Let us make ‘vocal for local’ our New Year resolution: PM
Mann Ki Baat: PM Modi pays rich tributes to Sikh Gurus for their valour and sacrifice
Matter of pride that number of leopards have increased in the country: PM
The ‘can do approach’ and ‘will do spirit’ of India’s youth is inspiring: PM
GI tag recognition for Kashmir’s Kesar is making it popular brand on global map: PM
As long as there is curiosity, one is inspired to learn: PM Eliminating single use plastic should also be one of the resolution of 2021: PM

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. ఈ రోజు డిసెంబర్ 27. నాలుగు రోజుల తర్వాత 2021 ప్రారంభం అవుతుంది. నేటి 'మన్ కి బాత్' 2020 సంవత్సరంలో చివరి 'మన్ కీ బాత్'. తదుపరి 'మన్s కీ బాత్' 2021 లో ప్రారంభమవుతుంది. మిత్రులారా! మీరు రాసిన లేఖలు నా ముందు చాలా ఉన్నాయి. మీరు మైగవ్‌లో పంపిన సూచనలు కూడా నా ముందు ఉన్నాయి. ఎంతో మంది ఫోన్ చేసి కూడా తమ విషయాలు చెప్పారు. చాలా సందేశాలలో ఈ ఏడాది అనుభవాలు, 2021 తో అనుసంధానించిన తీర్మానాలు ఉన్నాయి. కొల్హాపూర్ నుండి అంజలి గారు రాశారు.. “ప్రతిసారికొత్త సంవత్సరంలో ఇతరులను అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు ఒకరికొకరం  చెప్పుకుంటున్నాం కదా. ఈసారి మేము కొత్త పని చేస్తాం. మన దేశాన్ని మనం ఎందుకు అభినందించకూడదు?  దేశానికి ఎందుకు శుభాకాంక్షలు చెప్పకూడదు?” అని.   అంజలి గారు..  చాలా గొప్ప ఆలోచన. మన దేశం 2021 లో కొత్త విజయ శిఖరాలను తాకాలని, ప్రపంచంలో భారతదేశం మరింత గుర్తింపు పొందాలని, దేశం మరింత శక్తిమంతం కావాలని కోరుకోవడం కంటే గొప్ప కోరిక ఏముంటుంది?   

మిత్రులారా! ముంబాయికి చెందిన అభిషేక్ గారు నమోయాప్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. 2020 లో తాను చూసింది, నేర్చింది..  తాను ఎప్పుడూ కనీసం ఆలోచించలేదని రాశారు. కరోనాకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన రాశారు. ఈ లేఖలలో, ఈ సందేశాలన్నింటిలో ఉన్న ఉమ్మడి అంశాలను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా లేఖలలో దేశ సామర్థ్యాన్ని,   దేశవాసుల సామూహిక శక్తిని ప్రజలు ప్రశంసించారు. జనతా కర్ఫ్యూ వంటి వినూత్న ప్రయోగం మొత్తం ప్రపంచానికి ప్రేరణగా మారడాన్ని  చాలామంది గుర్తు చేశారు.  చప్పట్లు కొట్టడం ద్వారా మన కరోనా వారియర్స్ ను గౌరవించడాన్ని, సంఘీభావం చూపించడాన్ని కూడా చాలా మంది జ్ఞాపకం చేసుకున్నారు.

మిత్రులారా! దేశంలోని సామాన్యులు ఈ మార్పును అనుభవించారు. నేను దేశంలో అద్భుతమైన ఆశల ప్రవాహాన్ని కూడా చూశాను. చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా సమస్యలు కూడా వచ్చాయి. కరోనా కారణంగా సప్లై చైన్ తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి.  కాని మనం ప్రతి సంక్షోభం నుండి కొత్త పాఠాలు నేర్చుకున్నాం. దేశంలో కొత్త సామర్ధ్యం కూడా ఏర్పడింది. మాటల్లో చెప్పాలనుకుంటే ఈ సామర్ధ్యం  పేరు 'స్వావలంబన'.

మిత్రులారా! ఢిల్లీ లో నివసించే అభినవ్ బెనర్జీ గారు తమ అనుభవాన్ని నాకు రాసి పంపారు. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. తన బంధువుల పిల్లలకు  బహుమతులు ఇవ్వడానికి అభినవ్ గారు కొన్ని బొమ్మలు కొనవలసి వచ్చింది.  అందువల్ల ఆయన ఢిల్లీలోని ఝండేవాలాన్ మార్కెట్‌కు వెళ్ళారు. మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు-  ఈ మార్కెట్ ఢిల్లీలో సైకిళ్లకు, బొమ్మలకు ప్రసిద్ది చెందింది. అంతకుముందు అక్కడికి ఖరీదైన బొమ్మలు దిగుమతి అయ్యేవి.  చౌకైన బొమ్మలు కూడా బయటి దేశాల నుండి వచ్చేవి. కానీ అభినవ్ గారు తమ లేఖలో రాశారు. ఇప్పుడు అక్కడ చాలా మంది దుకాణదారులు కస్టమర్లకు బొమ్మలు చూపించి “ఇది మంచి బొమ్మ. ఎందుకంటే ఇది భారతదేశంలో తయారైన – 'మేడ్ ఇన్ ఇండియా' బొమ్మ కాబట్టి” అని చెప్తున్నారని. భారతదేశం తయారు చేసిన బొమ్మలను మాత్రమే వినియోగదారులు అడుగుతున్నారు. ఆలోచనలో పెద్ద మార్పు వచ్చిందనడానికి ఇది సజీవ రుజువు. దేశవాసుల మనస్తత్వంలో ఎంత పెద్ద మార్పు వస్తోంది-  అది కూడా ఒక సంవత్సరంలోనే. ఈ మార్పును అంచనా వేయడం అంత సులభం కాదు. ఆర్థికవేత్తలు కూడా తమ ప్రమాణాలపై ఆధారపడి ఈ మార్పును కొలవలేరు.  

మిత్రులారా! విశాఖపట్నం నుండి వెంకట మురళీ  ప్రసాద్ గారు రాసిన ఆలోచన విభిన్నంగా ఉంది. “2021 కోసం నా ఎబిసిని మీకు అటాచ్ చేస్తున్నాను” అని వెంకట్ గారు  రాశారు.  ఏబీసీ అంటే అర్థం ఏమిటో నాకు తెలియలేదు. అప్పుడు వెంకట్ గారు  తమ లేఖ  పాటు ఒక చార్టు ను కూడా జత చేసినట్టు నేను చూశాను. ఆ చార్ట్ వైపు చూశాన.  ఆపై ఏబీసీ అంటే అర్థం ఏమిటో తెలుసుకున్నాను. స్వయం సమృద్ధిగల భారత చార్ట్ ABC. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. వెంకట్ గారు ప్రతిరోజూ ఉపయోగించే అన్ని వస్తువుల పూర్తి జాబితాను తయారు చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్స్, స్టేషనరీ, స్వీయ సంరక్షణ సామగ్రితో పాటు మరికొన్నివస్తువులు ఉన్నాయి. మనకు తెలిసీ తెలియకుండానే, భారతదేశంలో సులభంగా లభించే విదేశీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నామని వెంకట్ గారు చెప్పారు. మన దేశవాసుల శ్రమ, చెమట ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

 మిత్రులారా! చాలా ఆసక్తికరంగా ఉన్న మరొక విషయాన్ని కూడా ఆయన చెప్పారు.  స్వావలంబన భారతదేశానికి తాము మద్దతు ఇస్తున్నామని ఆయన రాశారు. మన దేశీయ తయారీదారులు కూడా ఉత్పత్తుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టమైన సందేశం ఉండాలని ఆయన రాశారు. ఈ విషయం వాస్తవం.  శూన్య ప్రభావం, శూన్య లోపం అనే ఆలోచనతో పనిచేయడానికి ఇది సరైన సమయం. దేశ తయారీదారులు, పరిశ్రమల నాయకులను నేను కోరుతున్నాను: దేశ ప్రజలు స్వావలంబన భారతదేశం దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు.  వారు బలమైన చర్యలు తీసుకున్నారు. స్థానిక వస్తువుల కోసం స్వరం- వోకల్ ఫర్ లోకల్-  ఈ రోజు ఇంటింటా ప్రతిధ్వనిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో  మన ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో ఉండేలా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఉత్తమమైనది ఏమైనప్పటికీ మనం దాన్ని భారతదేశంలో తయారు చేయవచ్చు. దీని కోసం మన సహచరులు ముందుకు రావాలి. స్టార్ట్-అప్‌లు కూడా ముందుకు రావాలి. వెంకట్ గారి ఉత్తమ ప్రయత్నాలను మరోసారి అభినందిస్తున్నాను.

