యువర్ హైనెస్, ఎక్స్ లెన్సీస్
మీరు వ్యక్తపరిచిన విలువైన ఆలోచనలకు, సూచనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరుందరూ మన ఉమ్మడి ఆందోళనల్ని ఆకాంక్షల్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. మీ అభిప్రాయాలు ప్రపంచ దక్షిణ దేశాలు ఐకమత్యంగా వున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మీ సూచనలు మన సమగ్ర భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి. మన చర్చలు మనం పరస్పర అవగాహనతో ప్రయాణం చేయడానికిగాను పునాదులు వేశాయి. ఇది మన ఉమ్మడి లక్ష్యాల సాధనకు కావలసిన వేగాన్ని అందిస్తుందనే నమ్మకం నాకు వుంది.
స్నేహితులారా,
మీ అందరి ప్రసంగాలను విన్న తర్వాత భారతదేశం తరఫున ఒక సమగ్రమైన "గ్లోబల్ డెవలప్‌మెంట్ కాంపాక్ట్ " ను ప్రతిపాదించదలుచుకున్నాను. ఈ కాంపాక్ట్ పునాది అనేది భారతదేశ అభివృద్ధి ప్రయాణంమీదా, అభివృద్ది బాగస్వామ్యం అనుభవాలమీద ఆధారపడి వుంటుంది. ప్రపంచ దక్షిణ దేశాలు స్వయంగా పేర్కొన్న అభివృద్ధి ప్రాధాన్యతలతో ఈ కాంపాక్ట్ స్ఫూర్తి పొందుతుంది.
ఇది మానవ కేంద్రీకృతంగా, బహుళ కోణాలతో వుంటూ అభివృద్ధికి దోహదం చేసే బహుళ రంగాల విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది అభివృద్ధికోసం ఆర్ధిక సాయం పేరు మీద పేద దేశాలపై రుణభారాన్ని మోపదు. ఇది భాగస్వామ్య దేశాల సమతుల్య, సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుంది.
స్నేహితులారా,
మనం ఈ డెవలప్ మెంట్ కాంపాక్ట్ అనే విధానం కింద అభివృధికోసం వాణిజ్యం, సుస్థిరాభివృద్ధికోసం సామర్థ్య నిర్మాణం, సాంకేతికతల్ని ఇచ్చిపుచ్చుకోవడం, నిర్దేశిత ప్రాజెక్ట్ ఆర్థికా సాయం రాయితీ, గ్రాంట్లు అనే అంశాల మీద దృష్టి పెడతాం. వాణిజ్య ప్రోత్సాహక కార్యక్రమాలను బలోపేతం చేయడం కోసం 2.5 మిలియన్ డాలర్లతో భారతదేశం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది. వాణిజ్య విధానంలోను, సామర్థ్య నిర్మాణంకొరకు చేసే వాణిజ్య సంప్రదింపుల్లోను శిక్షణ అందించడం జరుగుతుంది. దీని కోసం ఒక మిలియన్ డాలర్ల నిధిని కేటాయించడం జరుగుతుంది.
ఆర్ధిక వత్తిళ్లను ఎదుర్కొనడంకోసం ఎస్ డి జి స్టిములస్ లీడర్స్ గ్రూప్ కు, ప్రపంచ దక్షిణ దేశాల అభివృద్ధికోసం నిధులను భారతదేశం అందిస్తోంది. ప్రపంచ దక్షిణ దేశాలకు సరసమైన ధరల్లో, సమర్థవంతమైన జనరిక్ మందులను అందించడానికి మేం కృషి చేస్తాం. డ్రగ్ రెగ్యులేటర్ల కు శిక్షణ ఇవ్వడంలో మేం సహకరిస్తాం. వ్యవసాయంరంగంలో సహజ సాగుకు సంబంధించిన అనుభవాలను, సాంకేతికతను పంచుకోవడానికి మేం సిద్ధంగా వున్నాం.
స్నేహితులారా,
ఉద్రిక్తతలు, సంఘర్షణల గురించి మీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మనందరికీ తీవ్రమైన సమస్య. ఈ ఆందోళనలకు పరిష్కారాలనేవి న్యాయమైన, సమ్మిళిత ప్రపంచ పాలన మీద ఆధారపడి వుంటాయి. ప్రపంచ దక్షిణ దేశాలకు ప్రాధాన్యతనిచ్చేలా తమ ప్రాధాన్యతలను కలిగిన సంస్థల నిర్వహణ మీద ఆధారపడి వుంటాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతలను, నిబద్దతలను నెరవేర్చాలి. ప్రపంచ ఉత్తర దేశాలకు, ప్రపంచ దక్షిణ దేశాల మధ్యన అంతరాలను చెరిపివేయడానికి తగినచర్యలను చేపట్టాలి. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితిలో నిర్వహించే భవిష్యత్ శిఖరాగ్ర సదస్సు వీటన్నిటికి సంబంధించి మైలురాయిగా నిలవబోతున్నది.
యువర్ హైనెస్,
ఎక్స్ లెన్సీస్
ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందరుకు, విలువైన ఆలోచనల్ని పంచుకున్నందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు. ప్రపంచ దక్షిణ దేశాల ప్రగతికోసం మనం మన గళాల్ని వినిపించే పనిని, మన అనుభవాలను పంచుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నాకు నమ్మకంగా వుంది.
ఈ రోజున మన బృందాలు రోజంతా అన్ని అంశాలపైనా లోతుగా చర్చిస్తాయి. రాబోయే రోజుల్లో అందరి సహకారంతో ఈ వేదికను ముందుకు తీసుకుపోయే పనిని కొనసాగిస్తాం.
అందరికీ అభినందనలు