Eager for your inputs for 100th episode of Mann Ki Baat: PM Modi to countrymen
It is a matter of satisfaction that today awareness about organ donation is increasing in the country: PM Modi
Huge role of Nari Shakti in rising the potential of India: PM Modi
The speed with which India is moving forward in the field of solar energy is a big achievement in itself: PM Modi
The spirit of 'Ek Bharat, Shreshtha Bharat' strengthens our nation: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా!మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఈ చర్చ మొదలుపెడుతుంటే  మనసులో చాలా ఆలోచనలు మెదులుతున్నాయి.  మా,  మీ 'మన్ కీ బాత్' అనుబంధం తొంభై తొమ్మిదవ మైలురాయికి చేరుకుంది. సాధారణంగా తొంభైతొమ్మిదవ మలుపు చాలా కష్టం అని వింటుంటాం. క్రికెట్‌లో 'నెర్వస్ నైంటీస్'ను చాలా క్లిష్టమైన దశగా భావిస్తారు. కానీ, భారతదేశంలోని ప్రజల 'మన్ కీ బాత్' ఉండే చోట ప్రేరణ కూడా భిన్నంగా ఉంటుంది. 'మన్ కీ బాత్' వందవ ఎపిసోడ్‌ గురించి దేశ ప్రజలలో చాలా ఆసక్తి ఉన్నందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. నాకు చాలా సందేశాలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మనం స్వేచ్ఛా స్వర్ణయుగాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో, కొత్త తీర్మానాలతో ముందుకు సాగుతున్న దశలోవందవ'మన్ కీ బాత్' గురించి మీ సలహాలు ,  ఆలోచనలను తెలుసుకోవాలని నేను కూడా చాలా ఆసక్తితో ఉన్నాను.మీ సూచనల కోసం నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. నిజానికినిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈసారి మరింత ఎక్కువగా ఎదురుచూస్తున్నాను. మీ సూచనలు,  ఆలోచనలు ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించుకునే వందవ 'మన్ కీ బాత్'ను మరింత గుర్తుండేలా చేస్తాయి.

నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం.  తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని  దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.

మిత్రులారా!ఈ ఆధునిక వైద్య విజ్ఞాన యుగంలోఅవయవ దానం ఒకరికి ప్రాణం పోయడానికి చాలా ముఖ్యమైన సాధనంగా మారింది. ఒక వ్యక్తి మరణానంతరం తన శరీరాన్ని దానం చేస్తే, దాని ద్వారా8 నుండి 9 మందికి కొత్త జీవితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందని చెబుతారు. దేశంలో కూడా అవయవ దానంపై అవగాహన పెరుగుతుండడం సంతోషించదగ్గ విషయం. 2013లో మన దేశంలో అవయవదానం కేసులు 5 వేల లోపే నమోదయ్యేవి.  2022 నాటికి ఈ సంఖ్య 15 వేలకు పైగా పెరిగింది. అవయవదానం చేసిన వ్యక్తులు గానీవారి కుటుంబాలుగానీ చేసింది చాలా పుణ్యం వచ్చే పని.

మిత్రులారా!ఇలాంటి ఉదాత్తమైన పని చేసే వ్యక్తుల ‘మనసులో మాట’ తెలుసుకోవాలని, దేశప్రజలతో కూడా పంచుకోవాలని నాకు చాలా కాలంగా కోరిక. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్' లో ఒక అందమైన పాప, ఆమె తల్లిదండ్రులు మనతో కలవబోతున్నారు. తండ్రి పేరు సుఖ్‌బీర్ సింగ్ సంధు,  తల్లి పేరు సుప్రీత్ కౌర్. ఈ కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నివసిస్తుంది.అనేక మొక్కుల  తర్వాతఆమెకు చాలా అందమైన పాప పుట్టింది. ఆమెకు ప్రేమగా ‘అబాబత్ కౌర్’ అని పేరు పెట్టారు. ‘అబాబత్’ అర్థం ఇతరుల సేవకు సంబంధించింది, ఇతరుల బాధలను తొలగించడానికి సంబంధించింది. ఆ పసిగుడ్డు కేవలం ముప్పై తొమ్మిది రోజుల వయస్సులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టింది.కానీ సుఖ్‌బీర్ సింగ్ సంధు గారు,  అతని భార్య సుప్రీత్ కౌర్ గారు, వారి కుటుంబం చాలా స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం –ముప్పై తొమ్మిది రోజుల వయస్సున్న పసిగుడ్డు అవయవ దానం. ఇప్పుడు సుఖ్‌బీర్ సింగ్ గారు, ఆయన శ్రీమతి ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు. రండి…వాళ్ళతో మాట్లాడదాం.

ప్రధానమంత్రి గారు: సుఖ్‌బీర్ గారూ! నమస్తే.

సుఖ్‌బీర్ గారు :నమస్కారం గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ... సత్ శ్రీ అకాల్

ప్రధానమంత్రి గారు : సత్ శ్రీ అకాల్ జీ, సత్ శ్రీ అకాల్ జీ. సుఖ్‌బీర్ గారూ...నేను ఈ రోజు 'మన్ కీ బాత్' గురించి ఆలోచిస్తుంటే ఎంతో ప్రేరణ కలిగించే అబాబత్ విషయాన్ని మీ నోటి నుండి వినాలని భావించాను. ఎందుకంటే ఇంట్లో బిడ్డ పుట్టుక ఎన్నో కలలను, సంతోషాలను తీసుకొస్తుంది. కానీ ఆ బిడ్డ  ఇంత త్వరగా వెళ్లిపోతే ఆ బాధ తీవ్రతను నేను ఊహించగలను. మీరు నిర్ణయం తీసుకున్న విధానాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

సుఖ్‌బీర్ గారు : సార్ దేవుడు మాకు చాలా మంచి బిడ్డను ఇచ్చాడు. చాలా అందమైన బొమ్మ మా ఇంటికి వచ్చింది. పుట్టిన వెంటనే తెలిసింది- బిడ్డ  మెదడులో నరాల గుచ్ఛం ఉందని, దాని కారణంగా బిడ్డ గుండె పరిమాణం పెద్దదిగా అవుతుందని. బిడ్డ దృఢంగా, అందంగా ఉన్నా ఇలాంటి పెద్ద సమస్యతో జన్మించడమేంటని మేం ఆందోళన చెందాం. మొదటి 24 రోజులు బిడ్డ పూర్తిగా సాధారణంగా ఉన్నా అకస్మాత్తుగా బిడ్డ గుండె పనిచేయడం పూర్తిగామానేసింది. మేం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు బిడ్డకు ప్రాణం పోశారు.  కానీ ఇంత చిన్న వయస్సులో బిడ్డకు వచ్చిన ఇంత పెద్ద సమస్య- గుండెపోటును అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. చికిత్స కోసం బిడ్డను చండీగఢ్‌లోని పీజీఐకి తీసుకెళ్లాం. అక్కడ చికిత్స చేసేప్పుడు చిన్నారి ధైర్యంగా పోరాడింది. కానీ వ్యాధి ఎలాంటిదంటే చిన్న వయస్సులో చికిత్స సాధ్యం కాదు. బిడ్డను బతికించడానికి డాక్టర్లు చాలా ప్రయత్నించారు. ఒకవేళ ఆ బిడ్డ దాదాపు ఆరు నెలల దాకా ఉంటే ఆపరేషన్ చేయాలనే ఆలోచన ఉండవచ్చు. కానీ దేవుడు మరొకటి తలిచాడు. బిడ్డకు 39 రోజుల వయస్సు ఉన్నప్పుడు మళ్ళీ గుండెపోటు వచ్చిందని డాక్టర్ చెప్పారు. అప్పుడు నమ్మకం తగ్గిపోయింది. బిడ్డ పదేపదే ధైర్యంగా పోరాడడం చూశాం. బిడ్డ ఇక్కడికి రావడంలో ఏదో ప్రయోజనం ఉందని భార్యాభర్తలం  ఏడుస్తూనే ఆ నిర్ణయానికి వచ్చాం. సరిగ్గా సమాధానమిచ్చాం. ఈ బిడ్డ అవయవాన్ని ఎందుకు దానం చేయకూడదని మేం అనుకున్నాం. దానివల్ల వేరొకరి జీవితంలోకి వెలుగు వస్తుందనుకున్నాం. పీజీఐ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వారిని సంప్రదించాం. అంతచిన్న బిడ్డది కేవలం కిడ్నీ మాత్రమే తీసుకోవచ్చని వారు మార్గనిర్దేశం చేశారు. భగవంతుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. గురునానక్ సాహెబ్ తత్వం మా వెంట ఉంది. మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.

ప్రధానమంత్రి గారు:  మీరు గురువులు చెప్పిన బోధనలను ఆచరించి చూపించారు. నువ్వు సుప్రీత్ గారున్నారా? ఆమెతో మాట్లాడవచ్చా?

సుఖ్‌బీర్ గారు : సరే సార్.

సుప్రీత్ గారు: నమస్తే సార్

ప్రధానమంత్రి గారు : సుప్రీత్ గారూ... మీకు నేనునమస్కరిస్తున్నాను.

సుప్రీత్ గారు: నమస్కారం సార్. నమస్కారం సార్.. మీరు మాతో మాట్లాడటం మాకు చాలా గర్వకారణం సార్.

