“క్రీడాకారుల అద్భుత కృషివల్ల దక్కిన స్ఫూర్తిదాయక విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో అడుగుపెడుతోంది”;
“క్రీడారంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ \యువతకు క్రీడాకారులు స్ఫూర్తి ప్రదాతలే”;
“ఆలోచనలు… లక్ష్యాలతో మీరందరూ దేశ సమైక్యతను ప్రోదిచేస్తారు.. మన స్వాతంత్ర్య సమరానికీ ఇదో గొప్ప శక్తి”;
“త్రివర్ణ పతాక శక్తి ఎంతటిదో ఉక్రెయిన్‌లో రుజువైంది.. భారతీయులుసహా ఇతర దేశాల పౌరులు యుద్ధ భూమినుంచి బయటపడటంలో ఇదొక రక్షణ కవచమైంది”;
అంతర్జాతీయంగా అద్భుత.. సమగ్ర.. వైవిధ్య.. గతిశీల క్రీడా పర్యావరణ వ్యవస్థ సృష్టి బాధ్యత మనదే.. ప్రతిభకు గుర్తింపు తప్పనిసరిగా దక్కాలి”

   కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ  మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.

   దేశం క్రీడారంగంలో కొన్ని వారాల వ్యవధిలోనే రెండు ప్రధాన విజయాలను సాధించిందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అటు మన క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్‌లో చారిత్రక ప్రతిభా ప్రదర్శన చేస్తే, ఇటు  మన దేశం తొలిసారి చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ-  “మీరందరూ బర్మింగ్‌హామ్‌లో పోటీలలో పాల్గొంటుండగా, మన దేశంలో కోట్లాది  భారతీయులు అర్థరాత్రిదాకా మేల్కొని మీ ప్రతి అడుగునూ ఆస్వాదించారు. మనవాళ్లు పాల్గొనే పోటీల సమాయానికి లేవడం కోసం చాలామంది అలారం పెట్టుకుని నిద్రపోయేవారు. తద్వారా వారు క్రీడాకారుల ప్రతిభా ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసేవారు. అని ప్రధానమంత్రి  పేర్కొన్నారు. క్రీడాకారులకు వీడ్కోలు పలికిన వేళ తానిచ్చిన హామీ ప్రకారం ఇవాళ విజయోత్సవం నిర్వహించుకుంటున్నామని ప్రధాని గుర్తుచేశారు.

   క్రీడాకారుల అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శనను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఇప్పుడు సాధించిన పతకాలు వారి నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో ప్రతిబింబించవని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మనకు లభించిన సంఖ్యతో సమానంగా వెంట్రుకవాసిలో పతకాలు చేజారాయని, ఈ పరిస్థితిని ఎదుర్కొన్న క్రీడాకారులు భవిష్యత్తులో ఆ లోటును భర్తీచేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుపటి క్రీడలతో పోలిస్తే 4 కొత్త క్రీడలలో విజయం సాధించగల మార్గాన్ని భారత్‌ కనుగొన్నదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు లాన్ బౌల్స్ నుంచి అథ్లెటిక్స్ దాకా క్రీడాకారులు అద్భుతంగా రాణించారని కొనియాడారు. ఈ ప్రతిభా ప్రదర్శనతో దేశంలో కొత్త క్రీడ‌లవైపు యువ‌త అధికంగా మొగ్గు చూపుతుందని ప్ర‌ధానమంత్రి అన్నారు. ఇక బాక్సింగ్, జూడో, కుస్తీ పోటీల్లో భరతమాత పుత్రికలు సాధించిన విజయాలు, సీడబ్ల్యూజీ-2022లో వారి ప్రతిభనే కాకుండా ఆధిపత్యాన్ని కూడా నిరూపించాయని ప్రధాని ప్రముఖంగా వివరించారు. ఈ పోటీల్లో తొలిసారి పాల్గొన్న క్రీడాకారులు 31 పతకాలు సాధించడం యువతలో ఆత్మవిశ్వాసం ఇనుమడించడాన్ని సూచిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

   క్రీడాకారులు దేశానికి పతకాలను బహుమతిగా తేవడంద్వారానే కాకుండా గర్వంతో తలెత్తుకుని సంబరాలు చేసుకునేలా ‘ఒకే భారతం – శ్రేష్ట భారతం’ సంకల్పాన్ని మరింత బలోపేతం చేశారని ప్రధానమంత్రి అన్నారు. క్రీడారంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ యువతకు క్రీడాకారులు స్ఫూర్తి ప్రదాతలేనని ప్రధాని అన్నారు. ఈ మేరకు “ఆలోచనలు… లక్ష్యాలతో మీరందరూ దేశ సమైక్యతను ప్రోదిచేస్తారు.. లోగడ మన స్వాతంత్ర్య సమరానికీ ఈ క్రీడాస్ఫూర్తి ఓ గొప్ప శక్తిగా నిలిచింది” అని చెప్పారు. అనేకానేకమంది స్వాతంత్య్ర సమరయోధుల గురించి ప్రస్తావిస్తూ- పద్ధతుల్లో భిన్నత్వం ఉన్నప్పటికీ, వారంతా స్వాతంత్ర్యమే ఉమ్మడి లక్ష్యంగా పోరాడారని ప్రధాని గుర్తుచేశారు. అదేవిధంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడం కోసం మన క్రీడాకారులు మైదానంలో ప్రకాశిస్తారని పేర్కొన్నారు. ఇక  త్రివర్ణ పతాకం శక్తి ఎంతటిదో ఉక్రెయిన్‌లో స్పష్టమైందని, భారతీయులుసహా ఇతర దేశాల పౌరులు యుద్ధ భూమినుంచి బయటపడటంలో ఇదొక రక్షణ కవచంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు.

   ముఖ్యంగా ‘ఖేలో ఇండియా’ వేదిక నుంచి ఆవిర్భవించిన యువ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై అత్యుత్తమంగా రాణించడంపై ప్రధాని సంతోషం వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ‘టాప్స్‌’ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్) సానుకూల ఫలితాలివ్వడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కొత్త ప్రతిభను పసిగట్టి, వారిని తగిన వేదికలకు తీసుకెళ్లే దిశగా మన కృషిని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ మేరకు “అంతర్జాతీయంగా అద్భుత.. సమగ్ర.. వైవిధ్య.. గతిశీల క్రీడా పర్యావరణ వ్యవస్థ సృష్టి బాధ్యత మనదే. ఎక్కడున్నా ప్రతిభకు గుర్తింపు తప్పనిసరి” అని ఆయన స్పష్టం చేశారు. క్రీడాకారుల విజయంలో శిక్షకులు, పాలనాధికారులు, సహాయక సిబ్బంది పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.

   రాబోయే ఆసియా క్రీడ‌లు, ఒలింపిక్స్‌కు స‌న్న‌ద్ధం కావాల్సిందిగా క్రీడాకారులకు ప్ర‌ధానమంత్రి పిలుపునిచ్చారు. కాగా, స్వాతంత్ర్య అమృత మహోత్సవం నేపథ్యంలో గత సంవత్సరం దేశంలోని 75 పాఠశాలలు, విద్యా సంస్థలను సందర్శించి పిల్లలను ప్రోత్సహించాల్సిందిగా క్రీడాకారులకు, వారి శిక్షకులకు ప్రధాని సూచించారు. తదనుగుణంగా పలువురు క్రీడాకారులు ‘మీట్ ది ఛాంపియన్’ కార్యక్రమం కింద పాఠశాలలకు వెళ్లి, యువతలో ఉత్తేజం నింపడం ద్వారా తమ హామీని నెరవేర్చారని ప్రధాని అభినందించారు. దేశంలోని యువత క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుంటున్నందున ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరారు. ఈ మేరకు “మీ సామర్థ్యంతోపాటు మీకు పెరుగుతున్న గుర్తింపు, లభిస్తున్న ప్రజాదరణను సద్వినియోగం చేసుకుంటూ దేశంలోని యువతరం కోసం కృషి చేయండి” అని ప్రధాని పిలుపునిచ్చారు. క్రీడాకారులు ‘విజయ యాత్ర’ను పూర్తిచేసుకుని తిరిగి రావడంపై అభినందనలతోపాటు భవిష్యత్‌ విజయాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

   ప్రపంచంలో జరిగే ప్రధాన క్రీడా పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు  ప్రోత్సాహం దిశగా ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఇవాళ్టి సత్కార కార్యక్రమం ఒక భాగం. కాగా, గత సంవత్సరం టోక్యో-2020 ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత క్రీడాకారులు, టోక్యో-2020 పారాలింపిక్ గేమ్స్‌లో పాల్గొన్న భారత పారా-అథ్లెట్ల బృందంతో కూడా ప్రధానమంత్రి సంభాషించారు. కామన్వెల్త్ క్రీడలు-2022 సమయంలోనూ క్రీడాకారుల పురోగమనంపై ప్రధానమంత్రి అమితాసక్తి చూపారు. విజయ సాధనలో వారు నిజాయితీగా చేసిన ప్రయత్నాలను ఆయన అభినందించారు. అదే సమయంలో వారు మరింత మెరుగ్గా రాణించేలా ప్రేరణనిచ్చేలా ప్రసంగించారు.

   బర్మింగ్‌హామ్‌లో 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో మొత్తం 215 మంది క్రీడాకారులు 19 క్రీడా విభాగాల్లోని 141 పోటీలలో పాల్గొని, భారతదేశానికి 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలను సాధించి పెట్టారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi