భారతదేశంలో అంతరించిపోయిన అడవి చిరుతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కునో జాతీయ పార్కులో విడుదల చేశారు. ప్రపంచంలోనే మొదటి ఖండాంతర అతిపెద్ద మాంసాహార జంతువుల మార్పిడి ప్రాజెక్టు "ప్రాజెక్ట్ చీతా" కింద నమీబియా నుండి ఈ చిరుతలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది. మొత్తం ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి.
కునో జాతీయ పార్కు లోని రెండు విడుదల ప్రదేశాల వద్ద, ప్రధానమంత్రి ఈ చిరుతలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, చిరుత మిత్రులు, చిరుత పునరావాస నిర్వహణ బృందం సభ్యులు, విద్యార్థుల తో కూడా సంభాషించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు.
కునో జాతీయ పార్క్ లో ప్రధానమంత్రి అడవి చిరుతలను విడుదల చేయడం భారతదేశ వన్యప్రాణులను మరియు వాటి ఆవాసాలను పునరుజ్జీవింపజేయడానికి, వైవిధ్యపరచడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలలో ఒక భాగం. భారతదేశంలో చిరుత పులులు అంతరించిపోయినట్లు 1952 లో ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో సంతకం చేసిన అవగాహన ఒప్పందం ప్రకారం, ఈ చిరుతలను నమీబియా నుండి తీసుకురావడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఖండాంతర పెద్ద మాంసాహార జంతువుల మార్పిడి ప్రాజెక్టు - "ప్రాజెక్ట్ చీతా" కింద భారతదేశానికి ఈ చిరుతలను తీసుకురావడం జరిగింది.
భారతదేశంలో బహిరంగ అటవీ భూములు, గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడంలో చిరుతలు సహాయపడతాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంతో పాటు, నీటి భద్రత, కర్బనాన్ని వేరుచేయడం, నేల తేమ పరిరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది, ముఖ్యంగా, సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుంది. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా, చేపట్టిన ఈ ప్రయత్నం, పర్యావరణ అభివృద్ధి, పర్యావరణ పర్యాటక కార్యకలాపాల ద్వారా స్థానిక సమాజానికి మెరుగైన జీవనోపాధి అవకాశాలకు కూడా దారి తీస్తుంది.
భారతదేశంలో చిరుతలను చారిత్రాత్మకంగా పునఃప్రారంభించడం అనేది గత ఎనిమిదేళ్లలో సుస్థిరత, పర్యావరణ పరిరక్షణకు భరోసా ఇచ్చే సుదీర్ఘ శ్రేణి చర్యలలో ఒక భాగం, దీని ఫలితంగా పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత రంగంలో గణనీయమైన విజయాలు సాధించబడ్డాయి. 2014 లో దేశ భౌగోళిక ప్రాంతంలో 4.90 శాతం గా ఉన్న రక్షిత ప్రాంతాల కవరేజీ ఇప్పుడు 5.03 శాతానికి పెరిగింది. దేశంలో 2014 లో 1,61,081.62 చ.కి.మీ విస్తీర్ణంతో ఉన్న 740 రక్షిత ప్రాంతాలు, ప్రస్తుతం 1,71,921 చ.కి.మీ విస్తీర్ణంతో 981 కి పెరిగాయి.
గత నాలుగేళ్లలో అడవులు మరియు చెట్ల విస్తీర్ణం 16,000 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. అటవీ విస్తీర్ణం స్థిరంగా పెరుగుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. కమ్యూనిటీ రిజర్వ్‌ల సంఖ్య కూడా పెరిగింది. 2014 లో కేవలం 43 గా ఉన్న వీటి సంఖ్య, 2019 లో 100 కంటే ఎక్కువగా ఉంది.
భారతదేశంలోని 18 రాష్ట్రాల్లోని సుమారు 75,000 చ.కి.మీ విస్తీర్ణంలో 52 టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం అడవి పులుల సంఖ్యలో సుమారు 75 శాతం పులులు భారతదేశంలో ఉన్నాయి. లక్ష్యంగా పెట్టుకున్న 2022 కంటే నాలుగు సంవత్సరాల ముందు 2018 లోనే పులుల సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని భారతదేశం సాధించింది. భారతదేశంలో 2014 లో 2,226 గా ఉన్న పులుల సంఖ్య, 2018 నాటికి 2,967 కి పెరిగింది.
2014 బడ్జెట్ లో పులుల సంరక్షణకు 185 కోట్ల రూపాయలు కేటాయించగా, 2022 నాటికి ఈ బడ్జెట్ కేటాయింపు 300 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఆసియా సింహాల విషయానికి వస్తే, 2015 లో 523 గా ఉన్న సింహాల సంఖ్య 28.87 శాతం (ఇప్పటి వరకు అత్యధిక వృద్ధి రేటులో ఒకటి) పెరుగుదల రేటుతో 674 తో స్థిరమైన పెరుగుదలను చూపుతోంది.
2014 లో నిర్వహించిన గత అంచనా 7,910 కంటే ఎక్కువగా, ప్రస్తుతం 2020 అంచనా ప్రకారం భారతదేశంలో 12,852 చిరుత పులులు ఉన్నాయి. అంటే, చిరుత పులుల సంఖ్య లో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది.
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్; ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్; కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా, శ్రీ అశ్విని చౌబే ప్రభృతులు పాల్గొన్నారు.