దాదాపు 1000 సంవత్సరాల నాటి అవలోకితేశ్వర పద్మపాణిని తిరిగి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం: ప్రధాని
2013 సంవత్సరం వరకు, సుమారు 13 విగ్రహాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. కానీ, గత ఏడు సంవత్సరాలలో, భారతదేశం 200 కంటే ఎక్కువ విలువైన విగ్రహాలను విజయవంతంగా తిరిగి తీసుకువచ్చింది: ప్రధాని
భారతీయ పాటలను లిప్ సింక్ చేస్తూ సోషల్ మీడియాలో అలలు సృష్టించిన కిలీ పాల్ మరియు నీమా గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.
మన మాతృభాష మన తల్లిలాగే మన జీవితాలను తీర్చిదిద్దుతుంది: ప్రధాని మోదీ
గర్వంగా మాతృభాషలోనే మాట్లాడాలి: ప్రధాని మోదీ
గత ఏడేళ్లలో, ఆయుర్వేద ప్రయోజనాలను ప్రోత్సహించడానికి చాలా శ్రద్ధ చూపబడింది: ప్రధాని మోదీ
మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా, పరిశుభ్రత కోసం కొంత ప్రయత్నం చేస్తున్నట్లు మీరు కనుగొంటారు: ప్రధాని
పంచాయితీ నుండి పార్లమెంటు వరకు, మన దేశంలోని మహిళలు కొత్త శిఖరాలను చేరుకుంటున్నారు: యువకులలో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించుకోవాలని కుటుంబాలను ప్రధాని మోదీ కోరారు: ప్రధాని మోదీ

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం భారతదేశ విజయ ప్రస్తావనతో 'మన్ కీ బాత్' ప్రారంభిద్దాం. ఈ నెల మొదట్లో ఇటలీ నుండి తన విలువైన వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడంలో భారతదేశం విజయవంతమైంది. ఇది ఒక వారసత్వ సంపద. వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైన అవలోకితేశ్వర పద్మపాణి విగ్రహం. ఈ విగ్రహం కొన్నేళ్ల క్రితం బీహార్‌లోని గయా జీ దేవస్థానం కుండల్‌పూర్ ఆలయం నుంచి చోరీ అయింది. అయితే ఎన్నో ప్ర‌య‌త్నాల త‌ర్వాత ఇప్పుడు భార‌త‌దేశం ఈ విగ్ర‌హాన్ని తిరిగి పొందింది. అదే విధంగా కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరులో హనుమంతుడి విగ్రహం చోరీకి గురైంది. ఈ హనుమాన్ విగ్రహం కూడా 600-700 సంవత్సరాల నాటిది. ఈ నెల ప్రారంభంలో దీన్ని ఆస్ట్రేలియాలో స్వీకరించాం. మన విశేష ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైంది.

