ఆక్సిజన్ లభ్యత-సరఫరాల పెంపుదిశగా వినూత్న మార్గాన్వేషణపై ప్రధానమంత్రి మోదీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య అవసరాలకు వాయురూప ఆక్సిజన్ వాడకంపై ఇవాళ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఉక్కు కర్మాగారాలు, చమురుశుద్ధి కర్మాగారాలు, పెట్రో-రసాయన పరిశ్రమలు, అత్యుష్ణ జనిత ప్రక్రియలను వినియోగించే పరిశ్రమలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు తదితరాల్లో ఆక్సిజన్ తయారీ యంత్రాగారాలు వాయురూప ఆక్సిజన్ తయారుచేసి, సొంతంగా వినియోగిస్తుంటాయి. ఇలాంటి వాయురూప ఆక్సిజన్‌ను వైద్య అవసరాల కోసం వాడుకునే వీలుంది.
ఈ దిశగా వ్యూహంలో భాగంగా- నిర్దిష్ట స్వచ్ఛతతో వాయురూప ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పారిశ్రామిక సంస్థలను గుర్తించాలని సమావేశం నిర్ణయించింది. అలాగే వీటిలో నగరాలు/జన సమ్మర్ద ప్రాంతాలు/ డిమాండ్‌గల ప్రదేశాలకు సమీపాన ఉన్నవాటి జాబితా రూపొందించాలని తీర్మానించింది. ఆయా ఆక్సిజన్ వనరులకు దగ్గరగా ఆక్సిజన్ ఆధారిత పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా అటువంటి 5 ఆరోగ్య సదుపాయాల ఏర్పాటు ఇప్పటికే ప్రారంభం కాగా, అవన్నీ ఆశావహంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఆక్సిజన్ ప్లాంట్లను నిర్వహించే ప్రభుత్వరంగ లేదా ప్రైవేటు పారిశ్రామిక సంస్థలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇది సాధ్యమైంది.
తాజా వ్యూహం ప్రకారం ఆక్సిజన్ ప్లాంట్ల సమీపాన తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా స్వల్ప వ్యవధిలోనే 10,000 ఆక్సిజన్ ఆధారిత పడకలు అందుబాటులోకి వస్తాయని అంచనా. మహమ్మారి నియంత్రణలో భాగంగా ఇటువంటి మరిన్ని ఆరోగ్య సదుపాయాలు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలని సమావేశం నిర్ణయించింది. మరోవైపు ‘పీఎస్ఏ’ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. దేశవ్యాప్తంగా ‘పీఎం కేర్స్’ నిధులతోపాటు ప్రభుత్వరంగ, తదితర సంస్థల తోడ్పాటుతో 1,500 ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ సాగుతున్నట్లు అధికారులు ప్రధానికి వివరించారు. ఇవన్నీ వీలైనంత వేగంగా పూర్తయ్యేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, మంత్రిమండలి కార్యదర్శి, రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.