అందరికీ అభినందనలు...
నమస్కారం!
నా మంత్రిమండలి సహచరులు కిరణ్ రిజిజు గారు, మురళీధరన్ గారు, ప్రపంచ ఆయుర్వేద ఉత్సవాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగాధరన్ గారు, ‘ఫిక్కి’ అధ్యక్షులు ఉదయ్ శంకర్ గారు, డాక్టర్ సంగీతారెడ్డి గారూ...
నా ప్రియ మిత్రులారా!
ఇవాళ 4వ ప్రపంచ ఆయుర్వేద ఉత్సవాల సందర్భంగా ప్రసంగించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అనేకమంది నిపుణులు తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకోనుండటం ఎంతో విశేషం. ఈ వేదికపై 25కు పైగా దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇదొక గొప్ప సంకేతం. ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాలపై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంపై కృషిచేస్తున్న వారందరినీ ఈ వేదికద్వారా అభినందిస్తున్నాను. వారి ఆసక్తి, దీక్ష మానవాళి మొత్తానికీ లబ్ధి చేకూరుస్తాయి.
మిత్రులారా!
ప్రకృతి, పర్యావరణాలపై భారతీయ సంస్కృతికిగల గౌరవంతో ఆయుర్వేదం సన్నిహితంగా ముడిపడి ఉంది. ఆ మేరకు ఆయుర్వేదాన్ని మా ప్రాచీన గ్రంథాలు ఇలా అద్భుతంగా అభివర్ణించాయి: ”हिता-हितम् सुखम् दुखम्, आयुः तस्य हिता-हितम्। मानम् च तच्च यत्र उक्तम्, आयुर्वेद स उच्यते॥” (హితా-హితమ్ సుఖమ్ దుఃఖమ్ ఆయుః తస్య హితా-హితమ్ మానమ్ చ తచ్ఛ యత్ర ఉక్తమ్, ఆయుర్వేద స ఉచ్యతే) అంటే- “ఆయుర్వేదం అనేక అంశాలకు అనువైనది. ఇది చక్కని ఆరోగ్యానికి, దీర్ఘాయుష్షుకూ భరోసా ఇస్తుంది” అని అర్థం. ఆయుర్వేదాన్ని ఒక సంపూర్ణ మానవ శాస్త్రంగా నిర్వచించడం సముచితం. మొక్కల నుంచి మీ భోజన పళ్లెందాకా... శారీరక దృఢత్వం నుంచి మానసిక శ్రేయస్సుదాకా- ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాల ప్రభావం, ప్రాబల్యం అపారం.
మిత్రులారా!
నేను 2020 జూన్ నెలలో ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రికలో ఒక వ్యాసం చదివాను. “కరోనా వైరస్ గివ్స్ ‘హెల్త్ హాలో’ ప్రాడక్ట్స్ ఎ బూస్ట్” (ఆరోగ్య పోషణ ఉత్పత్తులకు కరోనా వైరస్‌తో ఊపు) అన్నది దాని శీర్షిక. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో పసుపు, అల్లం తదితర దినుసులకు డిమాండ్ స్థిరంగా పెరుగుతుండటాన్ని ఆ వ్యాసం ప్రస్తావించింది. ఆ మేరకు ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజాదరణ లభించాల్సిన సమయం ఇదేనని ప్రస్తుత పరిస్థితులు సముచితంగానే సూచిస్తున్నాయి. దీనికి అనుగుణంగా నేడు వాటిపై ఆసక్తి పెరుగుతోంది. మానవాళికి మరింత శ్రేయస్సు కోసం ఆధునిక, సంప్రదాయ వైద్య విధానాల ప్రాముఖ్యాన్ని ప్రపంచం ఇవాళ గమనిస్తోంది. ఆయుర్వేదం ప్రయోజనాలను, రోగనిరోధకత పెంపులో ఈ విధానం పోషించగల పాత్రను ప్రజలు గుర్తిస్తున్నారు. కషాయం, తులసి, నల్ల మిరియాల వినియోగాన్ని తమ జీవితాల్లో సమగ్ర భాగం చేసుకుంటున్నారు.