ప్రధానమంత్రి గారు :  మీరు ఎంతో గొప్ప పని చేశారు. దేశం ఈ విషయాలన్నీ వింటే, ఇతరుల ప్రాణాలను రక్షించడానికి చాలా మంది ముందుకు వస్తారని నేను నమ్ముతున్నాను. ఇది అబాబత్  త్యాగం. ఇది చాలా గొప్పది.

సుప్రీత్ గారు: సార్…ఇది కూడా బహుశా గురునానక్ బాద్షా గారి నుండి వచ్చిన ఆశీర్వాదం కావచ్చు. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి తగిన ధైర్యాన్ని గురునానక్ జీ ఇచ్చాడు.

ప్రధానమంత్రి గారు :  గురువుల కృప లేకుండా ఏదీ జరగదు.

సుప్రీత్ గారు: ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా.

ప్రధానమంత్రి గారు : సుఖ్‌బీర్ గారూ.. మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు...  డాక్టర్ మీకు ఈ షాకింగ్ న్యూస్ చెప్పినప్పుడుమీరు,  మీ భార్య ఆరోగ్యకరమైన మనస్సుతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం గురువుల బోధనల ఫలితం. మీ మనస్సులో గొప్ప ఉదారమైన ఆలోచన. నిజానికి సాధారణ భాషలో అబాబత్ కి అర్థం సహకారం. ఈ పని పూర్తయిన క్షణం గురించి నేను వినాలనుకుంటున్నాను.

సుఖ్‌బీర్ గారు : సార్.. నిజానికి మా కుటుంబ స్నేహితురాలు ప్రియా గారు తన అవయవాలను దానం చేశారు. మేం ఆమె నుండి కూడా ప్రేరణ పొందాం. పార్థివ దేహంపంచభూతాలలో కలిసిపోతుందని ఆ సమయంలో మేం భావించాం. ఎవరైనా ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు వారి శరీరాన్ని కాల్చివేయడమో  పాతిపెట్టడమో చేస్తారు. కానీ ఆ అవయవాలు ఎవరికైనా ఉపయోగపడితేఅది మంచి పని. భారతదేశంలో విజయవంతంగా మార్పిడి చేసిన అవయవాలను దానం చేసిన అతి పిన్న వయస్కురాలు మీ కూతురేనని డాక్టర్లు మాకు చెప్పినప్పుడు మరింత గర్వపడ్డాం. ఇంత వయసొచ్చినా ఇప్పటివరకూ మా తల్లిదండ్రులకు మంచి పేరు తేలేకపోయాం. కానీ మా బిడ్డ కొన్ని రోజుల్లోనే మాకు పేరు తెచ్చింది. ఈరోజు మీతో మాట్లాడడం అంతకంటే గొప్ప విషయం. మాకు చాలా గర్వంగా ఉంది.

ప్రధానమంత్రి గారు : సుఖ్‌బీర్ గారూ.. ఈ రోజు మీ కుమార్తె శరీరంలోని ఒక భాగం మాత్రమే జీవించి ఉన్నట్టు కాదు.. మీ కుమార్తె మానవత్వ  అమర గాథలో   అమర యాత్రికురాలిగా మారింది. తన శరీరంలోని ఒక భాగం ద్వారా ఆ పాప నేటికీ జీవించి ఉంది. ఈ గొప్ప పనికినేను మిమ్మల్ని, మీ భార్యను, మీ కుటుంబాన్ని అభినందిస్తున్నాను.

సుఖ్‌బీర్ గారు : ధన్యవాదాలు సార్.

స్నేహితులారా!అవయవ దానంలో ఉన్న అతి పెద్ద భావన ఏమిటంటేఈ లోకం నుండి వెళ్లిపోతున్నప్పుడు కూడా ఒకరి ప్రాణాన్ని కాపాడాలి. అవయవ దానం కోసం ఎదురుచూసేవారికి ప్రతి క్షణం నిరీక్షణ ఎంత కష్టమో తెలుసు. అటువంటి పరిస్థితిలోఒక అవయవ దాతనో శరీర దాతనో లభించినప్పుడు వారిలో భగవంతుని రూపం మాత్రమే కనిపిస్తుంది.జార్ఖండ్ నివాసి స్నేహలతా చౌధరి గారు కూడా దేవుడిగా మారి ఇతరులకు జీవితాన్ని ఇచ్చారు. 63 ఏళ్ల స్నేహలతా చౌధరి తన గుండెను, కిడ్నీని, కాలేయాన్ని దానం చేశారు. ఈ రోజు 'మన్ కీ బాత్'లో ఆమె కుమారుడు అభిజిత్ చౌధరి గారు మాతో ఉన్నారు. వారి మాటలు విందాం.

ప్రధాన మంత్రి గారు: అభిజిత్ గారూ... నమస్కారం.

అభిజిత్ గారు: నమస్కారాలు సార్.

ప్రధాన మంత్రి గారు: అభిజిత్ గారూ... మీకు జన్మనిచ్చి, మీకు జీవితాన్ని అందించిన తల్లిచాలా మందికి జీవితాన్ని ఇచ్చి మరణించారు. ఒక కుమారుడిగా మీరు గర్వపడుతుండవచ్చు కదా..

అభిజిత్ గారు: అవును సార్.

ప్రధానమంత్రి గారు: మీ అమ్మ గురించి కొంచెం చెప్పండి. ఏ పరిస్థితుల్లో అవయవదానం నిర్ణయం తీసుకున్నారు?

అభిజిత్ గారు: జార్ఖండ్‌లో సరాయికెలా అనే ఒక చిన్న ఊరుంది. అక్కడ మా అమ్మానాన్నలు ఉండేవారు. గత ఇరవై ఐదేళ్లుగా నిరంతరాయంగా మార్నింగ్ వాక్ చేసే అలవాటు ప్రకారం మా అమ్మ ఉదయం 4 గంటలకు మార్నింగ్ వాక్ కు బయలుదేరారు. ఆ సమయంలో ఓ ద్విచక్రవాహనం ఆమెను వెనుక నుంచి ఢీకొనడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను సరాయికెలాలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యుడు ఆమెకు కట్టు కట్టాడు. కాని ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. స్పృహలో లేదు. వెంటనే టాటా మెయిన్ హాస్పిటల్ కి తీసుకెళ్లాం. అక్కడ సర్జరీ చేశారు. 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఆమె బతికే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్ చెప్పారు. తర్వాత ఆమెను విమానంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చాం. దాదాపు 7-8 రోజుల పాటు ఇక్కడ చికిత్స పొందారు.ఆ తర్వాత పరిస్థితి బాగానే ఉండేది. కానీ ఒక్కసారిగా రక్తపోటు బాగా పడిపోయింది. బ్రెయిన్ డెత్ అయిందని ఆ తర్వాత తెలిసింది. అప్పుడు డాక్టర్ మళ్ళీ అవయవ దానం గురించి, నియమ నిబంధనల గురించి మాకు చెప్పారు. అవయవ దానం లాంటివి ఉన్నాయని మా నాన్నగారికి చెప్పలేక పోవచ్చని అనుకున్నాం. ఈ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేరని మాకనిపించింది. కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటుందన్న విషయాన్ని ఆయన మనసులోంచి తీసేద్దామనుకున్నాం. అవయవ దానం గురించి చర్చ జరుగుతుందని మేం చెప్పగానే ఆయన “ఇది అమ్మకు కూడా ఇష్టం.  మనం దీన్ని చేయాలి” అని చెప్పాడు. అమ్మ బతకదని తెలిసి అప్పటివరకు చాలా నిరాశలో ఉన్నాం.  కానీ ఈ అవయవ దానం చర్చ మొదలు కాగానే ఆ నిరాశ పాజిటివ్ దిశకు మళ్ళింది. అలా చాలా మంచి పాజిటివ్ వాతావరణంలోకి వచ్చాం. అలా ఉండగానే రాత్రి 8 గంటలకు కౌన్సెలింగ్ జరిగింది. రెండో రోజు అవయవదానం చేశాం.ఇంతకుముందు నేత్ర దానం మొదలైన సామాజిక కార్యక్రమాలలో ఆమె చాలా చురుకుగా ఉండేదన్న మా అమ్మ ఆలోచనలు గుర్తొచ్చాయి.  బహుశా మేం ఈ ఆలోచనతోనే ఇంత పెద్ద పని చేయగలిగాం. ఈ విషయంలో మా నాన్న నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది.

ప్రధానమంత్రి గారు:  ఎంత మందికి ఆమె అవయవాలు ఉపయోగపడ్డాయి?

అభిజిత్ గారు: ఆమె గుండె, రెండు కిడ్నీలు, కాలేయం,  రెండు కళ్ళు దానం చేశాం. నలుగురు వ్యక్తుల ప్రాణాలు దక్కాయి. ఇద్దరికి కళ్ళు లభించాయి.

ప్రధానమంత్రి గారు: అభిజిత్ గారూ... మీ అమ్మానాన్న ఇద్దరూ గౌరవించటానికి అర్హులు. నేను వారికి నమస్కరిస్తున్నాను. ఇంత పెద్ద నిర్ణయంవైపు మీ నాన్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను నడిపించారు. ఇది నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. తల్లంటే తల్లే అని నేను నమ్ముతున్నాను. తల్లి స్వయం ప్రేరణ పొందుతుంది.  తల్లి నేర్పిన సంప్రదాయాలు తరతరాలుగా గొప్ప శక్తిగా మారతాయి. అవయవదానానికి మీ అమ్మ ప్రేరణ ఈరోజు దేశమంతటికీ చేరుతోంది. పవిత్రమైన ఈ గొప్ప పని విషయంలో నేను మీ మొత్తం కుటుంబాన్ని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు అభిజిత్ గారూ.. మీ నాన్నకి మా నమస్కారాలు తెలియజేయండి.

