Prabhu Ram was also a source of inspiration for the makers of our Constitution: PM Modi
The festivals of our democracy further strengthen India as the ‘Mother of Democracy’: PM Modi
Pran Pratishtha in Ayodhya has woven a common thread, uniting people across the country: PM Modi
India of the 21st century is moving ahead with the mantra of Women-led development: PM Modi
The Padma Awards recipients are doing unique work in their respective fields: PM Modi
The Ministry of AYUSH has standardized terminology for Ayurveda, Siddha and Unani medicine: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 2024 సంవత్సరంలో ఇది మొదటి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం. అమృతకాలంలో కొత్త ఉత్సాహం, కొత్త కెరటం. రెండు రోజుల క్రితం మనమందరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ ఏడాదితో మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. సుప్రీంకోర్టు కూడా 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. మన ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ పండుగలు ప్రజాస్వామ్యానికి తల్లిగా ఉన్న భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తాయి. భారతదేశ రాజ్యాంగాన్ని చాలా తీవ్రమైన మేధామథనం తర్వాత రూపొందించారు. అందుకే భారత రాజ్యాంగాన్ని ‘సజీవ పత్రం’ అని పిలుస్తారు. ఈ రాజ్యాంగం మూల ప్రతిలోని మూడవ అధ్యాయం భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది.  మన రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధ్యాయం ప్రారంభంలో భగవాన్ శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణ్ జీల చిత్రాలకు స్థానం కల్పించడం చాలా ఆసక్తికరంగా ఉంది.. రాముడి పాలన మన రాజ్యాంగ నిర్మాతలకు కూడా స్ఫూర్తిదాయకం. అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో 'దైవం నుండి దేశం వరకు’ అనే విషయంపై మాట్లాడాను. 'రాముడి నుండి దేశం వరకు’ అనే అంశంపై మాట్లాడాను.

మిత్రులారా! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భం కోట్లాది మంది దేశ ప్రజలను కట్టిపడేసిందనిపిస్తుంది. అందరి భావాలు ఒక్కటే. అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో రాముడు. అందరి హృదయాల్లో రాముడు. ఈ సమయంలో దేశంలోని చాలా మంది ప్రజలు రామభజనలను పాడి, శ్రీరాముని చరణాలకు  సమర్పించుకున్నారు. జనవరి 22 సాయంత్రం యావద్దేశం రామజ్యోతులను  వెలిగించి, దీపావళిని జరుపుకుంది. ఈ సమయంలో దేశం సామూహిక శక్తిని దర్శించింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన తీర్మానాలకు ప్రధాన ఆధారం. మకర సంక్రాంతి నుండి జనవరి 22వ తేదీ వరకు స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని నేను దేశ ప్రజలను కోరాను. లక్షలాది మంది ప్రజలు భక్తితో తమ ప్రాంతాల్లోని ధార్మిక స్థలాలను శుభ్రం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను నాకు ఎంతో మంది పంపారు. ఈ భావన ఆగకూడదు. ఈ ప్రచారం ఆగకూడదు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని కొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి జనవరి 26న జరిగిన కవాతు చాలా అద్భుతంగా సాగింది. అయితే కవాతులో మహిళా శక్తిని చూడడం ఎక్కువగా చర్చనీయాంశమైంది. కేంద్ర భద్రతా బలగాలకు, ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన మహిళా బృందాలు కర్తవ్య పథ్ లో కవాతు చేయడం ప్రారంభించినప్పుడు అందరూ గర్వంతో ఉప్పొంగిపోయారు. మహిళా బ్యాండ్ బృందం కవాతును చూసి, వారి అద్బుతమైన సమన్వయాన్ని చూసి దేశ విదేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈసారి కవాతులో పాల్గొన్న 20 బృందాలలో 11 బృందాలు మహిళలవే. ఇందులో పాల్గొన్న శకటాల్లో భాగస్వాములైన వారు కూడా మహిళా కళాకారులే. ఈ సందర్భంగా జరిగిన  సాంస్కృతిక కార్యక్రమాల్లో సుమారు ఒకటిన్నర వేల మంది అమ్మాయిలు పాల్గొన్నారు. చాలా మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరం, నాగద వంటి భారతీయ సంగీత వాయిద్యాలను ఉపయోగించారు. డి.ఆర్.డి.ఓ. ప్రదర్శించిన శకటం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నీరు, భూమి, ఆకాశం, సమాచార సాంకేతికత, అంతరిక్షం - ఇలా ప్రతి రంగంలోనూ మహిళా శక్తి దేశాన్ని ఎలా రక్షిస్తుందో ఇందులో చూపించారు. 21వ శతాబ్దపు భారతదేశం మహిళల నేతృత్వంలో అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతోంది.

మిత్రులారా! మీరు కొన్ని రోజుల క్రితం అర్జున పురస్కారాల వేడుకను తప్పక చూసి ఉంటారు. ఈ కార్యక్రమంలో దేశానికి చెందిన పలువురు క్రీడాకారులను, అథ్లెట్లను రాష్ట్రపతి భవన్‌లో సన్మానించారు. ఇక్కడ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది అర్జున పురస్కారాలు స్వీకరించిన అమ్మాయిలు, వారి జీవిత ప్రయాణాలు. ఈసారి 13 మంది మహిళా అథ్లెట్లను అర్జున పురస్కారంతో సత్కరించారు. ఈ మహిళా అథ్లెట్లు ఎన్నో పెద్ద టోర్నమెంట్లలో పాల్గొని భారతదేశ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సాహసోపేతమైన, ప్రతిభావంతులైన ఆటగాళ్ల ముందు శారీరక సవాళ్లు, ఆర్థిక సవాళ్లు నిలబడలేకపోయాయి. పరివర్తన చెందుతున్న భారతదేశంలో మన అమ్మాయిలు, మహిళలు ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. మహిళలు తమదైన ముద్ర వేసిన మరో రంగం స్వయం సహాయక సంఘాలు. ఇప్పుడు దేశంలో మహిళా స్వయం సహాయక సంఘాల సంఖ్య కూడా పెరిగింది. వాటి  పని పరిధి కూడా చాలా విస్తరించింది. ప్రతి గ్రామంలోని పొలాల్లో డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయడంలో సహాయం చేసే నమో డ్రోన్ సోదరీమణులను చూసే రోజు ఎంతో దూరంలో లేదు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్‌లో స్థానిక వస్తువులను  ఉపయోగించి మహిళలు జీవ-ఎరువులు, జీవ-పురుగుమందులను తయారు చేయడం గురించి నాకు తెలిసింది. నిబియా బేగంపూర్ గ్రామంలో స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న మహిళలు ఆవు పేడ, వేప ఆకులు, అనేక రకాల ఔషధ మొక్కలను కలపడం ద్వారా జీవ ఎరువులను తయారు చేస్తారు. అదేవిధంగా ఈ మహిళలు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరపకాయలను పేస్ట్ చేసి, సేంద్రియ పురుగుమందును కూడా తయారు చేస్తారు. ఈ మహిళలంతా సంఘటితమై ‘ఉన్నతి బయోలాజికల్ యూనిట్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. బయో ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ సంస్థ మహిళలకు సహాయం చేస్తుంది. వారు తయారు చేసిన జీవ ఎరువులు, జీవ పురుగుమందుల డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. అక్కడికి సమీప గ్రామాలకు చెందిన ఆరు వేల మందికి పైగా రైతులు వారి నుంచి బయో ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న ఈ మహిళల ఆదాయం పెరిగింది. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది.

నా ప్రియమైన దేశప్రజలారా! సమాజాన్ని, దేశాన్ని బలోపేతం చేయడానికి నిస్వార్థంగా పనిచేస్తున్న దేశవాసుల ప్రయత్నాలకు 'మన్ కీ బాత్'లో మనం  ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం దేశం పద్మ అవార్డులను ప్రకటించినప్పుడు 'మన్ కీ బాత్'లో ఇలాంటి వారిపై చర్చ జరగడం సహజం. ఈసారి కూడా అట్టడుగు వర్గాలతో మమేకమై సమాజంలో పెనుమార్పులు తీసుకురావడానికి కృషి చేసిన ఎంతోమంది దేశవాసులకు పద్మ పురస్కారాలు లభించాయి. ఈ స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత ప్రయాణం గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా చాలా ఆసక్తి ఏర్పడింది. మీడియా పతాక శీర్షికలకు దూరంగా, వార్తాపత్రికల మొదటి పేజీలకు దూరంగా, ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ఈ వ్యక్తులు సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇంతకు ముందు ఇలాంటి వ్యక్తుల గురించి మనం చూడలేదు, వినలేదు. కానీ ఇప్పుడు పద్మ పురస్కారాల ప్రకటన తర్వాత ఇలాంటి వారి గురించి ప్రతి చోటా చర్చ జరగడం, వారి గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ప్రజలు ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషం. ఈ పద్మ పురస్కార గ్రహీతల్లో చాలా మంది తమ తమ రంగాల్లో చాలా ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. ఉదాహరణకు ఒకరు అంబులెన్స్ సేవను అందిస్తున్నారు. ఒకరు నిరుపేదలకు పైకప్పును ఏర్పాటు చేస్తున్నారు. కొందరు కొన్ని వేల చెట్లను నాటుతూ ప్రకృతి పరిరక్షణలో నిమగ్నమై ఉన్నారు. 650 కంటే ఎక్కువ రకాల వరిపంట పరిరక్షణకు కృషి చేసిన వారు కూడా ఉన్నారు. మాదకద్రవ్యాలు, మద్యపాన వ్యసనాల నివారణకు సమాజంలో అవగాహన కల్పిస్తున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది వ్యక్తులు స్వయం సహాయక బృందాలతో, ముఖ్యంగా నారీ శక్తి ప్రచారంతో ప్రజలను అనుసంధానించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సన్మానం పొందిన వారిలో 30 మంది మహిళలు ఉండటం పట్ల కూడా దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళలు అట్టడుగు స్థాయిలో తమ కృషి ద్వారా సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

మిత్రులారా! పద్మ పురస్కార గ్రహీతల్లో ప్రతి ఒక్కరి అంకితభావం దేశప్రజలకు స్ఫూర్తిదాయకం. శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, రంగస్థలం, భజన ప్రపంచంలో దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొస్తున్న వారు ఈసారి పెద్ద సంఖ్యలో ఈ గౌరవం పొందుతున్నారు. ప్రాకృతం, మాళవీ, లంబాడీ భాషల్లో అద్భుతమైన కృషి చేసిన వారికి కూడా ఈ గౌరవం దక్కింది. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన పలువురు విదేశీ వాసులు  కూడా పద్మ పురస్కారం పొందారు. వీరిలో ఫ్రాన్స్, తైవాన్, మెక్సికో, బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నారు.

మిత్రులారా! గత దశాబ్ద కాలంలో పద్మ పురస్కారాల విధానం పూర్తిగా మారిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అది పీపుల్స్ పద్మగా మారింది.పద్మ పురస్కారాలు బహూకరించే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రజలు తమను తాము నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. 2014తో పోలిస్తే ఈసారి 28 రెట్లు ఎక్కువ నామినేషన్లు రావడానికి ఇదే కారణం. పద్మ పురస్కారాల ప్రతిష్ఠ, విశ్వసనీయత, గౌరవం ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని ఇది తెలియజేస్తుంది. పద్మ పురస్కారాలు పొందిన వారందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! ప్రతి జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి జన్మించారు. ఇందుకోసం ప్రజలు తమ విధులను పూర్తి భక్తితో నిర్వహిస్తారు. కొంత మంది సామాజిక సేవ ద్వారా, మరికొందరు సైన్యంలో చేరి, మరికొందరు తరువాతి తరానికి బోధిస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం మనం చూశాం. కానీ, మిత్రులారా! జీవితం ముగిసిన తర్వాత కూడా సామాజిక జీవితం పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించే వారు మన మధ్య ఉన్నారు. దీనికి వారి మాధ్యమం అవయవ దానం. ఇటీవలి సంవత్సరాల్లో మరణానంతరం అవయవాలను దానం చేసిన వారు దేశంలో వెయ్యి మందికి పైగా ఉన్నారు. ఈ నిర్ణయం అంత సులభం కాదు. కానీ ఈ నిర్ణయం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. తమ ప్రియమైనవారి చివరి కోరికలను గౌరవించిన కుటుంబాలను కూడా నేను అభినందిస్తాను. దేశంలోని అనేక సంస్థలు కూడా ఈ దిశగా చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు అవయవ దానం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు అవయవాలు దానం చేయడానికి ఇష్టపడే వ్యక్తుల వివరాలను నమోదు చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాల వల్ల దేశంలో అవయవదానం పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ప్రజల ప్రాణాలను ఈ అవయవదానం  కాపాడుతోంది.

నా ప్రియమైన దేశప్రజలారా! రోగుల జీవితాన్ని సులభతరం చేసి, వారి సమస్యలను తగ్గించే విషయంలో భారతదేశం సాధించిన విజయాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నాను. చికిత్స కోసం ఆయుర్వేదం, సిద్ధ లేదా యునాని వైద్య విధానాల నుండి సహాయం పొందే అనేక మంది వ్యక్తులు మీలో ఉంటారు. కానీ ఇలాంటి రోగులు అదే వైద్య విధానాన్ని అవలంబించే మరో వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ వైద్య విధానాల్లో వ్యాధులు, చికిత్సలు, మందుల పేర్లకు ఒకే భాష ఉపయోగించరు. ప్రతి వైద్యుడు తనదైన  మార్గంలో వ్యాధి పేరు, చికిత్స  పద్ధతులను రాస్తారు. ఇది కొన్నిసార్లు ఇతర వైద్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదం, సిద్ధ, యునాని వైద్య విధానాలకు సంబంధించిన డేటాను, పదజాలాన్ని వర్గీకరించిందని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. ఇద్దరి కృషి వల్ల ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్య విధానాల్లో వ్యాధి, చికిత్సకు సంబంధించిన పదజాలాన్ని కోడింగ్ చేశారు. ఈ కోడింగ్ సహాయంతో ఇప్పుడు వైద్యులందరూ తమ ప్రిస్క్రిప్షన్‌లు లేదా స్లిప్పులపై ఒకే భాషను రాస్తారు. ఇందులో ఒక ప్రయోజనం ఏమిటంటే మీరు ఆ స్లిప్‌తో మరొక వైద్యుడి వద్దకు వెళితే, ఆ స్లిప్ నుండే వైద్యుడికి దాని గురించి పూర్తి సమాచారం లభిస్తుంది. ఆ స్లిప్ మీ అనారోగ్యం, చికిత్స, మీరు ఏ మందులు తీసుకుంటున్నారు, చికిత్స ఎంతకాలంగా కొనసాగుతోంది, మీకు ఏ పదార్థాల అలెర్జీ ఉంది – మొదలైన విషయాలు  తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. దీనివల్ల పరిశోధకులకు కూడా మరో ప్రయోజనం కలుగుతుంది. ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా వ్యాధి, మందులు , వాటి ప్రభావాల గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు. పరిశోధనలు పెరిగి అనేక మంది శాస్త్రవేత్తలు ఒకచోట చేరితే, ఈ వైద్య విధానాలు మెరుగైన ఫలితాలను ఇస్తాయి. వాటి పట్ల ప్రజల మొగ్గు పెరుగుతుంది. ఈ ఆయుష్ విధానాలతో అనుబంధం ఉన్న మన వైద్యులు వీలైనంత త్వరగా ఈ కోడింగ్‌ని స్వీకరిస్తారని నేను విశ్వసిస్తున్నాను.

నా స్నేహితులారా! నేను ఆయుష్ వైద్య విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు యానుంగ్ జామోహ్ లెగో చిత్రం నా కళ్ల ముందు కదలాడుతోంది. శ్రీమతి యానుంగ్ అరుణాచల్ ప్రదేశ్ నివాసి. మూలికా ఔషధ నిపుణురాలు. ఆదివాసుల సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. ఈ కృషికి గాను ఈసారి ఆమెకు పద్మ అవార్డు కూడా లభించింది. అదేవిధంగా ఈసారి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హేమ్‌చంద్ మాంఝీ కూడా పద్మ పురస్కారాన్ని పొందారు. వైద్యరాజ్ హేమ్‌చంద్ మాంఝీ ఆయుష్  వైద్య విధానం సహాయంతో ప్రజలకు చికిత్స చేస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో 5 దశాబ్దాలకు పైగా పేద రోగులకు సేవలందిస్తున్నారు. మన దేశంలో నిక్షిప్తమైన ఆయుర్వేదం, మూలికా ఔషధాల నిధిని కాపాడడంలో శ్రీమతి యానుంగ్, హేమ్‌చంద్ జీ వంటి వారి పాత్ర చాలా ఉంది.

నా ప్రియమైన దేశప్రజలారా! ‘మన్ కీ బాత్’ ద్వారా మన మధ్య ఉన్న సంబంధానికి దశాబ్ద కాలం పూర్తయింది. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ యుగంలో కూడా మొత్తం దేశాన్నిఅనుసంధానించేందుకు శక్తివంతమైన మాధ్యమం రేడియో. రేడియో శక్తి ఎంత పరివర్తన తీసుకువస్తుందో చెప్పడానికి ఛత్తీస్‌గఢ్‌లో ఒక ప్రత్యేక ఉదాహరణ కనిపిస్తుంది. జనాదరణ పొందిన ఒక కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా ఇక్కడ రేడియోలో ప్రసారమవుతోంది. దాని పేరు 'హమర్ హాథీ - హమర్ గోఠ్'. ఈ పేరు వినగానే రేడియోకి, ఏనుగుకి మధ్య సంబంధం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది రేడియో ప్రత్యేకత. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు ఆకాశవాణి కేంద్రాలు-  అంబికాపూర్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, రాయ్‌గఢ్ ల నుండి ప్రసారమవుతుంది. ఛత్తీస్‌గఢ్, దాని చుట్టుపక్కల అడవుల్లో నివసించే ప్రజలు ఈ కార్యక్రమాన్ని చాలా ఆసక్తిగా వింటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏనుగుల గుంపు అడవిలోని ఏ ప్రాంతం గుండా వెళుతుందో ‘హమర్ హాథీ - హమర్ గోఠ్’ కార్యక్రమంలో చెప్తారు. ఈ సమాచారం ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏనుగుల గుంపు వచ్చినట్లు రేడియో ద్వారా సమాచారం అందిన వెంటనే ప్రజలు అప్రమత్తమవుతారు. ఏనుగులు  సంచరించే మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఇలా తప్పుతోంది. ఒక వైపు ఇది ఏనుగుల గుంపుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మరోవైపు ఇది ఏనుగుల గురించి డేటాను సేకరించడంలో సహాయపడుతుంది. ఈ డేటా వినియోగం భవిష్యత్తులో ఏనుగుల సంరక్షణకు కూడా సహాయపడుతుంది. ఇక్కడ ఏనుగులకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకు చేరవేస్తున్నారు. దీంతో అటవీ పరిసరాల్లో నివసించే ప్రజలకు ఏనుగుల బెడదను తట్టుకోవడం సులువుగా మారింది. దేశంలోని ఇతర అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఛత్తీస్‌గఢ్  ప్రదర్శించిన ఈ ప్రత్యేక చొరవను, ఆ అనుభవాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈ జనవరి 25వ తేదీన మనమందరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నాం. మన ఉజ్వల ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఇది ముఖ్యమైన రోజు. ప్రస్తుతం దేశంలో దాదాపు 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఎంత పెద్దదో తెలుసా? ఇది అమెరికా మొత్తం జనాభాకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇది మొత్తం ఐరోపా జనాభా కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ప్రస్తుతం దేశంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య దాదాపు పదిన్నర లక్షలకు చేరింది. భారతదేశంలోని ప్రతి పౌరుడు ప్రజాస్వామిక హక్కును వినియోగించుకునేలా చేయడానికి, మన ఎన్నికల సంఘం కేవలం ఒకే ఓటరు ఉన్న ప్రదేశాల్లో కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దేశంలో ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ఎన్నికల సంఘాన్ని నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా! ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఓటింగ్ శాతం తగ్గుతుండగా, భారతదేశంలో ఓటింగ్ శాతం పెరగడం దేశానికి ఉత్సాహాన్ని కలిగించే విషయం. 1951-52లో దేశంలో తొలిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 45 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడమే కాకుండా ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మన యువ ఓటర్ల నమోదుకు మరిన్ని అవకాశాలు లభించేలా ప్రభుత్వం చట్టంలో కూడా మార్పులు చేసింది. ఓటర్లలో అవగాహన పెంచడానికి సమాజ స్థాయిలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. కొన్నిచోట్ల  ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని ఓటర్లకు చెప్తున్నారు. కొన్నిచోట్ల పెయింటింగ్స్‌ వేస్తూ, మరికొన్ని చోట్ల వీధినాటకాల ద్వారా యువతను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి ప్రతి ప్రయత్నమూ మన ప్రజాస్వామ్య వేడుకలకు రకరకాల వర్ణాలను అందిస్తోంది. మొదటి సారి ఓటర్లుగా నమోదయ్యే అర్హత పొందిన యువత ఓటరు జాబితాలో తమ పేర్లను తప్పకుండా చేర్చుకోవాలని ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా సూచిస్తున్నాను.  నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. మీ ఒక్క ఓటు దేశ సౌభాగ్యాన్ని మార్చగలదని, దేశ భవితవ్యాన్ని రూపొందించగలదని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజు జనవరి 28వ తేదీ వివిధ కాలాల్లో దేశభక్తికి ఉదాహరణగా నిలిచిన భారతదేశానికి చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి కూడా. పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ జీకి నేడు దేశం నివాళులు అర్పిస్తోంది. లాలా జీ స్వాతంత్ర్య పోరాట యోధులు. పరాయి పాలన నుండి మనల్ని విముక్తి చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేశారు. లాలాజీ వ్యక్తిత్వం కేవలం స్వాతంత్ర్య పోరాటానికే పరిమితం కాదు. ఆయన చాలా దూరదృష్టి గలవారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, అనేక ఇతర సంస్థల ఏర్పాటులో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. విదేశీయులను దేశం నుండి బహిష్కరించడం మాత్రమే ఆయన లక్ష్యం కాదు. దేశానికి ఆర్థిక దృఢత్వాన్ని అందించాలనే దృక్కోణం కూడా ఆయన ఆలోచనల్లో ముఖ్యమైన భాగం. ఆయన ఆలోచనలు, త్యాగం భగత్ సింగ్‌ను బాగా ప్రభావితం చేశాయి. ఈరోజు ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కరియప్ప గారికి భక్తితో శ్రద్దాంజలి సమర్పించే రోజు కూడా. చరిత్రలో ముఖ్యమైన కాలంలో మన సైన్యాన్ని నడిపించడం ద్వారా ధైర్య సాహసాలకు ఆయన ఉదాహరణగా నిలిచారు. మన సైన్యాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

నా ప్రియమైన దేశప్రజలారా! నేడు భారతదేశం క్రీడా ప్రపంచంలో ప్రతిరోజు కొత్త శిఖరాలను అందుకుంటోంది. క్రీడా ప్రపంచంలో పురోగమించేందుకు  ఆటగాళ్లు వీలైనన్ని ఎక్కువ అవకాశాలను పొందడం, దేశంలో ఉత్తమస్థాయి  క్రీడా పోటీల నిర్వహణ చాలా ముఖ్యం. ఈ ఆలోచనతో నేడు భారతదేశంలో కొత్త టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశంలోని 5 వేల మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ రోజు భారతదేశంలో ఇటువంటి కొత్త వేదికలు నిరంతరం ఏర్పాటవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. వీటిలో క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని పొందుతున్నారు. అటువంటి ఒక వేదికే బీచ్ గేమ్స్ కు సంబంధించింది. వీటిని డయ్యూలో నిర్వహించారు. సోమనాథ్‌ కు సమీపంలో ఉండే 'డయ్యూ' కేంద్రపాలిత ప్రాంతమని మీకు తెలుసు. రోడ్డు సమీపంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే డయ్యూలో ఈ బీచ్ గేమ్స్ నిర్వహించారు. ఇవి భారతదేశంలో   మొట్టమొదటి మల్టీ-స్పోర్ట్స్ బీచ్ క్రీడలు. వీటిలో టగ్ ఆఫ్ వార్, సీ స్విమ్మింగ్, పెన్కాక్సిలత్,  మల్ల ఖంబ్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సాకర్ , బీచ్ బాక్సింగ్ వంటి పోటీలు ఉన్నాయి. ఇందులో ప్రతి క్రీడాకారుడు తమ ప్రతిభను ప్రదర్శించడానికి పుష్కలంగా అవకాశం పొందారు. ఈ టోర్నమెంటులో చాలా మంది క్రీడాకారులు సముద్రంతో సంబంధం లేని రాష్ట్రాల నుండి వచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ టోర్నమెంటులో సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్ అత్యధిక పతకాలు సాధించింది. క్రీడల పట్ల ఉన్న ఈ ఉత్సాహమే ఏ దేశాన్నైనా క్రీడా ప్రపంచంలో రారాజుగా నిలుపుతుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి 'మన్ కీ బాత్' విశేషాలింతే.  ఫిబ్రవరిలో మళ్ళీ మీతో మాట్లాడతాను. దేశంలోని ప్రజల సామూహిక, వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా దేశం ఎలా పురోగమిస్తుందనే దానిపై దృష్టి ఉంటుంది. మిత్రులారా! రేపు 29వ తేదీ ఉదయం 11 గంటలకు 'పరీక్షా పే చర్చా' కూడా ఉంటుంది. ఇది ‘పరీక్ష పే చర్చా’ 7వ ఎడిషన్. నేను ఎప్పుడూ ఎదురుచూసే కార్యక్రమమిది. ఇది విద్యార్థులతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తుంది. వారిలో  పరీక్షల సంబంధిత ఒత్తిడిని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తాను. గత 7 సంవత్సరాలుగా 'పరీక్ష పే చర్చా' చదువు, పరీక్షలకు సంబంధించిన వివిధ సమస్యలపై సంభాషించడానికి ఒక వేదికగా మారింది. ఈసారి 2. కోట్ల 25 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం కోసం నమోదు చేసుకోవడంతో పాటు తమ ఇన్‌పుట్‌లను కూడా అందించడం సంతోషంగా ఉంది. మొదట 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఈ సంఖ్య 22,000 మాత్రమే. విద్యార్థులను ప్రేరేపించడానికి, పరీక్ష ఒత్తిడి గురించి అవగాహన కల్పించడానికి అనేక వినూత్న ప్రయత్నాలు కూడా జరిగాయి. మీ అందరూ, ముఖ్యంగా యువత, విద్యార్థులు రేపు రికార్డు సంఖ్యలో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను. మీతో మాట్లాడడం నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాటలతో నేను ‘మన్ కీ బాత్’ ఈ భాగంలో మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. త్వరలో మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.