NCC symbolises leadership, selfless service, hardwork, discipline and nationalism: PM Modi
On 7th December we mark Armed Forces Flag Day. Let us salute the valour of our soldiers & remember their sacrifices: PM Modi
During Mann Ki Baat, PM Modi encourages students to actively take part in Fit India movement
In the country, values of peace, unity and goodwill are paramount: PM Modi
The Ayodhya verdict has proved to be a milestone for our judiciary: PM Modi
Our civilization, culture and languages convey the message of unity in diversity to the whole world: PM Modi
The Constitution of India is one which protects the rights and respects every citizen: Prime Minister

నా ప్రియమైన  దేశప్రజలారా,

 ‘మన్ కీ బాత్’ లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ్టి ‘మన్ కీ బాత్’ దేశ యువత కోసం. స్నేహశీలత, దేశభక్తి కల యువత కోసం. సేవాతత్పరత కలిగిన యువతరం కోసం. మీకు తెలుసు కదా, ప్రతి ఏడాదీ నవంబరు నెలలోని నాలుగవ ఆదివారాన్ని NCC Day గా మనం జరుపుకుంటాము. సాధారణంగా మన యువతకి స్నేహితుల దినోత్సవం బాగా గుర్తు ఉంటుంది. కానీ NCC Day ని గుర్తుపెట్టుకునేవారు కూదా చాలా మందే ఉన్నారు. రండి, ఇవాళ మనం NCC గురించి కబుర్లు చెప్పుకుందాం. తద్వారా నాకు కూడా కొన్ని గతరోజుల జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకునే అవకాశం లభిస్తుంది. ముందుగా NCC లోని ప్రస్తుత, పూర్వ కేడేట్లకి నా అనేకానేక శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా మీలాగనే ఒకప్పుడు NCC కేడెట్ నే. ఇవాళ్టికీ మనసులో నన్ను నేను ఒక కేడెట్ లాగే భావించుకుంటాను. NCC అంటే National Cadet Corps అని అందరికీ తెలుసిన విషయమే. ప్రపంచంలో అతిపెద్ద uniformed youth organizations అన్నింటిలోనూ, మన భారతదేశం లోని NCC ఒకటి. ఇది ఒక Tri-service Organization. ఇందులో మన సాయుధదళాలు, జల, వాయు సేనలు మూడూ కలిసి ఉంటాయి. నాయకత్వం, దేశభక్తి, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, మొదలైన సద్గుణాలను తమ  స్వభావంలో భాగంగా మార్చుకుని, వీటిని తమ అలవాట్లుగా మార్చుకునే అద్భుత ప్రయాణం పేరే NCC ! ఈ యాత్రను గురించి మరిన్ని కబుర్లు ఇవాళ మనతో ఫోన్లో చెప్పుకుందుకు, NCC లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్న కొందరు యువత తయారుగా ఉన్నారు. రండి వారితో మాట్లాడదాం.

 

ప్రధాన మంత్రి: మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు?

 

తరన్నుమ్ ఖాన్( lady): జైహింద్ ప్రధాన మంత్రి గారూ.

 

ప్రధాన మంత్రి: జైహింద్.

 

తరన్నుమ్ ఖాన్: సార్, నా పేరు junior under officer తరన్నుమ్ ఖాన్.

 

ప్రధాన మంత్రి: తరన్నుమ్ మీది ఏ ప్రాంతం?

 

తరన్నుమ్ ఖాన్: నేను ఢిల్లీ నివాసిని సర్.

 

ప్రధాన మంత్రి: ఓహో. NCC లో ఎప్పటి నుండి ఉన్నారు? మీ అనుభవాలు ఏమిటి?

 

తరన్నుమ్ ఖాన్: సర్ నేను NCC లో 2017 నుండి ఉన్నాను. ఈ మూడేళ్ళూ కూడా నా జీవితంలో అత్యంత ఉత్తమమైనవి.

 

ప్రధాన మంత్రి: ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది.

 

తరన్నుమ్ ఖాన్: సర్, నేను అనుభూతి చెందిన అత్యంత ఉత్తమమైన అనుభవాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అది “ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్” కేంప్. ఆగస్టు లో జరిగిన ఆ కేంప్ కి NER ‘North Eastern Region’ తాలూకూ పిల్లలు కూడా వచ్చారు. వారితో మేము పది రోజుల పాటు ఆ కేంప్ లో ఉన్నాము. తద్వారా మేము వారి జీవన విధానము, వారి భాష తెలుసుకున్నాము. వారి సంప్రదాయము, వారి సంస్కృతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. vaizome అంటే హలో అని, అలాంటివి. కల్చరల్ నైట్ జరిగినప్పుడు వారి నృత్య విధానాలనీ వాటినీ నేర్చుకున్నాము. వారి నృత్యాన్ని తెహ్రా అంటారు. వారు నాకు మెఖేలా వేసుకోవడం కూడా నేర్పించారు. ఆ దుస్తులలో మేమందరమూ ఎంతా బాగున్నామో. ఢీల్లీ, నాగాలాండ్ ప్రాంతాలకు చెందిన మిత్రులు, మేమందరమూ కూడా చాలా బాగున్నాము. వారికి మేము ఢిల్లీ కూడా చూపెట్టాము. ఢిల్లీలో వాళ్ళకి నేషనల్ వార్ మెమోరియల్ నూ, ఇండియా గేట్ నూ చూపెట్టాము. అక్కడ వాళ్లకి మేము ఢిల్లీ ఛాట్ , భేల్ పురీ రుచులను చూపెట్టాము కూడా. వాళ్ళు ఎక్కువగా సూప్స్, ఉడికించిన కూరలు తింటారు కాబట్టి మా రుచులు వారికి కారంగా అనిపించాయి. మన రుచులు వాళ్ళకి పెద్దగా నచ్చలేదు కానీ మేమందరమూ కలిసి బోలెడు ఫోటోలు తీసుకున్నాము. ఎన్నో అనుభవాలను పంచుకున్నాము.

 

ప్రధాన మంత్రి: మీరు వాళ్ళందరితో కాంటాక్ట్ లోనే ఉన్నారా?

 

తరన్నుమ్ ఖాన్: ఔను సర్. మేము వారితో మా స్నేహం కొనసాగుతోంది.

 

ప్రధాన మంత్రి: మంచి పని చేసారు.

 

తరన్నుమ్ ఖాన్: ఔను సర్.

 

ప్రధాన మంత్రి: మీ తర్వాత ఇంకా ఎవరున్నారు మాట్లాడేవారు..

