ధర్మంలో అభిధమ్మ ఉంది, ధర్మసారాన్ని అర్థం చేసుకోవడానికి పాళీ భాషలో ప్రావీణ్యం అవసరం: పీఎం
భాష కేవలం సమాచార సాధనం కాదు, నాగరికత, సంస్కృతికి ఆత్మ: పీఎం
ప్రతి దేశం తన గుర్తింపును వారసత్వంతో ముడిపెడుతుంది. దురదృష్టవశాత్తూ ఈ అంశంలో భారత్ వెనకబడి ఉంది, ఇప్పుడు ఆత్మన్యూనత నుంచి బయటపడి, పెద్ద నిర్ణయాలు తీసుకొంటోంది: పీఎం
నూతన విద్యా విధానం ద్వారా యువతకు మాతృభాషలో చదివే అవకాశం దొరకడంతో భాషలు మరింత బలోపేతమవుతాయి: పీఎం
నేటి భారత్ వేగవంతమైన అభివృద్ధిని, సుసంపన్నమైన వారసత్వాన్ని ఏకకాలంలో నిర్వర్తించే పనిలో నిమగ్నమైంది : పీఎం
బుద్ధ భగవానుని పునరుజ్జీవనంలో భారత్ తన సంస్కృతి, నాగరికతను తిరిగి ఆవిష్కరిస్తోంది: పీఎం
భారత్ ప్రపంచానికి బుద్ధుడినిచ్చింది.. యుద్ధాన్ని కాదు: పీఎం
ఈ రోజు అభిధమ్మ పర్వదినం సందర్భంగా యుద్ధాన్ని వదలి బుద్ధుడు సూచించిన శాంతి మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రపంచాన్ని కోరుతున్నాను: పీఎం
అందరికీ శ్రేయస్సు అనే బుద్ధుని సందేశమే మానవత్వానికి మార్గం: పీఎం
భారత అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలో బుద్ధుని బోధనలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి: పీఎం

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.

ఈ సందర్భంగా అభిధమ్మ దివస్ వేడుకలకు హాజరయ్యే అవకాశం లభించినందుకు ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు.  ప్రేమ, కరుణతో ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చవచ్చని అన్నారు. గతేడాది కుశీనగర్లో ఇదే తరహా కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. జన్మించినప్పటి నుంచి మొదలై ఇప్పటి వరకు బుద్ధ భగవానునితో తన అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. గుజరాత్‌లోని వాద్‌నగర్లో తాను జన్మించానని, ఒకప్పుడు అది ప్రముఖ బౌద్ధ క్షేత్రమని ప్రధానమంత్రి తెలిపారు. ఈ క్షేత్రం బుద్ధుని ధర్మం, బోధనలతో తన అనుభవాలకు ప్రేరణగా మారిందని వెల్లడించారు. గత పదేళ్లుగా దేశవిదేశాల్లో బుద్ధునికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తనకు వచ్చిన అవకాశాల గురించి ప్రధాని వివరించారు. నేపాల్‌లోని బుద్ధ జన్మక్షేత్ర సందర్శన, మంగోలియాలో బుద్ధ భగవానుని విగ్రహావిష్కరణ, శ్రీలంకలో వైశాఖి సమారోహ్‌లో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేసుకున్నారు. సంఘాన్నీ, సాధకుడినీ కలిపింది బుద్దుడి ఆశీర్వాద ఫలితమేనని ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు. శరద్ పూర్ణిమ, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 

బుద్ధుడు తన ప్రవచనాలను చెప్పిన పాళీ భాషకు ఈ నెలలోనే భారత ప్రభుత్వం నుంచి ప్రాచీన భాషగా గుర్తింపు లభించడం ఈ ఏడాది అభిధమ్మ దివస్ ప్రత్యేకంగా మారిందని ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు బుద్ధ భగవానుడు అందించిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి దక్కిన గౌరవంగా ప్రధాని అభివర్ణించారు. ధర్మంలో అభిధమ్మ ఉందని, దాని సారాన్ని అర్థం చేసుకోవడానికి పాళీ భాషలో ప్రావీణ్యం ఉండాలని శ్రీ మోదీ అన్నారు. ధర్మం అంటే బుద్ధుని సందేశమని, మానవ ఉనికికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమని, మానవాళికి శాంతి మార్గమని, బుద్ధుని నిత్య బోధనలని, సమస్త మానవాళి సంక్షేమానికి ఇచ్చిన హామీ అని శ్రీ మోదీ వివరించారు. బుద్ధుని ధర్మం ద్వారా  ఈ ప్రపంచం నిరంతరం జ్ఞానం పొందుతోందని అన్నారు.

