ప్రపంచ మహమ్మారి పరిస్థితుల నిర్వహణలో సైనిక బలగాల సంసిద్ధత, ఇప్పటిదాకా చేపట్టిన కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రక్షణ బలగాల ప్రధానాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సమీక్షించారు. ఈ మేరకు సీడీఎస్ ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికే చేపట్టిన చర్యలను ఆయన ప్రధానికి వివరించారు. ఇందులో భాగంగా సాయుధ దళాల ప్రస్తుత, రెండేళ్ల కిందట రిటైరైన, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన వైద్య సిబ్బంది మొత్తాన్నీ వారి ప్రస్తుత నివాసాలకు సమీపంలోని కోవిడ్ కేంద్రాల్లో విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. అంతకుముందు రిటైరైన వైద్యాధికారులను కూడా అత్యవసర సహాయ కేంద్రాల ద్వారా సంప్రదింపు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లు పేర్కొన్నారు.
కమాండ్, కోర్, డివిజన్, నావికాదళ, వాయుసేన తదితర ప్రధాన కేంద్రాలకు సంబంధించి విధుల్లో నియమించిన వైద్యాధికారులందరినీ ఆస్పత్రులలో విధులకు పంపనున్నట్లు ప్రధానమంత్రికి సీడీఎస్ తెలియజేశారు. అలాగే ఆయా ఆస్పత్రులలో వైద్యులకు సహాయంగా నర్సింగ్ సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమిస్తున్నామని కూడా ప్రధానికి ఆయన తెలిపారు. సాయుధ బలగాలకు చెందిన వివిధ విభాగాల వద్దగల ఆక్సిజన్ సిలిండర్లను ఆస్పత్రులకు అందజేస్తామని ప్రధానికి చెప్పారు. వైద్య సదుపాయాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నామని, వీలైనచోట్ల సైనికబలగాల మౌలిక వైద్య సదుపాయాలను పౌరులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మరోవైపు దేశంలోనేగాక ఇతర దేశాలకు ఆక్సిజన్ రవాణ కోసం భారత వాయుసేన (ఐఏఎఫ్) చేపట్టిన కార్యకలాపాలను కూడా ప్రధానమంత్రి సమీక్షించారు. మారుమూల ప్రాంతాలుసహా వీలైనంత ఎక్కువ ప్రాంతాలకు సైనిక బలగాల సేవలు అందించడంలో మాజీ సైనికులతో సమన్వయం చేసుకోవాల్సి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మాజీ సైనికుల విభాగాలకు సంబంధించి వివిధ ప్రధాన కార్యాలయాల పరిధిలో నియమితులైన కేంద్రీయ, రాష్ట్రీయ సైనిక సంక్షేమ బోర్డుల అధికారులను ఆదేశించడంపై రక్షణ బలగాల ప్రధానాధిపతితో ఆయన చర్చించారు.