ఇటలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.
‘‘అందరి కోసం కృత్రిమ మేధ’’ పేరిట భారత్ చేపట్టిన కార్యక్రమాన్ని ఉటంకిస్తూ- ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన వినియోగమైనా సర్వజన ప్రగతి, శ్రేయస్సు లక్ష్యంగా ఉండాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ విస్తృత దృక్కోణంతోనే కృత్రిమ మేధపై ప్రపంచ భాగస్వామ్యం సంస్థాపన సభ్యురాలుగా భారతదేశం ఈ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన గుర్తుచేశారు. భారత ఇంధన పరివర్తన మార్గం గురించి ప్రధానమంత్రి విశదీకరిస్తూ- ఇది లభ్యత, అందుబాటు, సరళత, ఆమోదయోగ్యత ప్రాతిపతికగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే దేశంలో 2070 నాటికి నికర శూన్య ఉద్గార స్థాయిని సాధించే దిశగా భారత్ నిర్విరామ కృషి చేస్తున్నదని తెలిపారు.
భారత్ ప్రతిపాదించిన మిషన్ ‘లైఫ్’ [పర్యావరణం కోసం జీవనశైలి] గురించి ప్రస్తావిస్తూ- ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో తాను స్వయంగా మొక్కల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని వెల్లడించారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘‘ప్లాంట్4మదర్’’ [భూమాత కోసం ఒక మొక్క] నినాదంతో వ్యక్తిగతంగా ప్రారంభించి, అంతర్జాతీయ కర్తవ్యంతో దీన్నొక ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు.
దక్షిణార్థ గోళం... ముఖ్యంగా ఆఫ్రికా దేశాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. కాగా, భారత్ జి-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆఫ్రికా సమాఖ్యకు ఆ కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించడం తమ దేశానికి దక్కిన గౌరవమని ఆయన గుర్తుచేశారు.