బుద్ధుడు మాట్లాడిన పాళీ భాష దురదృష్టవశాత్తూ వాడుకలో లేదని ప్రధాని అన్నారు. భాష అనేది మాట్లాడుకోవడానికి మాత్రమే కాదని, అది సంస్కృతి, సంప్రదాయాలకు ఆత్మవంటిదని తెలిపారు. ఇది ప్రాథమిక వ్యక్తీకరణతో ముడిపడి ఉందని, ప్రస్తుత తరుణంలో పాళీని సజీవంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ బాధ్యతను వినమ్రంగా నిర్వర్తించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. కోట్ల మంది బుద్ధ భగవానుని అనుచరులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

 

‘‘భాష, సాహిత్యం, కళలు, ఆధ్యాత్మిక వారసత్వాలే ఒక సమాజ ఉనికిని తెలియజేస్తాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఏ దేశమైనా తన భూభాగంలో చారిత్రక అవశేషం లేదా కళాకృతి బయటపడినప్పుడు దాన్ని ప్రపంచం ముందు సగర్వంగా ప్రదర్శిస్తాయని అన్నారు. ప్రతి దేశం తన ఉనికితో గత వారసత్వాన్ని అనుసంధానించుకుంటోందని, ఈ విషయంలో భారత్ వెనకబడి ఉందని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన దండయాత్రలు, స్వాతంత్ర్యం అనంతరం కొనసాగిన బానిస మనస్తత్వమే దీనికి కారణమన్నారు. ఇక్కడి వ్యవస్థలను భారతదేశంలోని తిరోగమన శక్తులు ఆక్రమించాయని అభిప్రాయపడ్డారు. భారత దేశ ఆత్మలో నిండి ఉన్న బుద్ధుడు, స్వాతంత్ర్య సమయంలో స్వీకరించిన అతని చిహ్నాలు తదనంతర దశాబ్దాల్లో మరుగున పడిపోయాయని అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా పాళీకి సరైన గుర్తింపు దక్కలేదని విచారం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దేశం ఆత్మన్యూనత భావన నుంచి బయటపడుతోందని, పెద్ద నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఓ వైపు పాళీ భాషకు ప్రాచీన భాష హోదాను కల్పిస్తూ, అదే గౌరవాన్ని మరాఠీకి కూడా ఇచ్చినట్లు తెలిపారు. మరాఠీ మాతృభాష అయిన బాబా సాహెబ్ అంబేద్కర్ సైతం బౌద్ధ ధర్మాన్ని పాటించేవారని, ధర్మ దీక్షను పాళీలోనే స్వీకరించారని తెలిపారు. బెంగాలీ, అస్సామీ, ప్రాకృత భాషలకు ప్రాచీన హోదాను కల్పించడంపై చర్చించారు.

 

‘‘భారత్‌లోని వివిధ భాషలే దేశ వైవిధ్యాన్ని పోషిస్తున్నాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. గతించిన కాలంలో భాషా ప్రాధాన్యం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ జాతి నిర్మాణంలో ప్రతి భాషా కీలక పాత్ర పోషించిందని శ్రీ మోదీ అన్నారు. దేశంలో అమల్లోకి వచ్చిన నూతన విద్యావిధానం కూడా భాషలను పరిరక్షించుకునే మాధ్యమంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండటంతో ఇప్పుడు అవి మరింత బలోపేతం అవుతాయని శ్రీమోదీ తెలిపారు.

వాగ్దానాలను నెరవేర్చేందుకు ఎర్ర కోట నుంచి ‘పంచ ప్రాణ్’ దృక్పథాన్ని ముందుకు తీసుకువచ్చినట్లు ప్రధాని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణం, బానిసత్వపు ఆలోచనల నుంచి విముక్తి, దేశ ఐక్యత, కర్తవ్య నిర్వహణ, వారసత్వం పట్ల గర్వపడటమే పంచ్ ప్రాణ్ ఉద్దేశమని శ్రీ మోదీ వివరించారు. ప్రస్తుతం భారత్ వేగవంతమైన అభివృద్ధి, ఘనమైన వారసత్వం అనే రెండు ఉద్దేశాలను ఏకకాలంలో నెరవేర్చడంలో నిమగ్నమై ఉందని ఆయన అన్నారు. భగవాన్ బుద్ధునికి సంబంధించిన వారసత్వ సంపద పరిరక్షణకు పంచ ప్రాణ్ కార్యక్రమం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.

