400 బిలియన్ డాలర్ల వస్తువుల ఎగుమతి భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది: ప్రధాని మోదీ
జిఈఎం పోర్టల్ ద్వారా గత సంవత్సరంలో, ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేసింది: ప్రధానమంత్రి
126 ఏళ్ల బాబా శివనాద ఫిట్‌నెస్ అందరికీ స్ఫూర్తి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
భారతదేశ యోగా మరియు ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నాయి: ప్రధాని మోదీ
నీటిని పొదుపు చేసేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
పిల్లలు పరిశుభ్రతను ఒక ఉద్యమంగా తీసుకున్నారు, వారు 'వాటర్ వారియర్స్'గా మారడం ద్వారా నీటిని ఆదా చేయడంలో సహాయపడగలరు: ప్రధాన మంత్రి
మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్‌లను స్ఫూర్తిగా తీసుకుని, తల్లిదండ్రులు మరియు సంరక్షకులందరూ తమ కుమార్తెలను చదివించాలని నేను కోరుతున్నాను: ప్రధాని

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం.  ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.

మిత్రులారా! దేశంలోని నలుమూలల నుండి కొత్త ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి . అస్సాంలోని హైలకండి నుండి లెదర్ ఉత్పత్తులు కావచ్చు లేదా ఉస్మానాబాద్ నుండి చేనేత ఉత్పత్తులు కావచ్చు, బీజాపూర్ నుండి పండ్లు , కూరగాయలు కావచ్చు లేదా చందౌలీ నుండి నల్ల బియ్యం కావచ్చు…  వాటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇప్పుడు లదదాఖ డఖ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ యాప్రికాట్ దుబాయ్‌లో కూడా దొరుకుతుంది. తమిళనాడు నుండి పంపిన అరటిపండ్లు సౌదీ అరేబియాలో కూడా లభిస్తాయి. ఇప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను కొత్త కొత్త దేశాలకు పంపడం గొప్ప విషయం. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లోని హిమాచల్‌లో పండిన చిరుధాన్యాలు తొలి విడతగా డెన్మార్క్‌కు ఎగుమతయ్యాయి.  ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగనపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు. త్రిపుర నుండి తాజా పనసపండ్లను విమానంలో లండన్‌కు ఎగుమతి చేశారు. నాగాలాండ్‌కు చెందిన రాజా మిర్చ్‌ను మొదటిసారిగా లండన్‌కు పంపారు. అదేవిధంగా మొదటి దశలో భాలియా గోధుమలు గుజరాత్ నుండి కెన్యాకు, శ్రీలంకకు ఎగుమతి అయ్యాయి. అంటే ఇప్పుడు ఇతర దేశాలకు వెళితే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మిత్రులారా! ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. ఈ జాబితా లాగే మేక్ ఇన్ ఇండియా  శక్తి కూడా చాలా గొప్పది. భారతదేశం శక్తి కూడా అంత గొప్పది. దాని సామర్థ్యానికి ఆధారం మన రైతులు, మన చేతివృత్తులు, మన నేత కార్మికులు, మన ఇంజనీర్లు, మన చిన్న వ్యాపారవేత్తలు, మన MSME రంగం, అనేక విభిన్న వృత్తులకు చెందిన వ్యక్తులు.  ఈ రంగాలు, ఈ వృత్తులు, ఈ రంగాల్లోని వ్యక్తులు దేశానికి నిజమైన బలం. వారి కృషి కారణంగా 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్య సాధన సాధ్యమైంది. భారతదేశ ప్రజల ఈ శక్తి ఇప్పుడు ప్రపంచంలోని ప్రతిమూలలో కొత్త మార్కెట్‌లను చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తుల కోసం నినదిస్తే మన  స్థానిక ఉత్పత్తులు  ప్రపంచవ్యాప్తం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. రండి.. స్థానికతను ప్రపంచవ్యాప్తం చేద్దాం. మన ఉత్పత్తుల ప్రతిష్ఠను మరింత పెంచుకుందాం.

