‘‘భారత్ నేడు భారీ ముందంజకు సిద్ధమని ప్రపంచం భావిస్తున్నదంటే-
దాని వెనుక పదేళ్ల శక్తిమంతమైన వేదిక ఉందన్నది సుస్పష్టం’’;
‘‘ఈ 21వ శతాబ్దపు భారతదేశం కలలు ఎంతమాత్రం చిన్నవి కావు... నేటి ఆలోచనలన్నీ అత్యుత్తమం.. అసాధారణ లక్ష్యాలకు ఆలవాలం’’;
‘‘భారతదేశంలో ప్రభుత్వం మీద.. వ్యవస్థలపైనా నమ్మకం పెరుగుతోంది’’;
‘‘ప్రభుత్వ కార్యాలయాలు నేడు సమస్యాత్మకం కాదు.. ప్రజాహితమైనవిగా మారాయి’’;
‘‘గ్రామాలను దృష్టిలో ఉంచుకుంటూ మా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది’’;
‘‘అవినీతి నిర్మూలన ద్వారా ప్రగతి ఫలితాలు దేశంలో ప్రతి ప్రాంతానికీ సమానంగా చేరేలా జాగ్రత్తలు తీసుకున్నాం’’;
‘‘సంతృప్త పాలనపై మా విశ్వాసం అచంచలం.. కొరత రాజకీయాలను మేం కోరుకోం’’;
‘‘దేశమే ప్రథమం’ సూత్రానికి ప్రాధాన్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది’’;
‘‘రాబోయే దశాబ్దాల కోసం ఈ 21వ శతాబ్దపు భారతాన్ని మనం నేడే సిద్ధం చేయాలి.. ‘భవిష్యత్తు భారతదేశానిదే’’;

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ‘న్యూస్9 ప్రపంచ సదస్సు’లో ప్రసంగించారు. ఈ మేరకు ‘‘భారత్: భారీ ముందంజకు సిద్ధం’’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ- టీవీ9 పత్రికా విలేకరుల బృందం భారతదేశ వైవిధ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఆ సంస్థ నడుపుతున్న బహుభాషా వార్తావేదికలు ‘టీవీ9’ను సచేతన భారత ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా నిలుపుతున్నాయని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సదస్సు ఇతివృత్తం ‘‘భారత్: భారీ ముందంజకు సిద్ధం’’ను ప్రస్తావిస్తూ- అనురక్తి, ఉత్సాహం ఉప్పొంగుతున్నపుడు ఎంత భారీ స్థాయిలోనైనా దూసుకెళ్లడం సాధ్యమేనని ప్రధాని స్పష్టం చేశారు. ఇందుకు తగిన ప్రయోగవేదికను 10 సంవత్సరాల కృషితో సిద్ధం చేశామని, ఈ దిశగా భారత్ ఆత్మవిశ్వాసం, ఆకాంక్షలను ప్రస్తుత సదస్సు ఇతివృత్తం కూడా ప్రతిబింబిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన పదేళ్లలో దేశ పరివర్తనాత్మకతకు ఆలోచన ధోరణి, ఆత్మవిశ్వాసం, సుపరిపాలన మూల సూత్రాలుగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు.

   భారతదేశ భవిష్యత్తులో పౌర కర్తవ్యానికిగల కీలక పాత్రను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఓటమి భయంతో కూడిన ఆలోచన ధోరణి ఎన్నడూ విజయానికి దారితీయదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ ఆలోచన ధోరణిలో మార్పుతోపాటు దేశం అనూహ్య శిఖరాలకు ఎదిగిన తీరు అద్భుతమని వ్యాఖ్యానించారు. గత నాయకత్వ హయాంలో ప్రతికూల దృక్పథం, అవినీతి, కుంభకోణాలు, విధాన స్తంభన, అనువంశిక రాజకీయాలు దేశ పునాదులను దుర్బలం చేశాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అటువంటి దుస్థితి నుంచి ప్ర‌పంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నేడు భారత్ ఎదగడాన్ని ఆయన ప్రముఖంగా ప్ర‌స్తావించారు. ‘‘ప్రస్తుత 21వ శతాబ్దపు భారతదేశం కలలు ఎంతమాత్రం చిన్నవి కావు. నేటి ఆలోచనలన్నీ అత్యుత్తమం, అసాధారణ లక్ష్యాలకు ఆలవాలం. కాబట్టే యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. అంతేకాదు... భారతదేశంతో జట్టుకడితే లభించే ప్రయోజనాలపై దృష్టి సారించింది’’ అన్నారు.

 

   మన దేశం 2014కు ముందునాటి పదేళ్లతో పోలిస్తే ఆ తర్వాతి దశాబ్దంలో సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) రికార్డు స్థాయిలో 300 బిలియన్ డాలర్ల నుంచి 640 బిలియన్ డాలర్లకు పెరిగాయన్నారు. అలాగే భారత డిజిటల్ విప్లవంతోపాటు మన కోవిడ్ టీకాలపై విశ్వవ్యాప్త నమ్మకం, దేశంలో పెరుగుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య వగైరాలను కూడా గుర్తుచేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇవన్నీ ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దేశంలో మ్యూచువ‌ల్ ఫండ్స్ వృద్ధిని  ప్ర‌స్తావిస్తూ- 2014లో ప్ర‌జ‌ల పెట్టుబడులు రూ.9 ల‌క్ష‌ల కోట్లు కాగా- 2024కల్లా రూ.52 ల‌క్ష‌ల కోట్లుగా నమోదై తారస్థాయికి చేరినట్లు ప్ర‌ధాని వెల్లడించారు. ‘‘దేశం ఎంతో శక్తిమంతంగా ముందుకు సాగుతున్నదని ఈ పరిణామాలన్నీ పౌరులకు రుజువు చేస్తున్నాయి. అలాగే వారిలో ఆత్మవిశ్వాసంతోపాటు ప్రభుత్వపైనా విశ్వాసం కూడా అదే స్థాయిలో పెరిగింది’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మరోవు ప్రభుత్వ పని సంస్కృతి, సుపరిపాలన కూడా ఈ సర్వతోముఖాభివృద్ధికి కారణాలని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ కార్యాలయాలు నేడు ఎంతమాత్రం సమస్యాత్మకం కాదు... అవి నేడు ప్రజాహితమైనవిగా మారిపోయాయి’’ అన్నారు.

   ఈ దూకుడు కోసం గేరు మార్చాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని అన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా దశాబ్దాల నుంచీ స్తంభించిన ప్రాజెక్టులను తాము అధికారంలోకి వచ్చాక పూర్తిచేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని సరయూ కెనాల్ ప్రాజెక్ట్, సర్దార్ సరోవర్ యోజన, మహారాష్ట్రలో కృష్ణా కోయెన పరియోజన వంటి వాటిని ఈ సందర్భంగా ప్రధాని ఉదాహరించారు. ఇక  2002లో శంకుస్థాపన చేసిన అటల్ సొరంగం పనులు 2014 నాటికీ అసంపూర్తిగా మిగిలాయని, అటుపైన తమ ప్రభుత్వం వాటిని తిరిగి మొదలుపెట్టి చివరకు 2020లో ప్రారంభోత్సవం కూడా చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా అస్సాంలోని బోగీబీల్ బ్రిడ్జి ఉదంతాన్ని కూడా ఆయనొక దృష్టాంతంగా చూపారు. ఈ వంతెన పని వాస్తవానికి 1998లో ప్రారంభమైనా, తమ హయాంలో ఎట్టకేలకు 2018లో పూర్తయిందని గుర్తుచేశారు. అలాగే తూర్పు ప్రత్యేక సరకు రవాణా కారిడార్ 2008లో మొదలుపెట్టినా 15 ఏళ్ల తర్వాత చివరకు 2023లో పూర్తయిందని పేర్కొన్నారు. ఈ విధంగా ‘‘ప్రస్తుత ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాకే వందలాది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి’’ అని ఆయన ముక్తాయించారు.

   దేశవ్యాప్తంగా భారీ ప్రాజెక్టుల పురోగమనాన్ని పర్యవేక్షించడానికి ‘ప్ర‌గ‌తి’ పేరిట నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ వచ్చినట్లు ప్రధాని గుర్తుచేశారు. తద్వారా గడచిన పదేళ్లల వ్యవధిలో రూ.17 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టులను ‘ప్రగతి’ యంత్రాంగం కింద క్రమానుగతంగా స‌మీక్షిస్తూ పనులను ముందుకు నడిపించామని తెలిపారు. ఈ ప్రాజెక్టులలో- అటల్ సేతు, పార్లమెంటు భవనం, జమ్ము ఎయిమ్స్, రాజ్‌కోట్ ఎయిమ్స్, ఐఐఎం-సంబల్‌పూర్, తిరుచ్చి విమానాశ్రయం కొత్త టెర్మినల్, ఐఐటి-భిలాయ్, గోవా విమానాశ్రయం, లక్షద్వీప్ నుంచి బనాస్ వరకూ సముద్రగర్భ కేబుళ్లు వగైరా ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేశామని ప్రధానమంత్రి ఉదాహరించారు. వారణాసిలో పాడి పరిశ్రమ, ద్వారకలో  సుదర్శన్ సేతు వంటివాటికి తానే శంకుస్థాపన చేసి, అటుపైన జాతికి అంకితం చేశానని గుర్తుచేశారు. ‘‘పన్ను చెల్లింపుదారుల సొమ్ముపై గౌరవంతోపాటు సంకల్ప శక్తి ఉన్నపుడే దేశం ముందడుగు వేయడంతోపాటు మరింత ఉన్నత శిఖరాలకు చేరడానికి సిద్ధం కాగలదని స్పష్టం చేశారు.

 

   ఈ సందర్భంగా ఇటీవల కేవలం ఒక వారంలో నిర్వహించిన కార్యకలాపాల జాబితాను ప్రధానమంత్రి ఏకరవు పెట్టారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న జమ్ము నుంచి  ‘ఐఐటి, ఐఐఎం, ఐఐఐటీ’ల వంటి ఉన్నత విద్యా సంస్థలను పెద్ద సంఖ్యలో ప్రారంభించడాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే ఫిబ్రవరి 24న రాజ్‌కోట్ నుంచి 5 ‘ఎయిమ్స్’ సంస్థలను జాతికి అంకితం చేశామని, అంతేకాకుండా ఈ ఉదయం 500కుపైగా అమృత్ స్టేషన్ల పునరుద్ధరణ సహా 2000కుపైగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అంతేకాకుండా మరో రెండు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో తన పర్యటన సందర్భంగా ఈ ప్రగతి కానుకల పరంపర కొనసాగుతుందని ఆయన తెలిపారు. ‘‘మేం తొలి, మలి, తృతీయ పారిశ్రామిక విప్లవాల్లో వెనుకబడ్డాం... కానీ, నేడు నాలుగో విప్లవంలో ప్రపంచానికి మనమే నాయకత్వం వహించాలి’’ అని ప్రధానమంత్రి ప్రగాఢ ఆకాంక్షను ప్రకటించారు. ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన మరికొన్నిటి వివరాలను కూడా ఆయన వివరించారు. దేశంలో సగటున నిత్యం 2 కొత్త కళాశాలలు, ప్రతి వారం ఓ కొత్త విశ్వవిద్యాలయం, 55 పేటెంట్లు, 600 ట్రేడ్‌మార్కులు, నిత్యం 1.5 లక్షల ముద్ర రుణాలు, 37 అంకుర సంస్థలు, రూ.16 వేల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు, రోజుకో 3 కొత్త జనఔషధి కేంద్రాల ఏర్పాటు, 14 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, 50 వేల వంటగ్యాస్ కనెక్షన్లు, ప్రతి సెకనుకూ ఓ కొళాయి కనెక్షన్, నిత్యం 75 వేల మందికి పేదరిక విముక్తి వంటివాటిని ప్రధాని ఉదాహరించారు.

   దేశంలో వినియోగ సరళిపై ఇటీవల వెల్లడైన ఓ నివేదికను ప్రస్తావిస్తూ- పేదరికం ఇప్పటికే కనిష్ఠ  స్థాయికి... అంటే ఏకసంఖ్యకు చేరిందన్న వాస్తవాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ గణాంకాల ప్రకారం... వివిధ వస్తు-సేవలపై ఖర్చులో వ్యక్తుల సామర్థ్యం పెరిగిందన్నారు. అలాగే దశాబ్దం కిందటితో పోలిస్తే వినియోగ స్థాయి 2.5 రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు. ‘‘గడచిన పదేళ్లలో నగరాలతో పోలిస్తే గ్రామీణ వినియోగం చాలా వేగంగా పెరిగింది. అంటే- గ్రామీణుల ఆర్థిక సామర్థ్యం పెరుగుతోందని, వారివద్ద ఖర్చు చేయగల సొమ్ము పెరిగిందని అర్థం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటూ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని ప్రధాని చెప్పారు. ఫలితంగా అనుసంధానం మెరుగుతోపాటు కొత్త ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆదాయం లభించడమేగాక గ్రామీణ భారతం బలపడిందని ఆయన అన్నారు. ‘‘దేశంలో తొలిసారి మొత్తం వ్యయంలో ఆహారంపై ఖర్చు 50 శాతంకన్నా తక్కువగా ఉంది.. అంటే- లోగడ తమ శక్తినంతా ఆహార సేకరణలో వెచ్చిస్తూ వచ్చిన కుటుంబాలు, వాటిలోని సభ్యులు నేడు ఇతరత్రా అంశాలపై డబ్బు ఖర్చు చేయగలుగుతున్నారు’’ అని ప్రధాని వివరించారు.

 

   గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను అనుసరించిందని పేర్కొంటూ- గడచిన పదేళ్లలో అవినీతి నిర్మూలనతోపాటు ప్రగతి ఫలాలు అందరికీ సమానంగా అందించడం ద్వారా భారతదేశం గతకాలపు కొరత రాజకీయాల వలనుంచి విముక్తమైందని వ్యాఖ్యానించారు. ఆ మేరకు ‘‘సంతృప్త పాలనపై మా విశ్వాసం అచంచలం. అందువల్ల కొరత రాజకీయాలను మేం కోరుకోం’’ అన్నారు. అలాగే ‘‘బుజ్జగింపులకు బదులు ప్రజల సంతోషం, సంతృప్తి మార్గానికే మేం ప్రాధాన్యమిచ్చాం’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గత దశాబ్ద కాలం నుంచీ తమ ప్రభుత్వం అనుసరిస్తున్న మంత్రం ఇదేనన్నారు. ‘‘ఇది సమష్టి కృషి... సామూహిక అభివృద్ధి’’ (సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్) అంటూ- ఒకనాటి ఓటు బ్యాంకు రాజకీయాలను నేటి ప్రభుత్వం తన పనితీరుతో సుపరిపాలన రాజకీయాలుగా మార్చిందని వివరించారు. ఈ నేపథ్యంలో ‘మోదీ గ్యారంటీ వాహనం’ గురించి ప్రస్తావిస్తూ- నేటి ప్రభుత్వం వివిధ సౌకర్యాలను లబ్ధిదారుల ఇంటిముంగిటకే చేరుస్తున్నదని ప్రధాని అన్నారు. ‘‘సంతృప్తత ఒక ఉద్యమంగా మారితే, ఎలాంటి వివక్షకూ ఆస్కారం ఉండదు’’ అని ప్రధాని మోదీ ఉద్వేగభరితంగా చెప్పారు. ఆ మేరకు  ‘‘మా ప్రభుత్వం దేశమే ప్రథమం’ సూత్రానికి ప్రాధాన్యంతో ముందడుగు వేస్తోంది’’ అని ప్రధాన వ్యాఖ్యానించారు. గతకాలపు సవాళ్లను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం సంక్లిష్ట నిర్ణయాలు తీసుకున్నదని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ముమ్మారు తలాఖ్ రద్దు, నారీశక్తి వందన్ అధినియం చట్టం, ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్, సాయుధ దళాల ప్రధానాధిపతి పదవి సృష్టి వగైరాలను ఆయన ఉదాహరించారు. వీటన్నిటినీ ‘దేశమే ప్రథమం’ అనే సూత్రం ఆదారంగానే పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.

 

   ఈ 21వ శతాబ్దపు భారతదేశాన్ని సర్వసన్నద్ధం చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ మేరకు వేగంగా రూపొందుతున్న ప్రణాళికల గురించి తెలిపారు. ‘‘అంతరిక్షం నుంచి సెమి-కండక్టర్ వరకు; డిజిటల్ నుంచి డ్రోన్లదాకా; కృత్రిమ మేధ (ఎఐ) నుంచి పరిశుభ్ర ఇంధనం వరకూ; 5జి నుంచి ఫిన్‌టెక్ దాకా... అనేక విధాలుగా భారత్ నేడు ప్రపంచంలో అగ్రస్థానానికి చేరింది’’  అని ఆయన అన్నారు. ప్రపంచ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి భారత్ అతిపెద్ద శక్తులలో ఒకటిగా ఎదిగిందన్నారు. అలాగే సాంకేతికార్థికత అనుసరణ విషయంలో వృద్ధిశాతం అత్యధికంగా నమోదవుతున్నదని తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా, సౌరశక్తి స్థాపిత సామర్థ్యంలో ప్రపంచ ప్రముఖ దేశాలలో ఒకటిగా భారత్ ముందంజ వేసిందని ఆయన నొక్కిచెప్పారు. 5జి నెట్‌వర్క్ విస్తరణలో ఐరోపాను వెనక్కు నెట్టడమేగాక, సెమి కండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి, హరిత ఉదజని వంటి భవిష్యత్ ఇంధనాలపై సత్వర ప్రగతిలోనూ ముందంజలో ఉందని వివరించారు.

 

   చివరగా- ‘‘నేడు భారత్ తన ఉజ్వల భవిష్యత్తు దిశగా ముమ్మర కృషి చేస్తోంది. మన దేశానిది భవిష్యత్ దృక్పథం... ఆ మేరకు అన్ని దేశాలూ ‘భవిష్యత్తు భారతదేశానిదే’ అంటున్నాయి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్ల కాలానికిగల ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. మూడో దఫా నాయకత్వం ద్వారా భార‌తదేశాన్ని కొత్త ఎత్తులకు చేర్చగలమని ఆయన ధీమా వెలిబుచ్చారు. రాబోయే ఐదేళ్లలో భారత్ అప్రతిహత పురోగమనం ద్వారా వికసిత భారతావనిగా కీర్తిని అందుకోవాలన్న ప్రగాఢ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."