“ప్రకృతి.. ప్రమోదంసహా నవ్యాభివృద్ధి నమూనాగా వెలుగొందుతున్న గోవా ప్రగతి ప్రస్థానంలో పంచాయతీ నుంచి పాలన యంత్రాంగం దాకా సమష్టి కృషి, సంఘీభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి”
“ఓడీఎఫ్‌.. విద్యుత్తు.. కొళాయి నీటి సరఫరా.. రేషన్ వంటి ప్రధాన పథకాల్లో గోవా 100 శాతం లక్ష్యాలను సాధించింది”
“గోవా జట్టులో నవ్య స్ఫూర్తి ఫలితమే నేటి స్వయంపూర్ణ గోవా”
“గోవాలో మౌలిక సదుపాయాల ప్రగతితో మన రైతులు.. పశుపోషకులు.. మత్స్యకారుల ఆదాయం పెరుగుదలకు తోడ్పాటు లభించింది”
పర్యాటకం ప్రధానంగాగల రాష్ట్రాలకు టీకాల కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యంతో గోవా ఇతోధిక ప్రయోజనం పొందింది”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ స్వయంపూర్ణ గోవా’ కార్యక్రమం లబ్ధిదారులు, భాగస్వాములతో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా గోవా అండర్‌ సెక్రటరీ శ్రీమతి ఇషా సావంత్‌తో ప్రధాని ముచ్చటిస్తూ- ‘స్వయంపూర్ణ మిత్ర’గా పనిచేయడంలో ఆమె అనుభవాలను పంచుకోవాల్సిదిగా కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ- ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు, సమస్యలకు పరిష్కారాలు వారి ముంగిటనే లభిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఏకగవాక్ష సేవాకేంద్రాలు ఎంతో సౌలభ్యం కల్పిస్తున్నట్లు వివరించారు.

   గోవాలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం గురించి ప్రధాని ప్రశ్నించగా… సహకార విధానంలో గణాంక సేకరణకు సాంకేతికతను సమర్థంగా వినియోగించుకున్నామని ఆమె తెలిపారు. దీనివల్ల ప్రజలకు అవసరమైన సదుపాయాలను గుర్తించే వీలు కలిగిందని చెప్పారు. మహిళా సాధికారతకు సంబంధించి సామాజిక మాధ్యమ మార్కెటింగ్‌, బ్రాండింగ్‌లో శిక్షణ, స్వయం సహాయ బృందాల వ్యవస్థద్వారా మహిళలకు ఉపకరణాలతోపాటు మద్దతు సమకూర్చినట్లు ఆమె వెల్లడించారు. అదే సమయంలో అటల్‌ ఇంక్యుబేషన్‌ బృందాల సేవలను కూడా వినియోగించుకున్నామన్నారు. ఈ సందర్భంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆహార తయారీ, సరఫరాకు సంబంధించి స్వయం సహాయ బృందాల మహిళలకు శిక్షణ, అనుకూల వాతావరణ సృష్టిద్వారా సాధికారత కల్పించడం గురించి వివరించారు. వస్తువులతోపాటు సేవల ప్రదానానికీ ఎంతో భవిష్యత్తు ఉన్నదని ప్రధాని చెప్పారు. అధికార యంత్రాంగం తగిన అవగాహన, వినూత్న పనితీరును అలవరచుకోవాలని చెబుతూ- ఇప్పటికే ఈ బాటలో నడుస్తున్న వారిని ప్రధానమంత్రి అభినందించారు.

   వివిధ రంగాల్లో ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యాలను సాధించే దిశగా స్వయంపూర్ణ గోవా కార్యక్రమం కొత్త కార్యకలాపాలు చేపట్టేందుకు తోడ్పడిందని మాజీ హెడ్మాస్టర్‌, సర్పంచి శ్రీ కాన్‌స్టాన్షియో మిరండా ప్రధానితో తన అనుభవం పంచుకున్నారు. ఆ మేరకు తాము అవసరం ఆధారిత కేంద్ర-రాష్ట్ర పథకాలను గుర్తించి వాటి అమలుకు సమన్వయంతో కృషి చేశామని తెలిపారు. దీర్ఘకాలం నుంచీ మధ్యలో ఆగిన పనులను పూర్తిచేయడంపై ప్రధాని ఆయనను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ స్వాతంత్ర్యానంతరం నిర్లక్ష్యానికి గురై, అర్థాంతరంగా ఆగిన అనేక పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని వివరించారు.

   కార్యక్రమంలో పాల్గొన్న కుందన్‌ ఫలారీతో ప్రధాని మాట్లాడిన సందర్భంగా- సమాజంలోని చివరి వ్యక్తికీ లబ్ధి చేరేవిధంగా స్థానిక యంత్రాంగంతో కలసి తాను సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ‘స్వానిధి’ పథకానికి తమ ప్రాంతంలో ప్రాచుర్యం కల్పించడంపై తన అనుభవాన్ని ప్రధానికి వివరించారు. ఈ పథకం కింద వీధి వర్తకులు డిజిటల్‌ లావాదేవీల విధానాన్ని ఎలా వినియోగిస్తున్నదీ ప్రధాని తెలుసుకోగోరారు. దీనివల్ల లావాదేవీల క్రమం మొత్తం నమోదవుతుందని, తద్వారా బ్యాంకులు వారికి మరింత రుణ సదుపాయం కల్పించడంలో డిజిటల్‌ లావాదేవీల పద్ధతి చక్కగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. ‘గోవా విముక్తి వజ్రోత్సవాల (60వ వార్షికోత్సవం) నేపథ్యంలో గోవాలోని ప్రతి పంచాయతీకి రూ.50 లక్షలు, ప్రతి పురపాలక సంస్థకూ రూ.కోటి వంతున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయం మంజూరు చేస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. దేశంలో ఆర్థిక సార్వజనీనత దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ప్రధాని వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.

   చేపల సాగు, వ్యాపారంలో ప్రభుత్వ పథకాలద్వారా తాను లబ్ధి పొందానని, ఈ మేరకు శీతల ఇన్సులేషన్‌ వాహనాలను వాడుతున్నానని పారిశ్రామికవేత్త శ్రీ లూయీ కార్డొజో ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, ‘నావిక్‌’ యాప్‌, బోట్ల కొనుగోలుకు ఆర్థిక సహాయం వంటి పథకాలు మత్స్యకారులకు ఎంతగానో తోడ్పడుతున్నాయని ప్రధాని వివరించారు. ఆక్వా రైతులు, మత్స్యకారులు మరింత లాభాలు ఆర్జించాలంటే ముడి ఉత్పత్తులకు బదులు ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తుల దిశగా వ్యాపార విస్తరణ చేపడితే బాగుంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

   స్వయంపూర్ణ కార్యక్రమం కింద దివ్యాంగుల కోసం గోవా ప్రభుత్వం చేపట్టిన చర్యలను శ్రీ రుకీ అహ్మద్‌ రాజాసాబ్‌ ప్రధాని వివరించారు. దివ్యాంగుల ఆత్మగౌరవం, సౌలభ్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి పారాలింపిక్స్‌లో సౌకర్యాల ప్రామాణీకరణ, తత్ఫలితంగా పారా అథ్లెట్ల అద్భుత విజయాలు వంటివాటి గురించి ఆయన గుర్తుచేశారు. అనంతరం స్వయం సహాయ బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీమతి నిషితా నామ్‌దేవ్‌ గవాజ్‌తో ప్రధానమంత్రి మాట్లాడారు. ఆమె నేతృత్వంలోని బృందం తయారుచేసే ఉత్పత్తులు, వాటి విక్రయిస్తున్న విధానం తదితరాల గురించి వాకబు చేశారు. మహిళల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచే దిశగా ‘ఉజ్వల, స్వచ్ఛ భారత్‌, పీఎం-ఆవాస్‌, జన్‌ధన్‌’ వంటి పథకాలను అమలు చేస్తున్నదని ప్రధాని గుర్తుచేశారు. సైనిక, క్రీడా రంగాలుసహా అన్నింటా మహిళలు భారత కీర్తిప్రతిష్టలను నలుదిశలా చాటుతున్నారని కొనియాడారు.

   నంతరం పాల డెయిరీ నిర్వహిస్తున్న బృందానికి నాయకుడైన శ్రీ దుర్గేష్‌ ఎం.శిరోద్కర్‌తో ప్రధానమంత్రి మాట్లాడారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా తామెంతో లబ్ధి పొందుతున్నామని శిరోద్కర్‌ ఈ సందర్భంగా హర్షం వెలిబుచ్చారు. అంతేకాకుండా ఈ సదుపాయం గురించి పాల వ్యాపారం చేస్తున్నవారికి, రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పథకానికి విశేష ప్రాచుర్యం కల్పించడంలో శ్రీ శిరోద్కర్‌ చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. రైతుల ఆదాయం పెంచడం లక్ష్యంగా ‘విత్తనం నుంచి విక్రయం’ (సీడ్‌ టు మార్కెట్‌)దాకా అనువైన పర్యావరణ వ్యవస్థ సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాని వెల్లడించారు. “కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, భూసార కార్డ్‌, వేపపూత యూరియా, ‘ఇ-నామ్‌’, అధీకృత విత్తనాలు, ఎంఎస్పీతో కొనుగోళ్లు, కొత్త వ్యవసాయ చట్టాలు” వంటివి ఈ దిశగా చేపట్టిన చర్యలలో భాగంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

   ఈ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- “గోవా… ఆనందానికి నిదర్శనం,  ప్రకృతికి ప్రతీక, పర్యాటకానికి ప్రతిరూపం” అని అభివర్ణించారు. అంతేకాకుండా నవ్యాభివృద్ధి నమూనాగా వెలుగొందుతున్న గోవా ప్రగతి ప్రస్థానంలో నేడు పంచాయతీ నుంచి పాలన యంత్రాంగం దాకా సమష్టి కృషి, సంఘీభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో గోవా అద్భుత పనితీరును ప్రశంసించారు. ఈ మేరకు బహిరంగ విసర్జన విముక్తం కావాలన్న జాతీయ లక్ష్యంలో భాగంగా గోవా 100 శాతం సాధించిందని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికీ విద్యుత్‌ సౌకర్యాన్ని నిర్దేశించగా, అందులోనూ గోవా నూరుశాతం విజయవంతమైందన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికీ కొళాయి నీరు లక్ష్యాన్ని 100 శాతం సాధించిన తొలి రాష్ట్రం గోవాయేనని చెప్పారు. ఇక పేదలకు ఉచిత రేషన్‌ పథకాన్ని కూడా గోవా 100 శాతం అమలు చేసిందని ప్రధానమంత్రి ప్రశంసల జల్లు కురిపించారు.

   హిళ ఆత్మగౌరవం, సౌకర్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడమే కాకుండా విస్తరిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే మహిళల కోసం మరుగుదొడ్లు, ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు, జన్‌ధన్‌ ఖాతాలు వంటి సదుపాయాలను గోవా ప్రభుత్వం కల్పిస్తున్నదని కొనియాడారు. గోవాను ప్రగతి పథంలో నిలిపిన కీర్తిశేషులు మనోహర్‌ పరికర్‌ను ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆయన బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం గోవాను కొత్త శిఖరాలకు చేర్చడంలో చిత్తశుద్ధితో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఆ మేరకు గోవా నేడు ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం శక్తి, పట్టుదల అనే రెండు ఇంజన్లతో కూడిన ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. గోవా జట్టులో వెల్లివిరుస్తున్న నవ్య స్ఫూర్తి ఫలితంగానే నేటి స్వయంపూర్ణ గోవా ఆవిర్భావం సాధ్యమైందని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.

   గోవాలో మౌలిక సదుపాయాల ప్రగతితో మన రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ఆదాయం పెరుగుదలకు తోడ్పాటు లభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు గోవా కేటాయిస్తున్న నిధులు మునుపటితో పోలిస్తే ఈ ఏడాది ఐదు రెట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల బోట్ల ఆధునికీకరణ దిశగా వివిధ మంత్రిత్వ శాఖలనుంచి ప్రతి స్థాయిలోనూ ప్రోత్సాహకాలు మంజూరవుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద గోవా మత్స్యకారులకు విశేషంగా తోడ్పాటు లభిస్తున్నదని గుర్తుచేశారు. పర్యాటకం ప్రధానంగాగల రాష్ట్రాలకు టీకాల కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యం, ప్రోత్సాహకాలు ఇచ్చిన నేపథ్యంలో గోవా ఇతోధిక ప్రయోజనం పొందిందని ప్రధాని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తొలి డోసు టీకాలు పూర్తి చేయడంలో గోవా ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని ఆయన ప్రశంసించారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi