కోవిడ్-19 టీకాలు వేసే ప్రక్రియ ప్రస్తుత స్థితి మరియు సంసిద్ధతను సమీక్షించడానికి, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు నిర్వాహకులతో 2021 జనవరి 11వ తేదీన వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన, ఉన్నత స్థాయి సమావేశానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు.
వైరస్ కు వ్యతిరేకంగా సమన్వయ పోరాటం :
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. వైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య స్థిరమైన సమన్వయం, సమాచార మార్పిడి, సకాలంలో నిర్ణయం తీసుకోవడం వంటివి, ప్రధాన పాత్ర పోషించాయని, ఆయన ప్రశంసించారు. తత్ఫలితంగా, అనేక ఇతర దేశాలలో మాదిరిగా మన దేశంలో కూడా, వైరస్ వ్యాప్తిని, నిరోధించ గలిగాము. మహమ్మారి ప్రారంభంలో పౌరులకు ఉన్న భయాందోళనలు ఇప్పుడు లేవనీ, పెరుగుతున్న విశ్వాసం ఆర్థిక కార్యకలాపాలపై కూడా సానుకూలంగా ప్రతిబింబిస్తోందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పోరాటంలో రాష్ట్రప్రభుత్వాలు చురుకుగా పనిచేసాయని, ఆయన ప్రశంసించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద టీకాలు వేసే కార్యక్రమ ప్రచారం :
జనవరి 16వ తేదీ నుండి ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ప్రచారం ప్రారంభం కావడంతో, దేశం ఈ పోరాటంలో నిర్ణయాత్మక దశలో ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అత్యవసర వినియోగం కోసం అనుమతించబడిన రెండు వ్యాక్సిన్లు భారతదేశంలోనే తయారు చేయబడటం గర్వించదగ్గ విషయమని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే, ఈ రెండు వ్యాక్సిన్లు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడవలసిన పరిస్థితి వస్తే, భారతదేశం చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చేదని ఆయన అన్నారు.
టీకాలు వేయడంలో భారతదేశానికి ఉన్న అపారమైన అనుభవం ఈ ప్రయత్నంలో ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి గుర్తించారు. టీకాలు వేయడంలో ప్రాధాన్యతలను రాష్ట్రాలతో సంప్రదించిన తరువాత నిపుణులు, శాస్త్రీయ సమాజాల సలహా, సూచనలకు అనుగుణంగా నిర్ణయించబడిందని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలు, ముందుగా ఈ టీకాను అందుకుంటారు. వారితో పాటు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులు, పోలీసులు, అనుబంధ సైనిక సిబ్బంది, హోమ్ గార్డులు, విపత్తు నిర్వహణ కార్యకర్తలు, పౌర రక్షణలోని ఇతర జవాన్లు, నియంత్రణ మరియు నిఘాతో సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులు కూడా మొదటి దశలో టీకాను అందుకుంటారు. అటువంటి సిబ్బంది దాదాపు 3 కోట్ల మంది ఉంటారు. మొదటి దశలో ఈ 3 కోట్ల మందికి టీకాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఖర్చు భరించవలసిన అవసరం లేదని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు
రెండవ దశలో, 50 ఏళ్లు పైబడిన వారితో పాటు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు లేదా రోగాలతో బాధపడుతున్నవారూ, వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికీ, టీకాలు వేస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాల కోసం సన్నాహకాలు జరిగాయనీ, టీకా వేయడం కోసం నమూనా ప్రక్రియలు దేశవ్యాప్తంగా జరిగాయని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. కోవిడ్ కోసం, మన కొత్త సన్నాహకాలు, ఎస్.ఓ.పి. లు, సార్వత్రిక రోగనిరోధకత కార్యక్రమాలను నిర్వహించడం మొదలైన పనులు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వంటి మన పాత అనుభవాలతో ముడిపడి ఉండాలని ఆయన సూచించారు. ఎన్నికలకు ఉపయోగించే బూత్ స్థాయి వ్యూహాన్ని ఇక్కడ కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కో-విన్ :
ఈ టీకాలు వేసే కార్యక్రమంలో అతి ముఖ్యమైన అంశం టీకాలు వేయాల్సిన వారిని గుర్తించడం, పర్యవేక్షించడం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇందుకోసం "కో-విన్" అనే డిజిటల్ వేదికను రూపొందించడం జరిగింది. ఆధార్ సహాయంతో, లబ్ధిదారులను గుర్తించడంతో పాటు సకాలంలో రెండవ మోతాదు ఇవ్వడాన్ని కూడా నిర్ధారించుకోవచ్చు. టీకాకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు "కో-విన్" లో పొందుపరిచేలా చూడటం చాలా ముఖ్యమైన అంశమని, ప్రధానమంత్రి, నొక్కిచెప్పారు.
ఒక వ్యక్తి టీకా యొక్క మొదటి మోతాదును వేయించుకున్న వెంటనే, అతని పేరు మీద, కో-విన్ ద్వారా, ఒక డిజిటల్ టీకా ధృవీకరణ పత్రం తయారవుతుంది. రెండవ మోతాదు తీసుకోడానికి, ఒక హెచ్చరికను జారీ చేసే, రిమైండర్ గా కూడా, ఈ ధృవీకరణ పత్రం పనిచేస్తుంది. ఆ తరువాత, తుది ధృవీకరణ పత్రం తయారౌతుంది.
వచ్చే కొన్ని నెలల్లో 30 కోట్లమందికి టీకాలు వేయాలనేది లక్ష్యం
అనేక ఇతర దేశాలు మనల్ని అనుసరించబోతున్నందున భారతదేశంలో టీకాలు వేసే కార్యక్రమం కూడా చాలా ముఖ్యమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 3 - 4 వారాల నుండి సుమారు 50 దేశాలలో కోవిడ్-19 కు టీకాలు వేస్తున్నారనీ, ఇప్పటి వరకు కేవలం 2.5 కోట్ల మందికి మాత్రమే టీకాలు వేయడం జరిగిందనీ, ఆయన తెలిపారు. రాబోయే కొన్ని నెలల్లో 30 కోట్ల మందికి టీకాలు వేయాలని, భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని, ప్రధానమంత్రి చెప్పారు.
టీకా వల్ల ఎవరికైనా అసౌకర్యం అనిపిస్తే, సరిద్దాడానికి అవసరమైన యంత్రాంగాలను అమల్లోకి తెచ్చామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. సార్వత్రిక రోగనిరోధకత కార్యక్రమం కోసం అటువంటి విధానం ఇప్పటికే అమలులో ఉందనీ, ఈ టీకాలు వేసే కార్యక్రమం కోసం దానిని మరింత బలోపేతం చేయడం జరిగిందనీ కూడా ప్రధానమంత్రి తెలియజేశారు.
ఈ ప్రయత్నంలో కోవిడ్ సంబంధిత నిర్వహణ నియమాలను అనుసరించవలసిన ఆవశ్యకత, ప్రాముఖ్యత గురించి, ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. టీకాలు వేసుకున్నవారు కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ఈ జాగ్రత్తలు పాటించడం కొనసాగించాలని, ఆయన సూచించారు. టీకాలకు సంబంధించిన పుకార్లు వ్యాప్తి చెందకుండా అదుపులో ఉంచేందుకు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యంత్రాంగాలు తగిన ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం మత, సామాజిక సంస్థలు; ఎన్.వై.కె; ఎన్.ఎస్.ఎస్; స్వయం సహాయక సంఘాల సహాయం తీసుకోవాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
బర్డ్ ఫ్లూ సవాలును ఎదుర్కోవడం
కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చర్చించారు. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రణాళికను రూపొందించిందనీ, ఈ విషయంలో జిల్లా న్యాయాధికారులు కీలక పాత్ర పోషించనున్నారనీ, ఆయన వివరించారు. ఈ ప్రయత్నంలో తమ డి.ఎం. లకు మార్గనిర్దేశం చేయాలని బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయన కోరారు. బర్డ్ ఫ్లూ ఇంకా చేరుకోని ఇతర రాష్ట్రాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అడవులు, ఆరోగ్యం, పశుసంవర్ధక శాఖల మధ్య సరైన సమన్వయం ద్వారా త్వరలో ఈ సవాలును అధిగమించగలమని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
టీకాలు వేసే ప్రక్రియ సంసిద్ధత మరియు ప్రతిస్పందన :
ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రుల నాయకత్వంలో, కోవిడ్ ను ఎదుర్కోవడంలో, భారతదేశం, ఇతర దేశాల కంటే మెరుగైన పనితీరు కనబరిచిందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో రాష్ట్రాలు ఇంతవరకు ప్రదర్శించిన సమన్వయాన్ని, టీకా డ్రైవ్‌లో కూడా కొనసాగించాలని, ఆయన కోరారు.
టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండడం పట్ల, ముఖ్యమంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. టీకాల గురించి వారు కొన్ని సమస్యలను, ఆందోళనలను వారు ప్రస్తావించగా, వాటిపై ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చారు.
టీకాలు వేసే ప్రక్రియ సంసిద్ధత గురించి, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, దృశ్యమాధ్యమం ద్వారా వివరించారు. టీకాలు వేసే కార్యక్రమం, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించబడుతుందని, ఆయన తెలియజేశారు. ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ కోసం చేపట్టే చర్యల విషయంలో రాజీ పడకుండా క్రమబద్ధమైన, సున్నితమైన పద్దతిలో ఈ కార్యక్రమం అమలౌతుంది. టీకాల వేసే కార్యక్రమ నిర్వహణలో కీలకమైన రవాణా సౌకర్యాల సంసిద్ధత గురించి గురించి కూడా ఆయన వివరించారు.