రూ.10,000ల కోట్ల విలువైన పలు పారిశుద్ధ్య, పరిశుభ్రతా ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభం
“పదేళ్ల స్వచ్ఛ్ భారత్ సందర్భంలో, పరిశుభ్రతను 'జన్ ఆందోళన్'గా మార్చిన 140 కోట్ల మంది భారతీయుల అచంచల స్ఫూర్తికి నేను వందనం చేస్తున్నా.”
"ఈ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమంగా స్వచ్ఛభారత్"
"దేశంలోని సామాన్య ప్రజల జీవితాలపై స్వచ్ఛభారత్ మిషన్ ప్రభావం అమూల్యం"
"స్వచ్ఛభారత్ మిషన్ కారణంగా మహిళల్లో గణనీయంగా తగ్గిన అంటువ్యాధులు"
"పెరుగుతున్న పరిశుభ్రత ప్రతిష్టతో దేశ ఆలోచనా విధానంలో భారీ మార్పు"
"ఇప్పుడు శ్రేయస్సుకు కొత్త మార్గంగా మారుతున్న పరిశుభ్రత"
"సర్క్యులర్ ఎకానమీకి కొత్త ఊపునిచ్చిన స్వచ్ఛభారత్ మిషన్"
"పరిశుభ్రత మిషన్ ఒక రోజు కోసం కాదు, జీవితకాలం ఆచరించాలి"
"అపరిశుభ్రత పట్ల ద్వేషం మనల్ని మరింత శక్తిమంతం చేస్తుంది, పరిశుభ్రత పట్ల మరింత బలంగా మార్చుతుంది"
“మనం నివసించే మన ఇల్లు, మన పరిసరాలు, మన కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం”

పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన సామూహిక ఉద్యమాల్లో ఒకటైన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ 155వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ స్వచ్ఛభారత్ దివస్ 2024 కార్యక్రమం నిర్వహించారు. అమృత్, అమృత్ 2.0, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోబర్‌ధన్ పథకాల కింద పలు ప్రాజెక్టులతో పాటు మొత్తం రూ. 9600 కోట్ల విలువైన అనేక పారిశుధ్య, పరిశుభ్రతా ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ‘స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత’ ఈ ఏడాది స్వచ్ఛతా హి సేవా నినాదం అని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, పూజ్య బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రీజీ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, ఇతర మహానుభావుల కలలను ఐక్యంగా సాకారం చేసుకునే దిశలో నేటి సందర్భం స్ఫూర్తిదాయకమని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

 

అక్టోబ‌ర్ 2న భావోద్వేగాలతో తన మనస్సు నిండిపోయినా తాను మాత్రం బాధ్యతలు నిర్వర్తించుటపైనే దృష్టి నిలిపినట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, “స్వచ్ఛ భారత్ మిషన్ ప్రయాణం కోట్లాది మంది భారతీయుల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం” అని ప్రధాన మంత్రి అన్నారు. గత 10 ఏళ్లలో ఈ ఉద్యమానికి లభించిన ప్రజల మద్దతును ప్రధానంగా ప్రస్తావించిన ఆయన దేశంలోని ప్రతి పౌరుడు తమ స్వంత మిషన్‌గా దీనిని వారి జీవితంలో భాగం చేసుకున్నారని అన్నారు. స్వచ్ఛ భారత్ 10 ఏళ్ల మైలురాయి సందర్భంలో, దీనిని భారీ ప్రజా ఉద్యమంగా మార్చడంలో సఫాయిమిత్రలు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. మునుపటి, ప్రస్తుత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సైతం శ్రమదానం రూపంలో స్వచ్ఛ భారత్ కోసం సహకారాన్ని అందించి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలు, నగరాలు, కాలనీల్లో నేడు జరుగుతున్న అనేక పరిశుభ్రతా కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర మంత్రులు, నాయకులు, ప్రజాప్రతినిధుల చురుకైన భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఈ స్వచ్ఛతా పఖ్వాడా ఎడిషన్‌లో కోట్లాది మంది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాలుపంచుకున్నారని ప్రధాని శ్రీ మోదీ తెలిపారు. 15 రోజుల సేవా పఖ్వాడాలో 28 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 27 లక్షలకు పైగా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేయవలసిన అవసరాన్ని వివరించిన ప్రధానమంత్రి, దేశ పౌరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

