ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 20-21 తేదీలలో గయానాలో ఆధికారిక పర్యటన నిమిత్తం ఈ రోజు జార్జ్‌టౌన్ చేరుకొన్నారు. గత 56 సంవత్సరాలలో భారతదేశ ప్రధాని గయానాను సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో గౌరవ సూచకంగా గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమద్ ఇర్ఫాన్ అలీ, గయానా ప్రధాని శ్రీ బ్రిగేడియర్ (రిటైర్డ్) మార్క్ ఆంధోనీ ఫిలిప్స్ సాదరంగా సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. గయానా ప్రభుత్వంలోని 12 మందికి పైగా కేబినెట్ మంత్రులు కూడా వారితోపాటు ఉన్నారు.
అనంతరం హోటల్ కు చేరుకున్న ప్రధానికి గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమద్ ఇర్ఫాన్ అలీతోపాటు బార్బడాస్ ప్రధాని శ్రీ మియా అమోర్ మోట్ లీ, గ్రెనెడా ప్రధాని శ్రీ డికాన్ మిశెల్ కూడా స్వాగతం పలికారు. గయానా కేబినెట్ మంత్రుల సమక్షంలో భారతీయులు, ఇండో-గయానా ప్రవాసులు అమిత ఉత్సాహంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి హృదయ పూర్వకంగా ఆహ్వానం పలికారు. విమానాశ్రయం నుంచి హోటల్ కు చేరుకునే వరకు... గయానాలో పూర్తి మంత్రిమండలి ఈ స్వాగత కార్యక్రమాలలో పాలుపంచుకున్నది. భారతదేశం, గయానాల సన్నిహిత మైత్రికి గుర్తుగా జార్జ్‌టౌన్ నగర పాలకుడు... ‘జార్జ్‌టౌన్ సిటీ తాళం చెవి’ జ్ఞాపికని ప్రధానమంత్రికి బహుకరించారు.