నావికా దళ అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఈ రోజు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిశారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో దేశ ప్రజలకు సహాయం చేయడానికి భారత నావికాదళం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాల గురించి ఆయన ప్రధానమంత్రి కి వివరించారు. భారత నావికాదళం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి, ఆసుపత్రుల్లో పడకలు, రవాణా, టీకాలు వేసే కార్యక్రమం అమలు వంటి విషయాల్లో, తగిన సహాయం అందిస్తున్నట్లు, ఆయన, ప్రధానమంత్రికి తెలియజేశారు. వివిధ నగరాల్లోని పౌరుల ఉపయోగం కోసం, వివిధ నావికాదళ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పడకలు కేటాయించినట్లు, ఆయన ప్రధానమంత్రి కి వివరించారు.
కోవిడ్ విధులను నిర్వహించడానికి నావికాదళం లోని వైద్య సిబ్బందిని, దేశంలోని వివిధ ఆసుపత్రులలో తిరిగి నియమించినట్లు ఆయన ప్రధానమంత్రికి తెలియజేశారు. కోవిడ్ ఆసుపత్రులలో మోహరించిన వైద్య సిబ్బందిని పెంచడానికి నావికాదళానికి చెందిన సిబ్బందికి యుద్ధ క్షేత్రంలో అనుసరించే వైద్య సంరక్షణపై శిక్షణ ఇస్తున్నారు.
ఆక్సిజన్ లభ్యతను పెంచడంతో పాటు, లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులలో కోవిడ్ సంబంధిత సామాగ్రిని తిరిగి నింపడానికి భారత నావికాదళం సహాయం చేస్తోందని, నావికాదళ అధిపతి, అడ్మిరల్ కరంబీర్ సింగ్, ప్రధానమంత్రి కి వివరించారు.
భారత నావికాదళం, బహ్రెయిన్, ఖతార్, కువైట్, సింగపూర్ నుండి భారతదేశానికి, ఆక్సిజన్ కంటైనర్లతో పాటు, ఇతర సామాగ్రిని రవాణా చేస్తోందని ఆయన ప్రధానమంత్రికి తెలియజేశారు.