మిత్రులారా! వేలాది సంవత్సరాల మన చరిత్రలో దేశంలోని నలుమూలల్లో ఎప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి విగ్రహాలు తయారవుతూ వచ్చాయి. ఇందులో శ్రద్ధ, సామర్థ్యం, నైపుణ్యం, వైవిధ్యం మిళితమై ఉన్నాయి. మన ప్రతి విగ్రహంలో ఆ కాలం నాటి చరిత్ర ప్రభావం కూడా కనిపిస్తుంది. అవి భారతీయ శిల్పకళకు అద్వితీయమైన ఉదాహరణలు మాత్రమే కాదు- మన విశ్వాసం కూడా అందులో మిళితమైంది. గతంలో చాలా విగ్రహాలు చోరీకి గురై భారత్ నుంచి వెళ్లిపోయాయి. కొన్నిసార్లు వివిధ దేశాల్లో ఆ విగ్రహాలను విక్రయించారు. వారికి అవి కళాఖండాలు మాత్రమే. వారికి దాని చరిత్రతో గానీ విశ్వాసాలతో గానీ ఎలాంటి సంబంధమూ లేదు. ఈ విగ్రహాలను తిరిగి తీసుకురావడం భారతమాత పట్ల మన బాధ్యత. ఈ విగ్రహాలలో భారతదేశ ఆత్మ ఉంది. విశ్వాసం ఉంది. వాటికి సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ బాధ్యతను గ్రహించిన భారత్ తన ప్రయత్నాలను పెంచింది. దొంగతనం చేసే ప్రవృత్తిలో భయం కూడా దీనికి కారణం. ఈ విగ్రహాలను దొంగిలించి తీసుకెళ్లిన దేశాల వారు ఇప్పుడు భారత్‌తో సంబంధాలలో సున్నితత్వం విషయంలో దౌత్య మార్గంలో కూడా దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుందని భావించడం ప్రారంభించారు. దీనికి కారణం భారతదేశ భావాలు దానితో ముడిపడి ఉన్నాయి. భారతదేశ గౌరవం కూడా దానితో ముడిపడి ఉంది. ఒక విధంగా ఇది ప్రజల మధ్య సంబంధాలలో కూడా చాలా ప్రభావాన్ని కలిగిస్తుంది. కాశీలో చోరీకి గురైన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా తిరిగి తీసుకురావడం కొద్దిరోజుల క్రితమే మీరు చూసి ఉంటారు. భారతదేశం పట్ల ప్రపంచ దృక్పథం మారుతున్నదనడానికి ఇదొక ఉదాహరణ. 2013 సంవత్సరం వరకు దాదాపు 13 విగ్రహాలు భారతదేశానికి వచ్చాయి. అయితే గత ఏడేళ్లలో భారతదేశం విజయవంతంగా 200 కంటే ఎక్కువ విలువైన విగ్రహాలను తిరిగి తీసుకువచ్చింది. అమెరికా, బ్రిటన్‌, హాలండ్‌, ఫ్రాన్స్‌, కెనడా, జర్మనీ, సింగపూర్‌- ఇలా ఎన్నో దేశాలు భారత్‌ స్ఫూర్తిని అర్థం చేసుకుని విగ్రహాలను తిరిగి తీసుకురావడానికి సహకరించాయి. గతేడాది సెప్టెంబర్‌లో నేను అమెరికా వెళ్లినప్పుడు అక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఎన్నో వస్తువులు లభ్యమయ్యాయి. దేశంలోని ఏదైనా విలువైన వారసత్వ సంపద తిరిగి వచ్చినప్పుడు చరిత్రపై గౌరవం ఉన్నవారు, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు; విశ్వాసం , సంస్కృతితో ముడిపడి ఉన్న వ్యక్తులు; భారతీయులుగా మనందరమూ సంతోషపడడం చాలా సహజం.

మిత్రులారా! భారతీయ సంస్కృతి, మన వారసత్వం గురించి మాట్లాడుతూ ఈ రోజు 'మన్ కీ బాత్'లో మీకు ఇద్దరిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో Facebook, Twitter, Instagramలలో వార్తల్లో ఉన్న ఆ ఇద్దరు టాంజానియన్ తోబుట్టువులు కిలీ పాల్, ఆయన సోదరి నీమా. మీరు కూడా వారి గురించి తప్పకుండా విని ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వారికి భారతీయ సంగీతంపై అభిరుచి, మమకారం ఉన్నాయి. ఈ కారణంగా వారు చాలా ప్రజాదరణ పొందారు. పెదవులు కదిలించే విధానం చూస్తే వారు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఈమధ్య రిపబ్లిక్ డే సందర్భంగా మన జాతీయ గీతం 'జన గణ మన'ను వారు ఆలపించిన వీడియో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం కూడా లతా దీదీకి ఓ పాట పాడి వారు ఆత్మీయ నివాళులర్పించారు. ఈ అద్భుతమైన సృజనాత్మకతకు ఈ ఇద్దరు తోబుట్టువులు కిలి, నీమాలను నేను చాలా అభినందిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం టాంజానియాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా వారిని సన్మానించారు. భారతీయ సంగీతంలోని మాయాజాలం అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు గుర్తుంది- కొన్ని సంవత్సరాల కిందట ప్రపంచంలోని నూట యాభైకి పైగా దేశాల నుండి గాయకులు, సంగీతకారులు వారి వారి దేశాలలో, వారి వారి సాంప్రదాయిక ఆహార్యంతో పూజ్య బాపుకు ప్రియమైన- మహాత్మా గాంధీకి ఇష్టమైన కీర్తన 'వైష్ణవ జనతో' పాడడం ద్వారా ఒక విజయవంతమైన ప్రయోగం చేశారు.