అభిజిత్ గారు: తప్పకుండా సార్. ధన్యవాదాలు.

 

స్నేహితులారా! 39 రోజుల అబాబత్ కౌర్ కానీయండి. 63 ఏళ్ల స్నేహలతా చౌధరి కానీయండి. వారిలాంటి దాతలు మనకు జీవితం  ప్రాముఖ్యతను తెలియజెప్పుతారు. మన దేశంలోఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆశించి, అవయవ దాత కోసం ఎదురుచూసేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.అవయవ దానాన్ని సులభతరం చేయడానికి,  ప్రోత్సహించడానికి ఒక విధాన రూపకల్పన జరుగుతుండడం నాకు ఆనందాన్నిస్తోంది. ఈ దిశలో అవయవ స్వీకర్త ఆయా రాష్ట్రాలలోనే నివాసం ఉండాలన్న నిబంధనను తొలగించాలని కూడా నిర్ణయించారు. అంటే.. ఇప్పుడు రోగి దేశంలోని ఏ రాష్ట్రానికైనా వెళ్లి అవయవాన్ని స్వీకరించడానికి నమోదు చేసుకోగలుగుతారు.అవయవదానానికి 65 ఏళ్లలోపు వయోపరిమితిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయత్నాల మధ్యఅవయవ దాతలు గరిష్ట సంఖ్యలో ముందుకు రావాలని నేను దేశప్రజలను కోరుతున్నాను. మీ ఒక్క నిర్ణయం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. జీవితాన్ని నిలబెట్టగలదు.

నా ప్రియమైన దేశప్రజలారా!ఇది నవరాత్రుల సమయం. శక్తిని ఆరాధించే సమయం. నేడుభారతదేశ సామర్థ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో మన మహిళా శక్తి పాత్ర కీలకం. ఇటీవల ఇలాంటి ఉదాహరణలు చాలానే మన ముందుకు వచ్చాయి. ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్‌ గారిని మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు.వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు తొలి మహిళా లోకో పైలట్‌గా కూడా సురేఖ గారు మరో రికార్డు సృష్టించారు. ఈ నెలలోనే నిర్మాత గునీత్ మోంగా గారు, దర్శకుడు కార్తికీ గొంజాల్విస్ గారు తమ డాక్యుమెంటరీ 'ఎలిఫెంట్ విస్పరర్స్' కు ఆస్కార్ అవార్డును గెలుచుకుని దేశానికి పేరు తెచ్చారు. భాభా అణు పరిశోధనాకేంద్ర శాస్త్రవేత్త, సోదరి జ్యోతిర్మయి మొహంతి గారు కూడా దేశానికి మరో ఘనతను సాధించారు.జ్యోతిర్మయి గారు  కెమిస్ట్రీ,  కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఐ.యు.పి.ఏ.సి. (IUPAC)నుండి ప్రత్యేక పురస్కారం పొందారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత అండర్‌-19 మహిళా క్రికెట్‌ జట్టు టీ-20 ప్రపంచకప్‌ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది.రాజకీయాలను పరిశీలిస్తే నాగాలాండ్‌లో కొత్త విశేషం చోటుచేసుకుంది. నాగాలాండ్‌లో 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి చేరుకున్నారు. వారిలో ఒకరికి నాగాలాండ్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా లభించింది. అంటే ఆ రాష్ట్ర ప్రజలకు తొలిసారిగా మహిళా మంత్రి సేవలను పొందే అవకాశం లభించింది.

మిత్రులారా!కొద్దిరోజుల క్రితంటర్కీలో విధ్వంసకర భూకంపం తర్వాత ప్రజలకు సహాయం చేయడానికి వెళ్లిన ఆ ధైర్యవంతులైన కుమార్తెలను నేను కూడా కలిశాను. వీరందరినీ ఎన్డీఆర్‌ఎఫ్ స్క్వాడ్‌లో చేర్చారు. వారి ధైర్యకౌశల్యాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మిషన్ కింద శాంతిసేనలో మహిళలు మాత్రమే ఉండే ప్లాటూన్‌ను కూడా భారత్ ఏర్పాటు చేసింది.

ఈరోజు మన త్రివిధ సైనిక దళాల్లో దేశ ఆడపడుచులు తమ శౌర్య పతాకాన్ని ఎగురవేస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ శాలిజా ధామి యుద్ధ విభాగంలో కమాండ్ అపాయింట్‌మెంట్ పొందిన మొదటి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నిలిచారు. ఆమెకు దాదాపు మూడు వేల  గంటల విమానయాన అనుభవం ఉంది. అదేవిధంగా సియాచిన్‌లో నియమితులైన తొలి మహిళా అధికారిగా భారత ఆర్మీ కెప్టెన్ శివ చౌహాన్ నిలిచారు.ఉష్ణోగ్రత మైనస్ అరవై (-60) డిగ్రీలకు పడిపోతున్న సియాచిన్‌లో శివ మూడు నెలల పాటు ఉంటారు.

మిత్రులారా!ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. అందరి గురించీ ఇక్కడ చర్చించడం కష్టం. అటువంటి మహిళలు, మన కుమార్తెలునేడు భారతదేశానికి,  భారతదేశస్వప్నాలకు శక్తిని ఇస్తున్నారు. ఈ నారీశక్తి వికసిత భారతావనికి ప్రాణవాయువు.

నా ప్రియమైన దేశప్రజలారా!ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రమైన శక్తి వనరులు, పునరుత్పాదక ఇంధనం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ప్రజలను కలిసినప్పుడువారు ఖచ్చితంగా ఈ రంగంలో భారతదేశం సాధించిన అద్భుత విజయం గురించి మాట్లాడతారు.ముఖ్యంగా సౌరశక్తి రంగంలో భారత్‌ వేగంగా ముందుకు సాగడం ఒక పెద్ద విజయం. భారతదేశ ప్రజలకు శతాబ్దాలుగా సూర్యునితో ప్రత్యేక సంబంధం ఉంది. సూర్యుని శక్తి గురించి మనకున్న శాస్త్రీయ అవగాహన, సూర్యుడిని పూజించే సంప్రదాయాలు ఇతర ప్రాంతాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ రోజు ప్రతి దేశవాసీ సౌరశక్తి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. పరిశుభ్రమైన శక్తి వనరులకు కూడా సహకరించాలని భావిస్తున్నారు. 'సబ్ కా ప్రయాస్' లోని ఈ స్ఫూర్తి నేడు భారతదేశ  సోలార్ మిషన్‌ను ముందుకు నడిపిస్తోంది. మహారాష్ట్రలోని పూణేలోఅటువంటి అద్భుతమైన ప్రయత్నం నా దృష్టిని ఆకర్షించింది. ఇక్కడి ఎం ఎస్ ఆర్- ఆలివ్ హౌసింగ్ సొసైటీ ప్రజలు ఇప్పుడు సొసైటీలో తాగునీరు, లిఫ్ట్,  లైట్లు వంటి సాధారణ అవసరాలకు సౌరశక్తిని మాత్రమే ఉపయోగించాలని  నిర్ణయించుకున్నారు.దీని తర్వాత అందరూ కలిసి ఈ సొసైటీలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సోలార్ ప్యానెళ్ల నుంచి ఏటా దాదాపు 90వేల కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. దీంతో ప్రతి నెలా దాదాపు 40 వేల రూపాయల డబ్బు ఆదా అవుతోంది. సొసైటీలోని ప్రజలందరూ ఈ పొదుపు ప్రయోజనం పొందుతున్నారు.

మిత్రులారా!డామన్ డయ్యూ లోని డయ్యూప్రత్యేక జిల్లా ప్రజలు కూడా పూణే లాగా అద్భుతమైన పని చేశారు. డయ్యూ సోమనాథ్ సమీపంలో ఉందని మీకు తెలిసి ఉండవచ్చు. పగటి వేళల్లో వంద శాతం క్లీన్ ఎనర్జీని అన్ని అవసరాలకు ఉపయోగిస్తున్న భారతదేశంలోని మొదటి జిల్లాగా డయ్యూ నిలిచింది. డయ్యూ సాధించిన ఈ విజయానికి మంత్రం కూడా అందరి కృషి.ఒకప్పుడు విద్యుదుత్పత్తికి వనరుల కొరత ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజలు సౌరశక్తిని ఎంచుకున్నారు. ఇక్కడ బంజరు భూమితో పాటు అనేక భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెళ్ల నుంచి డయ్యూలో పగటిపూట అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ సోలార్ ప్రాజెక్టు కారణంగా విద్యుత్ కొనుగోలుతో అయ్యే దాదాపు 52 కోట్ల రూపాయల ఖర్చు మిగిలింది. దీని వల్ల పర్యావరణం కూడా ఎంతో ఆదా అయింది.

