఏకపక్ష ప్రయత్నాలకు వ్యతిరేకంగా మీ గళాన్ని పెంచండి. ఎలాంటి ఉద్రిక్తతలు, ఏ వివాదమైనా శాంతియుత మార్గాల ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటి నుంచో భావిస్తోంది. చట్టం ద్వారా పరిష్కారం లభిస్తే దాన్ని అంగీకరించాలి. ఈ స్ఫూర్తితోనే బంగ్లాదేశ్ తో భూ, సముద్ర సరిహద్దు వివాదాన్ని భారత్ పరిష్కరించుకుంది.
ప్రముఖులారా
భారతదేశంలో, ఇక్కడ జపాన్ లో కూడా బుద్ధ భగవానుడు వేలాది సంవత్సరాలుగా అనుసరించబడుతున్నాడు. ఆధునిక యుగంలో బుద్ధ బోధనల ద్వారా పరిష్కారం కనుగొన లేని సమస్య ఎది ఉండదు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న యుద్ధం, అశాంతి, అస్థిరతకు బుద్ధుడు శతాబ్దాల క్రితమే పరిష్కారం ఇచ్చాడు.
బుద్ధ భగవానుడు ఇలా అన్నా రు…
नहि वेरेन् वेरानी,
सम्मन तीध उदासन्,
अवेरेन च सम्मन्ति,
एस धम्मो सन्नतन।
అంటే, శత్రుత్వం శత్రుత్వాన్ని శాంతపరచదు. శత్రుత్వం అనుబంధం ద్వారా శాంతించబడుతుంది.
ఈ స్ఫూర్తితోనే మనం అందరితో కలిసి ముందుకు సాగాలి.
ధన్యవాదాలు