మిత్రులారా!
పర్యాటకంలో నేడు అనేక అంగాలున్నాయి. అయితే, భారతదేశం ‘ఆరోగ్య పర్యాటకం’... మళ్లీ చెబుతున్నా ‘ఆరోగ్య పర్యాటకాన్ని’ భారత్ ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది. “అనారోగ్యానికి చికిత్స-ఆరోగ్యానికి మరింత ఆలంబన” అన్నదే ఆరోగ్య పర్యాటకం కీలక సూత్రం. ఇక ఆరోగ్య పర్యాటకం విషయానికొస్తే- ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యవిధానాలే దానికి అత్యంత బలమైన మూలస్తంభాలు. అందమైన కేరళ రాష్ట్రంలో దట్టమైన పచ్చని పరిసరాల నడుమ ‘శరీర కాలుష్య హరణ’ (డిటాక్స్) చికిత్స చేయించుకోవడాన్ని ఓసారి ఊహించుకోండి. ఉత్తరాఖండ్ పర్వత పవనాల నడుమ, గలగల ప్రవహించే నదీతీరంలో మీరు యోగాభ్యాసం చేయడాన్ని మీరే ఊహించుకోండి. ఈశాన్య భారతంలోని పచ్చని పచ్చిక మైదానాల నడుమ మిమ్మల్ని మీరు ఊహించుకోండి. రకరకాల గడువులు, నిరంతరం బాధించే ఒత్తిడి మీ జీవితాల్లో ఉన్నట్లయితే అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతీ ప్రవాహంలో ఓలలాడే సమయం ఇదేనని గ్రహించండి. మీ శరీరానికి చికిత్స లేదా మనసుకు పూర్వ నిశ్చలత కావాలంటే రండి... భారతదేశాన్ని సందర్శించండి!
మిత్రులారా!
ఆయుర్వేదానికిగల ప్రజాదరణ మనకొక బలమైన అవకాశాన్ని కల్పించడం సంతోషకరం. దీన్ని మనం ఎంతమాత్రం వదులుకోరాదు. ఆధునికతతో, సంప్రదాయకత మేళవింపు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. యువతరం నేడు ఆయుర్వేద ఉత్పత్తులను విస్తృతంగా వాడుతోంది. రుజువుల ప్రాతిపదికగల వైద్యశాస్త్రాలతో ఆయుర్వేదం అనుసంధానంపై అవగాహన పెరుగుతోంది. అదేతరహాలో ప్రాచుర్యం పొందుతున్న ఇతర అంశాల్లో- ఆయుర్వేద అనుబంధ ఉత్పత్తులు, ఆయుర్వేదంతో ముడిపడిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి. అలాగే ఉత్పత్తుల ప్యాకేజింగ్ కూడా ఎంతో మెరుగుపడింది. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాలపై మరింత లోతుగా పరిశోధనలు సాగించాలని మన విద్యావేత్తలకు పిలుపు ఇస్తున్నాను. అదేవిధంగా ఆయుర్వేద ఉత్పత్తులవైపు ప్రత్యేకంగా దృష్టి సారించాలని మన శక్తివంతమైన అంకుర సంస్థల సమాజాన్ని కోరుతున్నాను. ఈ సందర్భంగా మన యువతను నేను ప్రత్యేకంగా అభినందించాలని భావిస్తున్నాను. ఎందుకంటే- మన సంప్రదాయ చికిత్స విధానాలను ప్రపంచమంతా అర్థం చేసుకోగల భాషలో అందుబాటులో ఉంచేదిశగా వారు ముందడుగు వేశారు. మన మాతృభూమి ఆచార వ్యవహారాలు, యువత వ్యాపార స్ఫూర్తి అద్భుతాలు చేయగలవని నేను భావించడంలో ఆశ్చర్యం ఏముంటుంది!
మిత్రులారా!
ఆయుర్వేద ప్రపంచానికి ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. భారతదేశం ‘జాతీయ ఆయుష్ కార్యక్రమం’ అమలు చేస్తోంది. ‘ఆయుష్’ వైద్య విధానాలను చౌకగా లభించే ఆయుష్ సేవలద్వారా ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతోపాటు సంబంధిత విద్యా వ్యవస్థల బలోపేతానికి ఈ కార్యక్రమం కింద కృషి కొనసాగుతోంది. అంతేకాకుండా ‘ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియో’ ఔషధాల నాణ్యత నియంత్రణకు తోడ్పడుతోంది. ఆయా ఔషధాల తయారీకి ముడిపదార్థాల సుస్థిర లభ్యతకూ హామీ ఇస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా పలు నాణ్యత నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. ఆయుర్వేదం, ఇతర భారతీయ వైద్య పద్ధతులపై భారత ప్రభుత్వ విధానం ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ‘సంప్రదాయ వైద్య విధాన వ్యూహం 2014-2023’తో ఇప్పటికే అనుసంధానమైంది. భారత్‌లో “ప్రపంచ సంప్రదాయ వైద్యవిధాన కేంద్రం” ఏర్పాటు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రం ఏర్పాటును మేం స్వాగతిస్తున్నాం. ఇక ఆయుర్వేద, సంప్రదాయ వైద్యవిధానాలను అభ్యసించేందుకు వివిధ దేశాల విద్యార్థులు ఇప్పటికే భారతదేశానికి వస్తున్నారని తెలిస్తే మీరెంతో సంతోషిస్తారని నేను భావిస్తున్నాను. అయితే, ప్రపంచవ్యాప్త ఆరోగ్య శ్రేయస్సు గురించి ఆలోచించాల్సిన తరుణమిదే. ఈ అంశం ఇతివృత్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ బహుశా మంచి ఆలోచన కాగలదు. రానున్న రోజుల్లో ఆయుర్వేదం, ఆహారం గురించి మనమంతా ఆలోచించడం కూడా అవసరం. ఆయుర్వేదంతో సంబంధమున్న, చక్కని ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాల గురించి యోచించాలి. కొన్ని రోజుల కిందట ఐక్యరాజ్య సమితి 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించిన సంగతి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ మేరకు చిరుధాన్యాలతో సమకూరే ప్రయోజనాలపై అవగాహన పెంచుదాం.
మిత్రులారా!
మహాత్మాగాంధీ వ్యాఖ్యతో నా ఉపన్యాసాన్ని ముగిద్దామని భావిస్తున్నాను: “ఆయుర్వేదం అంటే నాకెంతో గౌరవం. ప్రాచీన భారత శాస్త్రాల్లో ఇదొకటి. దేశంలోని వేలాది గ్రామాల్లో లక్షలాది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. పౌరులు ప్రతి ఒక్కరూ ఆయుర్వేద సూత్రాలకు అనుగుణంగా జీవించాలని నా సూచన. ఔషధాలు, వైద్యశాల, వైద్యులు వీలైనంత ఎక్కువగా సేవలందించగలిగే పరిస్థితులు ఏర్పడాలని నేను ఆశీర్వదిస్తున్నాను.” ఆయన అన్నారు. మహాత్మాగాంధీ ఎప్పుడో వందేళ్లకన్నా ముందు ఈ మాటలన్నారు. కానీ, ఆయన మనోభావాలు నేటికీ సాపేక్షమే. ఆయుర్వేదంలో మన విజయాలను సద్వినియోగం చేసుకుందాం. ప్రపంచాన్ని మన ముంగిటకు చేర్చగల చోదకశక్తిగా రూపొందాలి. మన యువతకు అది సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిద్దాం. ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఇందులో పాల్గొంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అందరికీ ధన్యవాదాలు...
థ్యాంక్యూ వెరీమచ్!