ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కాంగ్రెస్ బృందంతో సమావేశమయ్యారు. సీనియర్ సెనేటర్ కార్నిన్ సహాధ్యక్షతన సెనేట్‌లో భారతదేశం, భారతీయ అమెరికన్లకు మద్దతునిచ్చే ఈ బృందంలో సెనేటర్లు మైఖేల్ క్రాపో, థామస్ ట్యూబర్‌విల్లే, మైఖేల్ లీతోపాటు కాంగ్రెస్ సభ్యులు టోనీ గొంజాలెజ్, జాన్ కెవిన్ ఎలిజీ సభ్యులుగా ఉన్నారు.
భారతదేశంలో వైవిధ్య జనాభా, పెనుసవాళ్లు ఎదురైనప్పటికీ కోవిడ్ పరిస్థితులను అద్భుతంగా ఎదుర్కొనడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ- గత శతాబ్ద కాలంలో అత్యంత భయంకరమైన ఈ మహమ్మారిని నిలువరించడంలో దేశంలోని ప్రజాస్వామ్య నైతికత ప్రాతిపదికగాగల ప్రజల భాగస్వామ్యం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలతో ముడిపడిన భారత-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టం కావడంలో అమెరికా కాంగ్రెస్ నిరంతర, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నదని ప్రధానమంత్రి ప్రశంసించారు.
దక్షిణాసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతంసహా పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ సమస్యలపై సౌహార్ద, విస్పష్ట చర్చ సాగింది. రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల నడుమ వ్యూహాత్మక ప్రయోజన సమన్వయం ఇనుమడిస్తున్నదని ప్రధానమంత్రితోపాటు కాంగ్రెస్ ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. ప్రపంచ శాంతిసుస్థిరతలకు ప్రోత్సాహం దిశగా సహకారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్షించింది. ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకుగల అవకాశాలపై ప్రధాని తన అభిప్రాయాన్ని కాంగ్రెస్ బృందంతో పంచుకున్నారు. అంతేకాకుండా ఉగ్రవాదం, వాతావరణ మార్పు, సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞాన సరఫరా శృంఖలాలను బలోపేతం చేసుకోవడంసహా సమకాలీన ప్రపంచ సమస్యలపై సహకార విస్తరణకూ వీలున్నదని ఆయన పేర్కొన్నారు.
Met a US Congressional delegation led by Senator @JohnCornyn and consisting of Senators @MikeCrapo, @SenTuberville, @SenMikeLee and Congressmen @RepTonyGonzales, @RepEllzey. Appreciated the support and constructive role of the US Congress for deepening the India-US partnership. pic.twitter.com/trGJGExv5N
— Narendra Modi (@narendramodi) November 13, 2021