మిత్రులారా!వారు పూణే,  డయ్యూలో చేసి చూపించినటువంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. పర్యావరణం,  ప్రకృతి పట్ల భారతీయులమైన మనం ఎంత సున్నితంగా ఉంటామో,  మన దేశం భవిష్యత్ తరాల పట్ల ఎంత స్పృహతో ఉందో ఇది తెలియజేస్తుంది. అలాంటి ప్రయత్నాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! మన దేశంలోకాలక్రమేణాపరిస్థితులకు అనుగుణంగాఅనేక సంప్రదాయాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సంప్రదాయాలు మన సంస్కృతికి బలాన్ని పెంపొందిస్తాయి.  ప్రతిరోజూ కొత్త శక్తిని కూడా ఇస్తాయి. కొన్ని నెలల క్రితం కాశీలో అలాంటి సంప్రదాయం ఒకటి మొదలైంది. కాశీ-తమిళ సంగమం సమయంలోకాశీ-తమిళ ప్రాంతాల మధ్య శతాబ్దాల నాటి చారిత్రక,  సాంస్కృతిక సంబంధాలను ఉత్సవంగా జరుపుకున్నారు.'ఏక్ భారత్-శ్రేష్ఠ్  భారత్' స్ఫూర్తి మన దేశానికి బలాన్నిస్తుంది. మనం ఒకరి గురించి ఒకరం  తెలుసుకున్నప్పుడు, ఒకరి నుండి ఒకరం నేర్చుకున్నప్పుడు ఈ ఏకత్వ భావన మరింత బలపడుతుంది. ఈ ఐక్యతా స్ఫూర్తితో వచ్చే నెలలో గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో 'సౌరాష్ట్ర-తమిళ సంగమం' జరుగుతుంది. 'సౌరాష్ట్ర-తమిళ సంగమం' ఏప్రిల్ 17వ తేదీ  నుండి30వ తేదీ వరకు కొనసాగుతుంది.గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తమిళనాడుతో సంబంధం ఏమిటని'మన్ కీ బాత్' శ్రోతలు  కొందరు ఆలోచిస్తుండవచ్చు. నిజానికిశతాబ్దాల క్రితమే సౌరాష్ట్రకు చెందిన చాలా మంది తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు.వీరికి ఇప్పటికీ 'సౌరాష్ట్రీ   తమిళులు'గానే గుర్తింపు ఉంది.నేటికీ వారిలో సౌరాష్ట్రఆహారపు అలవాట్లు, జీవనశైలి,  సామాజిక ఆచారాలు చూడవచ్చు. ఈ వేడుకకు సంబంధించి తమిళనాడుకు చెందిన చాలామంది నన్ను అభినందిస్తూ లేఖలు రాశారు.మధురైలో నివసించే జయచంద్రన్ గారు చాలా భావోద్వేగంతో కూడిన విషయాన్ని రాశారు. "వెయ్యి సంవత్సరాల తర్వాత, ఈ సౌరాష్ట్ర-తమిళ సంబంధాల గురించి ఎవరైనా ఆలోచించారా అని సౌరాష్ట్ర నుండి వచ్చి  తమిళనాడులో స్థిరపడిన ప్రజలను అడిగాన"ని ఆయన రాశారు.  జయచంద్రన్ గారి మాటలు వేలాది తమిళ సోదర సోదరీమణుల భావాల వ్యక్తీకరణ.

మిత్రులారా!అస్సాంకి సంబంధించిన ఒక వార్త గురించి 'మన్ కీ బాత్' శ్రోతలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని కూడా బలపరుస్తుంది. వీర్ లాసిత్ బోర్ఫుకన్ గారి400వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ధైర్యవంతుడైన లాసిత్ బోర్ఫుకన్ నిరంకుశ మొఘల్ సుల్తానుల చేతుల నుండి గౌహతిని విముక్తి చేశాడు. ఈ మహాయోధుని అలుపెరగని ధైర్యసాహసాలు నేడు దేశానికి పరిచయం అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం లాసిత్ బోర్ఫుకన్ జీవితంపై  వ్యాస రచన కోసం ప్రచారం మొదలైంది. ఇందులో దాదాపు 45 లక్షల మంది వ్యాసాలు పంపారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అది గిన్నిస్‌ రికార్డ్‌గా నిలిచిందని కూడా తెలిస్తే మీరు సంతోషిస్తారు.వీర్ లాసిత్ బోర్ఫుకన్ పై రాసిన ఈ వ్యాసాలలో దాదాపు 23 విభిన్న భాషల్లో రాసిన వ్యాసాలుండడం చాలా సంతోషకరమైన విషయం. ఇందులోఅస్సామీ భాష కాకుండాప్రజలు హిందీ, ఇంగ్లీష్, బంగ్లా, బోడో, నేపాలీ, సంస్కృతం, సంతాలి వంటి భాషలలో వ్యాసాలు పంపారు.ఈ ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! కాశ్మీర్ లేదా శ్రీనగర్ విషయానికి వస్తే, మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి మైదానాలు,  దాల్ సరస్సు. మనలో ప్రతి ఒక్కరూ దాల్ సరస్సు  వీక్షణను ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే దాల్ సరస్సులో మరో ప్రత్యేకత ఉంది. దాల్ సరస్సు రుచికరమైన తామరకాడలకు కూడా ప్రసిద్ధి చెందింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తామర కాడలను వివిధ పేర్లతో గుర్తిస్తారు. కాశ్మీర్‌లో వాటిని నాదరూ అంటారు. కాశ్మీర్  నాదరూకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దాల్‌ సరస్సులో నాదరూ సాగు చేస్తున్న రైతులు ఎఫ్‌పీఓగా ఏర్పడ్డారు. దాదాపు 250 మంది రైతులు ఈ FPOలో చేరారు. నేడు ఈ రైతులు తమ నాదరూని విదేశాలకు పంపడం ప్రారంభించారు. కొంతకాలం కిందట ఈ రైతులు రెండులోడుల నాదరూని యుఎఇకి పంపారు. ఈ విజయం కాశ్మీర్‌కు పేరు తీసుకురావడమే కాకుండా వందలాది మంది రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది.

మిత్రులారా!కాశ్మీర్ ప్రజల వ్యవసాయానికి సంబంధించిన అలాంటి ఒక ప్రయత్నం ఈ రోజుల్లో దాని విజయ పరిమళాన్ని వెదజల్లుతోంది. విజయ పరిమళమని నేనెందుకు అంటున్నానని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఈ విషయం పరిమళానికి సంబంధించింది. సుగంధానికి సంబంధించిన విషయమే! నిజానికిజమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో 'భదర్వాహ్' అనే పట్టణం ఉంది. ఇక్కడి రైతులు దశాబ్దాలుగా సంప్రదాయ మొక్కజొన్న సాగు చేస్తుండగాకొంత మంది రైతులు అందుకు భిన్నంగా ఏదైనా చేయాలని భావించారు. వారు ఫ్లోరీ కల్చర్ అంటే పూల సాగు వైపు మొగ్గు చూపారు. నేడుదాదాపు రెండున్నర వేల మంది రైతులు ఇక్కడ లావెండర్ ను సాగు చేస్తున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ సుగంధ మిషన్ నుండి కూడా సహకారం లభించింది. ఈ కొత్త సాగు రైతుల ఆదాయాన్ని బాగా పెంచింది.  నేడు లావెండర్‌తో పాటు వారి విజయ పరిమళం కూడా సుదూరప్రాంతాలకు వ్యాపిస్తోంది.

మిత్రులారా!కాశ్మీర్ గురించి మాట్లాడేటప్పుడు, కమలం గురించి మాట్లాడేటప్పుడు, పువ్వుల గురించి మాట్లాడేటప్పుడు, సుగంధ పరిమళం  గురించి మాట్లాడేటప్పుడు- తామర పువ్వుపై కూర్చున్న శారదామాత గుర్తుకు రావడం చాలా సహజం. కొన్ని రోజుల క్రితమేకుప్వారాలో శారదామాత భవ్య  ఆలయాన్ని ప్రారంభించారు. గతంలో శారదా పీఠాన్ని సందర్శించేందుకు వెళ్లే మార్గంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి స్థానికులు ఎంతో సహకరించారు. ఈ శుభ కార్యానికి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు నేను చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా!ఈసారి 'మన్ కీ బాత్'లో ఇంతే. తర్వాతిసారి 'మన్ కీ బాత్' వందవ ఎపిసోడ్‌లో కలుద్దాం. మీరందరూ మీ సూచనలను తప్పనిసరిగా పంపండి. ఈ మార్చి నెలలో మనం హోలీ నుండి నవరాత్రి వరకు అనేక పర్వాలు, పండుగలసందడితో ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసం కూడా ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో శ్రీరామ నవమి మహాపర్వదినం కూడా వస్తోంది. తర్వాతమహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే,  ఈస్టర్ కూడా వస్తాయి.ఏప్రిల్ నెలలో మనం భారతదేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతిని కూడా జరుపుకుంటాం. ఆ ఇద్దరు మహాపురుషులు మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. సమాజంలోని వివక్షను తొలగించేందుకు ఈ మహానుభావులిద్దరూ అపూర్వమైన కృషి చేశారు.స్వాతంత్య్ర అమృతకాలంలో ఉన్న ఈ రోజు మనం అలాంటి మహనీయుల నుండి నేర్చుకోవాలి. వారి నుండి నిరంతరం స్ఫూర్తిని పొందాలి.మన కర్తవ్యానికి అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మిత్రులారా!ఈ సమయంలో కరోనా కూడా కొన్ని చోట్ల పెరుగుతోంది. అందుకే మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించండి. వచ్చే నెలమన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి.  ధన్యవాదాలు. నమస్కారం.

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.