నేడు భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల ముఖ్యమైన పండుగను జరుపుకుంటున్నప్పుడు దేశభక్తి గీతాలకు సంబంధించి ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు. విదేశీ పౌరులను, అక్కడి నుండి ప్రసిద్ధ గాయకులను భారతీయ దేశభక్తి గీతాలు పాడటానికి ఆహ్వానిద్దాం. ఇది మాత్రమే కాదు- మన దేశంలో అనేక భాషలలో చాలా రకాల పాటలు ఉన్నాయి. టాంజానియాలోని కిలీ, నీమా భారతదేశంలోని పాటలకు ఈ విధంగా పెదవులను కదపగలిగినట్టే ఎవరైనా గుజరాతీ పిల్లలు తమిళంలో చేయవచ్చు. కేరళ పిల్లలు అస్సామీ పాటలు చేయాలి. మరికొందరు కన్నడ పిల్లలు జమ్మూ కాశ్మీర్ పాటలు చేయాలి. మనం 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' అనుభూతి చెందగలిగే వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు- మనం ఖచ్చితంగా స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను కొత్త పద్ధతిలో జరుపుకోవచ్చు. నేను దేశంలోని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ భాషలలోని ప్రసిద్ధ పాటలను మీకు తోచిన విధానంలో వీడియో తీయండి. మీరు బాగా పాపులర్ అవుతారు. దేశంలోని వైవిధ్యం కొత్త తరానికి పరిచయం అవుతుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! కొద్దిరోజుల క్రితం మనం మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. మాతృభాష అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, దాని వ్యుత్పత్తి ఏంటి అనే విషయాలపై విద్యా సంబంధమైన అంశాలను పండితులు చెప్పగలరు. మాతృభాషకు సంబంధించి నేను ఒకటే చెప్తాను- మన తల్లి మన జీవితాన్ని తీర్చిదిద్దే విధంగా మాతృభాష కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అమ్మ, మాతృభాష రెండూ జీవితపు పునాదిని పటిష్టం చేస్తాయి. చిరంజీవిని చేస్తాయి. మనం తల్లిని విడిచిపెట్టలేం. అలాగే మాతృభాషను కూడా వదలలేం. కొన్నాళ్ల కిందటి ఒక విషయం నాకు గుర్తుంది. నేను అమెరికా వెళ్ళినప్పుడు వివిధ కుటుంబాలను పరామర్శించే అవకాశం కలిగేది. ఒకసారి నేను తెలుగు కుటుంబాన్ని కలిసినప్పుడు అక్కడ చాలా సంతోషకరమైన దృశ్యాన్ని చూశాను. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఎంత పనిఉన్నా ఊరి బయట లేకుంటే కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి భోజనం చేయాలని, భోజన సమయంలో తెలుగు భాషలో మాత్రమే మాట్లాడాలని నియమంగా పెట్టుకున్నట్టు వారు చెప్పారు. అక్కడ పుట్టిన పిల్లలకు కూడా ఇదే నియమం. మాతృభాషపై ఉన్న ఈ ప్రేమ కారణంగా ఈ కుటుంబం నన్ను ఎంతగానో ప్రభావితుడిని చేసింది.