 

భారత్, నేపాల్ దేశాల్లో బుద్ధుడికి సంబంధించిన ప్రదేశాలను బుద్ధిస్ట్ సర్క్యూట్‌గా అనుసంధానిస్తూ చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి శ్రీ మోదీ వివరించారు. కుశీ నగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, లుంబినీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్, లుంబినీలోని బౌద్ధ విశ్వ విద్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధ అధ్యయన కేంద్రం ప్రారంభమయ్యాయని తెలిపారు. బుద్ధగయ, శ్రావస్తి, కపిలవస్తు, సాంచి, సాత్నా, రేవా తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ నెల 20న  వారణాసి, సారనాథ్‌లో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. నూతన నిర్మాణాలతో పాటు భారతదేశ ఘనమైన వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. గత పదేళ్లలో 600 ప్రాచీన వారసత్వ కళాకృతులు, చిహ్నాలను ప్రభుత్వం దేశానికి తిరిగి తీసుకువచ్చిందని, వాటిలో ఎక్కువ భాగం బౌద్ధమతానికి సంబంధించినేవని శ్రీ మోదీ తెలిపారు. బుద్ధుని వారసత్వ పునరుజ్జీవనంలో భాగంగా భారత్ తన సంస్కృతి, నాగరికతలను సరికొత్తగా ఆవిష్కరిస్తోందన్నారు.

బుద్ధ భగవానుని బోధనలను దేశ ప్రయోజనాలకే పరిమితం చేయకుండా సమస్త మానవాళి సంక్షేమార్థం ప్రచారం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బుద్ధుని బోధనలు అనుసరించే దేశాలను ఏకం చేసే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. శ్రీలంక, మయన్మార్ లాంటి దేశాలు పాళీ భాషలోని వ్యాఖ్యానాలను చురుకుగా సంకలనం చేస్తున్నాయన్నారు. ఇదే తరహా ప్రయత్నాలను భారత్‌లోనూ చేస్తున్నామని, దానికోసం సంప్రదాయ పద్ధతులతో పాటు, ఆధునిక విధానాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు. పాళీ భాషను ప్రోత్సహించడానికి ఆన్‌లైన్ వేదికలు, డిజిటల్ ఆర్కైవ్స్, యాప్‌లు ఉపయోగిస్తున్నామని శ్రీ మోదీ వివరించారు. బుద్ధ భగవానుని బోధనలను ఆకళింపు చేసుకోవడంలో అంతర్గత అన్వేషణ, విద్యా పరిశోధన ప్రాధాన్యాన్ని వివరిస్తూ ‘‘జ్ఞానం, ప్రశ్నల కలయికే బుద్ధుడు’’ అని అన్నారు. యువతను ఈ కార్యక్రమం దిశగా నడిపించే విషయంలో బౌధ్ద విద్యాలయాలు, బిక్షువులు అందించిన తోడ్పాటు పట్ల గర్వం వ్యక్తం చేశారు.

 

21వ శతాబ్ధంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న అస్థిర పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత తరుణంలో బుద్ధుని బోధనలు ప్రపంచానికి అవసరమని స్పష్టం చేశారు. ‘‘భారత దేశం ప్రపంచానికి బుద్ధుడిని అందించింది. యుద్దాన్ని కాదు’’ అని ఐక్యరాజ్యసమితిలో తాను ఇచ్చిన సందేశాన్ని మరోసారి గుర్తుచేశారు. యుద్ధంలో కాకుండా బుద్ధుని బోధనల్లోనే ప్రపంచానికి సమాధానం దొరుకుతుందన్నారు. తథాగతుడి నుంచి నేర్చుకోవాలని, యుద్ధాన్ని తిరస్కరించి శాంతికి మార్గం సుగమం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. శాంతి కంటే గొప్ప ఆనందం మరొకటి లేదన్న బుద్ధ భగవానుడి మాటలను ఉటంకిస్తూ ప్రతీకారాన్ని కక్షతో అణచలేమని, కరుణ మానవత్వంతో మాత్రమే ద్వేషాన్ని అధిగమించగలమని అన్నారు. అందరి ఆనందం, క్షేమం కోరిన బుద్ధుని సందేశాన్ని వివరించారు.

2047 వరకు ఉన్న 25 ఏళ్ల కాలాన్ని భారత్ ‘అమృతకాలం’గా గుర్తించిందని శ్రీ మోదీ తెలిపారు. ఈ అమృతకాలం దేశ పురోభివృద్ధి సమయమని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించే కాలమని అన్నారు. ఈ ప్రయాణంలో బుద్ధ భగవానుని బోధనలు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఈ దేశం వనరులను సద్వినియోగం చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని అన్నారు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ మార్పుల సంక్షోభం గురించి మాట్లాడుతూ ఈ సమస్యకు భారత్  స్వయంగా పరిష్కారం కనుక్కోవడంతో పాటు ప్రపంచంతోనూ దాన్ని పంచుకుంటుందని తెలిపారు. ఇతర దేశాలను కలుపుకొని మిషన్ లైఫ్‌ను ప్రారంభించామన్నారు.

 

బుద్ధ భగవానుడి బోధనను శ్రీ మోదీ పఠిస్తూ మనం చేసే ఏ మంచి కార్యక్రమమైనా అది మనతోనే మొదలవ్వాలనే ఆలోచనే మిషన్ లైఫ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వ్యక్తి సరైన జీవన విధానం అవలంభించడం ద్వారానే అతని భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పడుతుందని ఆయన అన్నారు. జీ -20 దేశాలకు భారత్ అధ్యక్షత వహించిన సమయంలో అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి, బయో ఫ్యూయల్ కూటమి, ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్  విధానం మొదలైన వాటిని ప్రపంచానికి అందించిందని శ్రీ మోదీ తెలిపారు. వాటిన్నింటిలోనూ బుద్ధుని ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయని వివరించారు. భారత్ చేసే ప్రతి ప్రయత్నం ప్రపంచానికి భద్రమైన భవిష్యత్తును అందిస్తుందని తెలిపారు. భారత్–మధ్య ప్రాచ్యం–ఐరోపా ఆర్థిక కారిడార్, గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమం, 2030 నాటికి భారతీయ రైల్వేల్లో సున్నా కర్భన ఉద్ఘారాల లక్ష్యాన్ని చేరుకోవడం, పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ను 20 శాతానికి పెంచడం తదితర కార్యక్రమాల గురించి ప్రధాని ప్రస్తావించారు. భూమిని సంరక్షించే విషయంలో భారత్ దృఢ సంకల్పాన్ని ఇవి తెలియజేస్తాయి.

ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు బుద్ధుడు, ధర్మం, సంఘం నుంచే ప్రేరణ పొందాయని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచ సంక్షోభ సమయాల్లో మొదటగా భారత్ స్పందించడమే దీనికి ఉదాహరణ అని అన్నారు. టర్కీలో భూకంపం, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, కొవిడ్–19 మహమ్మారి లాంటి అత్యవసర సమయాల్లో దేశం తీసుకున్న వేగవంతమైన చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు. ఇది బుద్దుని కరుణ సూత్రాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ‘‘విశ్వ బంధువుగా అందరినీ తనతో పాటు భారత్ నడిపిస్తుందని’’ ఆయన వివరించారు. యోగా, చిరు ధాన్యాలు, ఆయుర్వేద, సహజ వ్యవసాయం లాంటి ఇతర కార్యక్రమాలకు బుద్ధుని బోధనల నుంచే ప్రేరణ పొందినట్లు తెలిపారు.

 

తన ప్రసంగాన్ని ముగిస్తూ ‘‘అభివృద్ధి దిశగా పయనిస్తున్న భారత్ తన మూలాలను సైతం బలోపేతం చేసుకొంటోంది’’ అని అన్నారు. భారత దేశ యువతకు తమ సంస్కృతి, విలువలకు ప్రాధాన్యమిస్తూనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచాన్ని ముందుండి నడిపించడమే లక్ష్యంగా మారాలని వివరించారు. ఈ ప్రయత్నాల్లో బౌద్ధ మత ప్రబోధాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయని, బుద్ధుని సందేశంతో భారత్ అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ను భారత ప్రభుత్వం, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి 14 దేశాలకు చెందిన విద్యావేత్తలు, బౌద్ధ బిక్షువులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల నుంచి బౌద్ధ ధర్మంపై ప్రావీణ్యమున్న యువ నిపుణులు సైతం పాల్గొన్నారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."