మిత్రులారా! స్థానిక స్థాయిలో మన చిన్న వ్యాపారవేత్తల విజయం మనలో గర్వాన్ని నింపబోతోందని తెలుసుకుని 'మన్ కీ బాత్' శ్రోతలు సంతోషిస్తారు. ఈ రోజు మన చిన్న వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఇ-మార్కెట్ ద్వారా ప్రభుత్వ సేకరణలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ ద్వారా చాలా పారదర్శకమైన వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రభుత్వ ఇ-మార్కెట్ పోర్టల్ – GeM- ద్వారా గత ఏడాది కాలంలో ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసింది. దేశంలోని నలుమూలల నుంచి దాదాపు 1.25 లక్షల మంది చిన్నవ్యాపారులు, చిన్న దుకాణదారులు తమ వస్తువులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారు. ఒకప్పుడు పెద్ద కంపెనీలు మాత్రమే ప్రభుత్వానికి వస్తువులను విక్రయించేవి. కానీ ఇప్పుడు దేశం మారుతోంది-  పాత వ్యవస్థలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు చిన్న దుకాణదారు కూడా GeM పోర్టల్‌లో తన వస్తువులను ప్రభుత్వానికి విక్రయించవచ్చు - ఇది కొత్త భారతదేశం. పెద్దగా కలలు కనడమే కాదు- ఇంతకు ముందు ఎవరూ చేరుకోని లక్ష్యాన్ని చేరుకునే ధైర్యాన్ని కూడా చూపిస్తాడు. ఈ ధైర్యసాహసాల బలంతో భారతీయులమైన మనమందరం కలిసి స్వావలంబన భారతదేశ కలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం.

నా ప్రియమైన దేశప్రజలారా! మీరు ఇటీవల జరిగిన పద్మపురస్కారాల ప్రదాన వేడుకలో బాబా శివానంద్ జీని తప్పక చూసి ఉంటారు. 126 ఏళ్ల వృద్ధుడి చురుకుదనాన్నిచూసి, నాలాగే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి ఉంటారు.  రెప్పపాటులో ఆయన నంది ముద్రలో నమస్కరించడం ప్రారంభించారు. నేను బాబా శివానంద్ జీకి పదే పదే వంగి నమస్కరించాను. బాబా శివానంద్ 126 ఏళ్ల వయస్సు, ఆయన ఫిట్‌నెస్- రెండూ ఇప్పుడు దేశంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. బాబా శివానంద్ తన వయసు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫిట్ గా ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది కామెంట్స్ చూశాను. నిజానికి బాబా శివానంద్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను. ఆయనకు యోగా అంటే అభిరుచి ఎక్కువ. ఆయన చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నారు.

జీవేం శరదః శతం|

మన సంస్కృతిలో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తారు. ఏప్రిల్ 7న 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' జరుపుకుంటాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం గురించి యోగ, ఆయుర్వేదం మొదలైన భారతీయ చింతన పెరుగుతోంది. గత వారం ఖతర్‌లో యోగా కార్యక్రమం నిర్వహించడం మీరు చూసి ఉంటారు. ఇందులో 114 దేశాల పౌరులు పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఆయుష్ పరిశ్రమ మార్కెట్ కూడా నిరంతరం పెరుగుతోంది. 6 సంవత్సరాల క్రితం ఆయుర్వేదానికి సంబంధించిన మందుల మార్కెట్ దాదాపు 22 వేల కోట్ల రూపాయలు. నేడు ఆయుష్ తయారీ పరిశ్రమ దాదాపు లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకుంటోంది. అంటే, ఈ రంగంలో అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. స్టార్టప్ ప్రపంచంలో కూడా ఆయుష్ ఆకర్షణీయంగా మారుతోంది.

మిత్రులారా! ఆరోగ్య రంగంలోని ఇతర స్టార్టప్‌ల గురించి నేను ఇంతకు ముందు చాలాసార్లు మాట్లాడాను. కానీ ఈసారి ప్రత్యేకంగా ఆయుష్ స్టార్ట్-అప్‌ల గురించి మీతో మాట్లాడతాను. ఇందులో ఒక స్టార్టప్ ‘కపివా’. దాని అర్థం దాని పేరులోనే ఇమిడిఉంది. ఇందులో క అంటే కఫ, పి అంటే పిత్త, వా అంటే వాత. ఈ స్టార్టప్ మన సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌లో ఒక ప్రత్యేకమైన భావన అయిన నిరోగ్-స్ట్రీట్ అనే మరో స్టార్టప్ కూడా ఉంది. దీని సాంకేతికత ఆధారిత వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద వైద్యులను నేరుగా ప్రజలతో అనుసంధానిస్తుంది. 50 వేల మందికి పైగా అభ్యాసకులు ఈ స్టార్టప్ తో అనుసంధానమయ్యారు. అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్య రంగంలో ఆత్రేయ ఇన్నోవేషన్స్ అనే మరో హెల్త్‌కేర్ టెక్నాలజీ స్టార్టప్‌ కూడా పనిచేస్తోంది. ఇగ్జొరియల్ (Ixoreal) అశ్వగంధ వాడకం గురించి అవగాహన కల్పించడమే కాకుండా అత్యున్నత నాణ్యత ఉన్న ఉత్పత్తుల తయారీ ప్రక్రియపై భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. ఆధునిక మూలికా పరిశోధన, సంప్రదాయ  పరిజ్ఞానాన్ని మిళితం చేయడం ద్వారా క్యూర్ వేద సంపూర్ణ జీవితానికి ఆహార పదార్ధాలను రూపొందించింది.

మిత్రులారా! నేను ఇప్పటివరకు కొన్ని పేర్లను మాత్రమే పేర్కొన్నాను. ఈ జాబితా చాలా పెద్దది. ఇది భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు, భారతదేశంలో ఏర్పడుతున్న కొత్త అవకాశాలకు చిహ్నం. ఆరోగ్య రంగంలోని స్టార్ట్-అప్‌లు, ముఖ్యంగా ఆయుష్ స్టార్ట్-అప్‌లను ఒక  విషయం కోరుతున్నాను. మీరు ఆన్‌లైన్‌లో ఏ పోర్టల్‌ని తయారుచేసినా, ఏ కంటెంట్‌ను సృష్టించినా ఐక్యరాజ్యసమితి గుర్తించిన అన్ని భాషల్లో దాన్ని రూపొందించడానికి ప్రయత్నించండి. ఇంగ్లీషు అంతగా మాట్లాడని, అర్థం కాని దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువంటి దేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని మీ సమాచారాన్ని ప్రచారం చేయండి. భారతదేశం నుండి మెరుగైన నాణ్యమైన ఉత్పత్తులతో ఆయుష్ స్టార్ట్-అప్‌లు త్వరలో ప్రపంచవ్యాప్తమవుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

    మిత్రులారా! ఆరోగ్యం నేరుగా పరిశుభ్రతకు సంబంధించిన విషయం. 'మన్ కీ బాత్'లో పరిశుభ్రత కోసం కృషిచేసేవారి ప్రయత్నాలను మేం ఎప్పుడూ ప్రస్తావిస్తాం.  అలాంటి స్వచ్ఛాగ్రహి చంద్రకిషోర్ పాటిల్ గారు. ఆయన  మహారాష్ట్రలోని నాసిక్‌లో నివసిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో చంద్రకిషోర్ జీ సంకల్పం చాలా లోతైనది. గోదావరి నది పక్కనే ఉంటూ నదిలో చెత్త వేయకుండా ప్రజలను ఆయన నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా నదిలో చెత్త వేస్తుంటే  వెంటనే ఆపుతారు. చంద్రకిషోర్ జీ ఈ పనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నదిలో విసిరేందుకు ప్రజలు తెచ్చిన అటువంటి వస్తువులన్నీ సాయంత్రానికి ఆయన దగ్గర చేరతాయి. చంద్రకిషోర్ జీ చేసిన ఈ ప్రయత్నం అవగాహనను కూడా పెంచుతుంది.  స్ఫూర్తిని కూడా ఇస్తుంది. అదేవిధంగా, మరొక స్వచ్ఛాగ్రహి - ఒరిస్సాలోని పూరీకి చెందిన రాహుల్ మహారాణా. రాహుల్ ప్రతి ఆదివారం తెల్లవారుజామున పూరీలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేస్తుంటారు. ఇప్పటి వరకు వందల కిలోల ప్లాస్టిక్ చెత్తను, మురికిని శుభ్రం చేశారు. పూరీ రాహుల్ అయినా, నాసిక్‌కి చెందిన చంద్రకిషోర్ అయినా మనకు చాలా నేర్పుతారు. పరిశుభ్రత, పోషకాహారం లేదా టీకాకరణ – ఇలా సందర్భం ఏదైనా పౌరులుగా మనం మన విధులను నిర్వహించాలి. ఈ ప్రయత్నాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికి మనకు సహాయపడతాయి.

నా ప్రియమైన దేశప్రజలారా! కేరళకు చెందిన ముపట్టం శ్రీ నారాయణన్ గారి గురించి మాట్లాడుకుందాం. 'జీవించేందుకు అవసరమయ్యే నీటి కోసం కుండలు' అనే ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిస్తే  ఇది ఎంత అద్భుతమైన పని అని మీరు అనుకుంటారు.