మిత్రులారా! స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా కొందరు వ్యక్తులు తమ భాష, వేషధారణ, తిండి, పానీయాల పట్ల సంకోచంతో మానసిక సంఘర్షణలో బతుకుతున్నారు. అయితే ప్రపంచంలో మరెక్కడా ఇలా ఉండదు. మన మాతృభాషను మనం గర్వంగా మాట్లాడాలి. మన భారతదేశం భాషల పరంగా చాలా సమృద్ధమైంది. దాన్ని ఇతర దేశాలతో పోల్చలేం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుండి కోహిమా వరకు- వందలాది భాషలు, వేలాది మాండలికాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కానీ ఒకదానికొకటి కలిసిపోయాయి. భాషలు అనేకం. కానీ భావం ఒక్కటే. శతాబ్దాలుగా మన భాషలు తమను తాము మెరుగుపరుచుకుంటున్నాయి. ఒకదాని నుండి మరొకటి నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష తమిళం భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలోనే ఇంత గొప్ప వారసత్వ సంపద మనకు ఉన్నందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలి. అదే విధంగా అనేక ప్రాచీన ధర్మ శాస్త్ర గ్రంథాల్లోని అభివ్యక్తి మన సంస్కృత భాషలో కూడా ఉంది. భారతదేశంలోని ప్రజలు సుమారుగా 121 అంటే 121 రకాల మాతృభాషలతో అనుబంధం కలిగి ఉండడం మనకు గర్వ కారణం. వీటిలో దైనందిన జీవితంలో 14 భాషలలో ఒక కోటి మందికి పైగా ప్రజలు సంభాషిస్తారు. అంటే అనేక యూరోపియన్ దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ప్రజలు మన దేశంలో 14 వేర్వేరు భాషలతో అనుబంధం కలిగి ఉన్నారు. 2019 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో హిందీ మూడవ స్థానంలో నిలిచింది. ప్రతి భారతీయుడు ఈ విషయంలో గర్వపడాలి. భాష అనేది భావ వ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే కాదు. సమాజ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడేందుకు కూడా భాష ఉపయోగపడుతుంది. సుర్జన్ పరోహి గారు తన భాషా వారసత్వాన్ని కాపాడుకోవడానికి సూరినామ్‌లో ఇలాంటి పని చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన ఆయన 84వ ఏట అడుగుపెట్టారు. ఆయన పూర్వీకులు జీవనోపాధి కోసం వేలాది మంది కార్మికులతో పాటు చాలా ఏళ్ల కిందట సూరినామ్‌కు వెళ్లారు. సుర్జన్ పరోహి గారు హిందీలో చాలా మంచి కవిత్వం రాస్తారు. ఆయనకు అక్కడ జాతీయ కవులలో ఒకరిగా గుర్తింపు వచ్చింది. అంటే నేటికీ ఆయన గుండెల్లో హిందుస్థాన్ ధ్వని వినబడుతుంది. ఆయన రచనల్లో హిందుస్థానీ మట్టి సుగంధం ఉంది. సూరినామ్ ప్రజలు సుర్జన్ పరోహి పేరు మీద మ్యూజియం కూడా నిర్మించారు. 2015లో ఆయనను సన్మానించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.

మిత్రులారా! ఈరోజు- అంటే ఫిబ్రవరి 27న మరాఠీ భాషాదినోత్సవం కూడా.

"సర్వ్ మరాఠీ బంధు భగినినా మరాఠీ భాషా దినాచ్యా హార్దిక్ శుభేచ్ఛా! "

ఈ రోజు మరాఠీ కవిరాజు విష్ణు బామన్ షిర్వాడ్కర్ జీ, శ్రీ కుసుమాగ్రజ్ జీకి అంకితం. ఈరోజు కుసుమాగ్రజ్ గారి జన్మదినం కూడా. కుసుమాగ్రజ్ గారు మరాఠీలో కవిత్వం రాశారు. అనేక నాటకాలు రాశారు. మరాఠీ సాహిత్యానికి ఔన్నత్యం కల్పించారు.

మిత్రులారా! భాషకు స్వీయ లక్షణాలు ఉన్నాయి. మాతృభాషకు దాని స్వీయ విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకుని జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. మన వృత్తిపరమైన కోర్సులను కూడా స్థానిక భాషలోనే బోధించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర అమృత కాలంలో మనమందరం కలిసి ఈ ప్రయత్నానికి ఊపు ఇవ్వాలి. ఇది మన స్వాభిమాన కార్యం. మీరు ఏ మాతృభాష మాట్లాడినా దాని యోగ్యత గురించి తెలుసుకుని ఆ విషయంపై రాయాలి.

మిత్రులారా! కొన్ని రోజుల క్రితం నేను నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా గారితో సమావేశమయ్యాను. ఈ సమావేశం ఆసక్తికరంగా, చాలా ఉద్వేగభరితంగా సాగింది. మనం చాలా మంచి స్నేహితులమైతే స్వేచ్ఛగా మాట్లాడతాం. మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఒడింగా గారు తన కుమార్తె గురించి చెప్పాడు. ఆయన కుమార్తె రోజ్ మేరీకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. దాని కారణంగా ఆయన తన కుమార్తెకు శస్త్రచికిత్స చేయించవలసి వచ్చింది. అయితే దీని వల్ల ఒక దుష్ఫలితం ఏమిటంటే రోజ్ మేరీ కంటి చూపు దాదాపుగా పోయింది. ఆయన కుమార్తె పరిస్థితి ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. మనం ఆ తండ్రి పరిస్థితిని కూడా ఊహించవచ్చు. ఆయన భావాలను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో తన కుమార్తె చికిత్స కోసం ఆయన తన వంతు ప్రయత్నం చేయని పెద్ద దేశం ప్రపంచంలోనే లేదు.

 

 

 

 

 

 

ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఓ విధంగా ఆశలన్నీ వదులుకున్నారు. దాంతో ఇల్లంతా నిస్పృహ వాతావరణం నెలకొంది. ఆయుర్వేద చికిత్స కోసం ఇండియాకు వెళ్లాలని ఎవరో సూచించారు. ఆయన చాలా చేశారు. అలసిపోయారు. “ఒకసారి ప్రయత్నిద్దాం. ఏమవుతుంది?” అనుకుని భారతదేశానికి వచ్చారు. కేరళలోని ఆయుర్వేద ఆసుపత్రిలో తన కుమార్తెకు చికిత్స చేయించడం ప్రారంభించారు. ఆయన కూతురు చాలా కాలం ఇక్కడే ఉండిపోయింది. ఆయుర్వేద చికిత్స ప్రభావం వల్ల రోజ్ మేరీ కంటి చూపు చాలా వరకు తిరిగి వచ్చింది. రోజ్ మేరీకి కొత్త జీవితం లభించినట్టు, ఆమె జీవితానికి కొత్త వెలుగు వచ్చినట్టు మీరు ఊహించవచ్చు. కానీ మొత్తం కుటుంబానికి ఒక కొత్త వెలుగు వచ్చింది. ఈ విషయం నాకు చెబుతున్నప్పుడు ఒడింగా గారు చాలా ఉద్వేగానికి లోనయ్యారు. భారతీయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని కెన్యాకు తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయుర్వేదంలో వినియోగించే మొక్కలను పెంచి, మరింత మందికి ప్రయోజనం కలిగేలా కృషి చేస్తామన్నారు.

మన భూమి నుండి, సంప్రదాయం నుండి ఒకరి జీవితంలోని ఇంత గొప్ప బాధ తొలగిపోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది విని మీరు కూడా సంతోషిస్తారు. దాని గురించి గర్వించని భారతీయుడు ఎవరు ఉంటారు? ఒడింగా గారు మాత్రమే కాదు- ప్రపంచంలోని లక్షలాది ప్రజలు ఆయుర్వేదం నుండి ఇలాంటి ప్రయోజనాలను పొందుతున్నారని మనందరికీ తెలుసు.

బ్రిటన్ యువరాజు చార్లెస్ కూడా ఆయుర్వేదం అభిమానులలో ఒకరు. నేను ఆయనను కలిసినప్పుడల్లా ఆయన ఖచ్చితంగా ఆయుర్వేదం గురించి ప్రస్తావిస్తారు. ఆయనకు భారతదేశంలోని అనేక ఆయుర్వేద సంస్థల గురించి కూడా తెలుసు.

మిత్రులారా! గత ఏడేళ్లలో దేశంలో ఆయుర్వేద ప్రచారంపై చాలా శ్రద్ధ పెట్టారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు మన సంప్రదాయ వైద్యాన్ని, ఆరోగ్య పద్ధతులను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద రంగంలో అనేక కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్ ఈ నెల మొదట్లో ప్రారంభమైంది. ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లను గుర్తించడం, వాటికి సహకారం ఇవ్వడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ఈ రంగంలో పనిచేస్తున్న యువత తప్పనిసరిగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.

