Quoteకార్యక్రమంలో పాల్గొన్న వారు పది ఇతివృత్తాలపై రాసిన ఉత్తమ వ్యాసాల సంకలనం ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణ
Quoteభారత్ యువ శక్తి అసాధారణ మార్పులను తెస్తోంది...
Quote‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ ప్రేరణనిచ్చే వేదికలా పనిచేస్తుంది..
Quoteఈ కార్యక్రమం అభివృద్ధి చెందిన భారత్‌ను తీర్చిదిద్దడానికి మన యువతలో ఉన్న శక్తినీ, నవ భావనల్నీ ఉపయోగించుకొంటుంది: ప్రధాని
Quoteమన దేశ యువ శక్తిలో ఉన్న సత్తాయే భారత్‌ను ‘అభివృద్ధి చెందిన భారత్‌’గా మారుస్తుంది: ప్రధానమంత్రి
Quoteభారత్ అనేక రంగాల్లో తన లక్ష్యాలను అనుకున్న కాలాని కన్నా ఎంతో ముందుగానే సాధిస్తోంది: ప్రధాని
Quoteమహత్వ కాంక్షల్ని సాధించాలంటే దేశంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా, కలిసికట్టుగా కృషిచేయాలి: ప్రధానమంత్రి
Quoteభారత్‌లో యువజనుల ఆలోచనల పరిధి చాలా పెద్దది: ప్రధాని

స్వామి వివేకానంద జయంతిని స్మరించుకొంటూ పాటించే జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 3,000 మంది చురుకైన యువ నాయకులతో ఆయన మాట్లాడారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మన దేశంలో యువతలో గొప్ప హుషారైన శక్తి నిండి ఉందంటూ, ఈ శక్తి భారత్ మండపానికి జవ జీవాలనిచ్చిందన్నారు. దేశ యువతపై అపార నమ్మకం పెట్టుకొన్న స్వామి వివేకానందను యావత్తు జాతి స్మరించుకొంటూ, ఆయనకు నివాళులు అర్పిస్తోందని ప్రధాని అన్నారు. స్వామి వివేకానంద తన శిష్యులు యువతరం నుంచే వస్తారనీ, వారు ప్రతి ఒక్క సమస్యనూ సింహాల్లా పరిష్కరిస్తారని నమ్మారనీ శ్రీ మోదీ అన్నారు. యువతపై స్వామీజీ నమ్మకాన్ని ఉంచినట్లే స్వామీజీ పట్లా, ఆయన విశ్వాసాల పట్లా తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ప్రధాని తెలిపారు. ఆయననూ, ప్రత్యేకించి యువత విషయంలో ఆయనకున్న దృష్టి కోణాన్నీ తాను పూర్తిగా నమ్మినట్లు ప్రధానమంత్రి చెప్పారు. స్వామి వివేకానంద ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే, 21వ శతాబ్ది యువజనంలో శక్తి జాగృతమై, వారు చేస్తున్న చురుకైన ప్రయత్నాలను చూసి స్వామి వివేకానందలో ఒక కొత్త విశ్వాసం తొణికిసలాడేదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

భారత్ మండపంలో జి-20 కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేస్తూ... ప్రపంచ భవితను గురించి చర్చించడానికి ప్రపంచ నేతలు అప్పట్లో ఇదే సభాస్థలిలో సమావేశమవగా, రాబోయే 25 సంవత్సరాలకు దేశానికి మార్గసూచీని భారత యువత ఈ రోజు రూపొందిస్తోందనీ అభివర్ణించారు. కొన్ని నెలల కిందట తన నివాసంలో యువ క్రీడాకారులతో సమావేశమైనప్పటి సంగతులను ఆయన పంచుకొంటూ, వారిలో ఒకరు ‘‘ప్రపంచానికి, మీరు ప్రధాన మంత్రి, అయితే మాకు మాత్రం మీరు పరమ మిత్రులు’’ అని అన్నారని ప్రధానంగా ప్రస్తావించారు. భారతదేశ యువతతో  తనకు స్నేహ బంధం ఉందని ప్రధాని స్పష్టంచేశారు. స్నేహాన్ని బలంగా నిలిపి ఉంచేది నమ్మకమేనన్నారు. యువత పట్ల తనకు అపార నమ్మకం ఉందని, ఈ విషయమే మై భారత్‌‌ (MY Bharat)ను ఏర్పాటు చేయడానికి ప్రేరణనిచ్చి, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌‌కూ పునాది వేసిందన్నారు. భారతదేశ యువత సామర్థ్యం త్వరలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యం గొప్పదే అయినప్పటికీ అసాధ్యమైందేం కాదు అని ఆయన అంటూ అదెలా సాధ్యమనే వ్యక్తుల ఆలోచనల్ని తోసిపుచ్చారు. లక్షల కొద్దీ యువజనుల ఉమ్మడి కృషి ప్రగతి రథ చక్రాలను ముందుకు నడిపిస్తూంటే, దేశం తన గమ్యాన్ని చేరుకొని తీరుతుందనీ, ఇందులో అనుమానం అక్కర్లేదన్నారు.

 

|

‘‘చరిత్ర మనకు బోధించి, ప్రేరణనిస్తుంద’’ని శ్రీ మోదీ అన్నారు. పెద్ద కలలు కన్న, సంకల్పాలు చెప్పుకొన్న దేశాలూ, బృందాలు వాటి లక్ష్యాల్ని సాధించిన ఉదాహరణలూ ప్రపంచంలో అనేకం ఉన్నాయని ఆయన ప్రధానంగా చెప్పారు. 1930వ దశాబ్దంలో అమెరికాలో ఆర్థిక సంక్షోభాన్ని ఆయన ఒక ఉదాహరణగా చెబుతూ, అమెరికన్లు న్యూ డీల్‌ను ఎంపిక చేసుకొని సంక్షోభాన్ని అధిగమించడమే కాకుండా వారి అభివృద్ధిని పెంపొందించుకున్నారని ఆయన వివరించారు. మౌలిక జీవన సంకటం తలెత్తిన సింగపూర్‌ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అయితే సింగపూర్ క్రమశిక్షణతోనూ, సమష్టి కృషితోనూ ప్రపంచానికి ఆర్థిక, వ్యాపార కూడలి (హబ్)గా మార్పు చెందిదని చెప్పారు. భారత్‌లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూ, స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్యం వచ్చాక ఆహార సంక్షోభాన్ని అధిగమించడాన్ని గురించి తెలిపారు. పెద్ద లక్ష్యాల్ని పెట్టుకొని, వాటిని ఒక గడువు లోపల సాధించడం చేతకానిదేం కాదని ఆయన అన్నారు. ఒక ప్రధాన లక్ష్యమంటూ లేకపోతే, దేనినీ సాధించలేం, మరి ఇవాళ భారత్ ఈ మనస్తత్వంతోనే పనిచేస్తోందని ఆయన స్పష్టంచేశారు.

గత పదేళ్లలో దృఢసంకల్పంతో లక్ష్యాల్ని సాధించామనడానికి అనేక ఉదాహరణలను ప్రధాని  చెబుతూ, భారత్ ఆరుబయలు ప్రదేశాల్లో మలమూత్రాదుల విసర్జనకు స్వస్తి పలకాలని సంకల్పం చెప్పుకొందనీ, 60 నెలల్లో 60 కోట్ల మంది పౌరులు ఈ లక్ష్యాన్ని సాధించగలిగారన్నారు. దేశంలో దాదాపుగా ప్రతి ఒక్క కుటుంబానికీ ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయనీ, పొగ చూరు వంటిళ్ల బారి నుంచి మహిళలను కాపాడడానికి 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందించామనీ ప్రధానమంత్రి చెప్పారు. మన దేశం వివిధ రంగాల్లో తాను పెట్టుకొన్న లక్ష్యాలను నిర్ణీత కాలాని కన్నా ముందే సాధిస్తోందని శ్రీ మోదీ అంటూ, కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రపంచం టీకామందుల కోసం సతమతం అవుతుంటే భారతదేశ శాస్త్రవేత్తలు ఒక టీకామందును అనుకొన్న కాలాని కన్నా ముందుగానే తయారు చేశారని చెప్పారు. భారత్‌లో ప్రతి ఒక్కరికీ టీకామందును ఇప్పించాలంటే 3-4 సంవత్సరాలు పడుతుందని ముందస్తు అంచనాలు వెలువడ్డా, మన దేశం ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయి టీకామందు కార్యక్రమాన్ని రికార్డు వ్యవధిలో నిర్వహించిందని ఆయన అన్నారు. గ్రీన్ ఎనర్జీ అంశంలో భారత్ చేసిన వాగ్దానాన్ని ప్రధాని ప్రధానంగా చెబుతూ, ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా చేసిన వాగ్దానాన్ని షెడ్యూలు కన్నా తొమ్మిది సంవత్సరాల ముందు నిలబెట్టుకొన్న మొట్టమొదటి దేశం భారతదేశమేనని వివరించారు. పెట్రోలులో 20 శాతం మేరకు ఇథనాల్‌ను మిశ్రణం చేసే లక్ష్యానికి 2030కల్లా చేరుకోవాలని భారత్ సంకల్పించుకొన్న సంగతిని కూడా ఆయన చెబుతూ, దీనిని కూడా గడువు కంటే చాలా ముందుగా భారత్ సాధించనుందన్నారు. ఈ విజయాల్లో ప్రతి ఒక్క విజయమూ ఒక్కొక్క ప్రేరణగా నిలుస్తూ, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యానికి చేరువగా తీసుకుపోతుందని ఆయన అన్నారు.

 

|

‘‘పెద్ద లక్ష్యాల్ని సాధించడం ఒక్క ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతే  కాదు... దేశంలో ప్రతి ఒక్కరి ఉమ్మడి ప్రయత్నమూ దీనికి అవసరమవుతుంద’’ని శ్రీ మోదీ అన్నారు. జాతీయ లక్ష్యాలను నెరవేర్చడంలో చర్చోపచర్చలు, దిశ, యాజమాన్య భావనలు ముఖ్యమని ఆయన ప్రధానంగా చెప్పారు. ఈ ప్రక్రియలో - ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ యువతకు ప్రశ్నోత్తరాలు, వ్యాసరచన పోటీలు, నివేదికల్లో పాలుపంచుకోవడానికి అవకాశం ఇచ్చి, వారిని నాయకత్వ స్థానంలో నిలిపి మార్గదర్శనం చేయనిస్తుందని ప్రధాని అభివర్ణించారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని యువత తమ సొంత లక్ష్యంగా మార్చుకొందనీ, ఇప్పుడే తాను ఆవిష్కరించిన వ్యాసాల సంకలనంలోనూ, తాను చూసిన పది నివేదికల్లోనూ ఈ విషయం ప్రస్ఫుటమైందంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. యువత సూచించిన పరిష్కారాల్లో వాస్తవికత, అనుభవం ఉట్టిపడుతున్నాయనీ, ఈ పరిష్కారాలు దేశం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వారికున్న విస్తృత అవగాహనను తెలియజేస్తున్నాయనీ ప్రధాన మంత్రి అన్నారు. యువత చాలా కోణాల్లో ఆలోచనలు చేస్తోందనీ, నిపుణులు, మంత్రులు, విధాన రూపకర్తలతో చర్చల్లో యువత చురుగ్గా పాలుపంచుకొంటోందనీ ఆయన కొనియాడారు. యంగ్ లీడర్స్ డైలాగ్ నుంచి లభించే ఉపాయాలు, సలహాలు ఇకమీదట జాతీయ విధానాల్లో భాగమవుతాయనీ, దేశాభివృద్ధికి దారిని చూపుతాయనీ ప్రధాని ప్రకటించారు. యువతకు ఆయన అభినందనలను తెలియజేస్తూ, ఒక లక్ష మంది కొత్త యువ జనాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. యువత వారు ఇచ్చిన సలహాల అమలులో క్రియాశీలంగా పాల్గొనాలంటూ వారిని ఆయన ఉత్సాహపరిచారు.

అభివృద్ది చెందిన భారతదేశం ఎలా ఉండాలో తన దృష్టి కోణాన్ని ప్రధాని వెల్లడిస్తూ, ఈ సందర్బంగా వికసిత్ భారత్ ఆర్థిక, వ్యూహాత్మక, సామాజిక, సాంస్కృతిక శక్తిని చాటిచెప్పారు. అభివృద్ది చెందిన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థతోపాటు జీవావరణం (ఇకాలజీ) కూడా వర్ధిల్లాలనీ, మంచి విద్యార్జనకూ, మంచి ఆదాయార్జనకూ లెక్కపెట్టలేనన్ని అవకాశాలు అందుబాటులోకి రావాలనీ ఆయన వ్యాఖ్యానించారు.  ప్రపంచంలోకెల్లా నైపుణ్యవంతులైన యువ శ్రామిక శక్తి భారత్‌లో ఉంటుందనీ, వారి కలల  పరిధి ఆకాశమంత విస్తారంగా ఉంటుందనీ ఆయన అభివర్ణించారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే తీసుకొన్న ప్రతి ఒక్క నిర్ణయాన్నీ, వేసే ప్రతి అడుగునూ, రూపొందించే ప్రతి విధానాన్నీ అభివృద్ది చెందిన భారతదేశం దార్శనికతకు అనుగుణంగా ఉండేటట్లు చూడాలన్నారు. భారత్ ప్రగతిపథంలోకి ఒక భారీ అడుగును వేయాల్సిన తరుణం ఇదేననీ, ఎందుకంటే మన దేశం రాబోయే కొన్ని దశాబ్దుల పాటు యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా అలరారనుందనీ ఆయన స్పష్టంచేశారు. ‘‘మన దేశ యువతకు భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)ని గణనీయంగా పెంచే సామర్థ్యం ఉందని ప్రపంచ ఏజెన్సీలు గుర్తించాయ’’ని శ్రీ మోదీ అన్నారు. మహర్షి అరబిందో, గురుదేవులు టాగూర్, హోమీ జె. భాభా ల వంటి గొప్ప ఆలోచనపరులు యువ శక్తి సత్తాను నమ్మారని శ్రీ మోదీ చెబుతూ, భారత యువత ప్రపంచంలో ప్రధాన కంపెనీలకు సారథులుగా ఉండి, వారి యోగ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నారన్నారు. వచ్చే 25 సంవత్సరాలు ‘అమృత కాలం’.. ఇది చాలా కీలక కాలమని  ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ కాలంలో యువత అభివృద్ధి చెందిన భారతదేశం స్వప్నాన్ని సాకారం చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.  అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్) జగతిలో భారతదేశాన్ని ప్రపంచంలో మూడు అగ్రదేశాల సరసన నిలబెట్టడం, తయారీలో ముందంజ వేయడం, డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో విస్తరించడంతోపాటు క్రీడల్లో రాణించడం వంటి యువత సాధిస్తున్న ఘనకార్యాలను ఒక్కటొక్కటిగా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మన దేశంలోని యువతీయువకులు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ ఉన్నప్పుడు, అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించడం అనుమానం అక్కర్లేకుండా సాధించదగ్గదేనని ఆయన తేల్చి చెప్పారు.

నేటి యువతకు సాధికారత కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రతి వారంలో భారతదేశంలో ఒక కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారనీ, ప్రతి రోజూ ఒక కొత్త ఐటీఐని కూడా స్థాపిస్తున్నారనీ ఆయన ప్రస్తావించారు. దీనికి అదనంగా, ప్రతి మూడో రోజునా, ఒక అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్నారనీ, నిత్యం రెండు నూతన కళాశాలల్ని సైతం ఏర్పాటు చేస్తున్నారన్నారు. మన దేశంలో ఇప్పుడు 23 ఐఐటీలు (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ) ఉన్నాయనీ, గత పదేళ్లలో ఐఐఐటీల (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సంఖ్య 9 నుంచి 25కు పెరిగిందనీ, ఐఐఎమ్‌ల (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్) సంఖ్య 13 నుంచి 21కి చేరిందనీ ఆయన వివరించారు. ఏఐఐఎంఎస్‌ల (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సంఖ్య కూడా గడచిన పది సంవత్సరాల్లో మూడు రెట్లు అయిందనీ, వైద్య కళాశాలలు సుమారుగా రెట్టింపయ్యాయన్నారు. దేశంలో విద్యాసంస్థలు రాశి పరంగానూ, వాసి పరంగానూ శ్రేష్ఠ ఫలితాలను సాధిస్తున్నాయనీ, క్యూఎస్ ర్యాంకింగులు తెచ్చుకొన్న ఉన్నత విద్య సంస్థల సంఖ్య 2014లో 9గా ఉన్నవి కాస్తా ప్రస్తుతం 46గా వృద్ధి చెందాయని ప్రధాని చెప్పారు. భారత్‌లో విద్యా సంస్థల బలం పెరుగుతూ ఉండడం అభివృద్ధి చెందిన భారతదేశానికి ఒక చక్కని పునాది అని చెప్పవచ్చని ఆయన స్పష్టంచేశారు.

 

|

భారత్ 2047 కల్లా అభివృద్ది చెందిన దేశంగా తయారు కావాలన్న లక్ష్యం నెరవేరడానికి రోజువారీ లక్ష్యాలను పెట్టుకొని, నిరంతరం కృషి చేస్తుండాలి’’ అని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో, 25 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటకు తీసుకువచ్చినట్లు శ్రీ మోదీ తెలిపారు. త్వరలో పూర్తి దేశం పేదరికానికి చోటుండని దేశంగా మారుతుందని నమ్ముతున్నానన్నారు. ఈ దశాబ్దం చివరికల్లా అంటే 2030కల్లా 500 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడంతోపాటు రైల్వేల్లో కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి చేర్చాలన్న భారత్ లక్ష్యాలను గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

వచ్చే దశాబ్దంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వాలన్న మహత్వాకాంక్షను ప్రధాని ప్రధానంగా చెబుతూ, దీనిని సాధించడానికి దేశం అంకితభావాన్ని కనబరుస్తుందని స్పష్టంచేశారు. భారత్ ఒక అంతరిక్ష శక్తిగానూ వేగంగా అడుగులు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 2035కల్లా అంతరిక్షంలో ఒక కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్)ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉందన్నారు. ‘చంద్రయాన్’ సఫలం కావడాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ‘గగన్‌యాన్’ కోసం ప్రస్తుతం సన్నాహాలు సాగుతున్నాయన్నారు.  భారతదేశం నుంచి ఒకరు చంద్రునిపై అడుగు పెట్టాలన్నదే అంతిమ ధ్యేయమని తెలిపారు. ఈ తరహా లక్ష్యాలను నెరవేర్చుకోవడం 2047కల్లా అభివృద్ధి చెందిన భారతదేశానికి బాటను పరచగలుగుతుందని ఆయన అన్నారు.

ఆర్థిక వృద్ధి ప్రభావం దైనందిన జీవనంపై ఉంటుందని ప్రధాని అంటూ, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన కొద్దీ, అది మనిషి జీవనంలో అన్ని అంశాలపైనా సానుకూల ఫలితాలను ప్రసరిస్తుందన్నారు. ఈ శతాబ్దం మొదటి పదేళ్లలో, భారత్ ట్రిలియన్ (ఒక లక్ష కోట్ల) డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా మారిందనీ, అయితే వ్యవసాయ బడ్జెట్ మాత్రం చిన్న ఆర్థిక వ్యవస్థ మాదిరిగా కొన్ని వేల కోట్ల రూపాయల లోనే ఉందనీ, మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన బడ్జెట్ రూ.1 లక్ష కోట్ల కన్నా తక్కువే ఉందని ఆయన గుర్తుకు తెచ్చారు. ఆ కాలంలో, చాలా వరకు గ్రామాలకు సరైన రహదారులు లేవనీ, జాతీయ రహదారులతోపాటు రైలుమార్గాల స్థితి అధ్వానంగా ఉందనీ, విద్యుత్తు, నీరుల వంటి ప్రాథమిక సదుపాయాలు దేశంలో చాలా పెద్ద ప్రాంతానికి అందుబాటులో లేవనీ ఆయన అన్నారు. 2 ట్రిలియన్ (2 లక్షల కోట్ల) డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా మారిన తరువాతా మన దేశంలో మౌలిక సదుపాయాలకు కేటాయించిన బడ్జెట్ రూ.2 లక్షల కోట్ల లోపే ఉందని ఆయన చెప్పారు. ఏమైనా, దేశం రోడ్లు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, కాలవలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, పాఠశాలలతోపాటు ఆసుపత్రుల పరంగా చూసినప్పుడు మంచి మెరుగుదలను సాధించిందన్నారు. భారత్ 3 ట్రిలియన్ (3 లక్షల కోట్ల) డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా శరవేగంగా ఎదిగిందనీ, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందనీ, ‘వందే భారత్’ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టుకొన్నామనీ, బులెట్ రైలు కలను నెరవేర్చే దిశగా కృషి మొదలైందనీ ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 5జి సేవలను ప్రారంభించే విషయంలో మన దేశం అత్యంత వేగవంతంగా ఆ స్థాయిని అందుకొందనీ, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్‌ సేవల్ని వేల కొద్దీ గ్రామ పంచాయతీలకు విస్తరించడంతోపాటు 3,00,000 కన్నా ఎక్కువ పల్లెలకు రహదారుల్ని నిర్మించిందని కూడా ఆయన అన్నారు. యువజనులకు పూచీకత్తు అక్కర్లేని తరహా ‘ముద్ర’ రుణాల రూపంలో రూ.23 లక్షల కోట్లను అందించారనీ, అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్దదైన ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను కూడా ప్రారంభించుకొన్నామన్నారు. అలాగే, రైతుల బ్యాంకు ఖాతాలలో ఏటా వేల కోట్ల రూపాయల డబ్బును నేరుగా జమచేసే పథకాన్ని ప్రారంభించుకొని, పేదలకు 4 కోట్ల పక్కా ఇళ్లను నిర్మించుకొన్నామని ఆయన తెలిపారు.  ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న క్రమంలో, ఇది అభివృద్ధి కార్యకలాపాల్ని జోరందుకొనేలా చేసిందనీ, మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తూ దేశంలోని ప్రతి రంగంలోనూ, సమాజంలోని ప్రతి వర్గంలోనూ ఖర్చు పెట్టే తాహతును పెంచిందనీ ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

 

|

భారత్ ప్రస్తుతం సుమారు 4 ట్రిలియన్ (4 లక్షల కోట్ల) డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా మారిందనీ, ఫలితంగా దేశ సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయనీ ప్రధాని చెప్పారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పన బడ్జెట్ రూ.11 లక్షల కోట్లకు పైబడిందనీ, ఇది ఒక దశాబ్దం కిందటి కాలం కన్నా దాదాపు 6 రెట్లు అధికమనీ, 2014 సంవత్సరంలో పూర్తి మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన బడ్జెట్ కన్నా ఎక్కువ సొమ్మును ఇప్పుడు ఒక్క రైల్వేల రంగంలో ఖర్చు చేస్తున్నారనీ ఆయన తెలిపారు.  ఈ పెంచిన బడ్జెట్ ప్రభావం రూపురేఖలు మారిపోతున్న భారత్ ముఖచిత్రంలో సుస్పష్టంగా తెలియవస్తోందనీ, దీనికి ‘భారత్ మండపం’ ఒక సుందర ఉదాహరణనీ ఆయన వివరించారు.

 

‘‘భారత్ 5 ట్రిలియన్ (5 లక్షల కోట్ల) డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా మారే దిశలో దూసుకుపోతోంది, దీంతో అభివృద్ధితోపాటు సౌకర్యాల పరిధి కూడా ఘనంగా విస్తరిస్తుంది’’ అని శ్రీ మోదీ సంతోషంగా చెప్పారు. వచ్చే దశాబ్ది చివరికల్లా భారత్ 10 ట్రిలియన్ (10 లక్షల కోట్ల) డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ స్థాయిని కూడా మించిపోతుందని అంచనాగా చెబుతూ, ఇది సంభవమేనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ ఎదిగే కొద్దీ అసంఖ్యాక అవకాశాలు లభిస్తాయంటూ యువతను ఆయన ఉత్సాహపరిచారు. వారి తరం దేశ చరిత్రలో అత్యంత ఘనమైన మార్పునకు చోదకశక్తిగా ఉండడం ఒక్కటే కాకుండా, ఆ మార్పు వల్ల లభించే ప్రయోజనాలను అందుకొనే తరంగా కూడా నిలుస్తుందని ఆయన స్పష్టంచేశారు.  యువత నిక్షేపంగా ఉండే వాతావరణం కోసం ఎదురుచూడ్డం మానుకోవాలనీ, రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడాలనీ, యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న వారు చాటినట్లుగా తమ లోపలి తపనను చాటాలంటూ ప్రధానమంత్రి సలహా ఇచ్చారు. జీవనంలో ఈ మంత్రాన్ని అనుసరిస్తే వారిని అది విజయంలో కొత్త శిఖరాలకు తీసుకుపోతుందని ఆయన చెప్పారు.

భారత్ అనుసరించాల్సిన భావి మార్గసూచీ (రోడ్‌మ్యాప్)ని సిద్ధం చేయడంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమానిది ప్రముఖ పాత్ర అని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. యువత ఈ సంకల్పాన్ని అక్కున చేర్చుకోవడంలో చూపిన శక్తినీ, ఉత్సాహాన్నీ, అంకితభావాన్నీ ఆయన మెచ్చుకొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం ఆవిష్కరణ కోసం అందించిన ఉపాయాలు అమూల్యమైనవీ, శ్రేష్ఠమైనవీ, అత్యుత్తమమైనవీ అని ఆయన అభివర్ణించారు. ఈ ఆలోచనలను దేశంలో మూలమూలకూ చేరవేసి, అభివృద్ధి చెందిన భారత్‌ను రూపొందించే విషయాలపై ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ, ఇరుగుపొరుగు ప్రాంతాల్లోనూ ఇతర యువతీ యువకులకు చెప్పాల్సిందిగా యువతను ప్రధాని కోరారు. 2047కల్లా అభివృ‌ద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న నిబద్ధతను ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అందరూ తమను తాము అంకితం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తూ ప్రసంగాన్ని ముగించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశంలో యువతీయువకులందరికీ ఆయన మనసారా తన  శుభాభినందనలను మరోసారి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా, కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ జయంత్ చౌదరి, శ్రీమతి రక్ష ఖడ్‌సే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

|

నేపధ్యం

జాతీయ యువజనోత్సవాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తూ వచ్చిన 25 సంవత్సరాల పాత పద్ధతికి బదులు విభిన్నంగా ఉండాలనేదే ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం లక్ష్యం. ఎలాంటి రాజకీయ అనుబంధాలూ లేని 1 లక్షమంది యువతను ప్రోత్సహిస్తూ ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను ఆవిష్కరించాలన్న ఆశయాన్ని నెరవేర్చేలా వారి ఆలోచనలను వెల్లడి చేయడానికి వారికి ఒక రాజకీయ వేదికను అందించాలంటూ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఈ ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇదే మార్గంలో, ఈ జాతీయ యువజన దినోత్సవం నాడు, దేశ భావి నేతలకు ప్రేరణనివ్వడానికీ, వారిలో స్ఫూర్తిని నింపడానికీ, వారికి సాధికారతను కల్పించడానికీ రూపొందించిన అనేక కార్యక్రమాల్లో ప్రధాని స్వయంగా పాలుపంచుకొన్నారు. సరికొత్త ఆలోచనలున్న యువ నేతలు మన దేశం అభివృద్ధికి ముఖ్య రంగాలైన పది రంగాలకు ప్రాతినిధ్యం వహించే పది ఇతివృత్తాలపై 10 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శిస్తారు. ఈ ప్రజెంటేషన్లు మన దేశం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సవాళ్లలో కొన్ని సవాళ్లను పరిష్కరించడానికి యువ నేతలు ప్రతిపాదించిన సరికొత్త ఆలోచనలను తెలియజేస్తాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు పది ఇతివృత్తాలపై రాసిన అత్యుత్తమ వ్యాసాలతో కూర్చిన ఒక పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ పది ఇతివృత్తాల్లో.. టెక్నాలజీ, సుస్థిరత, మహిళలకు సాధికారత కల్పన, తయారీ, వ్యవసాయం వంటి విభిన్న రంగాలకు చెందిన ఇతివృత్తాలున్నాయి.

యువ నాయకులతో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో కూడా ప్రధాని పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా తన సమక్షంలో వారి ఆలోచనలను, అనుభవాలను, ఆకాంక్షలను వెల్లడి చేసేందుకు వారికి ప్రధాని అవకాశాన్ని ఇచ్చినట్లయింది. పరిపాలనకూ, యువత ఆకాంక్షలకూ మధ్య అంతరాన్ని తొలగించడానికీ, కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒక విధమైన యాజమాన్య భావననూ, బాధ్యతాయుత ప్రవర్తననూ పెంపొందించడానికీ ఈ మాటామంతీ తోడ్పడనుంది.  

 

|

జనవరి 11న మొదలుపెట్టిన ఈ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా పోటీల్లోనూ, వివిధ కార్యకలాపాల్లోనూ, సాంస్కృతిక నివేదికల్ని, ఇతివృత్త ప్రధాన నివేదికల్ని (థీమాటిక్ ప్రజెంటేషన్స్) రూపొందించడంలోనూ యువ నేతలు నిమగ్నం  కానున్నారు. సలహాదారులు (మెంటర్స్), ఆయా రంగాలకు చెందిన నిపుణుల నాయకత్వంలో చర్చోపచర్చలుంటాయి. మన దేశ కళాత్మక వారసత్వాన్ని కళ్లకు కట్టే సాంస్కృతిక ప్రదర్శనలనూ, మన దేశం సాధించిన ఆధునిక విజయాలనూ ఈ కార్యక్రమంలో చాటిచెప్పనున్నారు.

 

|

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి హుషారైన, ప్రేరణశక్తిని కలిగి ఉన్న 3,000 మందిని ఎంపిక చేశారు. దీనికోసం ‘‘వికసిత్ భారత్ ఛాలెంజ్’’ అనే ఒక పోటీని నిర్వహించారు. ఈ పోటీకి ఎంతో శ్రద్ధగా రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా అత్యంత స్ఫూర్తివంతుల్నీ, చురుకైన యువతనూ గుర్తించి వారిలోని ప్రతిభను వెలికితీయడానికి అనేక స్థాయిలలో వడపోసి మరీ ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. దీనిలో భాగంగా 15 - 29 ఏళ్ల మధ్య వయస్సు గల వారిని మూడు దశల్లో పరీక్షించారు. మొదటి దశలో, ‘వికసిత్ భారత్ క్విజ్’ (అభివృద్ధి చెందిన భారతదేశం అంశంపై ప్రశ్న-జవాబుల పోటీ)ని 12 భాషలలో నిర్వహించారు. దీనిలో అన్ని రాష్ట్రాలకు చెందిన యువత సుమారు 30 లక్షల మంది పాల్గొన్నారు. క్విజ్‌లో పాల్గొని అర్హత సాధించిన వారు రెండో దశలోకి ముందడుగు వేశారు. రెండో దశలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వారు ‘‘వికసిత్ భారత్’’ దార్శనికతను సాకారం చేయడంలో కీలక పది అంశాలపై తమ భావాలను వ్యాసాల రూపంలో వ్యక్తంచేశారు. ఈ పోటీలో 2 లక్షలకు పైగా వ్యాసాల్ని దాఖలుచేశారు. మూడో దశ రాష్ట్ర స్థాయి పోటీలు. ఒక్కొక్క ఇతివృత్తానికీ 25 మంది అభ్యర్థుల చొప్పున  ఈ పోటీకి అర్హతను సాధించారు. ప్రతి ఒక్క రాష్ట్రం తన ముగ్గురు అగ్రగామి అభ్యర్థుల్ని గుర్తించి, వారిని ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి ఈవెంట్‌లో పాల్గొనాల్సిన డైనమిక్ టీములుగా పంపించింది.

ఈ డైలాగ్‌ కార్యక్రమానికి రావాల్సిందిగా వికసిత్ భారత్ చాలెంజ్ ట్రాక్‌లో పాల్గొన్న 500 జట్లకు చెందిన 1500 మందినీ ట్రెడిషనల్ ట్రాక్ లో పాల్గొన్న 1,000 మందినీ (వీరిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్, టెక్నాలజీ రంగంలో నవకల్పన అంశంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనల ప్రాతిపదికలపై ఎంపిక చేశారు), 500 మంది వినూత్న ఆలోచనలను అందించిన వారినీ ఆహ్వానించారు. 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How has India improved its defence production from 2013-14 to 2023-24 since the launch of

Media Coverage

How has India improved its defence production from 2013-14 to 2023-24 since the launch of "Make in India"?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM speaks with HM King Philippe of Belgium
March 27, 2025

The Prime Minister Shri Narendra Modi spoke with HM King Philippe of Belgium today. Shri Modi appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. Both leaders discussed deepening the strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

In a post on X, he said:

“It was a pleasure to speak with HM King Philippe of Belgium. Appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. We discussed deepening our strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

@MonarchieBe”