మిత్రులారా! వేసవిలో జంతువులకు, పక్షులకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముపట్టం శ్రీ నారాయణన్ గారు మట్టి కుండలను పంపిణీ చేసేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవిలో జంతువులు, పక్షుల సమస్యను చూసి ఆయన కలత చెందారు. అలాంటప్పుడు ఆ కుండల్లో నీళ్లు నింపే పని మాత్రమే ఇతరులకు ఉండేలా స్వయంగా మట్టి కుండల పంపిణీ ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నారు. నారాయణన్ గారు  పంపిణీ చేసిన పాత్రల సంఖ్య లక్ష దాటబోతుందంటే మీరు ఆశ్చర్యపోతారు. తన ప్రచారంలో, గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమానికి లక్షవ పాత్రను విరాళంగా ఇవ్వనున్నారు. ఈరోజు వేసవి కాలం వచ్చిందంటే, నారాయణన్ గారు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ వేసవిలో మన జంతు, పక్షి స్నేహితులకు కూడా నీటిని ఏర్పాటు చేస్తాం.

మిత్రులారా! మన సంకల్పాలను తిరిగి గుర్తు తెచ్చుకోవలసిందిగా 'మన్ కీ బాత్' శ్రోతలను నేను కోరుతున్నాను. ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు మనం చేయగలిగే పని చేయాలి. ఇది కాకుండా నీటి రీసైక్లింగ్‌ కు మనం సమాన ప్రాధాన్యతనిస్తూనే ఉండాలి. ఇంట్లో వినియోగించిన నీటిని కుండీల్లో వాడుకోవచ్చు.  తోటపనిలో వాడుకోవచ్చు. ఆ నీటిని మళ్లీ వాడాలి. కొంచెం ప్రయత్నం చేస్తే  మీరు మీ ఇంట్లో అలాంటి ఏర్పాట్లు చేయవచ్చు. రహీమ్‌దాస్ జీ శతాబ్దాల క్రితం 'రహిమన్ పానీ రాఖియే,  బిన్ పానీ సబ్ సూన్' అని చెప్పారు. ఈ నీటి పొదుపు పనిలో నేను పిల్లలపై చాలా ఆశలు పెట్టుకున్నాను. మన పిల్లలు పరిశుభ్రతను ఒక ఉద్యమంలా చేసినట్టే  వారు 'వాటర్ వారియర్'గా మారడం ద్వారా నీటి ఆదాలో సహకరించవచ్చు.

మిత్రులారా! మన దేశంలో నీటి సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణ, శతాబ్దాలుగా సమాజ స్వభావంలో భాగం. దేశంలో చాలా మంది ప్రజలు నీటి సంరక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అరుణ్ కృష్ణమూర్తి చెన్నైకి చెందిన మిత్రుడు. అరుణ్ గారు తన ప్రాంతంలోని చెరువులు, సరస్సులను శుభ్రం చేసే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. 150కి పైగా చెరువులు, సరస్సులను శుద్ధి చేసే బాధ్యతను తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన రోహన్ కాలే గారు కూడా కృషి చేస్తున్నారు. రోహన్  గారు వృత్తిరీత్యా హెచ్‌ఆర్ ప్రొఫెషనల్. మహారాష్ట్రలోని వందలాది దిగుడు బావులను పరిరక్షించేందుకు ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ బావులు చాలా వందల సంవత్సరాల నాటివి. అవి మన వారసత్వంలో భాగమయ్యాయి. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేటలో ఉన్న బాగి కూడా అలాంటి దిగుడుబావుల్లో ఒకటి. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో ఈ మెట్ల బావి మట్టితోనూ చెత్తతోనూ నిండిపోయింది. అయితే ఇప్పుడు ఈ దిగుడుబావిని పునరుద్ధరించాలనే ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభమైంది.

మిత్రులారా! ఎప్పుడూ నీటి కొరత ఉండే రాష్ట్రం నుండి నేను వచ్చాను. గుజరాత్‌లో ఈ దిగుడు బావుల ను వావ్ అంటారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో వావ్ ప్రధాన భూమిక నిర్వహించాయి. ఈ దిగుడు బావులు లేదా మెట్ల బావుల రక్షణలో 'జల్ మందిర్ పథకం' ప్రముఖ పాత్ర పోషించింది. గుజరాత్ అంతటా అనేక మెట్ల బావులను పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడానికి ఇది చాలా దోహదపడింది.