మిత్రులారా! ప్రజలు కలిసి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, వారు అద్భుతమైన పనులు చేస్తారు. సమాజంలో ఇలాంటి పెద్ద మార్పులు ఎన్నో వచ్చాయి. అందులో ప్రజల భాగస్వామ్యం, సమిష్టి కృషి పెద్ద పాత్ర పోషించాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ‘మిషన్ జల్ థల్’ పేరుతో అలాంటి ప్రజా ఉద్యమం జరుగుతోంది. శ్రీనగర్‌లోని సరస్సులను, చెరువులను శుభ్రపరిచి వాటి పాత వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. ‘మిషన్ జల్ థల్’ దృష్టి కుశల్ సార్, గిల్ సార్ లపై ఉంది. ఇందులో ప్రజల భాగస్వామ్యంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో, ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయో తెలుసుకునేందుకు ఈ ప్రాంతంలో సర్వే చేయించారు. దీనితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, వ్యర్థాలను శుభ్రం చేయడం వంటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మిషన్ రెండవ దశలో పాత నీటి కాలువలు, సరస్సులను నింపే 19 జలపాతాలను పునరుద్ధరించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన కల్పించడానికి స్థానిక ప్రజలను, యువతను నీటి రాయబారులుగా మార్చారు. ఇప్పుడు ఇక్కడి స్థానిక ప్రజలు కూడా గిల్ సార్ సరస్సులో వలస పక్షులు, చేపల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఇది చూసి సంతోషిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి శ్రీనగర్ ప్రజలను నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా! ఎనిమిదేళ్ల కిందట దేశం ప్రారంభించిన ‘స్వచ్చ భారత్ మిషన్' విస్తరణ కాలంతో పాటు పెరిగింది. కొత్త ఆవిష్కరణలు కూడా అనుసంధానమయ్యాయి. మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా, ప్రతిచోటా పరిశుభ్రత కోసం కొంత ప్రయత్నం జరుగుతుందని మీకు తెలుస్తుంది. అస్సాంలోని కోక్రాఝర్‌లో అలాంటి ఒక ప్రయత్నం గురించి నాకు తెలిసింది. ఇక్కడ మార్నింగ్ వాకర్స్ బృందం ఒకటి 'క్లీన్ అండ్ గ్రీన్ కోక్రాఝర్' మిషన్ కింద చాలా ప్రశంసనీయమైన చొరవ తీసుకుంది. వీరంతా కొత్త ఫ్లైఓవర్ ప్రాంతంలోని మూడు కిలోమీటర్ల పొడవునా రోడ్డును శుభ్రం చేసి స్వచ్ఛత స్ఫూర్తి సందేశాన్ని అందించారు. అదేవిధంగా విశాఖపట్నంలో ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కింద పాలిథిన్‌కు బదులు గుడ్డ సంచులు వినియోగించాలని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు వ్యర్థాలను ఇంటి వద్దే వేరుచేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముంబాయిలోని సోమయ్య కాలేజీ విద్యార్థులు తమ పరిశుభ్రత ప్రచారంలో సౌందర్యాన్ని కూడా చేర్చారు. కళ్యాణ్ రైల్వే స్టేషన్ గోడలను అందమైన పెయింటింగ్స్‌తో అలంకరించారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ కూడా నాకు తెలిసింది. ఇక్కడి యువత రణథంబోర్‌లో 'మిషన్ బీట్ ప్లాస్టిక్' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో రణథంబోర్‌ అడవుల్లో ప్లాస్టిక్, పాలిథిన్ లను తొలగించారు. ప్రతి ఒక్కరి కృషిలోని ఈ స్ఫూర్తి దేశంలో ప్రజల భాగస్వామ్యాన్ని బలపరుస్తుంది. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు అతిపెద్ద లక్ష్యాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి.

నా ప్రియమైన దేశవాసులారా! నేటి నుండి కొద్ది రోజులకే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. 'మన్ కీ బాత్'లో మనం మహిళల సాహసాలు, నైపుణ్యం, ప్రతిభకు సంబంధించిన అనేక ఉదాహరణలను పంచుకుంటున్నాము. నేడు స్కిల్ ఇండియా అయినా, స్వయం సహాయక బృందాలయినా, చిన్న, పెద్ద పరిశ్రమలైనా అన్ని చోట్లా మహిళలు ముందున్నారు. ఎక్కడ చూసినా మహిళలు పాత అపోహలను ఛేదిస్తున్నారు. నేడు మ‌న దేశంలో మ‌హిళ‌లు పార్ల‌మెంట్ నుంచి పంచాయతీల వరకు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు పొందుతున్నారు. సైన్యంలో కూడా అమ్మాయిలు ఇప్పుడు ఉన్నత స్థానాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశాన్ని కాపాడుతున్నారు. గత నెల గణతంత్ర దినోత్సవం రోజున అమ్మాయిలు కూడా ఆధునిక యుద్ధ విమానాలను ఎగురవేయడం చూశాం. సైనిక్ పాఠశాలల్లో అమ్మాయిల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని దేశం తొలగించింది. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో ఇప్పుడు అమ్మాయిలు ప్రవేశం పొందుతున్నారు. అదేవిధంగా మన స్టార్ట్-అప్ ప్రపంచాన్ని చూడండి. గత సంవత్సరాలలో దేశంలో వేలాది కొత్త స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్టప్‌లలో దాదాపు సగం మహిళలే నిర్వహిస్తున్నవి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మహిళలకు ప్రసూతి సెలవుల పెంపు వంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అబ్బాయిలు, అమ్మాయిలకు సమాన హక్కులు కల్పిస్తూ పెళ్లి వయసును సమానం చేసేందుకు దేశం ప్రయత్నిస్తోంది. దీంతో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలో జరుగుతున్న మరో పెద్ద మార్పును మీరు తప్పక చూస్తారు. ఈ మార్పు మన సామాజిక ప్రచారాల విజయం. 'బేటీ బచావో, బేటీ పడావో' విజయాన్ని తీసుకోండి.. దీని ద్వారా నేడు దేశంలో లింగ నిష్పత్తి మెరుగుపడింది. పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య కూడా మెరుగుపడింది. మన అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. అదేవిధంగా 'స్వచ్ఛ్ భారత్ అభియాన్' కింద దేశంలోని మహిళలు బహిరంగ మలవిసర్జన నుండి విముక్తి పొందారు. ముమ్మారు తలాక్ లాంటి సామాజిక దురాచారం కూడా అంతం కాబోతోంది. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం వచ్చినప్పటి నుంచి దేశంలో ఈ కేసులు 80 శాతం తగ్గాయి. ఇంత తక్కువ సమయంలో ఈ మార్పులన్నీ ఎలా జరుగుతున్నాయి? మన దేశంలో మార్పుకు, ప్రగతిశీల ప్రయత్నాలకు ఇప్పుడు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ మార్పు వస్తోంది.

నా ప్రియమైన దేశ వాసులారా! రేపు ఫిబ్రవరి 28న 'నేషనల్ సైన్స్ డే'. ఈ రోజు రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు కూడా ప్రసిద్ధి చెందింది. నేను సివి రామన్ గారితో పాటు మన వైజ్ఞానిక యాత్రను సుసంపన్నం చేయడంలో ప్రధానపాత్ర పోషించిన శాస్త్రవేత్తలందరికీ నేను గౌరవపూర్వక నివాళులర్పిస్తున్నాను. మిత్రులారా! సాంకేతికత మన జీవితంలో సులభంగా, సరళంగా ఎక్కువ పాత్ర సంపాదించింది. ఏ సాంకేతికత మంచిది, ఏ సాంకేతికత ఉత్తమ వినియోగం ఏమిటి, -ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు. కానీ, మన కుటుంబంలోని పిల్లలకు ఆ సాంకేతికతకు ఆధారం ఏమిటి, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనే విషయాలను వివరించడం పైకి మన దృష్టి వెళ్లడం లేదన్నది కూడా నిజం. ఈ సైన్స్ దినోత్సవం సందర్భంగా కుటుంబాలన్నీ తమ పిల్లలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడాన్ని చిన్న చిన్న ప్రయత్నాలతో తప్పకుండా ప్రారంభించాలని నేను కోరుతున్నాను.

