ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు, శ్రీ రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ జుగ్నాత్ శ్రీలంక, మారిషస్‌లలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపిఐ) సేవలను ప్రారంభించడంతోపాటు మారిషస్‌లో రూపే కార్డ్ సేవలను ప్రారంభించనున్నారు. 12 ఫిబ్రవరి, 2024న మధ్యాహ్నం 1 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫిన్‌టెక్ ఇన్నోవేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. భాగస్వామ్య దేశాలతో మన అభివృద్ధి అనుభవాలు మరియు ఆవిష్కరణలను పంచుకోవడంపై ప్రధాన మంత్రి బలమైన దృష్టి పెట్టారు. శ్రీలంక, మారిషస్‌లతో భారతదేశం బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాల దృష్ట్యా, ఈ ప్రస్థానం వేగవంతమైన, ఒడిదొడుకులు లేని డిజిటల్ లావాదేవీల అనుభవం ద్వారా విస్తృత వర్గానికి చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
ఈ కొత్త ప్రయత్నంతో శ్రీలంక, మారిషస్‌లకు ప్రయాణించే భారతీయ పౌరులకు అలాగే భారతదేశానికి ప్రయాణించే మారిషస్ పౌరులకు యూపిఐ సెటిల్‌మెంట్ సేవలను అందుబాటులోకి తెస్తుంది. మారిషస్‌లో రూపే కార్డ్ సేవలను పొడిగించడం వల్ల మారిషస్‌లోని రూపే మెకానిజం ఆధారంగా మారిషస్ బ్యాంకులు కార్డులను జారీ చేయగలవు. భారతదేశం, మారిషస్‌లో లావాదేవీల కోసం రూపే కార్డ్‌ను ఉపయోగించడం సులభతరం చేస్తుంది.