నేటి ముఖ్యమైన సందర్భంలో, దాదాపుగా రూ. 10,000 కోట్లతో పరిశుభ్రతకు సంబంధించి అనేక ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి ప్రస్తావించారు. ‘మిషన్ అమృత్’లో భాగంగా అనేక నగరాల్లో నీరు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నమామి గంగే, సేంద్రీయ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చే గోబర్‌ధన్ ప్రాజెక్ట్ వంటివి స్వచ్ఛ భారత్ మిషన్‌ను ఉన్నత శిఖరాల దిశగా నడిపిస్తాయని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. "స్వచ్ఛ భారత్ మిషన్ ఎంత విజయవంతమైతే, మన దేశం అంతగా ప్రకాశిస్తుంది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

 

1000 ఏళ్ల తర్వాత కూడా భారతదేశంపై అధ్యయనం జరిగితే అప్పుడు సైతం స్వచ్ఛభారత్ మిషన్ గుర్తుకు వస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. "ప్రజల భాగస్వామ్యం, ప్రజల నాయకత్వంతో స్వచ్ఛభారత్ మిషన్ ఈ శతాబ్దపు అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం"గా మారిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ మిషన్ ప్రజల నిజమైన శక్తిసామర్థ్యాలను తనకు తెలిసేలా చేసిందన్నారు. పరిశుభ్రత తనకు ప్రజల శక్తి ఏమిటో చూపిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. స్వచ్ఛతా అభియాన్‌ను ప్రారంభించిన సమయంలో లక్షలాది మంది దీనికోసం చేతులు కలిపారన్నారు. వివాహాలు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకలు సహా అన్ని చోట్లా పరిశుభ్రత సందేశాన్ని ప్రభావవంతంగా వ్యాప్తి చేశారని ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకోవడం కోసం నాటి కాలంలో కొందరు తల్లులు తమ పశువులను అమ్ముకోగా, కొంతమంది మహిళలు తమ మంగళసూత్రాన్ని కూడా అమ్ముకున్నారనీ, అలాగే ఇంకొంతమంది తమ భూమిని సైతం అముకున్న ఘటనలు సైతం ఉన్నాయన్నారు. అయితే నేడు పరిశుభ్రత మిషన్ కోసం కొంతమంది రిటైర్డ్ టీచర్లు తమ పింఛను విరాళంగా ఇచ్చారని, కొంతమంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది తమ పదవీ విరమణ ప్రయోజనాలను విరాళంగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విరాళం ఏదైనా ఆలయానికో, ఏదైనా కార్యక్రమం కోసమో ఇస్తే, అది వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికగా ఉండేదని ప్రధాని వ్యాఖ్యానించారు. టీవీల్లో ఎప్పుడూ వారి ముఖం చూపించకపోయినా, పత్రికల్లో వారి పేరు ఎక్కడా ప్రచురించకపోయినా ఈ మిషన్‌ను విజయవంతం చేయడం కోసం తమ డబ్బు, విలువైన సమయాన్ని విరాళంగా ఇచ్చిన లక్షలాది మంది ప్రజలు ఉన్నారనే సత్యం దేశం తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ సంఘటలు భారత ప్రజల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం మానేయాలని తాను ఇచ్చిన స్పష్టమైన పిలుపుతో స్పందించిన ప్రజలంతా దుకాణాలకు జనుము, బట్ట సంచులతో వెళ్లే సంప్రదాయాన్ని ప్రారంభించి మంచి కార్యక్రమానికి మద్దతునిచ్చిన విషయాన్ని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ చొరవకు సహకరించిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తి పరిశ్రమలకు అలాగే దేశ ప్రజలందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. దీనికోసం తమవంతు సహకారం అందించిన అన్ని రాజకీయ పార్టీలకూ శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

 

సినిమాల రూపంలో పరిశుభ్రత సందేశాన్ని ప్రచారం చేయడంలో గత 10 ఏళ్లలో భారత చలనచిత్ర పరిశ్రమ కృషిని ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు అయితే ఇలాంటి పనిని ఒక్కసారి మాత్రమే కాకుండా ఒక తరం నుంచి మరొక తరం వరకూ కొనసాగించాలని సూచించారు. ప్రజల నేతృత్వంలో నిర్వహించిన పలు పరిశుభ్రతా కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో దాదాపు 800 సార్లు పరిశుభ్రత అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఆయన ఉదహరించారు.