 

జి.వి.శ్రీహరి: జై హింద్ సర్

 

ప్రధాన మంత్రి: జైహింద్

 

జి.వి.శ్రీహరి: నేను సీనియర్ అండర్ ఆఫీసర్ జి.వి. శ్రీహరి ని మాట్లాడుతున్నాను. సర్. నేను కర్నాటక లోని బెంగుళూరు నుంచి వచ్చాను.

 

ప్రధాన మంత్రి: మీరు ఎక్కడ చదువుకుంటున్నారు.

 

జి.వి.శ్రీహరి: బెంగుళూరు లోని Kristu Jayanti College లో సర్

 

ప్రధాన మంత్రి: ఓహో, బెంగుళూరు లోనేనా

 

జి.వి.శ్రీహరి: అవును సర్.

 

ప్రధాన మంత్రి: చెప్పండి.

 

జి.వి.శ్రీహరి: నేను సింగపూర్ లో జరిగిన యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి హాజరై, నిన్ననే వచ్చాను సర్ .

 

ప్రధాన మంత్రి: భలే!

 

జి.వి.శ్రీహరి: అవును సర్

 

 

ప్రధాన మంత్రి: అయితే మీకు సింగపూర్ వెళ్ళే అవకాశం లభించిందన్నమాట.

 

జి.వి.శ్రీహరి: అవును సర్.

 

ప్రధాన మంత్రి: అయితే సింగపూర్ అనుభవాలు చెప్పండి –

 

జి.వి.శ్రీహరి: అక్కడ కేంప్ కి యునైటెట్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, హాంగ్ కాంగ్,  ఇంకా Nepal మొదలైన ఆరు దేశాల నుండి కేడెట్స్ వచ్చారు. అక్కడ మాకు combat lessons, International Military exercises మొదలైనవాటిని exchange చేసుకునే అవకాశం లభించింది. అక్కడ మా ప్రదర్శన కొంత భిన్నంగానే జరిగింది సర్. అక్కడ మాకు water sports, ఇంకా ఎన్నో సాహస కార్యకలాపాలు నేర్చుకునే అవకాశం లభించింది. అక్కడ జరిగిన water polo tournament లో భారతీయ జట్టుకి విజయం లభించింది సర్. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలోనూ మేము  పాల్గొన్నాము సర్. అక్కడి వారికి మా డ్రిల్, మా word of command బాగా నచ్చాయి సర్.  

 

ప్రధా నమంత్రి: హరీ, మీరు ఎంతమంది వెళ్లారు?

 

జి.వి.శ్రీహరి: ఇరవై మంది సర్. పది మంది అబ్బాయిలం, పది మంది అమ్మాయిలు.

 

ప్రధాన మంత్రి: వీరంతా భారతదేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారేనా?

 

జి.వి.శ్రీహరి: అవును సర్.

 

ప్రధానమంత్రి: బావుంది. మీ అనుభవాలను వినడానికి మీ మిత్రులందరూ ఆత్రంగా ఉండి ఉంటారు.

 

ఇంకా ఎవరున్నారు మాట్లాడేవారు –

 

వినోలే కిసో : జైహింద్ సర్.

 

ప్రధాన మంత్రి: జైహింద్.

 

వినోలే కిసో : నా పేరు వినోలే కిసో సర్. నేను సీనియర్ అండర్ ఆఫీసర్ ని . నేను north eastern region కి చెందిన నాగాలాండ్ నుంచి వచ్చాను సర్.

 

ప్రధాన మంత్రి: వినోలే, మీ అనుభవాలేమిటో చెప్పండి.

 

వినోలే కిసో : సర్ , నేను St. Joseph’s college, Jakhama ( Autonomous) లో B.A. History (Honours) చదువుతున్నాను. నేను 2017లో  NCC లో చేరాను. అది నా జీవితంలోకెల్లా అత్యంత మంచి నిర్ణయం సర్.

 

ప్రధాన మంత్రి: NCCలో చేరడం వల్ల మీకు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అభించింది?

 

వినోలే కిసో : నేను NCCలో చేరాకా ఎంతో నేర్చుకున్నాను. నాకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను ఈ 2019, జూన్ నెలలో ఒక కేంప్ కి వెళ్ళాను. దాని పేరు  Combined Annual Training Camp. kohima లోని Sazolie college లో అది జరిగింది. ఆ కేంప్ కి 400 మంది cadets హాజరైయ్యారు.

 

ప్రధాన మంత్రి: అయితే, మీ నాగాలాండ్ ప్రజలంతా మీ అనుభవాలను తెలుసుకోవాలనుకుంటారు కదా. భారతదేశం లో ఎక్కడికి వెళ్ళావో, ఏమేమి చూశావో, నీ అనుభవాలను మా అందరితో పంచుకుంటావా?

 

వినోలే కిసో : తప్పకుండా చెప్తాను సర్.

 

ప్రధాన మంత్రి: సరే! మీతో ఇంకా ఎవరున్నారు?

 

అఖిల్: జైహింద్ సర్. నా పేరు జూనియర్ అండర్ ఆఫీసర్ అఖిల్ సర్.

 

ప్రధాన మంత్రి: అఖిల్, చెప్పండి.

 

అఖిల్: హరియాణా కు చెందిన రోహ్తక్ నుంది వచ్చాను సర్ నేను.

 

ప్రధాన మంత్రి: ఓహో

 

అఖిల్: నేను ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన దయాల్ సింగ్ కాలేజీ నుండి వచ్చాను సర్. నేను ఫిజిక్స్ ఆనర్స్ చదువుతున్నాను సర్.

 

ప్రధాన మంత్రి: ఓహో.

 

అఖిల్: సర్, నాకు ఎన్.సి.సి లో అన్నింటికన్నా క్రమశిక్షణ బాగా నచ్చింది సర్

 

ప్రధాన మంత్రి: ఆహా!

 

అఖిల్: ఆ క్రమశిక్షణే నన్ను మరింత బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దింది సర్. ఎన్.సి.సి  కేడెట్ లతో చేయించే డ్రిల్, వారి యూనిఫారమ్ నాకు బాగా ఇష్టం సర్.

 

ప్రధాన మంత్రి: ఎన్ని కేంప్స్ లో పాల్గొన్నావు? ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళావు?

 

అఖిల్: నేను మూడు కేంప్ లకు హాజరయ్యాను సర్. నేను ఈమధ్యనే డేహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ లో పాల్గొని వచ్చాను సర్.

