మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు.
ప్రధానమంత్రి విడుదల చేసిన పుస్తకాల్లో (i) ‘‘వెంకయ్యనాయుడు-సేవా జీవితం’’ పేరిట ది హిందూ హైదరాబాద్ ఎడిషన్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ శ్రీ ఎస్.నగేశ్ కుమార్ రచించిన జీవితచరిత్ర; (ii) భారత ఉపరాష్ర్టపతికి మాజీ కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ ఐ.వి.సుబ్బారావు ‘‘వేడుకల భారతం-13వ ఉపరాష్ర్టపతిగా శ్రీ వెంకయ్యనాయుడు ప్రయాణం, సందేశం’’ పేరిట సంపుటీకరించిన ఫొటో క్రానికల్; (iii) శ్రీ సంజయ్ కిశోర్ ‘‘మహానేత-శ్రీ వెంకయ్యనాయుడు జీవితం, జీవనయానం’’ పేరిట రచించిన వర్ణచిత్ర జీవిత చరిత్ర ఉన్నాయి.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ శ్రీ వెంకయ్యనాయుడు జూలై ఒకటవ తేదీతో 75 సంవత్సరాల జీవితం పూర్తి చేసుకోబోతున్నారు అన్నారు. ‘‘ఈ 75 సంవత్సరాల ప్రయాణం ఎంతో అసాధారణమైనది, అద్భుతమైన దశలు కూడా ఉన్నాయి’’ అని చెప్పారు. శ్రీ వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర, ఆయన జీవితంపై సంపుటీకరించిన మరో రెండు పుస్తకాలు విడుదల చేయడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. ఈ పుస్తకాలు ప్రజలకు స్ఫూర్తి దాయకం కావడమే కాకుండా జాతి సేవా తత్పరతకు సరైన దారిని చూపిస్తాయి’’ అన్న విశ్వాసం ప్రకటించారు.
మాజీ ఉప రాష్ర్టపతితో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీ వెంయక్యజీతో సుదీర్ఘ కాలం కలిసి పని చేసే అవకాశం నాకు వచ్చింది అన్నారు. శ్రీ వెంకయ్యజీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడుగా పని చేసిన కాలంలో మొదలైన తమ అనుబంధం తదుపరి కేబినెట్ సీనియర్ సహచరునిగానున, దేశ ఉప రాష్ర్టపతిగాను, రాజ్యసభలో స్పీకర్ గాను పని చేసిన కాలంలో మరింత బలపడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘‘ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆయన విశిష్టమైన పదవులు అలంకరిస్తూ సాధించిన అనుభవ సంపద ఎంతటిదో ఎవరైనా ఊహించుకోవచ్చు. నేను కూడా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను’’ అని ప్రధానమంత్రి అన్నారు.
శ్రీ వెంకయ్యనాయుడు జీ జీవితం ఆలోచనలు, విజన్, వ్యక్తిత్వ సంగమం అని శ్రీ మోదీ అభివ్యక్తీకరించారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో ఎలాంటి పునాది లేని దశ నుంచి బిజెపి, జనసంఘ్ అనుభవిస్తున్న నేటి మెరుగైన దశ పట్ల ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. ‘‘అంత వెనుకబడిన స్థితి నుంచి పార్టీని పైకి తీసుకురావడానికి శ్రీ నాయుడు ‘‘జాతి ప్రథమం’’ అనే తన సిద్ధాంతంతో ‘‘జాతి కోసం ఏదైనా చేయాలి’’ అన్న ఆకాంక్షతో ఎంతో శ్రమించారని ఆయన చెప్పారు. దేశంలో 50 సంవత్సరాల క్రితం విధించిన ఎమర్జెన్సీ సమయంలో 17 నెలల పాటు జైలుశిక్ష అనుభవిస్తూ కూడా పాలకులకు వ్యతిరేకంగా శ్రీ నాయుడు వెన్ను చూపని పోరాటం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. శ్రీ నాయుడు ఎమర్జెన్సీ ఉక్కు సంకెళ్లను కూడా దీటుగా ఎదుర్కొని నిలిచిన ధీశాలి అని చెబుతూ అందుకే తాను నాయుడుజీని అసలైన మిత్రునిగా భావిస్తానని చెప్పారు.
అధికారం అనేది జీవితంలో సౌకర్యాల కోసం కాదు, సేవా సంకల్పాన్ని నెరవేర్చుకునే మాధ్యమం అని ఆయన నొక్కి చెప్పారు. అందుకే శ్రీ వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసే అవకాశం వచ్చినపుడు శ్రీ నాయుడు గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారన్నారు. ‘‘నాయుడుజీ గ్రామాలు, పేదలు, రైతులకు సేవ చేయాలని భావించారు’’ అని శ్రీ మోదీ చెప్పారు. తన ప్రభుత్వంలో కూడా శ్రీ నాయుడు పట్టణాభివృద్ధి మంత్రిగా పని చేశారంటూ భారతీయ నగరాలు ఆధునికంగా ఉండాలన్న ఆయన విజన్ ను, కట్టుబాటును ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్మార్ట్ సిటీ మిషన్, అమృత యోజన విషన్ వంటివన్నీ శ్రీ వెంకయ్యనాయుడు ప్రారంభించారని చెప్పారు.
మాజీ ఉపరాష్ర్టపతి సున్నిత స్వభావం, వాక్చాతుర్యం, హాస్య చతురతను ప్రధానమంత్రి ప్రశంసించారు. హాస్య సంభాషణలో గాని, అప్పటికప్పుడు సమయానుకూలంగా స్పందించడంలో గాని, ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధించడంలో గాని, ఏకవాక్య అభివ్యక్తీకరణల్లో గాని శ్రీ వెంకయ్యనాయుడుకు సాటి రాగల వారెవరూ ఉండరని శ్రీ మోదీ అన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో ‘‘ఒక చేతిలో బిజెపి జెండా, మరో చేతిలో ఎన్ డిఏ అజెండా’’ అన్న శ్రీ వెంకయ్యనాయుడు నినాదాన్ని ఎంతో ఆదరంగా శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. 2014 సంవత్సరంలో తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు మోదీ అనే పదానికి ‘‘మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా’’ (అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం) అని అభివ్యక్తీకరించారని తెలిపారు. శ్రీ వెంకయ్య జీ లోతైన ఆలోచనలు తననెప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయని, ఒక సందర్భంలో రాజ్యసభలో ఆయన పని చేస్తున్న శైలిని ప్రశంసించకుండా ఉండలేకపోయానని చెబుతూ మాజీ ఉపరాష్ర్టపతి మాటల్లో లోతు, చిత్తశుద్ధి, విజన్, బీట్, బౌన్స్, జ్ఞాన సంపద ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు.
రాజ్యసభ స్పీకర్ గా శ్రీ నాయుడు నెలకొల్పిన సానుకూల వాతావరణాన్ని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ ఆయన పదవీ కాలంలో రాజ్యసభ ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టకుండానే రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు శ్రీ నాయుడు తన అనుభవం రంగరించి సభ హుందాతనం దెబ్బ తినకుండానే అటువంటి సునిశితమైన బిల్లును అంగీకరింపచేసిన తీరును ప్రధానమంత్రి ప్రశంసించారు. శ్రీ నాయుడు చురుగ్గా, ఆరోగ్యవంతంగా దీర్ఘకాలం పాటు జీవించాలన్న శుభాకాంక్ష ప్రధానమంత్రి ప్రకటించారు.
శ్రీ వెంకయ్యలోని భావోద్వేగ కోణాన్ని కూడా శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రతికూలతలేవీ తన విధాన నిర్ణయాన్ని ప్రభావితం చేయకుండా ఆయన చూసుకునే వారన్నారు. శ్రీ వెంకయ్యనాయుడు నిరాడంబర జీవితం, ప్రజలందరితోనూ కలిసిపోయే విధంగా నడుచుకునే ఆయన ప్రత్యేక శైలిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పండుగల సమయంలో శ్రీ వెంకయ్యజీ నివాసంలో కాలం గడిపిన రోజులను కూడా పిఎం శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. భారత రాజకీయాలకు శ్రీ నాయుడు వంటి వారు చేసిన సేవలను కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నేడు విడుదల చేసిన మూడు పుస్తకాల గురించి ప్రస్తావిస్తూ అవి వెంకయ్యజీ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతాయని, రాబోయే యువతరాలకు అవి స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు.
ఒకప్పుడు రాజ్యసభలో తాను శ్రీ నాయుడుకు అంకితం చేస్తూ చెప్పిన పద్యంలోని పంక్తులను పాడుతూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. 75 సంవత్సరాల జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ వెంకయ్యనాయుడు జీకి శ్రీ మోదీ మరోసారి అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. నాయుడు జీ నూరు సంవత్సరాల వయసు పూర్తి చేసుకునే నాటికి అంటే 2047 నాటికి ‘‘దేశం స్వాతంత్ర్యం సాధించిన శతాబ్ది’’ నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందన్న విశ్వాసం శ్రీ మోదీ ప్రకటించారు.