మిత్రులారా! మనం ఈ భావనను కలిగిఉండాలి.  ఈ భావనను మనలో ఉంచుకోవాలి, పెంచుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పాను.  ఆపై దేశవాసులను కూడా కోరుతున్నాను. మీరు కూడా ఒక జాబితాను తయారు చేయండి.  రోజంతా మనం ఉపయోగించే అన్ని వస్తువుల  గురించి చర్చించండి. తెలిసీ తెలియకుండా విదేశాలలో తయారైన వస్తువులు ఏవైనా మన జీవితంలోకి ప్రవేశించాయేమో  చూడండి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని  బందీలుగా చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో ఉపయోగించగలిగే భారతదేశ ఉత్పత్తులను కనుగొనండి. ఇకపై భారతదేశంలో ప్రజలు చెమటోడ్చి కష్టపడి తయారుచేసిన ఉత్పత్తులను ఉపయోగించాలని నిర్ణయించుకోండి. మీరు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సర తీర్మానాలను చేస్తారు.  ఈసారి దేశం కోసం తీర్మానం కూడా చేసుకోవాలి.

నా ప్రియమైన దేశవాసులారా!  దేశంలోని వేల సంవత్సరాల సంస్కృతిని, నాగరికతను, మన ఆచారాలను కాపాడడానికి;  ఉగ్రవాదుల నుండి, అణచివేతదారుల నుండి దేశాన్ని రక్షించడానికి  మన దేశంలో ఎన్ని త్యాగాలు చేశారో.. ఈ రోజు ఆ బలిదానాలను గుర్తుంచుకునే రోజు. ఈ రోజు గురు గోవింద్ కుమారులు సాహిబ్  జాదే జొరావర్ సింగ్, ఫతే సింగ్  లను గోడలో సజీవంగా బలి చేసినరోజు. సాహిబ్ జాదే తన విశ్వాసాన్ని వదులుకోవాలని, గొప్ప గురు సంప్రదాయాన్ని విడిచిపెట్టాలని నిరంకుశులు కోరుకున్నారు. కానీ, మన సాహిబ్జాదాలు చిన్న వయసులో కూడా గొప్ప ధైర్యం, సంకల్ప శక్తిని ప్రదర్శించారు. గోడలో సజీవ సమాధి సమయంలో రాళ్ళు పెరుగుతూనే ఉన్నాయి..  గోడ పెరుగుతూనే ఉంది..  మరణం వారి ముందు కొట్టుమిట్టాడుతోంది.. అయినా వారు బెదరలేదు. గురు గోవింద్ సింగ్ జీ తల్లి – మాతా గుజ్రీ కూడా ఇదే రోజు   ప్రాణాలర్పించారు. .  సుమారు వారం కిందట  శ్రీ గురు తేగ్ బహదూర్ జి బలిదానం  చేసిన రోజు. ఢిల్లీ లోని గురుద్వారా రకాబ్ గంజ్ కు వెళ్ళి  గురు తేగ్ బహదూర్ జికి నివాళి తెలిపే అవకాశం,   నమస్కరించే అవకాశం నాకు లభించింది. శ్రీ గురు గోవింద్ సింగ్ జి స్ఫూర్తితో చాలా మంది ఈ నెల నేలమీద నిద్రపోతారు.  

శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కుటుంబ బలిదానాలను ప్రజలు చాలా భావోద్వేగ స్థితిలో గుర్తుంచుకుంటారు. ఈ బలిదానం మొత్తం మానవాళికి, దేశానికి కొత్త పాఠం నేర్పింది. ఈ అమరవీరులు మన సంస్కృతిని సురక్షితంగా ఉంచడంలో గొప్ప పని చేశారు. ఈ అమరవీరులకు మనమందరం రుణపడి ఉన్నాం. శ్రీ గురు తేగ్ బహదూర్ జీ , మాతా గుజ్రీ జీ, గురు గోవింద్ సింగ్ జీలతో పాటు నలుగురు సాహిబ్జాదాల అమరవీరులకు మరోసారి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా చాలామంది అమరవీరులు భారతదేశ  ప్రస్తుత రూపాన్ని సంరక్షించారు, కొనసాగించారు.

నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం మీకు సంతోషంగా, గర్వంగా ఉంటుంది. 2014-2018 మధ్య భారతదేశంలో చిరుతపులుల సంఖ్య 60 శాతానికి పైగా పెరిగింది. 2014 లో దేశంలో చిరుతపులుల సంఖ్య 7,900 ఉండగా, 2019 లో వారి సంఖ్య 12,852 కు పెరిగింది. " ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించే చిరుతపులులను చూడని వారు దాని అందాన్ని ఊహించలేరు. చిరుతపులి రంగుల అందం, దాని నడకలోని   సౌందర్యాన్ని ఊహించలేరు." అని జిమ్ కార్బెట్ చెప్పిన చిరుతపులి అదే.  దేశంలోని చాలా రాష్ట్రాల్లో-  ముఖ్యంగా మధ్య భారతదేశంలో  చిరుతపులుల  సంఖ్య పెరిగింది. చిరుతపులుల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నాయి. ఇది పెద్ద విజయం. చిరుతపులులు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అపాయాలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాటి ఆవాసాలకు నష్టం జరుగుతోంది.  అటువంటి సమయంలో చిరుతపులుల జనాభాను నిరంతరం పెంచడం ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించింది. గత కొన్నేళ్లుగా భారతదేశంలో సింహాల జనాభా పెరిగింది. పులుల సంఖ్య కూడా పెరిగింది.  అలాగే భారత అటవీ ప్రాంతం కూడా పెరిగింది.  దీనికి కారణం మన చెట్లు, వన్యప్రాణుల రక్షణలో ప్రభుత్వం మాత్రమే కాదు- చాలా మంది ప్రజలు, పౌర సమాజం, అనేక సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. వారందరూ అభినందనలకు అర్హులు.  

మిత్రులారా! తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన హృదయాన్ని స్పర్శించే ఒక కృషి గురించి చదివాను. సోషల్ మీడియాలో మీరు కూడా ఆ కృషికి సంబంధించిన విజువల్స్ చూశారు. మనమందరం మనుషుల వీల్‌చైర్‌ను చూశాం. కానీ కోయంబత్తూరుకు చెందిన గాయత్రి అనే అమ్మాయి తన తండ్రితో కలిసి బాధిత కుక్క కోసం వీల్‌చైర్ తయారు చేసింది. ఈ సంఘటన ఉత్తేజకరమైంది. ప్రేరణ కలిగించేది . మనుషులు  ప్రతి జీవి పట్ల దయ, కరుణ చూపినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో, దేశంలోని ఇతర నగరాల్లో చలి ఎక్కువగా ఉన్న సమయంలో జంతువులను జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా మంది చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆ జంతువులకు తినడానికి, తాగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి కోసం స్వెట్టర్లు, పరుపులను  కూడా ఏర్పాటు చేస్తారు. కొంతమంది ప్రతిరోజూ వందలాది జంతువులకు ఆహారం అందిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలను ప్రశంసించాలి. ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబిలో కూడా ఇలాంటి గొప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆవులను చలి నుండి రక్షించడానికి అక్కడి జైలు ఖైదీలు ప్రత్యేకంగా పాత, చిరిగిన కంబళ్లను కుడుతున్నారు. కౌశాంబితో సహా ఇతర జిల్లాల జైళ్ల నుండి వాటిని సేకరించి, ఆ తర్వాత వాటిని కుట్టి గోశాలలకు పంపుతారు. కౌశాంబి జైలు ఖైదీలు పాత, చిరిగిన దుప్పట్లతో ఆవులను కప్పేందుకు  ప్రతివారం ఇలాంటి కవర్లు తయారు చేస్తున్నారు. రండి, ఇతరులను చూసుకోవటానికి సేవా భావంతో  నిండిన ఇటువంటి ప్రయత్నాలను ప్రోత్సహించండి. ఇవి నిజంగా సమాజంలోని సానుభూతులను బలపరిచే మంచి పనులు.