 

ఈ రోజు పరిశుభ్రత పట్ల ప్రజలు చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పరిశుభ్రత వైపు మార్గాన్ని చూపారు" అని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వాలు స్వచ్ఛత పట్ల నిర్లక్ష్యం వహించిన అంశాన్ని ఆయన లేవనెత్తారు. మహాత్మాగాంధీని తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకున్న వారు ఇప్పుడు ఆయన ఆశయాలను మరచిపోయారని విమర్శించారు. అపరిశుభ్రత, మరుగుదొడ్ల కొరతను జాతీయ సమస్యగా ఎప్పుడూ పరిగణించలేదన్నారు. ఫలితంగా సమాజంలో దీని గురించి చర్చలు జరగలేదనీ, మురికి ప్రజల జీవితంలో భాగమైపోయిందని ప్రధాని అన్నారు. ఎర్రకోట సాక్షిగా తాను ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత అనేక విమర్శలు ఎదుర్కొన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. "సాధారణ పౌరుల జీవితాలను సులభతరం చేయడం ప్రధానమంత్రి మొదటి ప్రాధాన్యం" అని ఆయన తెలిపారు. మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్‌ల గురించి మాట్లాడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

 

పదేళ్ల క్రితం వరకు దేశ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలు మరుగుదొడ్లు లేని కారణంగా బహిరంగ మలవిసర్జన చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇది మానవ ఆత్మగౌరవానికి విరుద్ధమైనదనీ, తరతరాలుగా దేశంలోని పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారి పట్ల అగౌరవాన్ని ఇది సూచిస్తుందని ప్రధాని అన్నారు. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల తల్లులు, సోదరీమణులు అలాగే ఆడబిడ్డలు పడే ఇబ్బందులను ప్రస్తావించిన శ్రీ మోదీ, ఇది వారి ఆరోగ్యం, భద్రతకూ పెనుముప్పుగా పేర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన వల్ల ఏర్పడే అపరిశుభ్రతతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఉందనీ, పిల్లల మరణాలకు ఇది ప్రధాన కారణంగా ఉందన్నారు.

 

ఇలాంటి దయనీయమైన పరిస్థితిలో దేశం కొనసాగడం కష్టమని భావించిన తాము పరిస్థితులు ఇలాగే కొనసాగకూడదని నిర్ణయించుకున్నామని శ్రీ మోదీ చెప్పారు. ఈ ప్రభుత్వం దీనిని జాతీయ, మానవ సవాలుగా పరిగణించి, పరిష్కారం కోసం స్వచ్ఛభారత్ ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. దీంతో స్వచ్ఛభారత్ మిషన్ కోసం బీజం పడిందన్నారు. అనతికాలంలోనే కోట్లాది మంది భారతీయులు అద్భుతాలు చేశారని ఆయన అన్నారు. దేశంలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయనీ, గతంలో 40 శాతం కంటే తక్కువ ఉన్న మరుగుదొడ్ల వినియోగం 100 శాతానికి చేరుకుందని ప్రధాని స్పష్టం చేశారు.

 

దేశంలో సామాన్యుల జీవితాలపై స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభావం అమూల్యమైనదని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వాషింగ్టన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఒహియో స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ నుంచి ఇటీవలి అధ్యయనాన్ని ఉటంకిస్తూ, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతియేటా 60 నుంచి 70వేల మంది పిల్లల ప్రాణాలను కాపాడుతున్న విషయం వెలుగులోకి వచ్చిందని శ్రీ మోదీ తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికను ప్రస్తావిస్తూ, 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రాణాంతక అతిసారం బారిన పడి మరణించే 3 లక్షల మంది ప్రాణాలను కాపాడడం ఈ కార్యక్రమం వల్లే సాధ్యపడిందని తెలిపారు. యునిసెఫ్ నివేదికలను ఉటంకిస్తూ, ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణం కారణంగా, ఇప్పుడు 90 శాతానికి పైగా మహిళలు సురక్షితంగా ఉన్నారనీ, ఈ స్వచ్ఛభారత్ మిషన్ కారణంగా మహిళల్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధులు గణనీయంగా తగ్గాయని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించడం వల్ల బడిమానేసే విద్యార్థినుల సంఖ్య తగ్గిందని శ్రీ మోదీ తెలిపారు. యునిసెఫ్ నిర్వహించిన మరో అధ్యయనాన్ని ఉటంకిస్తూ, పరిశుభ్రత కారణంగా, గ్రామాల్లోని కుటుంబాలు గతంలో వ్యాధుల చికిత్స కోసం సగటున ప్రతియేటా ఖర్చు చేసే 50 వేల రూపాయలు ఇప్పుడు ఆదా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

 

స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ప్రజల్లో వచ్చిన అవగాహనను ప్రస్తావిస్తూ, గోరఖ్‌పూర్‌లో బ్రెయిన్ ఫీవర్ కారణంగా చిన్నారుల మరణాల సమస్యను ప్రజలు పరిశుభ్రతతో పరిష్కరించుకున్న సంఘటను ప్రధాన మంత్రి ఉదహరించారు.

 

పరిశుభ్రత ప్రతిష్ట పెరగడంతో దేశ ప్రజల ఆలోచనా విధానంలో భారీ మార్పు వచ్చిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ వల్ల వారి ఆలోచనలో మార్పును గురించి ఆయన ప్రస్తావించారు అలాగే పారిశుద్ధ్య కార్మికుల పట్ల గతంలో చిన్నచూపు ఉండేదన్నారు. “పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం లభించిన క్రమంలో వారు కూడా దేశాన్ని మార్చడంలో తమ పాత్ర గురించి గర్వంగా భావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లక్షలాది మంది సఫాయి మిత్రలకు గర్వకారణంగా నిలిచింది” అని పేర్కొన్నారు. సఫాయి మిత్రల గౌరవప్రదమైన జీవితం, భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రధాన మంత్రి వివరించారు. సెప్టిక్ ట్యాంకుల్లో దిగి మురికి శుభ్రం చేయడం వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి జరుగుతున్నదని తెలిపిన శ్రీ మోదీ, ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. "వృత్తినిపుణులు, అంకురసంస్థలను ఈ విషయంగా పరిష్కారం కనుగొనేందుకు ప్రోత్సహిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

 

స్వచ్ఛభారత్ అభియాన్ విస్తరణ పురోగతిని ప్రస్తావిస్తూ, శ్రీ మోదీ ఇది కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదనీ, నేడు శ్రేయస్సు కోసం కొత్త మార్గాన్ని పరిశుభ్రత సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు.

 

స్వచ్ఛ్ భారత్ అభియాన్ దేశంలో పెద్ద ఎత్తున ఉపాధిని కూడా కల్పిస్తోందని, గత కొన్నేళ్లుగా కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణంతో అనేక రంగాలు లబ్ది పొందాయనీ, ఎంతో మందికి ఉపాధి లభించిందని తెలిపారు. గ్రామాల్లో మేస్త్రీలు, ప్లంబర్లు, కూలీలు ఇలా చాలా మంది ఉపాధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మిషన్ వల్ల దాదాపు 1.25 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక రూపంలో ఉపాధి పొందినట్లు యునిసెఫ్ అంచనా తెలిపినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. నేటి తరం మహిళా మేస్త్రీలు స్వచ్ఛ భారత్ అభియాన్ కారణంగా సాధ్యమైన భారీ మార్పుగా అభివర్ణించిన ప్రధానమంత్రి, మన యువత సైతం క్లీన్-టెక్ ద్వారా మంచి ఉద్యోగావకాశాలను పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం క్లీన్-టెక్‌కు సంబంధించి దాదాపు 5 వేల అంకురసంస్థలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. నీరు, పారిశుద్ధ్య రంగంలో, వ్యర్థాల నుంచి సంపదను పొందడం, వృధా, వ్యర్థాలను సేకరించి, రవాణా చేయడం, నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్ వంటి అనేక కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ రంగంలో 65 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నామని, స్వచ్ఛభారత్ మిషన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

 

“స్వచ్ఛభారత్ మిషన్ భారతదేశంలో సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది”, గృహాల నుంచి ఉత్పత్తయ్యే వ్యర్థాలు ఇప్పుడు విలువైన వనరులుగా మారుతున్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. గృహ వ్యర్థాల నుంచి కంపోస్టు, బయోగ్యాస్‌, విద్యుత్‌, రోడ్డు నిర్మాణానికి వినియోగించే చార్‌కోల్ వంటి పదార్థాలు తయారవుతున్నాయన్నారు. గోబర్‌ధన్ యోజన విజయం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మార్పు కోసం కీలకమైన చోదకశక్తిగా దానిని అభివర్ణించారు. జంతు వ్యర్థాలను బయోగ్యాస్‌గా మారుస్తున్న గోబర్‌ధన్ యోజన కింద గ్రామాల్లో వందలాది బయోగ్యాస్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వందలాది కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు, అనేక కొత్త సీబీజీ ప్లాంట్లు ప్రారంభించినట్లు తెలిపిన ప్రధానమంత్రి, ఈ చొరవను మరింత విస్తరించడానికి మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.

 

భవిష్యత్ సవాళ్లను ప్రస్తావిస్తూ, ఆర్థిక వ్యవస్థ, పట్టణీకరణలో వేగవంతమైన మార్పులకు అనుగుణంగా మార్పు చెందాల్సిన అవసరాన్ని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. వేగవంతమైన పట్టణీకరణ, వ్యర్థాల ఉత్పత్తిని ఎదుర్కోవడానికి సమర్థమంతమైన వ్యర్థాల నిర్వహణ కోసం వ్యూహాలను మెరుగుపరచాలని ఆయన స్పష్టం చేశారు. వ్యర్థాల విడుదల లేకుండా, అత్యంత తక్కువగా ఉండేలా రీసైకిల్ సామాగ్రి, ఇంటి నమూనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నిర్మాణంలో సాంకేతికతలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీటి దుర్వినియోగం అడ్డుకోవడానికి, వినియోగానికి ముందు మురుగునీటిని శుద్ధి చేయడానికి కృషి చేయాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. నమామి గంగే మిష‌న్‌ను న‌దుల ప‌రిశుభ్ర‌త‌ కోసం ఒక నమూనాగా అభివర్ణించిన ప్ర‌ధానమంత్రి, గంగా నది ఈ రోజు చాలా పరిశుభ్రంగా ఉందని తెలిపారు. అమృత్ మిషన్, అమృత్ సరోవర్ కార్యక్రమాలు గణనీయమైన మార్పును తెస్తున్నాయనీ, నీటి సంరక్షణ, శుద్ధి, నదుల పరిశుభ్రత కోసం కొత్త సాంకేతికతల రూపకల్పన కోసం నిరంతర పెట్టుబడుల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. పరిశుభ్రత, పర్యాటకం మధ్య సంబంధాన్ని ప్రధాని మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, స్వచ్ఛమైన పర్యాటక ప్రదేశాలు, వారసత్వ ప్రదేశాలు సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. మన పర్యాటక ప్రదేశాలు, విశ్వాస స్థలాలు, వారసత్వ ప్రదేశాలను పరిశుభ్రంగా, చక్కటి నిర్వహణతో ఉంచడం చాలా అవసరమని అన్నారు.

 

గత దశాబ్దంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ, “ఈ పదేళ్ల స్వచ్ఛ భారత్‌లో మనం చాలా సాధించాం, కానీ మన లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి పౌరుడు పరిశుభ్రతను తమ కర్తవ్యంగా, బాధ్యతగా స్వీకరించినప్పుడే నిజమైన మార్పు సాధ్యం.” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ పట్ల ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. పరిశుభ్రమైన భారతదేశాన్ని సాధించడానికి ప్రతి పౌరుడు నిరంతర తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత ఒకరోజు ఆచారం కాదని, జీవితాంతం పాటించాల్సిన ఆచారమని, దీనిని తరం నుంచి తరానికి ముందుకు తీసుకెళ్లాలన్నారు. పరిశుభ్రత ప్రతి పౌరుని సహజ లక్షణంగా ఉండాలి అలాగే అది ప్రతిరోజూ జరగాలి”, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిజమైన పరిశుభ్ర దేశంగా మారేంత వరకు విశ్రమించకుండా కృషి చేయాలని ఆయన రాబోయే తరం పిల్లలకు ఉద్బోధించారు.

 

జిల్లా, మండల, గ్రామ, స్థానిక సంస్థల స్థాయిల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. జిల్లాలు, మండలాల వారీగా పరిశుభ్రమైన పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాల కోసం పోటీలు నిర్వహించాలని సూచించారు. మున్సిపాలిటీలు తప్పనిసరిగా పబ్లిక్ టాయిలెట్లను చక్కగా నిర్వహించాలని, పరిశుభ్రత వ్యవస్థలు పాత పద్ధతుల వైపు మళ్లకుండా చూడాలని ఆయన కోరారు. స్థానిక సంస్థలు పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలకు, వాటి సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కోరారు. పౌరులందరూ ఇంట్లో, వారి పరిసరాల్లో, వారి కార్యాలయంలో ఎక్కడ ఉన్నా పరిశుభ్రతను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. "మనం మన ప్రార్థనా స్థలాలను శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన పరిసరాల పరిశుభ్రత పట్ల అదే భక్తి భావాన్ని కలిగి ఉండాలి", అని సూచించిన ఆయన, వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణంలో పరిశుభ్రత పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర జలశక్తి శాఖా మంత్రి శ్రీ సీ ఆర్ పాటిల్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ తోఖాన్ సాహు అలాగే కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి పాల్గొన్నారు.

 

నేపధ్యం

 

ఈ కార్య‌క్ర‌మంలో పారిశుధ్యం, పరిశుభ్రత‌కు సంబంధించిన రూ. 9600 కోట్లకు పైగా విలువైన ప‌లు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాప‌న‌ చేశారు. అమృత్, అమృత్ 2.0 కింద పట్టణ నీటి, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరిచే లక్ష్యంతో రూ. 6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులు, క్లీన్ గంగా కోసం జాతీయ మిషన్ కింద గంగా పరీవాహక ప్రాంతాల్లో నీటి నాణ్యత, వ్యర్థాల నిర్వహణ గురించి రూ.1550 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు, గోబర్‌ధన్ పథకం కింద రూ. 1332 కోట్ల విలువైన 15 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నాయి.

 

స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమం దశాబ్ద కాలంగా దేశంలో సాధించిన పారిశుద్ధ్య విజయాలను, ఇటీవలే ముగిసిన స్వచ్ఛతా హి సేవా ప్రచార విజయాలను ప్రదర్శిస్తుంది. ఈ జాతీయస్థాయి ప్రయత్నం కోసం తదుపరి వేదికను ఇది సిద్ధం చేస్తుంది. సంపూర్ణ స్వచ్ఛతా స్ఫూర్తి దేశంలోని ప్రతి మూలకు చేరేలా దేశవ్యాప్తంగా స్థానిక ప్రభుత్వ సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు అలాగే కమ్యూనిటీ నాయకుల భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

 

ఈ ఏడాది స్వచ్ఛతా హి సేవా నినాదం, ‘స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత’, ఇది పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణ సుస్థిరత పట్ల నిబద్ధతతో దేశాన్ని మరోసారి ఏకం చేసింది. స్వచ్ఛతా హి సేవా 2024 కింద, 17 కోట్ల మందికి పైగా ప్రజల భాగస్వామ్యంతో 19.70 లక్షలకు పైగా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాదాపు 6.5 లక్షల యూనిట్లను పరిశుభ్రంగా మార్చే లక్ష్యం సాకారమైంది. 30 లక్షల మందికి పైగా సఫాయి మిత్రలకు ప్రయోజనం కలిగించే దాదాపు 1 లక్ష సఫాయిమిత్ర సురక్షా శిబిరాలు కూడా నిర్వహించారు. ఇంకా, ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా 45 లక్షలకు పైగా చెట్లను నాటారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi