ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కజాన్ లో రష్యా అధ్యక్షతన జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.
బహుళవాదాన్ని బలోపేతం చేయడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం, అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాల ఆందోళనలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై బ్రిక్స్ నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. కొత్తగా చేరిన 13 బ్రిక్స్ భాగస్వామ్య దేశాలకు నేతలు స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో రెండు సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. సంఘర్షణలు, ప్రతికూల వాతావరణ ప్రభావాలు, సైబర్ బెదిరింపులతో సహా ప్రపంచం అనేక అనిశ్చితులు, సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోందని, బ్రిక్స్ పై ఆశాజనక అంచనాలు ఉన్నాయని ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్రిక్స్ ప్రజల కేంద్రీకృత విధానాన్ని తీసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరితగతిన ఆమోదించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
ప్రపంచ పాలనా సంస్కరణలకు బ్రిక్స్ చురుగ్గా ముందుకు సాగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. జి-20 అధ్యక్షునిగా భారత్ నిర్వహించిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులను గుర్తు చేసిన ప్రధాని, గ్లోబల్ సౌత్ ఆందోళనలకు బ్రిక్స్ ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. భారతదేశంలోని గిఫ్ట్ నగరంతో సహా న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రాంతీయ ఉనికి కొత్త విలువలు,ప్రభావాలను సృష్టించిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి బ్రిక్స్ కార్యకలాపాల ప్రాముఖ్యతను తెలియచేస్తూ, వ్యవసాయం, సుస్థిర సరఫరా వ్యవస్థలు, ఈ-కామర్స్, ప్రత్యేక ఆర్థిక మండలాలలో వాణిజ్య సౌలభ్యంపై బ్రిక్స్ చేసిన ప్రయత్నాలు కొత్త అవకాశాలను సృష్టించాయని ఆయన చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ఈ ఏడాది భారత్ ప్రారంభించనున్న బ్రిక్స్ స్టార్టప్ ఫోరం బ్రిక్స్ ఆర్థిక ఎజెండాకు గణనీయమైన విలువను చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
కాప్ (సిఒపి)-28 సందర్భంగా ప్రకటించిన అంతర్జాతీయ సౌర కూటమితో పాటు విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి, మిషన్ లైఫ్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ తో సహా భారతదేశం ఇటీవల చేపట్టిన హరిత కార్యక్రమాలను ప్రధాన మంత్రి వివరించారు. బ్రిక్స్ దేశాలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు.
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు పుతిన్ ను ప్రధాన మంత్రి అభినందించారు. కొత్తగా బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపట్టిన బ్రెజిల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. శిఖరాగ్ర సదస్సు ముగింపులో నేతలు 'కజాన్ డిక్లరేషన్'ను ఆమోదించారు.
Address of PM at the Closed Plenary may be seen here.
Address of PM at the Open Plenary may be seen here.