దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని, కోవిడ్ టీకాల పంపిణీకి సంసిద్ధతను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి సమీక్షించారు. ఈ సమావేశానికి కాబినెట్ కార్యదర్శి, ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. కోవిడ్ కి సంబంధించిన అన్ని అంశాలమీద ప్రధాని సమగ్రంగా చర్చించి సమీక్షించారు. సురక్షితమని సంబంధిత నియంత్రణా సంస్థ ధ్రువీకరించిన కోవి షీల్డ్, కొవాక్సిన్ అనే రెండు టీకాలను వాడటానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.
టీకామందు పంపిణీపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన సమాలోచనల ఫలితాలను, సంసిద్ధత స్థాయిని అధికారులు ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. టీకాల కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, ఎన్నికల సమయంలో వాడుకున్న బూత్ వారీ వ్యూహాన్నే అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే విధంగా గతంలో అమలు చేసిన సార్వత్రిక టీకాల కార్యక్రమం అనుభవాలను వాడుకుంటున్నామని కూడా తెలియజేశారు. అదే సమయంలో ప్రాథమిక ఆరోగ్య రక్షణ లాంటి కార్యక్రమాలను ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండబోదని కూడా చెప్పారు. శాస్త్రీయ, నియంత్రణాపరమైన పద్ధతులను, ప్రామాణిక ఆచరణ విధానాలను పాటిస్తూనే సాఫీగా కోవిడ్ టీకాల కార్యక్రమం చేపడతామని తెలియజేశారు
మొదటి విడత కోవిడ్ టీకాల కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బందికి, ఇతర కీలకమైన కోవిడ్ యోధులకు ప్రాధాన్యమిస్తారని, వీరిని మూడు కోట్లుగా లెక్కించారని తేలింది. ఆ తరువాత ప్రాధాన్యం 50 ఏళ్ళు పైబడ్డవారికి, దీర్ఘకాల వ్యాధులున్న వారికి ఇస్తారు. అలాంటి వారి సంఖ్య 27 కోట్లు ఉంటుందని తేల్చారు.
కో-విన్ వాక్సిన్ పంపిణీ యాజమాన్య వ్యవస్థ పనితీరును కూడా ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. వాక్సిన్ నిల్వ, పాటించాల్సిన ఉష్ణోగ్రత, ముందస్తు రిజిస్ట్రేషన్, లబ్ధిదారుల సమాచారం, తనిఖీ, టీకా ఇచ్చిన వెంటనే ధ్రువపత్రం రావటం లాంటివి జరిగేలా ఆ పొర్టల్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆ విధంగా టీకాల కార్యక్రమం విజయవంతం కావటానికి ఆ సాఫ్ట్ వేర్ పనిచేస్తుందని వివరించారు. ఇప్పటికే ఈ వేదిక మీద79 లక్షలమంది నమోదు చేసుకున్నారని కూడా ప్రధాని దృష్టికి తెచ్చారు.
ఈ మొత్తం టీకాల కార్యక్రమంలో టీకాలిచ్చేవారు, వారిని పర్యవేక్షించేవారు కీలక భూమిక పాటించాల్సి ఉంటుంది గనుక వారికి శిక్షణ ఇచ్చేందుకు కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చే శిక్షకులు 2360 మందికి ముందుగా శిక్షణ ఇచ్చారు. వారిలో అన్ని రాష్ట్రాల టీకా అధికారులు, టీకామందు నిల్వ కేంద్రాల అధికారులు, ఐఇసి అధికారులు, టీకా మందు రూపకర్తల ప్రతినిధులు ఉన్నారు. 62 వేలకు పైగా ప్రోగ్రామ్ మేనేజర్లు, 2 లక్షలమంది టీకాలిచ్చేవారు, 3.7 లక్షలమంది టీకా బృందాల సభ్యులు ఇప్పటిదాకా శిక్షణ తీసుకున్నారు. వీళ్లకోసం తాలూకా స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట స్థాయి శిక్షణ శిబిరాలు నడిచాయి.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మూడు విడతలుగా నమూనా టీకాల కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, మూడవసారిగా నిన్న జరిగిన కార్యక్రమంలో 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 615 జిల్లాల్లో 4895 ప్రదేశాలలో టీకాలిచ్చిన సంగతి కూడా ప్రధానికి చెప్పారు. సవివరమైన సమీక్ష అనంతరం రాబోయే సంక్రాంతి, లోహ్రు, మాఘ బిహు పండుగల నేపథ్యంలో కోవిడ్ టీకాల కార్యక్రమం జనవరి 16 నుంచి చేపట్టాలని నిర్ణయించారు.