 

ప్రధాన మంత్రి: ఎన్ని రోజుల క్యాంప్ అది?

 

అఖిల్ : అది పదమూడు రోజుల క్యాంప్ సర్

 

ప్రధాన మంత్రి: ఓహో.

 

అఖిల్: భారతీయ సేనలో ఆఫీసర్ ఎలా అవుతారో అక్కడ నేను చూశాను సర్. ఆ తర్వాత నుండీ భారతీయ సేనలో ఆఫీసర్ అవ్వాలనే కోరిక, సంకల్పం ఇంకా దృఢంగా మారాయి సర్.

ప్రధాన మంత్రి: చాలా మంచిది.

 

అఖిల్: రిపబ్లిక్ డే పెరేడ్ లో కూడా నేను పాల్గొన్నాను సర్.

 

ప్రధాన మంత్రి: శభాష్!

 

అఖిల్: నాకన్నా ఎక్కువ మా అమ్మ చాలా సంతోషించింది సర్. తెల్లవారుజామున రెండింటికి లేచి మేము రాజ్ పథ్ లో పెరేడ్ చేయడానికి వెళ్ళేప్పుడు మేమంతా ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళం. మిగిలిన దళాలవారు మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించారంటే, రాజ్ పథ్ లో మేము మార్చ్ చేస్తూంటే మా వెంట్రుకలు నిక్కబొడుచుకునేవి సర్.

 

ప్రధాన మంత్రి: మీ నలుగురితో మాట్లాడే అవకాశం లభించినందుకు ఆనందం గా ఉంది. అది కూడా NCC Day నాడు. ఇది నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు మా గ్రామం లోని పాఠశాల లో NCC కేడెట్ గా ఉన్నాను. ఈ క్రమశిక్షణ, ఈ యూనిఫారమ్, వాటి వల్ల పెరిగే మానసిక స్థైర్యం, ఇవన్నీ కూడా ఒక NCC కేడెట్ గా  నాకు చిన్నప్పుడు అనుభవమే.

 

వినోలే: ప్రధాన మంత్రి గారూ, నాదొక ప్రశ్న

 

ప్రధాన మంత్రి: ఆ..అడగండి

 

తరన్నుమ్: మీరు కూడా NCC లో భాగంగా ఉన్నానంటున్నారు కదా..

 

ప్రధాన మంత్రి: ఎవరు? వినోలే నేనా మాట్లాడుతున్నది?

 

వినోలే: అవును సర్, నేనే

 

ప్రధా నమంత్రి: ఆ, వినోలే చెప్పండి.

 

వినోలే: మీకు ఎప్పుడైనా దండన (punishment) లభించిందా?

 

ప్రధాన మంత్రి: (నవ్వుతూ) అంటే మీకు అప్పుడప్పుడూ దండన(punishment) లభిస్తూ ఉంటుందా?

 

వినోలే : అవును సర్.

 

ప్రధాన మంత్రి: లేదు. నాకెప్పుడూ ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే నేను మొదటి నుండి క్రమశిక్షణ ను నమ్మే వ్యక్తి ని. కానీ ఒకసారి ఒక అపార్థం జరిగింది. మేము ఒక కేంప్ కి వెళ్లినప్పుడు నేను ఒక చెట్టు ఎక్కాను. అందరూ నేను తప్పు చేశాను, నాకు శిక్ష పడుతుందనే భావించారు. కానీ తర్వాత, గాలిపటం దారానికి చిక్కుకున్న ఒక చిన్న పక్షిని రక్షించడానికి నేను ఆ చెట్టు ఎక్కానని, ఆ పక్షిని విడిపించినప్పుడు అందరికీ అర్థమైంది. అందరూ నన్ను అభినందించారు. ఇలాంటి ఒక చిత్రమైన అనుభవం నాకు ఎదురైంది.

 

తరన్నుమ్ ఖాన్: మీ అనుభవాన్ని తెలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది సర్.

 

ప్రధాన మంత్రి: ధన్యవాదాలు

 

తరన్నుమ్ ఖాన్: నేను తరన్నుమ్ ని మాట్లాడుతున్నాను సర్.

 

ప్రధాన మంత్రి: ఆ..చెప్పండి చెప్పండి.

 

తరన్నుమ్ ఖాన్:  సర్, ప్రతి భారతీయ పౌరుడినీ రాబోయే మూడేళ్ళలో దేశంలోని పదిహేను ప్రదేశాలకు వెళ్లవలసిందని మీ సందేశంలో మీరు చెప్పారు కదా. మేము ఎటువంటి ప్రదేశానికి వెళ్ళాలో మీరు కొంచెం చెప్పగలరా?  అన్నింటికన్నా ఏ ప్రదేశం మీకు బాగా నచ్చిందో కూడా చెప్పగలరా?

 

ప్రధాన మంత్రి: నేను ఎప్పుడూ హిమాలయ ప్రాంతాన్ని బాగా ఇష్టపడతాను.

 

తరన్నుమ్ ఖాన్: ఓహో..

 

ప్రధాన మంత్రి: అయినా నా ఇష్టాన్ని పక్కనపెడితే, నేను భారతీయులను కోరేది ఏమిటంటే, మీకు ప్రకృతి పై ప్రేమ గనుక ఉంటే, దట్టమైన అడవులను, జలపాతాలను, ఇంకా భిన్నమైన ప్రదేశాలను చూడాలని ఉంటే, మీరు తప్పకుండా ఈశాన్య భారతదేశానికి(North East) వెళ్ళవలసిందని నా విన్నపం.

 

తరన్నుమ్: అలాగే సర్.

 

ప్రధాన మంత్రి: నేను ఎప్పుడూ ఇదే చెప్తూంటాను. ఇందువల్ల ఈశాన్య భారత ప్రదేశాల లో టూరిజం పెరుగుతుంది. ఆ ప్రాంతాల ఎకానమీకి చాలా లాభదాయకం. ఇందువల్ల “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” అనే స్వప్నం కూడా మరింత శక్తిమంతమవుతుంది.

 

తరన్నుమ్ ఖాన్: అవును సర్.

 

ప్రధాన మంత్రి: కానీ, యావత్ భారతదేశం లో ప్రతి ప్రాంతం లోనూ చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆత్మను స్పృశించే ప్రాంతాలు ఉన్నాయి.

 

జి.వి. శ్రీహరి: ప్రధాన మంత్రి గారూ, నేను శ్రీహరి ని మాట్లాడుతున్నాను.

 

ప్రధాన మంత్రి : హరీ, చెప్పండి.

 

జి.వి. శ్రీహరి: మీరు ఒక రాజకీయ నాయకుడు కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు? అని మిమ్మల్ని అడగాలనుకున్నాను సర్.

 

ప్రధాన మంత్రి : ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి పిల్లవాడి జీవితంలోనూ ఎన్నో మజిలీలు వస్తాయి.

 

ఒకసారి ఏదో అవ్వాలనిపిస్తుంది. మరోసారి మరొకటి అవ్వాలనిపిస్తుంది. నాకు రాజకీయాలలోకి రావాలని ఆసక్తి ఎప్పుడూ లేదు. అలా ఎప్పుడూ అనుకోనూ లేదు. కానీ ఇప్పుడిక్కడికి చేరుకున్నాను. కాబట్టి, నా శాయశక్తులా దేశానికి సేవ చెయ్యాలని, అదే విషయం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల, అసలు ఇక్కడ లేకపోతే మరెక్కడ? అని అసలు ఆలోచించకూడదు కూడా నేను. ఉన్నచోటనే మనసు లగ్నం చేసి జీవించాలి. శాయశక్తులా శ్రమించాలి. వీలయినంతగా దేశం కోసమే పని చెయ్యాలి. రాత్రి, పగలు చూసుకోకుండా, నేను పని చేయ్యాల్సినది దేశం కోసం మాత్రమే అనే లక్ష్యం తో నేను ముందుకు వెళ్తున్నాను.

అఖిల్: ప్రధాన మంత్రి గారూ…

 

ప్రధాన మంత్రి: ఆ..చెప్పండి

 

అఖిల్: మీరు ఇంతగా శ్రమిస్తూ ఉంటారు కదా, మీకు టీవీ చూడడానికీ, సినిమాలు చూడడానికీ, పుస్తకాలు చదువుకోవడానికీ ఎప్పుడు సమయం దొరుకుతుందా అని నాకు చాలా కుతూహలంగా ఉంది.

 

ప్రధాన మంత్రి: పుస్తకాలు చదివే అలవాటు నాకు ఉండేది. సినిమాలు చూడాలనే ఆసక్తి ఎప్పుడూ లేదు. అందువల్ల ఆ సమయాభావం అనిపించదు.  కానీ టీవీ చూడడానికి ఎక్కువ సమయం లభించదు. చాలా తక్కువ సమయం దొరుకుతుంది. ఆసక్తి ఉండడం వల్ల ఇదివరలో అప్పుడప్పుడూ డిస్కవరీ ఛానల్ చూసేవాణ్ణి. పుస్తకాలు కూడా చదివేవాణ్ణి కానీ ఈ మధ్య అసలు సమయమే దొరకడం లేదు. అయినా గూగుల్ కారణంగా మంచి అలవాట్లు పోతున్నాయి.  ఏదన్నా రిఫరెన్స్ కావాలంటే వెంటనే షార్ట్ కట్ లు వెతికేసుకుంటున్నాము. అలా అందరితో పాటే నాకు ఉన్న మంచి అలవాట్లు కూడా తప్పిపోయాయి.

 

ఇవాళ మీ అందరితో మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ ద్వారా ఎన్.సి.సి కేడెట్స్ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అనేకానేక ధన్యవాదాలు మిత్రులారా.

ఎన్.సి.సి కేడెట్స్  అందరూ: అనేకానేక ధన్యవాదాలు సర్. థాంక్ యూ.

ప్రధాన మంత్రి: ధన్యవాదాలు. ధన్యవాదాలు

ఎన్.సి.సి కేడెట్స్  అందరూ: జైహింద్ సర్.

ప్రధాన మంత్రి: జైహింద్.

ఎన్.సి.సి కేడెట్స్  అందరూ: జైహింద్ సర్

ప్రధాన మంత్రి: జైహింద్. జైహింద్.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, డిసెంబర్ 7 వ తేదీని, మన Armed Forces Flag Day గా జరుపుకుంటామన్న విషయాన్ని భారతీయులంతా ఎప్పుడూ మర్చిపోకూడదు. మన వీర సైనికుల పరక్రమాన్నీ, బలిదానాలను గుర్తు చేసుకునే రోజు అది. అంతేగాక, వారికి మన సహకారాన్ని, మద్దతుని తెలిపే రోజు. వారికి మనం కేవలం గౌరవాన్ని మాత్రమే ప్రకటిస్తే సరిపోదు. మన సహకారాన్ని కూడా అందించాలి. డిసెంబర్ 7 వ తేదీన ప్రతి భారతీయ పౌరుడూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరి దగ్గరా ఆ రోజున Armed Forces Flag ఉండి తీరాల్సిందే. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించి తీరాలి. రండి, ఈ సందర్భంగా మనం మన సాయుధదళాల అద్భుతమైన సాహసాలు, శౌర్య పరాక్రమాలను, సమర్పణాభావాల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరుద్దాం. అమరవీరులైన మన సైనికులను స్మరిద్దాం.

 

 

నా ప్రియమైన దేశప్రజలారా, భారతదేశం లో మొదలైన ఫిట్ ఇండియా ఉద్యమం గురించి మీకు తెలుసు కదా. సిబిఎస్ సి వారు ఒక ప్రశంసాత్మకమైన పని చేశారు. ఫిట్ ఇండియా వారోత్సవాన్ని ప్రారంభించారు. పాఠశాలల వారు ఈ ఫిట్ ఇండియా వారోత్సవాన్ని డిసెంబర్ నెలలో ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ఇందులో ఫిట్ నెస్ కు సంబంధించిన ఎన్నో రకాల కార్యకలాపాలు ఉంటాయి. ఇందులో క్విజ్, వ్యాస రచన, చిత్రలేఖనం, సంప్రదాయ, ప్రాంతీయ ఆటలు, యోగాసనాలు, నృత్యం, మొదలైన ఆటపాటల్లో పోటీలు ఉంటాయి. ఫిట్ ఇండియా వారోత్సవంలో విద్యార్థులతో పాటూ వారి అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా పాల్గోవచ్చు. కానీ ఫిట్ ఇండియా అంటే కేవలం మెదడుకు పదునుపెట్టడం, కాయితాలపై కసరత్తు చేయడమో  లేదా ల్యాప్ టాప్ లోనో, కంప్యూటర్ లోనో, లేదా మొబైల్ ఫోన్ లోనో ఒక ఫిట్ నెస్ యాప్ చూడడం మాత్రమే అనుకోకండి. ఫిట్ ఇండియా  అంటే చెమటను చిందించడం. మన ఆహారపు అలవాట్లు మారాలి. ఎక్కువగా శ్రమించడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. నేను దేశం లోని ప్రతి పాఠశాల బోర్డు వారినీ, యాజమాన్యాన్నీ కోరేదేమిటంటే, ప్రతి పాఠశాల లోనూ, డిసెంబర్ నెలలో ఫిట్ ఇండియా వారోత్సవాన్ని జరపాలని కోరుతున్నాను. ఇందువల్ల ఫిట్ నెస్ అనేది మన దిన చర్యలో ఒక భాగం గా మారుతుంది. ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లో భాగం గా ఫిట్ నెస్ గురించి పాఠశాలలకు ర్యాంకింగ్ ఏర్పాటు కూడా జరిగింది. ఈ ర్యాంకింగ్ ని సంపాదించుకున్న పాఠశాలల వారు ఫిట్ ఇండియా లోగోనీ, జెండానీ వాడుకోగలుగుతారు.