నా ప్రియమైన దేశవాసులారా!  ఇప్పుడు నా ముందు ఉన్న లేఖలో రెండు పెద్ద ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలు ఒక ఆలయానివి. గతంలో, ఇప్పుడు ఆ దేవాలయ ఫోటోలు అవి. ఈ ఫోటోలతో ఉన్న లేఖ తమను తాము యువ బ్రిగేడ్ అని పిలిచే యువకుల బృందం గురించి చెప్తుంది. వాస్తవానికి ఈ యువ బ్రిగేడ్ కర్ణాటకలోని శ్రీరంగపట్నం సమీపంలోని  ఉన్న పురాతన వీరభద్రస్వామి శివాలయానికి పునరుజ్జీవనం కల్పించింది. ఈ ఆలయం ప్రతి వైపు కలుపు మొక్కలు, పొదలతో నిండి ఉండేది. ఎంతగా అంటే అక్కడ శివాలయం ఉందనే విషయం  బాటసారులు కూడా చెప్పలేనంతగా. ఒక రోజు కొంతమంది పర్యాటకులు ఈ పురాతన ఆలయం  వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన యువ బ్రిగేడ్ ఆగలేకపోయారు.  తరువాత ఈ బృందం కలిసి దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. ఆలయ ప్రాంగణంలో పెరిగిన ముళ్ల పొదలు, గడ్డి, మొక్కలను ఈ బృందం తొలగించింది.  అవసరమయ్యే చోట మరమ్మత్తు, నిర్మాణం చేశారు.  వారి మంచి పనిని చూసి స్థానిక ప్రజలు కూడా తమ సహాయాన్ని అందించారు. కొంతమంది సిమెంటు ఇచ్చారు. కొంతమంది పెయింట్, మరెన్నో వస్తువులతో తమవంతు సహకారం అందించారు. ఈ యువకుల్లో  అనేక రకాలైన వృత్తుల వారు ఉన్నారు. ఈ విధంగా వారు వారాంతాల్లో సమయం తీసుకున్నారు, ఆలయం కోసం పనిచేశారు. ఆలయంలో తలుపులను ఏర్పాటు చేయడంతో పాటు, విద్యుత్ కనెక్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆలయ పాత వైభవాన్ని తిరిగి నెలకొల్పడానికి కృషి చేశారు. అభిరుచి, సంకల్పం ఉంటే ఏ లక్ష్యాన్నయినా సాధించవచ్చు.  భారతదేశ యువతను చూసినప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. నమ్మకం కలుగుతుంది.  ఎందుకంటే నా దేశంలోని యువతకు ‘నేను చేయగలను’ అనే దృక్కోణం,  ‘నేను చేస్తాను’ అనే ఆత్మవిశ్వాసం ఉన్నాయి. వారికి ఏ సవాలూ పెద్దది కాదు.  ఏదీ వారికి అందనంత దూరంలో లేదు. నేను తమిళనాడుకు చెందిన ఒక టీచర్ గురించి చదివాను. ఆమె పేరు ఎన్.కె. హేమలత. విడుపురంలోని ఒక పాఠశాలలో ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళాన్ని  ఆమె నేర్పిస్తారు.  కోవిడ్ 19 మహమ్మారి కూడా ఆమె బోధనామార్గానికి అడ్డు రాలేదు. అవును! ఆమె ముందు సవాళ్లు ఉన్నాయి.  కానీ, ఆమె ఒక వినూత్న మార్గాన్ని కనుగొన్నారు.   కోర్సు  మొత్తం 53 అధ్యాయాలను రికార్డ్ చేశారు. యానిమేటెడ్ వీడియోలను తయారు చేశారు. వాటిని పెన్ డ్రైవ్‌లో తన విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇది ఆమె విద్యార్థులకు చాలా సహాయపడింది. తద్వారా అధ్యాయాలను విద్యార్థులు దృశ్యరూపంలో అర్థం చేసుకోగలిగారు. దీంతో పాటు ఆమె తన విద్యార్థులతో టెలిఫోన్‌లో మాట్లాడటం కొనసాగించింది. ఇది విద్యార్థులకు చదువును మరింత ఆసక్తికరంగా చేసింది. దేశవ్యాప్తంగా కరోనా ఉన్న ఈ సమయంలో ఉపాధ్యాయులు అనుసరించిన వినూత్న పద్ధతులు, సృజనాత్మకంగా తయారుచేసిన కోర్సు సామగ్రి ఆన్‌లైన్ అధ్యయనాల ఈ దశలో అమూల్యమైనవి. ఈ కోర్సు సామగ్రిని విద్యా మంత్రిత్వ శాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను.  దయచేసి ‘దీక్ష’ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయండి. ఇది దేశంలోని సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.