           మీరు స్థానికంగా కూడా ఇలాంటి ఉద్యమాలను నిర్వహించవచ్చు. చెక్ డ్యామ్‌లు కానివ్వండి, వాననీటి సంరక్షణ కానివ్వండి.. వీటిలో వ్యక్తిగత ప్రయత్నాలు కూడా ముఖ్యమైనవి. సామూహిక కృషి కూడా అవసరం. స్వతంత్ర్య భారత అమృతోత్సవాల్లో మన దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత్ సరోవరాలను తయారు చేయవచ్చు. కొన్ని పాత సరస్సులను బాగు చేయవచ్చు. కొన్ని కొత్త వాటిని నిర్మించవచ్చు. మీరు ఈ దిశలో తప్పకుండా కొంత ప్రయత్నం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' విశిష్టత, సౌందర్యం ఏమిటంటే మీ సందేశాలు అనేక భాషలలో, అనేక మాండలికాలలో నాకు అందుతాయి. చాలా మంది మై గవ్ లో ఆడియో సందేశాలను కూడా పంపుతారు. భారతదేశ సంస్కృతి, మన భాషలు, మాండలికాలు, మన జీవన విధానం, మన ఆహార పానీయాల విస్తరణ-  ఈ వైవిధ్యాలన్నీ మనకు గొప్ప బలం. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఈ వైవిధ్యం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది. ‘ఏక్ భారత్ -శ్రేష్ట్ భారత్’ గా మారుస్తుంది. ఇందులో కూడా మన చారిత్రక ప్రదేశాలు, పురాణాలు -  చాలా దోహదపడతాయి. నేను ఇప్పుడే మీతో ఈ విషయం ఎందుకు చెబుతున్నానని  మీరు ఆలోచిస్తూ ఉంటారు. దీనికి కారణం ‘మాధవ్‌పూర్ మేళా’. మాధవపూర్ మేళా ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, భారతదేశ వైవిధ్యంతో ఆ మేళాకు ఎలా సంబంధం ఉందో తెలుసుకోవడం మన్ కీ బాత్ శ్రోతలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

మిత్రులారా! ‘మాధవ్‌పూర్ జాతర’ గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సముద్రానికి సమీపంలోని మాధవపూర్ గ్రామంలో జరుగుతుంది. కానీ ఇది భారతదేశం  తూర్పు చివరతో కూడా కలుపుతుంది. ఇది ఎలా సాధ్యం అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. దీనికి సమాధానం కూడా ఒక పౌరాణిక కథ నుండి తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈశాన్యప్రాంత రాజకుమారి రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్తారు. ఈ వివాహం పోరుబందర్‌లోని మాధవపూర్‌లో జరిగింది. ఆ పెళ్ళికి గుర్తుగా ఈ రోజు కూడా మాధవపూర్ జాతర అక్కడ జరుగుతుంది. తూర్పు, పడమరల మధ్య ఉన్న ఈ లోతైన సంబంధం మన వారసత్వం. కాలంతో పాటు ఇప్పుడు ప్రజల కృషితో మాధవపూర్ జాతరకు కొత్తదనం కూడా తోడవుతోంది. వధువు వైపు వారిని ఘరాతీ అని పిలుస్తారు.  ఇప్పుడు ఈశాన్య ప్రాంతాల నుండి చాలా మంది ఘరాతీలు ఈ జాతరకు రావడం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే మాధవపూర్ జాతరకు ఈశాన్య రాష్ట్రాల నుండి కళాకారులు చేరుకుంటారు. హస్తకళకు సంబంధించిన కళాకారులు వస్తారు. నలుగురు చంద్రుల వెన్నెలలాగా ఈ జాతర అందాలు పొందుతుంది. ఒక వారం పాటు భారతదేశ తూర్పు, పశ్చిమ సంస్కృతుల సమ్మేళనమైన ఈ మాధవపూర్ జాతర  ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్‌కు చాలా అందమైన ఉదాహరణను సృష్టిస్తోంది. మీరు ఈ జాతర గురించి చదివి తెలుసుకోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా!  దేశంలో స్వాతంత్ర్య అమృతోత్సవం ఇప్పుడు ప్రజల భాగస్వామ్యానికి కొత్త ఉదాహరణగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం అంటే మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక వేడుకలు జరిగాయి. దేశం స్వాతంత్ర్యం సాధించిన వీరులను, వీరవనితలను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంది. అదే రోజు కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో విప్లవీ భారత్ గ్యాలరీని ప్రారంభించే అవకాశం కూడా నాకు లభించింది. భారతదేశంలోని వీర విప్లవకారులకు నివాళులర్పించేందుకు ఇది చాలా ప్రత్యేకమైన గ్యాలరీ. అవకాశం దొరికితే చూడడానికి తప్పకుండా వెళ్ళండి.  

మిత్రులారా, ఏప్రిల్ నెలలో మనం ఇద్దరు మహానుభావుల జయంతిని కూడా జరుపుకుంటాం. వీరిద్దరూ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఈ మహనీయులు మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతిని, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ జయంతిని జరుపుకుంటాం. ఈ మహానుభావులు ఇద్దరూ వివక్షకు, అసమానతలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. మహాత్మా ఫూలే ఆ కాలంలో ఆడపిల్లల కోసం పాఠశాలలు తెరిచారు. ఆడ శిశు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పారు. నీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు పెద్దఎత్తున ఉద్యమాలు కూడా చేశారు.

మిత్రులారా! మహాత్మా ఫూలే గురించిన ఈ చర్చలో సావిత్రీబాయి ఫూలే గారి ప్రస్తావన కూడా అంతే ముఖ్యమైనది. అనేక సామాజిక సంస్థల ఏర్పాటులో సావిత్రీబాయి ఫూలే ప్రముఖ పాత్ర పోషించారు. ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సమాజానికి అవగాహన కల్పించి ప్రోత్సహించారు. వారిద్దరూ కలిసి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. ప్రజల సాధికారత కోసం కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలలో మహాత్మా ఫూలే ప్రభావాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. సమాజ అభివృద్ధిని ఆ సమాజంలో మహిళల స్థితిగతులను బట్టి అంచనా వేయవచ్చని కూడా ఆయన చెప్పేవారు. మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులు, సంరక్షకులందరూ తమ కుమార్తెలను చదివించాలని కోరుతున్నాను. ఆడపిల్లలను బడిలో చేర్పించడం కోసం కొద్దిరోజుల క్రితమే కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవ్‌ కూడా ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల చదువుకు దూరమైన ఆడపిల్లలను మళ్లీ పాఠశాలకు తీసుకురావడంపై శ్రద్ధ పెట్టడం జరుగుతోంది.

మిత్రులారా! బాబాసాహెబ్‌తో అనుబంధం ఉన్న పంచ తీర్థం కోసం పని చేసే అవకాశం కూడా లభించడం మనందరి అదృష్టం. మహూలోని ఆయన జన్మస్థలమైనా, ముంబైలోని చైత్యభూమి అయినా, లండన్‌లోని ఆయన నివాసమైనా, నాగ్‌పూర్‌ దీక్షా భూమి అయినా, ఢిల్లీలోని బాబాసాహెబ్‌ మహాపరినిర్వాణస్థలమైనా- అన్ని ప్రదేశాలను, అన్ని తీర్థాలను సందర్శించే భాగ్యం నాకు లభించింది. మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్‌లకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించాలని నేను 'మన్ కీ బాత్' శ్రోతలను కోరుతున్నాను. అక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి కూడా 'మన్ కీ బాత్'లో మనం  అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. వచ్చే నెలలో చాలా పండుగలు వస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులలో మనం ఉపవాసాలు చేస్తాం. శక్తి సాధన చేస్తాం. శక్తిని ఆరాధిస్తాం. అంటే మన సంప్రదాయాలు మనకు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు నిగ్రహాన్ని నేర్పుతాయి. సంయమనం, పట్టుదల కూడా మనకు పర్వాలే. కాబట్టి నవరాత్రులు ఎప్పుడూ మనందరికీ చాలా ప్రత్యేకమైనవి. నవరాత్రుల మొదటి రోజున గుడి పడ్వా పండుగ కూడా ఉంది. ఈస్టర్ కూడా ఏప్రిల్‌లో వస్తుంది. రంజాన్ పవిత్ర రోజులు కూడా ప్రారంభమవుతాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకుని మన పండుగలను జరుపుకుందాం. భారతదేశ వైవిధ్యాన్ని బలోపేతం చేద్దాం.  ఇదే అందరి కోరిక. ఈసారి 'మన్ కీ బాత్'లో ఇవే విషయాలు. కొత్త అంశాలతో వచ్చే నెలలో మళ్లీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.