ఉదాహరణకి ఇప్పుడు సరిగ్గా కనబడడం లేదు కానీ కళ్లద్దాలు పెట్టుకున్నాక కనిపిస్తోంది.. దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటో పిల్లలకు సులభంగా వివరించవచ్చు. కేవలం ‘అద్దాలు చూడండి- ఆనందించండి’ అనడం మాత్రమే కాదు. మీరు ఒక చిన్న కాగితంపై వారికి చెప్పవచ్చు. ఇప్పుడు వారు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది, రిమోట్ కంట్రోల్ ఎలా పని చేస్తుంది, సెన్సార్లు ఏమిటి? ఇలాంటి సైంటిఫిక్ విషయాలు ఇంట్లో చర్చిస్తారా? ఇంటి దైనందిన జీవితం వెనుక ఉన్న ఈ విషయాలను మనం సులభంగా వివరించవచ్చు. అది ఏమి చేస్తుందో దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో చెప్పవచ్చు. అదే విధంగా మనం ఎప్పుడైనా పిల్లలతో కలిసి ఆకాశాన్ని పరిశీలించామా? రాత్రిపూట నక్షత్రాల గురించి మాట్లాడాలి. వివిధ రకాల నక్షత్రరాశులు కనిపిస్తాయి. వాటి గురించి చెప్పండి. ఇలా చేయడం ద్వారా మీరు పిల్లలలో భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం పట్ల ఆసక్తిని కలిగించవచ్చు. ఈ రోజుల్లో, చాలా యాప్‌లు కూడా ఉన్నాయి. వాటి నుండి మీరు నక్షత్రాలను, గ్రహాలను గుర్తించవచ్చు లేదా ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని మీరు గుర్తించవచ్చు. దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. దేశ నిర్మాణానికి సంబంధించిన పనిలో మీ నైపుణ్యాలు , శాస్త్రీయ స్వభావాన్ని ఉపయోగించాలని మన స్టార్టప్‌ ఆవిష్కర్తలకు నేను చెప్తాను. దేశం పట్ల మన సమష్టి శాస్త్రీయ బాధ్యత కూడా ఇదే. ఈ రోజుల్లో మన స్టార్టప్‌లు వర్చువల్ రియాలిటీ ప్రపంచంలో చాలా మంచి పని చేస్తున్నాయని నేను చూస్తున్నాను. వర్చువల్ తరగతుల ఈ యుగంలో పిల్లలను దృష్టిలో ఉంచుకుని అటువంటి వర్చువల్ ల్యాబ్‌ను తయారు చేయవచ్చు. మనం వర్చువల్ రియాలిటీ ద్వారా పిల్లలను ఇంట్లో కూర్చొని కెమిస్ట్రీ ల్యాబ్‌ను అనుభవించేలా చేయవచ్చు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నా అభ్యర్థన ఏమిటంటే విద్యార్థులు , పిల్లలందరినీ ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహించండి. వారితో కలిసి ప్రశ్నలకు సరైన సమాధానాలు కనుగొనండి. కరోనాపై పోరాటంలో భారతీయ శాస్త్రవేత్తల పాత్రను కూడా ఈ రోజు నేను అభినందించాలనుకుంటున్నాను. వారి కృషి కారణంగానే మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్‌ను తయారు చేయడం సాధ్యమైంది. ఇది ప్రపంచం మొత్తానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇది మానవాళికి సైన్స్ అందించిన బహుమతి.

 నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి కూడా మనం అనేక అంశాలపై చర్చించాం. మార్చి నెలలో అనేక పండుగలు వస్తున్యి. శివరాత్రి వస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు మీరందరూ హోలీ కోసం సిద్ధం కావడం ప్రారంభిస్తారు. హోలీ మనల్ని కలిపే పండుగ. ఇందులో మనవాడు -పరాయివాడు, చిన్న- పెద్ద అనే తేడాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ద్వేషాలు-విద్వేషాలు దూరమవుతాయి. అందుకే హోలీకి ఉన్న ప్రేమ, సామరస్యాలు హోలీ రంగుల కంటే గాఢమైనవని అంటారు. హోలీలో తీయనైన కజ్జికాయలతో పాటు, సంబంధాలలో కూడా ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. మనం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. మన కుటుంబంలోని వ్యక్తులతో మాత్రమే కాకుండా మీ విస్తృత కుటుంబంలో భాగమైన వారితో కూడా సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. దీన్ని చేయడానికి అత్యంత ముఖ్యమైన మార్గం కూడా మీరు గుర్తుంచుకోవాలి. 'వోకల్ ఫర్ లోకల్'తో పండుగ జరుపుకోవడమే ఈ మార్గం. పండుగల సందర్భంగా మీరు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. తద్వారా మీ చుట్టూ నివసించే ప్రజల జీవితాలను కూడా వర్ణమయం చేయవచ్చు. ఉత్సాహం నింపవచ్చు. మన దేశం కరోపై విజయంసాధిస్తూ ముందుకు సాగడంతో, పండుగలలో ఉత్సాహం కూడా చాలా రెట్లు పెరిగింది. ఈ ఉత్సాహంతో మనం పండుగలు జరుపుకోవాలి. అదే సమయంలో మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. రానున్న పండుగల సందర్భంగా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్ను. నేను ఎప్పుడూ మీ మాటలు, మీ ఉత్తరాలు, మీ సందేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government