మిత్రులారా! జార్ఖండ్‌కు చెందిన కొర్వా తెగకు చెందిన హీరామన్ గారి గురించి మాట్లాడుకుందాం. హీరామన్ గారు గర్వా జిల్లాలోని సింజో గ్రామంలో నివసిస్తున్నారు. కొర్వా తెగ జనాభా కేవలం 6,000 మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.  వారు నగరాలకు దూరంగా ఉన్న పర్వతాలు, అడవులలో నివసిస్తున్నారు. తన సమాజ  సంస్కృతి , గుర్తింపును కాపాడడానికి హీరామన్ గారు ముందడుగు వేశారు. 12 సంవత్సరాల నిరంతర శ్రమ తరువాత అతను అంతరించిపోయిన కొర్వ భాష నిఘంటువును సిద్ధం చేశారు. ఇంట్లో ఉపయోగించే పదాల నుండి మొదలుకొని రోజువారీ జీవితంలో ఉపయోగపడే అనేక పదాలను అర్థాలతో సహా ఆయన ఈ నిఘంటువులో చేర్చారు.  కొర్వా సమాజం కోసం హెరామన్ చేసిన పని దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.

నా ప్రియమైన దేశవాసులారా! అక్బర్ ఆస్థానంలో ఒక ప్రముఖుడు  ఉన్నారని చెబుతారు. ఆయన అబుల్ ఫజల్. కాశ్మీర్‌లో ఒక దృశ్యాన్ని చూసి చిరాకు, కోపంతో  ఉండేవారు కూడా ఆనందం వ్యక్తం చేస్తారని కాశ్మీర్ సందర్శన తర్వాత ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లోని కుంకుమ పొలాల గురించి ఆయన ఆ మాట అన్నారు.  కుంకుమ పువ్వు శతాబ్దాలుగా కాశ్మీర్‌తో సంబంధం కలిగి ఉంది. కాశ్మీరీ కుంకుమ పువ్వు ప్రధానంగా పుల్వామా, బడ్ గాం, కిష్త్ వార్  వంటి ప్రదేశాలలో పండిస్తారు. ఈ సంవత్సరం మేలో కాశ్మీరీ కుంకుమపువ్వుకు భౌగోళిక సూచిక ట్యాగ్ అంటే జీ ఐ ట్యాగ్  ఇచ్చారు. దీని ద్వారా కాశ్మీరీ కుంకుమ పువ్వును ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్‌గా మార్చాలనుకుంటున్నాం. కాశ్మీరీ కుంకుమ పువ్వు అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉన్న మసాలా దినుసుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఇది చాలా సువాసనతో , ముదురు రంగులో ఉంటుంది. దాని దారాలు పొడవుగా, మందంగా ఉంటాయి. ఇది దాని ఔషధ విలువను పెంచుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్  గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది. నాణ్యత గురించి చెప్పాలంటే కాశ్మీరీ  కుంకుమ పువ్వు చాలా ప్రత్యేకమైంది. ఇతర దేశాల కుంకుమపువ్వు తో పోలిస్తే  పూర్తిగా భిన్నమైంది. కాశ్మీరీ కుంకుమపువ్వుకు జిఐ ట్యాగ్ గుర్తింపుతో  ప్రత్యేకఠ వచ్చింది. జిఐ ట్యాగ్ సర్టిఫికేట్ పొందిన తరువాత కాశ్మీరీ కుంకుమ పువ్వును దుబాయ్ లోని సూపర్ మార్కెట్లో ప్రారంభించినట్లు తెలిస్తే మీరు సంతోషిస్తారు.. ఇప్పుడు దాని ఎగుమతులు పెరగడం ప్రారంభమవుతుంది. ఇది స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి మన ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది. కుంకుమ పువ్వు  రైతులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. పుల్వామాలోని త్రాల్ లో ఉన్న  షార్ ప్రాంతంలో నివసించే అబ్దుల్ మజీద్ వానీ ని  చూడండి. ఆయన జి.ఐ టాగ్ పొందిన  కుంకుమపువ్వును పాంపోర్‌లోని ట్రేడింగ్ సెంటర్‌లో నేషనల్ సాఫ్రాన్ మిషన్ సహాయంతో ఇ-ట్రేడింగ్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇలా చాలా మంది కాశ్మీర్‌లో ఈ పని చేస్తున్నారు. ఈసారి మీరు కుంకుమపువ్వు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు కాశ్మీర్ నుండి కుంకుమపువ్వు కొనాలని ఆలోచించండి. కాశ్మీరీ ప్రజల గొప్పదనం ఏమిటంటే అక్కడి కుంకుమ పువ్వు రుచి భిన్నంగా ఉంటుంది.

నా ప్రియమైన దేశ వాసులారా! కేవలం రెండు రోజుల కిందట గీతా జయంతి జరుపుకున్నాం. గీత మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ మనకు స్ఫూర్తినిస్తుంది. గీత ఇంత అద్భుతమైన గ్రంథం ఎందుకైందని  మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే అది స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడి వాణి. కానీ గీత  ప్రత్యేకత ఏమిటంటే అది తెలుసుకోవాలనే ఉత్సుకతతో మొదలవుతుంది. ప్రశ్నతో మొదలవుతుంది. అర్జునుడు దేవుణ్ణి ప్రశ్నించాడు. ఉత్సుకత చూపాడు.  అప్పుడే ప్రపంచానికి గీతా  జ్ఞానం వచ్చింది. గీత మాదిరిగా మన సంస్కృతిలో ఉన్న జ్ఞానం అంతా ఉత్సుకతతో మొదలవుతుంది. వేదాంతం  మొదటి మంత్రం “అథాతో బ్రహ్మ జిజ్ఞాసా’ అంటే  మనం బ్రహ్మను విచారిద్దాం. అందుకే బ్రహ్మను అన్వేషించే చర్చ కూడా ఉంది. ఉత్సుకత లోని శక్తి అలాంటిది. ఉత్సుకత నిరంతరం కొత్త అంశాల  కోసం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. బాల్యంలో మనలో ఉత్సుకత ఉన్నందు వల్ల మనం నేర్చుకుంటాం. అంటే ఉత్సుకత ఉన్నంతవరకు జీవితం ఉంటుంది. ఉత్సుకత ఉన్నంతవరకు కొత్త అభ్యాస క్రమం కొనసాగుతుంది. ఇందులో వయస్సు, పరిస్థితులతో సంబంధం లేదు. అటువంటి ఉత్సుకత శక్తికి, జిజ్ఞాసకు ఒక ఉదాహరణ నాకు తెలిసింది. ఆ ఉదాహరణ తమిళనాడుకు చెందిన పెద్దవారు టి. శ్రీనివాసాచార్య స్వామి జీ గురించి! టి.  శ్రీనివాసాచార్య స్వామి గారి వయస్సు 92 సంవత్సరాలు.  ఈ వయస్సులో కూడా ఆయన తన పుస్తకాన్ని కంప్యూటర్లో రాస్తున్నారు. అది కూడా స్వయంగా టైప్ చేయడం ద్వారా. పుస్తకం రాయడం సరైందేనని మీరు ఆలోచిస్తూ ఉండాలి. కాని పూర్వ కాలంలో కంప్యూటర్ అసలే లేదు. అప్పుడు ఆయన కంప్యూటర్ ఎప్పుడు నేర్చుకున్నారు? ఆయన కళాశాలలో చదువుతున్న సమయంలో కంప్యూటర్ లేదనేది నిజం. కానీ, ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న ఉత్సుకత, జిజ్ఞాస ఇప్పుడూ ఉన్నాయి. శ్రీనివాసాచార్య స్వామీజీ సంస్కృత , తమిళ పండితుడు. ఆయన ఇప్పటివరకు 16 ఆధ్యాత్మిక గ్రంథాలను రాశారు. కంప్యూటర్ వచ్చిన తరువాత పుస్తకం రాయడం, ముద్రించే విధానం మారిందని భావించినప్పుడు, తన 86 సంవత్సరాల వయస్సులో కంప్యూటర్ నేర్చుకున్నారు. తనకు అవసరమైన సాఫ్ట్‌వేర్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన తన పుస్తకాన్ని పూర్తి చేస్తున్నారు.

మిత్రులారా! జీవితంలో జిజ్ఞాస చనిపోయేంత వరకు నేర్చుకోవాలనే కోరిక చనిపోదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ టి. శ్రీనివాసాచార్య స్వామీజీ జీవితం.  అందువల్ల వెనుకబడిపోయామని, ఆగిపోయామని ఎప్పుడూ అనుకోకూడదు. నేర్చుకుంటామని ఆశాజనకంగా ఉండాలి. మనం నేర్చుకోలేమని, ముందుకు సాగలేమని కూడా అనుకోకూడదు.

నా ప్రియమైన దేశవాసులారా! ప్రస్తుతం మనం ఉత్సుకతతో కొత్త విషయాన్ని  నేర్చుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కొంతమంది నిరంతరం కొత్త పనులు చేస్తూ, కొత్త సంకల్పాలను నెరవేరుస్తూ ఉంటారు. మీరు కూడా మీ జీవితంలో అనుభూతి చెంది  ఉంటారు. మనం సమాజం కోసం ఏదైనా చేసినప్పుడు సమాజం మనకు చాలా చేయగల శక్తిని ఇస్తుంది. సామాన్యంగా కనబడే ప్రేరణలతో చాలా పెద్ద పనులు చేయవచ్చు. ప్రదీప్ సంగ్వాన్ అలాంటి ఒక యువకుడు! గురుగ్రామ్‌కు చెందిన ప్రదీప్ సంగ్వాన్ 2016 నుండి హీలింగ్ హిమాలయాస్ అనే పేరుతో ఉద్యమం  చేస్తున్నారు. ఆయన తన బృందం, వాలంటీర్లతో కలిసి హిమాలయాలలోని  వివిధ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ టూరిస్టులు వదిలేసిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను శుభ్రపరుస్తారు. ప్రదీప్ గారు ఇప్పటివరకు హిమాలయాలలోని వివిధ పర్యాటక ప్రాంతాల నుండి టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ను శుభ్రపరిచారు. ఇదేవిధంగా కర్ణాటకకు చెందిన అనుదీప్, మినుషా అనే ఒక యువ జంట ఉన్నారు. అనుదీప్, మినుషా గత నెల నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత చాలా మంది వివిధ ప్రాంతాలు తిరిగేందుకు వెళతారు. కానీ ఈ ఇద్దరూ భిన్నమైన పని చేశారు. ప్రజలు తమ ఇంటి నుండి బయటికి తిరగడానికి వెళ్లడాన్ని వారిద్దరూ ఎప్పుడూ గమనించేవారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా చెత్తను వదిలివేస్తారన్న విషయాన్ని వారు గమనించారు. కర్ణాటకలోని సోమేశ్వర్ బీచ్‌లో పరిస్థితి కూడా అలాంటిదే. సోమేశ్వర్ బీచ్‌లో ప్రజలు వదిలిపెట్టిన చెత్తను శుభ్రం చేయాలని అనుదీప్, మినుషా నిర్ణయించుకున్నారు. భార్యాభర్తలిద్దరూ వివాహం తర్వాత మొదటి ప్రతిజ్ఞ తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి సముద్ర తీరంలో చాలా చెత్తను శుభ్రపరిచారు. అనుదీప్ తన సంకల్పాన్ని సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. తర్వాత ఏమైంది? వారిద్దరి అద్భుతమైన ఆలోచనతో ప్రభావితం అయిన చాలా మంది యువత వచ్చి వారితో  చేరారు. మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులందరూ కలిసి సోమేశ్వర్ బీచ్ నుండి 800 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను శుభ్రపరిచారు.

మిత్రులారా! ఈ ప్రయత్నాల మధ్య-  ఈ చెత్త ఈ బీచ్ లకు, ఈ పర్వతాలకు ఎలా చేరుకుంటుందో కూడా మనం ఆలోచించాలి. మనలోనే కొందరు  ఈ చెత్తను అక్కడ వదిలివేస్తారు. ప్రదీప్, అనుదీప్-మినుషా లాగా  శుభ్రతా ఉద్యమాన్ని   మనం నడపాలి. కానీ దీనికి ముందు మనం చెత్తను అస్సలు వ్యాప్తి చేయబోమని ప్రతిజ్ఞ కూడా తీసుకోవాలి. స్వచ్ఛభారత అభియాన్ మొదటి తీర్మానం ఇదే. అవును.. నేను మీకు మరో విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. కరోనా కారణంగా ఈ సంవత్సరం పెద్దగా చర్చించలేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి దేశానికి విముక్తి కల్పించాలి. 2021 తీర్మానాల్లో ఇది కూడా ఒకటి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి. వచ్చే ఏడాది జనవరిలో కొత్త అంశాలపై 'మన్ కీ బాత్' ఉంటుంది.

మీకు చాలా చాలా కృతజ్ఞతలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg

Media Coverage

5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister urges the Indian Diaspora to participate in Bharat Ko Janiye Quiz
November 23, 2024

The Prime Minister Shri Narendra Modi today urged the Indian Diaspora and friends from other countries to participate in Bharat Ko Janiye (Know India) Quiz. He remarked that the quiz deepens the connect between India and its diaspora worldwide and was also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

He posted a message on X:

“Strengthening the bond with our diaspora!

Urge Indian community abroad and friends from other countries  to take part in the #BharatKoJaniye Quiz!

bkjquiz.com

This quiz deepens the connect between India and its diaspora worldwide. It’s also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

The winners will get an opportunity to experience the wonders of #IncredibleIndia.”