 

ఏ పాఠశాల అయినా ఫిట్ ఇండియా పోర్టల్ కు వెళ్ళి తమను తాము ఫిట్ గా ప్రకటించుకోవచ్చు. అప్పుడు ఆ పాఠశాలలకు ఫిట్ ఇండియా త్రీ స్టార్, ఫిట్ ఇండియా ఫైవ్ స్టార్   రేటింగ్స్ ఇవ్వబడతాయి. దేశం లోని అన్ని పాఠశాలలూ ఫిట్ ఇండియా ర్యాంకింగ్ లో పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఫిట్ ఇండియా అనేది ఒక సహజ స్వభావం గా మారాలి. ఇది ఒక ప్రజా ఉద్యమం గా మారాలి. ప్రజల్లో అవగాహన పెరగాలి. ఇందుకోసం అందరూ ప్రయత్నించాలి.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఎంతో విశాలమైనది. ఎన్నో భిన్నత్వాలతో నిండి ఉన్నది మన దేశం. అందువల్ల ఎన్నో విషయాలు మన దృష్టికి రావు. అది స్వాభావికమే. ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం mygov app   లోని కామెంట్స్ పై నా దృష్టి పడింది. అస్సామ్ లోని నౌగావ్ అనే ప్రాంతానికి చెందిన శ్రీ రమేష్ శర్మ గారు ఆ కామెంట్ రాశారు. బ్రహ్మపుత్ర నది పై ఒక ఉత్సవం జరుగుతోందని ఆయన రాశారు. దాని పేరు బ్రహ్మపుత్ర పుష్కరాలు. నవంబరు 6 నుండి నవంబరు16 వరకూ ఈ ఉత్సవాలు జరిగాయి. ఇందులో పాల్గోవడానికి దేశం నలుమూలల నుండి ఎందరో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఇది విని మీకు ఆశ్చర్యంగా అనిపించలేదు? కానీ దురదృష్టవశాత్తు ఈ ఉత్సవానికి లభించవలసిన ప్రచారం లభించలేదు. దేశం నలుమూలలకీ ఈ ఉత్సవాన్ని గురించిన సమాచారం అందాల్సినంతగా అందలేదు. కానీ ఈ మొత్తం ఉత్సవం ఒకరకంగా చెప్పాలంటే దేశాన్ని ఏకం చేసే కార్యక్రమం. ఒకే దేశం, ఒకే సందేశం, మనందరము ఒకటే అనే సందేశాన్ని అందించే ఉత్సవం ఇది. ఐకమత్య భావాన్ని పెంచేది, ఆ భావానికీ బలాన్నిచ్చే కార్యక్రమం ఇది.

 

ముందుగా, ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు ఈ విషయాన్ని తెలిపే ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్న రమేష్ గారికి అనేకానేక ధన్యవాదాలు. ఈ విషయమై విస్తృతమైన చర్చలు గానీ, ప్రచారం గానీ జరగలేదని మీరు బాధపడుతూ చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. దేశం లో చాలామందికి ఈ సంగతి తెలియనే తెలియదు. కానీ ఎవరైనా ఈ సంగతిని International river festival అని ప్రచారం చేసి ఉంటే, గొప్ప గొప్ప పద ప్రయోగాలతో ప్రచారం చేయగలిగి ఉంటే, బహుశా మన దేశంలో కొందరు దీనిపై చర్చలు జరిపి ఉండేవారు, అందువల్ల ప్రచారం కూడా జరిగి ఉండేది.

నా ప్రియమైన దేశ ప్రజలారా, पुष्करम, पुष्करालू, पुष्करः అనే పదాలను మీరెప్పుడైనా విన్నారా? వీటి అర్థం మీకు తెలుసా? ఇవి భారతదేశం లోని రకరకాల నదులకు జరిగే ఉత్సవాల తాలూకూ వేరు వేరు పేర్లు, ప్రతి పన్నెండేళ్ళకి ఒకసారి, మన దేశం నలుమూలల్లోనూ ప్రవహించే పన్నెండు ముఖ్యమైన నదులకు ఉత్సవాలు జరుగుతాయి. ఒకదాని తర్వాత ఒకటిగా, ప్రతి నదికీ పన్నెండేళ్ల కొకసారి, పన్నెండు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. కుంభ్ మేళా లాగ ఈ ఉత్సవాలన్నీ దేశ సమైక్యతను పెంచుతాయి. “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” అనే నినాదాన్ని దృశ్యరూపం లో ఈ ఉత్సవాలు చూపెడతాయి. పుష్కరాల వల్ల నది తాలూకు గౌరవం, ప్రాముఖ్యత, జీవితంలో నది ప్రాముఖ్యత ఒక సహజరూపంలో బహిర్గతమవుతాయి.

 

ప్రకృతికీ, పర్యావరణానికీ, నీటికీ, భూమికీ, అరణ్యాలకూ మన పూర్వీకులు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. నదుల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సమాజానికి నదుల పట్ల సానుకూల భావం ఏర్పడేలా, అది ఒక ఆచరించదగ్గ కర్మలాగ ఏర్పరిచారు. నది తో పాటుగా సంస్కృతిని, నదితో పాటుగా ఒక కర్మనూ ప్రవహింపజేశారు మన పూర్వీకులు. అలా నదితో పాటుగా సమాజాన్ని కలిపి ఉంచే ప్రయత్నం నిరంతరం సాగుతూ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందువల్ల సమాజం నదులతోనూ ముడిపడింది, తనలో తాను ఐకమత్యంగానూ ఉంది. క్రితం సంవత్సరం తమిళనాడు లో తామీర్ బర్నీ అనే నది పుష్కరాలు జరిగాయి. ఈ ఏడాది బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు జరిగాయి. వచ్చే ఏడాది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో తుంగభద్రా నది పుష్కరాలు జరగబోతున్నాయి. ఒకరకంగా మీరు ఈ పన్నెండు నదుల ప్రదేశాల యాత్రలనూ ఒక యాత్రా ప్రదక్షిణలాగ చేయాలనే పథకాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ సందర్భంలో నేను అస్సాం ప్రజల ఆత్మీయతనూ, వారి ఆతిథ్యాన్నీ మెచ్చుకోవాలనుకుంటున్నాను. భారతదేశం నలుమూలల నుండి వచ్చిన తీర్థయాత్రికులను అస్సాం ప్రజలు ఎంతో అందమైన స్వాగతాన్ని అందించారు. పరిశుభ్రత పట్ల కూడా నిర్వాహకులు ఎంతో శ్రధ్ధను కనబరిచారు. ప్లాస్టిక్ రహితంగా ప్రదేశం ఉండేలా ఏర్పాట్లు చేసారు. ప్రతిచోటా బయో టాయిలెట్లను ఏర్పరిచారు, నదుల పట్ల ఈ రకమైన ఐక్యతా భావాన్ని జాగృతం చేసేలా వేల ఏళ్ల క్రితమే మొదలైన ఈ ఉత్సవాలు భావితరాలను కూడా ఐకమత్యంగా ఉంచుతాయని ఆశిస్తున్నాను. ప్రకృతి, పర్యావరణ, నీరు, ఇవన్నీ కూడా మన పర్యటన లో భాగం గా మారాలని, జీవితాల లో కూడా ఇవి ఒక భాగమవ్వాలని ఆశిస్తున్నాను.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, మధ్య ప్రదేశ్ నుండి శ్వేత అనే ఆడబిడ్డ నమో యాప్ లో ఏం రాసిందంటే, “సర్, నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. నా బోర్డ్ పరీక్షలకు ఇంకా ఒక ఏడాది సమయం ఉంది. మీరు విద్యార్థులతోనూ, ఎగ్జామ్స్ వారియర్స్ తోనూ మీరు మాట్లాడడం నేను వింటూనే ఉంటాను. కానీ నేను మీకు ఇప్పుడు ఎందుకు రాస్తున్నానంటే, రాబోయే పరీక్షలపై చర్చ ఎప్పుడు ఉంటుందో మీరింకా చెప్పలేదు. దయచేసి మీరు త్వరలో ఈ చర్చను ఏర్పాటు చేయండి.  వీలైతే జనవరి లోనే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి.

మిత్రులారా, మన్ కీ బాత్ గురించి ఇదే సంగతి నాకు బాగా నచ్చుతుంది. నా యువ మిత్రులు నాతో అధికార పూర్వకం గానూ, స్నేహభావం తోనూ ఫిర్యాదు చేస్తారు. ఆదేశాలను జారీ చేస్తారు. సూచనల ను అందిస్తారు. ఇది నాకు ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. శ్వేత గారూ, మీరెంతో సరైన సమయానికి ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చారు. పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఏడాది లాగానే వాటిని గురించి మనం చర్చించుకోవాలి కూడా. మీరు చెప్పినది సరిగ్గానే ఉంది. ఈ కార్యక్రమాన్ని కాస్త త్వరగానే ఏర్పాటు చేయాలి.

 

పరీక్షల గురించి జరిగిన గత కార్యక్రమం తర్వాత, ఎంతో మంది ప్రజలు దీనిని ఇంకా ప్రభావవంతంగా తయారు చేయడానికి ఎన్నో సూచనలను పంపించారు. కార్యక్రమాన్ని చాలా ఆలస్యం గా చేశానని, కార్యక్రమం జరిగే నాటికి పరీక్షలు బాగా దగ్గరకు వచ్చేశాయని ఫిర్యాదు కూడా చేశారు. ఈ కార్యక్రమాన్ని జనవరి లో చేయాలని శ్వేత ఇచ్చిన సూచన సరైనదే. HRD Ministry , MyGov టీమ్ కలిసి దీనిపై పని చేస్తోంది. కానీ నేను జనవరి నెల మొదట్లోనో, మధ్యలోనో ఈ కార్యక్రమం ఏర్పాటయ్యే ప్రయత్నం చేస్తాను. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల, మిత్రుల వద్ద రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది, తమ స్కూల్ నుండే ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవడం, రెండవది – ఇక్కడ ఢిల్లీ లో జరిగే కార్యక్రమం లో నేరుగా పాల్గొనడం. ఢిల్లీ లో ఈ కార్యక్రమం లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఎంపిక, MyGov మాధ్యమం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

మిత్రులారా, మనందరం కలిసి పరీక్షల భయాన్ని పారద్రోలాలి. నా యువ మిత్రులు పరీక్షల సమయం లో నవ్వుతూ, ఆడుతూ పాడుతూ ఉండాలి, తల్లిదండ్రులు వత్తిడి లేకుండా ఉండాలి, అధ్యాపకులు ధైర్యంగా ఉండాలి, అనే ఉద్దేశాలతో గత కొన్ని సంవత్సరాలుగా మేము ‘మన్ కీ బాత్’ ద్వారా, పరీక్షల గురించిన చర్చను టౌన్ హాల్ మాధ్యమం ద్వారా, లేదా ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం మాధ్యమం ద్వారానూ నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ, తల్లిదండ్రులందరూ, అధ్యాపకులందరూ వేగాన్నందించారు. ఇందుమూలంగా నేను వారందరికీ ఋణపడి ఉంటాను. రాబోయే పరీక్షలపై చర్చా కార్యక్రమాన్ని కూడా మనందరము కలిసి జరుపుకుందామని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను.

 

మిత్రులారా, 2010లో అయోధ్య కేసులో అలహాబాద్ హై కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ గురించి గత ‘మన్ కీ బాత్’ లో మనం మాట్లాడుకున్నాం. నిర్ణయం రాబోయే ముందర, వచ్చిన తర్వాత కూడా , దేశం యావత్తు ఆ సమయంలో ఎలా ప్రశాంతంగా ఉందో, సోదరభావంతో నిలబడిందో అప్పుడు నేను చెప్పాను. ఈసారి కూడా నవంబర్ 9వ తేదీన సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు, 130 కోట్ల భారతీయులందరూ కలిసి, తమకు దేశ సంక్షేమం కన్నా మరేదీ ఎక్కువ కాదని మరోసారి నిరూపించారు. శాంతి, ఐకమత్యం, ఇంకా సద్భావనా విలువలు దేశవ్యాప్తంగా నిండి ఉన్నాయి. రామమందిరం పై నిర్ణయం వచ్చినప్పుడు, యావత్ దేశం ఆ తీర్పుని మనస్ఫూర్తిగా ఆమోదించింది. ఎంతో సహజంగా, శాంతి పూర్వకంగా తీర్పుని స్వీకరించింది. ఇవాళ ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా నేను దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరూ తమ ధైర్యాన్నీ, నిగ్రహాన్నీ, పరిపక్వతనీ చూపెట్టిన విధానానికి నేను అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుతున్నాను.

 

ఒక వైపు నుంచి చూస్తే ఈ తీర్పు వల్ల ఎంతో కాలం తర్వాత ఒక న్యాయ పోరాటం సమాప్తమైంది.  మరో వైపు నుండి చూస్తే న్యాయ వ్యవస్థ పట్ల దేశానికి గౌరవం మరింత పెరిగింది. ఒక రకంగా ఈ తీర్పు మన న్యాయ వ్యవస్థకు కూడా ఒక మైలు రాయిగా నిలుస్తుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు తర్వాత దేశం కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో, కొత్త దారులలో కొత్త ఉద్దేశాలతో నడక మొదలుపెట్టింది. నవ భారతం(న్యూ ఇండియా) ఇదే భావనను స్వీకరిస్తూ శాంతి, ఐకమత్యం , సద్భావన తో ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇది మనందరి కోరిక కూడా.

 

నా ప్రియమైన దేశప్రజలారా, మన నాగరికత, మన సంస్కృతి, మన భాషలు ప్రపంచానికి భిన్నత్వం లో ఏకత్వం అనే సందేశాన్ని అందిస్తాయి. 130 కోట్ల ప్రజలున్న ఈ దేశం లో ‘कोस-कोस पर पानी बदले और चार कोस पर वाणी’ అనే నానుడి ఉండేది.  అంటే, మన దేశంలో ప్రతి క్రోశు దూరానికీ నీళ్ళు మారతాయి, ప్రతి నాలుగు క్రోశుల దూరానికీ భాష మారుతుంది అని అర్థం. మన భారతదేశం లో కొన్ని వందల భాషలు శతాబ్దాలుగా పుడుతూ, అభివృధ్ధి చెందుతూ ఉన్నాయి. అయితే, ఈ రకరకాల భాషలు, మాండలీకాలన్నీ కూడా అంతరించిపోతాయేమో అని భయం వేస్తూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం నేను ఉత్తరాఖండ్ లోని ధార్చులా కు చెందిన ఒక సంఘటన గురించి చదివి నేను ఎంతో ఆనందించాను. ప్రజలు ఏ విధంగా తమ భాషను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నారన్నది ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. ఇందుకోసం ప్రజలు కొన్ని సృజనాత్మక పధ్ధతులు కూడా పాటిస్తున్నారు. ధార్చులా సంఘటనపై నా దృష్టి ఎందుకు వెళ్లిందంటే, ఒకప్పుడు నేను ధార్చులా మీదుగా ప్రయాణిస్తూ ఉండేవాడిని. ఆ వైపున నేపాల్, అటు వైపు కాలీ గంగా ఉన్న ధార్చులా గురించి వింటూనే …

 

నా దృష్టి ఈ వార్త వైపు వెళ్ళింది. పిథౌరాగఢ్ లోని ధార్చులాలో రంగ్ సమూహానికి చెందిన చాలామంది నివసిస్తూ ఉంటారు. వీరి భాష రగ్లో. వీళ్ల భాషను మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువైపోతోందని వాళ్లంతా చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు వారంతా కలిసి తమ భాషను రక్షించుకోవాలని తీర్మానించుకున్నారు. చూస్తూండగానే ఈ ఉద్యమంలో చేరే  రంగ్ సమూహానికి చెందిన ప్రజల సంఖ్య మరింతగా పెరుగుతూ వచ్చింది. ఈ సమూహానికి చెందిన సంఖ్య ఎంత చిన్నదో వింటే మీరు ఆశ్చర్యపోయారు. మొత్తం కలిపి దాదాపు పది వేల మంది ఉంటారేమో అంతే. ఎనభై నాలుగేళ్ల ముదుసలి దీవాన్ సింగ్ నుండి ఇరవై రెండేళ్ళ వైశాలి గర్బ్యాల్ వరకు, ప్రొఫెసర్ నుండి వ్యాపారస్తుడి వరకూ ప్రతి వ్యక్తి తమకు వీలైన ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ ఉద్యమంలో సోషల్ మీడియా సహాయాన్ని కూడా పూర్తిగా వాడుకున్నారు. ఎన్నో వాట్సప్ గ్రూపులు తయారయ్యాయి. వందల కొద్దీ ప్రజలను అందులో చేర్చుకున్నారు. ఈ భాష కు ఏ లిపీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భాష మనుగడ కేవలం వాడుకలోనే ఉంది. ఇలా ఉండగా, ప్రజలు కథలు, పాటలు, కవితలూ పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఒకరి భాషను మరొకరు సరిచేయడం మొదలు పెట్టారు. ఒకరకంగా వాట్సప్ క్లాస్ రూమ్ గా మారిపోయింది. అక్కడ ప్రతి ఒక్కరూ అధ్యాపకులే, ప్రతి ఒక్కరూ విద్యార్థే! రంగ్లో భాషను సంరక్షించడానికి మరో ప్రయత్నం కూడా జరిగింది. రకరకాల కార్యక్రమాలు ప్రారంభించారు. పత్రికలు ప్రారంభించారు. సామాజిక సంస్థల సహాయం కూడా తీసుకున్నారు.

 

మిత్రులారా, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఐక్య రాజ్య సమితి ఈ ఏడాదిని  ‘International Year of Indigenous Languages’ గా ప్రకటించింది. అంటే, అంతరించిపోయే దిశలో ఉన్న భాషలను సంరక్షణ చేయాలని బలంగా సంకల్పించారు. నూట ఏభై ఏళ్ల క్రితం ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతేందు హరిశ్చంద్ర గారు కూడా అన్నారు.. ““निज भाषा उन्नति अहै, सब उन्नति को मूल,

बिन निज भाषा-ज्ञान के, मिटत न हिय को सूल ||”

అంటే, మాతృభూమి గురించిన జ్ఞానాన్ని తెలుసుకోకుండా అభివృధ్ధి జరగదు. అని అర్థం.

ఇటువంటి సమయంలో రంగ్ సమూహానికి చెందిన ఈ ఉదాహరణ యావత్ ప్రపంచానికీ ఒక దారిని చూపేట్టేదిగా నిలుస్తుంది.

 

ఒకవేళ మీరు కూడా ఈ కథ వల్ల ప్రేరణ పొందితే గనుక మీ మాతృ భాషనూ, మీ మాండలీకాన్నీ ఉపయోగించడం మొదలు పెట్టండి. కుటుంబానికీ, సమాజానికీ ప్రేరణని ఇవ్వండి.

19వ శతాబ్ద అంతంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారు కూడా తమిళంలో కొన్ని మాటలు అన్నారు. అవి కూడా మనకు ఎంతో ప్రేరణను అందిస్తాయి. సుబ్రహ్మణ్య భారతి గారు తమిళంలో ఏమన్నారంటే –

मुप्पदु कोडी मुगमुडैयाळ

उयिर् मोइम्बुर ओंद्दुडैयाळ

इवळ सेप्पु मोळी पधिनेट्टूडैयाळ 

एनिर् सिन्दनै ओंद्दुडैयाळ  

(Muppadhu kodi mugamudayal, enil maipuram ondrudayal

Ival seppumozhi padhinetudayal, enil sindhanai ondrudayal)

19వ శతాబ్దం చివరలో ఆయన చెప్పిన మాటలివి. భారతమాతకు ముఫ్ఫై కోట్ల ముఖాలున్నాయి. కానీ, ఒకటే శరీరం ఉంది అని ఆయన అన్నారు. ఇది పద్దెనిమిది భాషలు మాట్లాడినా, ఆలోచన ఒకటే అన్నారు.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, అప్పుడప్పుడు జీవితం లో చిన్నచిన్న విషయాలు కూడా ఎంతో పెద్ద సందేశాన్ని అందిస్తాయి. మీరే చూడండి – మీడియాలో స్కూబా డైవర్స్ తాలూకూ కథ ఒకటి ఉంది. ప్రతి భారతీయుడికీ ప్రేరణను అందించేలాంటి కథ ఇది. విశాఖపట్నం లో ఒకరోజు మంగమరిపేట బీచ్ లో డైవింగ్ లో శిక్షణ ను అందించే స్కూబా డైవర్లు సముద్రం నుంచి తిరిగి వస్తున్నప్పుడు, సముద్రం లో తేలివస్తున్న కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్, పౌచ్ లనూ చూశారు. వాటిని శుభ్రపరుస్తుంటే ఇది చిన్న విషయం కాదని వారికి అర్థమైంది. మన సముద్రం చెత్తతో నిండిపోతోందని అర్థం అయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ డైవర్స్ సముద్ర తీరంలో ఒక వంద మీటర్ల దూరానికి లోపలికంటా ఈదుకుంటూ వెళ్ళి అక్కడ పేరుకున్న చెత్తని బయటకు తీస్తూ వచ్చారు. కేవలం పదమూడు రోజుల్లోనే అంటే రెండు వారాల లోపే దాదాపు నాలుగు వేల కిలోల ప్లాస్టిక్ వేస్ట్ ని వారు సముద్రం నుండి బయటకు తీసారని నాకు చెప్పారు. ఈ స్కూబా డైవర్స్ చేసిన చిన్న ఆరంభం, ఒక పెద్ద ఉద్యమ రూపాన్ని సంతరించుకుంటోంది. వీరికి ఇప్పుడు స్థానీయుల సహాయం కూడా లభ్యమౌతోంది. చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కూడా వారికి అన్నిరకాల సహాయాలనూ అందిస్తున్నారు. ఈ స్కూబా డైవర్స్ ప్రేరణతో మనం కూడా కేవలం మన చుట్టుపక్కల ప్రాంతాలను ప్లాస్టిక్ చెత్త నుండి విముక్తి చేయాలనే సంకల్పాన్ని తీసుకుంటే గనుక భారతదేశం ప్లాస్టిక్ చెత్త నుండి విముక్తిని పొందగలదు. యావత్ దేశానికీ ఒక ఉదాహరణగా నిలవగలదు. కాస్త ఆలోచించండి..!

 

నా ప్రియమైన దేశప్రజలారా, రెండు రోజుల తర్వాత నవంబర్ 26. ఈ రోజు యావత్ దేశానికీ ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా మన గణతంత్రానికి ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజును మనం మన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈసారి మన రాజ్యాంగ దినోత్సవంగా ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి రాజ్యాంగాన్ని మనం స్వీకరించి డెభ్భై ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఈసారి పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం జరిగుతుంది. ఏడాది పొడుగునా దేశవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. రండి, ఈ సందర్భంగా మన రాజ్యాంగం లోని సభ్యులందరికీ ఆదర పూర్వకంగా నమస్కరిద్దాం. వారి పట్ల మన భక్తిని సమర్పిద్దాం. భారత రాజ్యాంగం ఎటువంటిదంటే, అందులో ప్రతి పౌరుడి అధికారం, గౌరవం రక్షింపబడుతుంది. ఇది మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి వల్లనే సాధ్యం కాగలిగింది. ఈ రాజ్యాంగ దినోత్సవం నాడు, మన రాజ్యాంగంలోని ఆదర్శాలను కాపాడుకుంటూ, దేశ నిర్మాణానికి సహకారాన్ని అందించాలనే మన నిబధ్ధతకు మనం శక్తినివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇదే మన రాజ్యాంగ నిర్మాతలు కన్న కల.

 

నా ప్రియమైన దేశప్రజలారా, చలికాలం మొదలవుతోంది. కొద్ది కొద్దిగా చలి తెలుస్తోంది. కొన్ని హిమాలయ శిఖరాలను మంచు దుప్పట్లు కప్పడం మొదలైపోయింది. కానీ ఈ కాలం ‘ఫిట్ ఇండియా’ ఉద్యమానికి. మీరు, మీ కుటుంబం, మీ మిత్రులు, మీ సహచరులు అందరూ అవకాశాన్ని వదులుకోకండి. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఈ కాలాన్ని బాగా ఉపయోగించుకోండి.

 

అనేకానేక శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi