నా ప్రియమైన కుటుంబసభ్యులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉన్న తరుణంలో ఈ ఎపిసోడ్ జరుగుతోంది. రాబోయే అన్ని పండుగలకు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.
మిత్రులారా! ఈ పండుగల ఉత్సాహం మధ్య ఢిల్లీ నుండి వచ్చిన ఒక వార్తతో ఈసారి మన్ కీ బాత్ ను ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ నెల మొదట్లో గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఖాదీ అమ్మకాలు జరిగాయి. ఇక్కడి కన్నాట్‌ప్లేస్‌లో ఒకే ఒక్క ఖాదీ స్టోర్‌లో కేవలం ఒక్కరోజులోనే ఒకటిన్నర కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో జరుగుతున్న ఖాదీ మహోత్సవ్ పాత అమ్మకాల రికార్డులన్నింటినీ మరోసారి బద్దలు కొట్టింది. మీరు ఇంకో విషయం తెలుసుకుంటే ఇంకా సంతోషిస్తారు. పదేళ్ల కిందట దేశంలో ఖాదీ ఉత్పత్తుల విక్రయం దాదాపు 30 వేల కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు కోట్లకు చేరుతోంది. ఖాదీ అమ్మకాలు పెరగడం అంటే దాని ప్రయోజనాలు నగరం నుండి గ్రామం వరకు సమాజంలోని వివిధ వర్గాలకు చేరుతున్నట్టు అర్థం. మన చేనేత కార్మికులు, హస్తకళా కళాకారులు, మన రైతులు, ఆయుర్వేద మొక్కలు నాటుతున్న కుటీర పరిశ్రమల వారు- ఇలా ప్రతి ఒక్కరూ ఈ అమ్మకాల ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇది 'వోకల్ ఫర్ లోకల్' ఉద్యమ బలం. మన దేశవాసులైన మీ అందరి మద్దతు క్రమంగా పెరుగుతోంది.
మిత్రులారా! ఈ రోజు నేను మీకు మరో అభ్యర్థనను పునరావృతం చేయాలనుకుంటున్నాను. నేను దాన్ని చాలా పట్టుదలతో పునరావృతం చేయాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పర్యటనకు వెళితే, తీర్థయాత్రలకు వెళితే, అక్కడి స్థానిక కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులనే తప్పకుండా కొనండి. మీరు మీ ప్రయాణంలోని మొత్తం బడ్జెట్‌లో ముఖ్యమైన ప్రాధాన్యతగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం కొనసాగించండి. అది 10 శాతం అయినా, 20 శాతం అయినా- మీ బడ్జెట్ అనుమతించినంత వరకు మీరు దానిని స్థానిక ఉత్పత్తుల కోసమే ఖర్చు చేయాలి. అక్కడ మాత్రమే ఖర్చు చేయాలి.
మిత్రులారా! ఎప్పటిలాగానే ఈసారి కూడా మన పండుగలలో మన 'వోకల్ ఫర్ లోకల్' ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం కలిసి ఆ కలను నెరవేర్చుకుందాం. మన కల ‘స్వయం సమృద్ధ భారతదేశం'. ఈ సారి నా దేశవాసుల్లో ఒకరి స్వేద సుగంధం, నా దేశ యువకుడి ప్రతిభ మిళితమై దాని తయారీలో నా దేశవాసులకు ఉపాధి కల్పించిన ఉత్పత్తితో మాత్రమే ఇంటిని వెలిగిద్దాం. రోజువారీ జీవితంలో అవసరమైనప్పుడల్లా మనం స్థానిక ఉత్పత్తులనే కొనాలి. అయితే మీరు మరొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 'వోకల్ ఫర్ లోకల్' భావన కేవలం పండుగ షాపింగ్‌కి మాత్రమే పరిమితం కాదు. కొందరు దీపావళికి దీపాలు కొని సోషల్ మీడియాలో 'వోకల్ ఫర్ లోకల్' అని పోస్ట్ చేయడం నేను చూశాను. అది కేవలం ప్రారంభం మాత్రమే. మనం చాలా ముందుకు సాగాలి. జీవితంలో అవసరపడే అన్ని వస్తువులు ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. ఈ దృక్కోణం కేవలం చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారుల నుండి వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అవతరిస్తోంది. చాలా పెద్ద బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తున్నాయి. మనం ఆ ఉత్పత్తులను మనవిగా చేసుకుంటే మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం దొరుకుతుంది. అలాగే, మనం 'లోకల్ కోసం వోకల్'గా ఉండాలి. అవును.. అటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు మన దేశానికి గర్వకారణమైన యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేయాలి. దీన్ని జీవితంలో అలవాటు చేసుకోండి. ఆ ఉత్పత్తితో లేదా ఆ కళాకారుడితో సెల్ఫీ దిగి నమో యాప్ లో నాతో పంచుకోండి - అది కూడా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ నుండి సెల్ఫీని షేర్ చేయండి. ఇతర వ్యక్తులు కూడా 'వోకల్ ఫర్ లోకల్'కు ప్రేరణ పొందేలా నేను ఆ పోస్టుల్లో కొన్నింటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాను.
మిత్రులారా! భారతదేశంలో తయారు చేసిన, భారతీయులు తయారు చేసిన ఉత్పత్తులతో దీపావళి కాంతులు తెచ్చుకుంటే; మీ కుటుంబ ప్రతి చిన్న అవసరాన్ని స్థానిక ఉత్పత్తులతో తీర్చుకున్నప్పుడు దీపావళి వెలుగులు మరింత పెరుగుతాయి. ఆ కళాకారుల జీవితాల్లో ఒక కొత్త దీపావళి వస్తుంది. కొత్త జీవితం ఉదయిస్తుంది. వారి జీవితం అద్భుతంగా మారుతుంది. భారతదేశాన్ని స్వావలంబనగా మార్చండి. 'మేక్ ఇన్ ఇండియా' ఎంపికను కొనసాగించండి, అలా చేస్తే మీతో పాటు కోట్లాది మంది దేశప్రజల దీపావళి అద్భుతంగా, ఉల్లాసంగా, ప్రకాశవంతంగా, ఆసక్తికరంగా మారుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! అక్టోబర్ 31 మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మనం మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకుంటాం. భారతీయులమైన మనం అనేక కారణాల వల్ల ఆయనను స్మరించుకుంటాం. నివాళులర్పిస్తాం. అతిపెద్ద కారణం- దేశంలోని 580 కంటే అధిక సంఖ్యలో రాచరిక రాష్ట్రాలను, సంస్థానాలను అనుసంధానించడంలో ఆయన పాత్ర సాటిలేనిది. ప్రతి ఏడాది అక్టోబర్ 31వ తేదీన గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఐక్యతా దినోత్సవానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమం జరుగుతుందని మనకు తెలుసు. దీంతోపాటు ఈసారి ఢిల్లీలోని కర్తవ్య పథ్ దగ్గర అత్యంత ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రతి గ్రామం నుండి, ప్రతి ఇంటి నుండి మట్టిని సేకరించాలని నేను ఈమధ్య కోరిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి మట్టిని సేకరించి, కలశంలో ఉంచి, అనంతరం అమృత కలశ యాత్రలు నిర్వహించారు. దేశంలోని నలుమూలల నుంచి సేకరించిన ఈ మట్టితో వేలాది అమృత కలశ యాత్రలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంటున్నాయి. ఇక్కడ ఢిల్లీలో ఆ మట్టిని విశాల భారత కలశంలో వేసి, ఈ పవిత్ర మట్టితో ఢిల్లీలో ‘అమృత వాటిక’ నిర్మిస్తారు. ఇది దేశ రాజధాని నడిబొడ్డున అమృత్ మహోత్సవ భవ్య వారసత్వంగా నిలిచిపోతుంది. దేశవ్యాప్తంగా గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న స్వాతంత్య్ర అమృత మహోత్సవం అక్టోబర్ 31న ముగుస్తుంది. మీరందరూ కలిసి దీన్ని ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పండుగలలో ఒకటిగా మార్చారు. సైనికులను సన్మానించడమైనా, ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం అయినా స్వాతంత్ర్య అమృత మహోత్సవంలో ప్రజలు తమ స్థానిక చరిత్రకు కొత్త గుర్తింపును ఇచ్చారు. ఈ కాలంలో సమాజ సేవకు అద్భుతమైన ఉదాహరణలు కూడా కనిపించాయి.
మిత్రులారా! ఈ రోజు నేను మీకు మరో శుభవార్త చెప్తున్నాను. ముఖ్యంగా దేశం కోసం ఏదైనా చేయాలనే అభిరుచి, కలలు, సంకల్పం ఉన్న నా యువతీ యువకులకు ఈ శుభవార్త చెప్తున్నాను. ఈ శుభవార్త భారతదేశ ప్రజల కోసం. కానీ నా యువ మిత్రులారా! ఇది మీకు ప్రత్యేకమైంది. కేవలం రెండు రోజుల తర్వాత- అక్టోబర్ 31వ తేదీన చాలా పెద్ద దేశవ్యాప్త సంస్థకు పునాది పడుతోంది. అది కూడా సర్దార్ సాహెబ్ జయంతి రోజున. ఈ సంస్థ పేరు – మేరా యువ భారత్... అంటే MYBharat. MYBharat సంస్థ భారతదేశంలోని యువతకు వివిధ దేశ నిర్మాణ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించే అవకాశాన్ని కల్పిస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో భారతదేశ యువశక్తిని ఏకం చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం. మేరా యువ భారత్ వెబ్‌సైట్ MYBharat కూడా ప్రారంభం అవుతుంది. నేను యువతను కోరుతున్నాను. పదే పదే కోరుతున్నాను. నా దేశ నవ యువతీ యువకులారా! MYBharat.Gov.inలో నమోదు చేసుకోండి. వివిధ కార్యక్రమాల కోసం సైన్ అప్ చేయండి. అక్టోబర్ 31వ తేదీన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి పుణ్య తిథి కూడా. ఇందిరాగాంధీ గారికి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా! మన సాహిత్యం ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ భావనను మరింతగా పెంచే ఉత్తమ మాధ్యమాలలో ఒకటి. తమిళనాడుకు చెందిన అద్భుతమైన వారసత్వానికి సంబంధించి రెండు ఉత్తేజకరమైన ప్రయత్నాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రముఖ తమిళ రచయిత్రి- సోదరి శివశంకరి గారి గురించి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. ఆమె ‘నిట్ ఇండియా- త్రూ లిటరేచర్’ అనే ఒక ప్రాజెక్ట్ చేశారు. దాని అర్థం సాహిత్యం ద్వారా దేశాన్ని అల్లడం, అనుసంధానించడం. ఆమె గత 16 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె 18 భారతీయ భాషలలో రాసిన సాహిత్యాన్ని అనువదించారు. వివిధ రాష్ట్రాల రచయితలు, కవులను ఇంటర్వ్యూ చేసేందుకు వీలయ్యేలా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, ఇంఫాల్ నుండి జైసల్మేర్ వరకు దేశవ్యాప్తంగా అనేక సార్లు పర్యటించారు. శివశంకరీ గారు వివిధ ప్రాంతాలకు వెళ్లి వాటిని ట్రావెల్ కామెంటరీ- ప్రయాణ వ్యాఖ్యానంతో పాటు ప్రచురించారు. ఇది తమిళ, ఆంగ్ల భాషల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు పెద్ద సంపుటాలు ఉన్నాయి. ప్రతి సంపుటిని భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలకు అంకితమిచ్చారు. ఆమె సంకల్ప శక్తికి నేను గర్వపడుతున్నాను.
మిత్రులారా! కన్యాకుమారికి చెందిన తిరు ఎ. పెరుమాళ్ గారి పని కూడా చాలా స్ఫూర్తిదాయకం. తమిళనాడు కథాకథన సంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆయన ప్రశంసనీయమైన పని చేశారు. ఆయన గత 40 సంవత్సరాలుగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇందుకోసం తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళతారు. అక్కడి జానపద కళారూపాలను అన్వేషిస్తారు. వాటిని తన పుస్తకంలో భాగం చేసుకుంటారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 100 పుస్తకాలు రాశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కాకుండా పెరుమాళ్ గారికి మరో అభిరుచి కూడా ఉంది. తమిళనాడులోని ఆలయ సంస్కృతిపై పరిశోధన చేయడం ఆయనకు ఇష్టం. అక్కడి స్థానిక జానపద కళాకారులకు ప్రయోజనం కలిగిస్తున్న తోలుబొమ్మలపై కూడా ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. శివశంకర్ గారు, ఎ.కె. పెరుమాళ్ గారు చేస్తున్న కృషి అందరికీ ఆదర్శం. భారతదేశం తన సంస్కృతిని కాపాడుకోవడానికి జరిగే ఇటువంటి ప్రతి ప్రయత్నం పట్ల గర్విస్తుంది, ఇది మన జాతీయ ఐక్యతను బలోపేతం చేయడమే కాకుండా దేశం పేరును, దేశ గౌరవాన్ని పెంచుతుంది.
నా కుటుంబ సభ్యులారా! దేశం యావత్తూ నవంబర్ 15వ తేదీన ఆదివాసీ గౌరవ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ దినోత్సవం భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని సూచిస్తుంది. భగవాన్ బిర్సా ముండా మన అందరి హృదయాలలో ఉన్నారు. అసలైన ధైర్యం అంటే ఏమిటో, సంకల్ప శక్తి విషయంలో స్థిరంగా ఉండటం అంటే ఏమిటో మనం ఆయన జీవితం నుండి నేర్చుకోవచ్చు. ఆయన ఎప్పుడూ పరాయి పాలనను అంగీకరించలేదు. అన్యాయానికి ఆస్కారం లేని సమాజాన్ని ఆయన కోరుకున్నారు. ప్రతి వ్యక్తి గౌరవం, సమానత్వంతో కూడిన జీవితాన్ని పొందాలన్నారు. భగవాన్ బిర్సా ముండా ఎల్లప్పుడూ ప్రకృతితో సామరస్యంగా జీవించడాన్ని నొక్కి చెప్పారు. నేటికీ మన ఆదివాసీ సోదరులు, సోదరీమణులు ప్రకృతి పట్ల బాధ్యతగా ప్రకృతి పరిరక్షణకు అన్ని విధాలుగా అంకితభావంతో ఉన్నారని మనం చూడవచ్చు. ఆదివాసీ సోదర సోదరీమణుల ఈ పని మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.
మిత్రులారా! రేపు అంటే అక్టోబర్ 30వ తేదీ గోవింద్ గురు గారి పుణ్యతిథి కూడా. గుజరాత్, రాజస్థాన్‌లోని ఆదివాసీలు, అణగారిన వర్గాల జీవితాల్లో గోవింద్ గురు జీకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గోవింద్ గురు జీకి కూడా నా నివాళులర్పిస్తున్నాను. నవంబర్ నెలలో మేము మాన్ గఢ్ ఊచకోత వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. ఆ ఊచకోతలో అమరులైన భారతమాత బిడ్డలందరికీ నేను వందనం సమర్పిస్తున్నాను.
మిత్రులారా! భారతదేశ ఆదివాసీ యోధులది గొప్ప చరిత్ర. అన్యాయానికి వ్యతిరేకంగా తిల్కా మాంఝీ శంఖారావం చేసింది ఈ భారత భూమిపైనే. ఈ భూమి నుండే సిద్ధో-కణ్హు సమానత్వ వాణిని వినిపించారు. ప్రజా యోధుడు టంట్యా భిల్ మన గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాం. అమరవీరుడు వీర్ నారాయణ్ సింగ్‌ను భక్తితో స్మరించుకుంటాం. వారు క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచారు. వీర్ రామ్‌జీ గోండ్, వీర్ గుండాధూర్, భీమా నాయక్ -- వీరి ధైర్యం ఇప్పటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. గిరిజన సోదర సోదరీమణుల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈశాన్య ప్రాంతాలకు చెందిన కియాంగ్ నోబాంగ్, రాణి గైడిన్ ల్యూ వంటి స్వాతంత్ర్య సమరయోధుల నుండి కూడా మనకు చాలా ప్రేరణ లభిస్తుంది. రాజమోహినీ దేవి, రాణి కమలపాటి లాంటి వీరాంగనలు దేశానికి లభించింది ఆదివాసీ సమాజం నుంచే. ఆదివాసీ సమాజానికి స్ఫూర్తినిచ్చిన రాణి దుర్గావతి గారి 500వ జయంతిని దేశం ప్రస్తుతం జరుపుకుంటోంది. దేశంలోని మరింత మంది యువత తమ ప్రాంతంలోని గిరిజన వీరుల గురించి తెలుసుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. దేశం ఆత్మగౌరవాన్ని, ప్రగతిని ఎల్లప్పుడూ ప్రధానమైనదిగా భావించిన ఆదివాసీ సమాజం పట్ల దేశం కృతజ్ఞతతో ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ పండుగల సమయంలో దేశంలో క్రీడా పతాకం కూడా రెపరెపలాడుతోంది. ఇటీవల ఆసియా క్రీడల తర్వాత పారా ఆసియా క్రీడల్లో కూడా భారత క్రీడాకారులు అద్భుతమైన విజయాలు సాధించారు. ఈ క్రీడల్లో భారత దేశం 111 పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. పారా ఏషియన్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! నేను మీ దృష్టిని స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ వైపు
తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ క్రీడలు బెర్లిన్‌లో జరిగాయి. ఇంటలెక్చువల్ డిసెబిలిటీ ఉన్న మన క్రీడాకారుల్లోని సామర్థ్యాన్ని బయటికి తెచ్చేందుకు ఈ పోటీ ఒక అద్భుతమైన అవకాశం. ఈ పోటీలో భారత జట్టు 75 బంగారు పతకాలతో సహా 200 పతకాలు సాధించింది. రోలర్ స్కేటింగ్, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ పతక విజేతల జీవిత ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. గోల్ఫ్‌లో హర్యానాకు చెందిన రణవీర్ సైనీ స్వర్ణ పతకం సాధించారు. చిన్నప్పటి నుంచి ఆటిజంతో బాధపడుతున్న రణ్‌వీర్‌కి గోల్ఫ్‌పై ఉన్న మక్కువను ఏ సవాలు కూడా తగ్గించలేకపోయింది. వారి కుటుంబంలో ఈ రోజు అందరూ గోల్ఫ్ క్రీడాకారులుగా మారారని ఆయన తల్లి కూడా చెప్పింది. పుదుచ్చేరికి చెందిన 16 ఏళ్ల టి-విశాల్ నాలుగు పతకాలు సాధించారు. గోవాకు చెందిన సియా సరోదే పవర్‌లిఫ్టింగ్‌లో 2 బంగారు పతకాలతో సహా నాలుగు పతకాలు సాధించారు. 9 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయిన తర్వాత కూడా ఆమె అధైర్యపడలేదు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన అనురాగ్ ప్రసాద్ పవర్‌లిఫ్టింగ్‌లో మూడు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించారు. సైక్లింగ్‌లో రెండు పతకాలు సాధించిన జార్ఖండ్‌కు చెందిన ఇందు ప్రకాష్‌ది కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం. చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఇందు తన విజయానికి పేదరికాన్ని అడ్డు గోడ కానివ్వలేదు. ఈ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు సాధించిన విజయం ఇంటలెక్చువల్ డిసెబిలిటీ సమస్యను ఎదుర్కొంటున్న ఇతర పిల్లలు, కుటుంబాలకు కూడా స్ఫూర్తినిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన మీ గ్రామంలోని, మీ ఊరి పొరుగు ప్రాంతాలలో ఉన్న పిల్లల వద్దకు మీ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. వారిని అభినందించండి. ఆ పిల్లలతో కొన్ని క్షణాలు గడపండి. మీకు కొత్త అనుభవం కలుగుతుంది. మీరు కూడా వారిని చూసే అవకాశం పొందేంత శక్తిని దేవుడు వారిలో నింపాడు. తప్పకుండా వెళ్ళండి.
నా కుటుంబ సభ్యులారా! మీరందరూ గుజరాత్‌లోని పుణ్యక్షేత్రమైన అంబాజీ ఆలయాన్ని గురించి తప్పక విని ఉంటారు. ఇది ఒక మహిమగల శక్తిపీఠం. మా అంబే దర్శనం చేసుకోవడానికి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారు. ఇక్కడి గబ్బర్ పర్వతానికి వెళ్లే మార్గంలో మీరు వివిధ రకాల యోగా భంగిమలు, ఆసనాల ప్రతిమలు కనిపిస్తాయి. ఈ విగ్రహాల ప్రత్యేకత ఏంటో తెలుసా? నిజానికి వీటిని చెత్తతో తయారు చేస్తారు. చెత్తతో చేసిన ఈ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ విగ్రహాలను చెత్తలో పడేసిన పాత వస్తువులతో తయారయ్యాయి. అంబాజీ శక్తి పీఠంలో అమ్మవారి దర్శనంతో పాటు ఈ విగ్రహాలు కూడా భక్తులకు ఆకర్షణ కేంద్రాలుగా మారాయి. ఈ ప్రయత్నం విజయం పొందడం చూసి నా మనసులో ఒక ఆలోచన కూడా వస్తోంది. వ్యర్థపదార్థాలతో ఇలాంటి కళాఖండాలను తయారు చేసేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి గుజరాత్ ప్రభుత్వం ఒక పోటీని ప్రారంభించి, అలాంటి వారిని ఆహ్వానించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రయత్నం గబ్బర్ పర్వతం ఆకర్షణను పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా 'వేస్ట్ టు వెల్త్' ప్రచారానికి ప్రజలను ప్రేరేపిస్తుంది.
మిత్రులారా! స్వచ్ఛ భారత్, 'వేస్ట్ టు వెల్త్' విషయాలకు వస్తే దేశంలోని ప్రతి మూల నుండి మనకు లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. అస్సాంలోని కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో అక్షర్ ఫోరమ్ అనే పాఠశాల పిల్లలలో స్థిరమైన అభివృద్ధి భావనలను పెంపొందించే పనిని నిరంతరం చేస్తోంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ప్రతి వారం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు, ఇటుకలు, కీ చైన్ల వంటి పర్యావరణ అనుకూల వస్తువులను తయారు చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. ఇక్కడ విద్యార్థులకు రీసైక్లింగ్, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఉత్పత్తులను తయారు చేయడం కూడా నేర్పిస్తారు. చిన్న వయస్సులోనే పర్యావరణం పట్ల ఈ అవగాహన ఈ పిల్లలను దేశం పట్ల కర్తవ్యనిష్ట ఉన్న పౌరులుగా మార్చడంలో చాలా దోహదపడుతుంది.
నా కుటుంబ సభ్యులారా! ఈ రోజు మనం మహిళా శక్తిని చూడలేని ప్రాంతం లేదు. వారు సాధించిన విజయాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న ఈ కాలంలో- చరిత్రలోని బంగారు పుటల్లో నిలిచిపోయిన -భక్తి శక్తిని చాటిన ఓ మహిళా సాధువును కూడా మనం స్మరించుకోవాలి. ఈ సంవత్సరం దేశం సంత్ మీరాబాయి 525వ జయంతి వేడుకలను జరుపుకుంటోంది. ఆమె అనేక కారణాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయక శక్తిగా ఉంది. ఎవరికైనా సంగీతం పట్ల ఆసక్తి ఉంటే సంగీతం పట్ల అంకితభావానికి ఆమె గొప్ప ఉదాహరణ. ఎవరైనా కవితా ప్రియులైతే, భక్తిరసంలో ముంచే మీరాబాయి భజనలు అలౌకిక ఆనందాన్ని ఇస్తాయి. ఎవరైనా దైవిక శక్తిని విశ్వసిస్తే అప్పుడు మీరాబాయి- శ్రీ కృష్ణునిలో లీనం కావడం వారికి గొప్ప ప్రేరణగా మారుతుంది. మీరాబాయి సంత్ రవిదాస్‌ని తన గురువుగా భావించింది. ఆమె కూడా చెప్పేది- ‘గురు మిలియా రైదాస్, దీన్హీ జ్ఞాన్ కీ గుట్కీ’ అని. మీరాబాయి ఇప్పటికీ దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆ కాలంలో కూడా ఆమె తన అంతర్గత స్వరాన్ని విని, మూస పద్ధతులకు వ్యతిరేకంగా నిలబడింది. సాధువుగా కూడా ఆమె మనందరికీ స్ఫూర్తినిస్తుంది. దేశం అనేక రకాల దాడులను ఎదుర్కొంటున్నప్పుడు ఆమె భారతీయ సమాజాన్ని, సంస్కృతిని బలోపేతం చేయడానికి ముందుకు వచ్చింది. సరళత, సాధారణ జీవన విధానంలో ఎంత శక్తి ఉందో మీరాబాయి జీవితకాలం నుండి మనకు తెలుసు. నేను సంత్ మీరాబాయికి నమస్కారాలు సమర్పిస్తున్నాను.
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! ఈసారి 'మన్ కీ బాత్'లో ఇంతే! మీ అందరితో చేసే ఈ సంభాషణ నాలో కొత్త శక్తిని నింపుతుంది. మీ సందేశాలలో ఆశాభావం, సానుకూలతకు సంబంధించిన వందలాది కథనాలు నాకు చేరుతున్నాయి. స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని నొక్కి చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని మళ్లీ అభ్యర్థిస్తున్నాను. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయండి. స్థానిక ఉత్పత్తులపై మాట్లాడండి. మీరు మీ ఇళ్లను శుభ్రంగా ఉంచుకున్నట్టే మీ ప్రాంతాన్ని, నగరాన్ని శుభ్రంగా ఉంచండి. మీకు తెలుసా- అక్టోబర్ 31వ తేదీన సర్దార్ సాహెబ్ జయంతిని దేశం ఏకతా దివస్ గా జరుపుకుంటుంది, దేశంలోని అనేక ప్రదేశాలలో ఐక్యత కోసం పరుగు జరుగుతుంది. మీరు కూడా అక్టోబర్ 31వ తేదీన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించండి. మీరు కూడా పెద్ద సంఖ్యలో సంఘటితంగా ఉండి ఐక్యతా సంకల్పాన్ని బలోపేతం చేయాలి. మరోసారి రాబోయే పండుగలకు చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ మీ కుటుంబంతో ఆనందంగా పండుగలు జరుపుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే నా కోరిక. దీపావళి సమయంలో అగ్నిప్రమాదాలు సంభవించేవిధంగా ఎలాంటి పొరపాట్లూ జరగకూడదు. ఒకరి ప్రాణం ప్రమాదంలో ఉంటే మీరు తప్పకుండా కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నెన్నో శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.
On Gandhi Jayanti, Khadi witnessed record sales. #MannKiBaat pic.twitter.com/o3puDNphR0
— PMO India (@PMOIndia) October 29, 2023
Like every time, this time too, during festivals, our priority should be 'Vocal for Local'. #MannKiBaat pic.twitter.com/ZbCiIqBN71
— PMO India (@PMOIndia) October 29, 2023
Tributes to Sardar Vallabhbhai Patel. #MannKiBaat pic.twitter.com/8dcD9kGFho
— PMO India (@PMOIndia) October 29, 2023
Thousands of Amrit Kalash Yatras are now reaching Delhi. The soil will be put in an enormous Bharat Kalash and with this sacred soil, ‘Amrit Vatika’ will be built in Delhi. #MannKiBaat pic.twitter.com/dHDCpZarmL
— PMO India (@PMOIndia) October 29, 2023
MYBharat will provide an opportunity to the youth of India to play an active role in various nation building events. This is a unique effort of integrating the youth power of India in building a developed India. #MannKiBaat pic.twitter.com/lziVSWl2kv
— PMO India (@PMOIndia) October 29, 2023
An inspiring endeavour related to the glorious heritage of Tamil Nadu. #MannKiBaat pic.twitter.com/26hLnTcf0R
— PMO India (@PMOIndia) October 29, 2023
The work of Thiru A. K. Perumal Ji of Kanyakumari is very inspiring. He has done a commendable job of preserving the story telling tradition of Tamil Nadu. #MannKiBaat pic.twitter.com/CO4P55Igyc
— PMO India (@PMOIndia) October 29, 2023
Bhagwaan Birsa Munda’s life exemplifies true courage and unwavering determination. #MannKiBaat pic.twitter.com/cBQ8TtGOKe
— PMO India (@PMOIndia) October 29, 2023
Govind Guru Ji has a very special significance in the lives of the tribal communities of Gujarat and Rajasthan. #MannKiBaat pic.twitter.com/uz1WFhNj9c
— PMO India (@PMOIndia) October 29, 2023
India has a rich history of tribal warriors. #MannKiBaat pic.twitter.com/mwsep9Q9cD
— PMO India (@PMOIndia) October 29, 2023
India has created a history by winning 111 medals in the Para Asian Games. Our country has excelled in Special Olympics World Summer Games as well. #MannKiBaat pic.twitter.com/a4kKWdZ0ih
— PMO India (@PMOIndia) October 29, 2023
Amba Ji Temple is an important Shakti Peeth, where a large number of devotees from India and abroad arrive to have a Darshan.
— PMO India (@PMOIndia) October 29, 2023
On the way to Gabbar Parvat, there are sculptures of various Yoga postures and Asanas. Here is why these sculptures are special... #MannKiBaat pic.twitter.com/1mY167jpCe
A great example of 'Waste to Wealth' from Assam's Kamrup district... #MannKiBaat pic.twitter.com/elfIzOhR0X
— PMO India (@PMOIndia) October 29, 2023
Mirabai is an inspiration for the women of our nation. #MannKiBaat pic.twitter.com/wOOwzpFrUh
— PMO India (@PMOIndia) October 29, 2023