భారతీయ న్యాయవ్యవస్థ 2023-24 వార్షిక నివేదికను ఆవిష్కరించిన ప్రధానమంత్రి
మన రాజ్యాంగం ఒక చట్ట గ్రంథం ఏమీ కాదు; అది, ఎల్లప్పటికీ ప్రవహిస్తూనే ఉండే వాహిని: ప్రధానమంత్రి
మనకు వర్తమానంలోనే కాక భవిష్యత్తుకు కూడా దారిని చూపించేదే మన రాజ్యాంగం: ప్రధానమంత్రి
ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరికీ ఒకే ఒక లక్ష్యముంది.. వికసిత్ భారత్‌ను నిర్మించాలనేదే ఆ లక్షక్యం: ప్రధానమంత్రి
సత్వర న్యాయాన్నిఅందించడానికి అమలులోకి ఒక కొత్త జ్యుడిషియల్ కోడ్‌; శిక్ష వేయడమే ప్రధానంగా ఉన్న వ్యవస్థ ఇకపై న్యాయాధారిత వ్యవస్థగా మారింది: ప్రధానమంత్రి

న్యూఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధిత కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీ సంజీవ్ ఖన్నా, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ బీ.ఆర్. గవయి, జస్టిస్ శ్రీ సూర్యకాంత్, చట్ట, న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్, అటార్నీ జనరల్ లు సహా ఇతర ఉన్నతాధికారులు పాలుపంచుకొన్నారు.

 సభికులను ఉద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరు ఉన్నతాధికారులకు, ప్రతినిధులకు, పౌరులకు అభినందనలు తెలిపారు.  భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇది 75వ సంవత్సరం కావడం అమిత గర్వకారణమైన విషయం అని ఆయన వ్యాఖ్యానించారు.  రాజ్యాంగాన్ని ఆయన ప్రశంసిస్తూ, రాజ్యాంగ పరిషత్తు సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించారు.
 

ఈ రోజు, మనం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్న తరుణంలో, ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిగిన ఘటన వార్షికోత్సవం కూడా ఇదే రోజు అనే విషయాన్ని ప్రధాన మంత్రి చెబుతూ, దీనిని మనం మరచిపోలేమన్నారు.  ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలను కోల్పోయిన వారికి, ఇతర బాధితులకు ఆయన నివాళి అర్పించారు.  మన దేశ భద్రతకు, సమైక్యతకు బెదరింపు గా పరిణమిస్తున్న ప్రతి ఒక్క ఉగ్రవాద సంస్థకూ  భారతదేశం దీటుగా జవాబు చెబుతుందని శ్రీ నరేంద్ర మోదీ మరో సారి స్పష్టంచేశారు.

భారతదేశ రాజ్యాంగం విషయంలో రాజ్యంగ పరిషత్తులో జరిగిన కూలంకష చర్చోపచర్చలను, వాదోపవాదాలను శ్రీ నరేంద్ర మోదీ గుర్తుకు తెచ్చారు.  ‘‘రాజ్యాంగం ఒక న్యాయవాది రూపొందించిన దస్తావేజు ఎంత మాత్రం కాదు.  అది ఒక స్ఫూర్తి, అంతేకాకుండా, అది ఎల్లప్పటికీ ఆ కాలపు స్ఫూర్తిని చాటుతూనే ఉంటుంది’’ అని బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటలను శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.  ఈ స్ఫూర్తి తప్పనిసరని, దేశ కాలమాన స్థితులను బట్టి అప్పటికి తగినవి అని అనుకున్న నిర్ణయాలను ఎప్పటికి అప్పుడు తీసుకొంటూ, రాజ్యాంగానికి అర్థ నిర్ణయం చేసే స్వతంత్రతను రాజ్యాంగ రూపకర్తలు మనకు అందించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  కాలం ముందుకు సాగిపోతుండే కొద్దీ దేశం కలలు, దేశం ఆకాంక్షలు సరికొత్త స్థాయిలను అందుకొంటాయన్న సంగతి రాజ్యాంగ శిల్పులకు ఎంతో బాగా తెలుసు.  మరి, స్వతంత్ర భారతదేశంలో ప్రజల అవసరాలు సైతం ఆయా సవాళ్ళతో పాటే, మార్పులకు లోనవుతాయని కూడా వారు ఎరుగుదురని ఆయన అన్నారు.  కాబట్టే, రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని కేవలం ఒక పత్రంగా కాక, నిరంతరమూ ప్రవహిస్తూ ఉండే చైతన్యవాహినిలాగా తీర్చిదిద్ది మరీ మనకు అందించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
 

‘‘మన రాజ్యాంగం మనకు వర్తమాన కాలంలోనూ, రాబోయే కాలంలోనూ దారిని చూపుతూ ఉంటుంద’’ని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 75 సంవత్సరాలుగా తలెత్తిన వేరు వేరు సవాళ్ళను పరిష్కరించడానికి ఒక సరి అయిన దోవను రాజ్యాంగం చూపింది అని కూడా ఆయన అన్నారు.  భారత ప్రజాస్వామ్యం అత్యవసర స్థితికి లోనైనప్పుడు రాజ్యాంగం అపాయకర స్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని కూడా ఆయన అన్నారు.  దేశంలో ప్రతి అవసరాన్ని, ప్రతి అపేక్షను రాజ్యాంగం నెరవేర్చిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.  ప్రస్తుతం జమ్మూ, కాశ్మీర్ లో కూడా డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ తీర్చిదిద్దిన రాజ్యాంగం అమలవుతోందంటే, అది రాజ్యాంగం ప్రసాదించిన శక్తి వల్లే అని ప్రధాని అన్నారు.  ఈ రోజు జమ్మూ, కాశ్మీర్‌లో మొట్టమొదటి సారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారని కూడా శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

భారతదేశం మార్పులో ఒక ముఖ్యమైన దశ లో  ప్రయాణిస్తున్నదని ప్రధానమంత్రి చెబుతూ, రాజ్యాంగం మనకు సరైన మార్గాన్ని చూపుతోందన్నారు.  ప్రస్తుతం పెద్ద పెద్ద కలలను, పెద్ద పెద్ద సంకల్పాలను నెరవేర్చుకోవాలన్నది భారతదేశ భవిష్యత్తు మార్గంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అంటూ, ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలనేదే దేశంలో ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉందని వ్యాఖ్యానించారు.  దీనిపై మరింత వివరంగా మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన భారతదేశం అంటే దానికి అర్థం దేశంలో ప్రతి ఒక్కరికీ మంచి జీవనం, ఆత్మగౌరవంతో నిండిన జీవనం లభించేటట్లుగా హామీనిచ్చే గడ్డ అని విడమరచారు. సామాజిక న్యాయానికి పూచీ పడేటటువంటి ఒక గొప్ప సాధనం ఇది, మరి రాజ్యాంగంలో ఉల్లేఖించిన భావం కూడా ఇదే అని ఆయన అన్నారు.  ఈ కారణంగానే, గడచిన కొన్నేళ్ళలో సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని అందించడానికి అనేక చర్యలను తీసుకోవడమైందన్నారు.  ఆ చర్యలలో, ఏ రోజూ బ్యాంకు గుమ్మం తొక్కి ఎరుగని వారి చేత 53 కోట్ల కన్నా ఎక్కువగా బ్యాంకు ఖాతాలను తెరిపించడం ఒక చర్య అని ఆయన చెప్పారు.  గత దశాబ్ద కాలంలో నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్ళను ఇచ్చాం.  కుటుంబంలోని మహిళలకు 10 కోట్ల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను సమకూర్చామని  ప్రధాని వివరించారు.  స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తరువాతా మన దేశంలో నల్లా కనెక్షన్లు కలిగి ఉన్న ఇళ్ళు 3 కోట్లు మాత్రమే అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.  గడచిన అయిదారేళ్ళలో 12 కోట్ల కన్నా ఎక్కువ కుటుంబాలకు నీరు నల్లాలో సరఫరా అయ్యే సదుపాయాన్ని తన ప్రభుత్వం కల్పించినందుకు తాను సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. ఈ చర్య పౌరుల జీవనాన్ని, ముఖ్యంగా మహిళల జీవనాన్ని సరళతరంగా మార్చివేసిందని ఆయన అన్నారు.  ఇది రాజ్యాంగ స్ఫూర్తికి మరింత బలాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.
 

రాజ్యాంగ సిసలు ప్రతిలో భగవాన్ రాముడు, సీతామాత, భగవాన్ హనుమంతుడు, భగవాన్ బుద్ధుడు, భగవాన్ మహావీరుడు లతోపాటు గురు గోవింద్ సింగ్‌ల చిత్రాలు ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ భారతీయ సంస్కృతి ప్రతీకలకు, రాజ్యాంగంలో చోటు కల్పించినందు వల్ల అది మనకు సదా మానవీయ విలువలను గుర్తు చేస్తూ ఉంటుందని కూడా ఆయన అన్నారు.  ‘‘ప్రస్తుత కాలంలో భారతీయ విధానాలకు, నిర్ణయాలకు ఆధారంగా ఉన్నది మానవతా విలువలే’’ అని’ ప్రధానమంత్రి అన్నారు.   పౌరులకు శీఘ్ర న్యాయాన్ని అందించడానికే భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.  శిక్షలు విధించడం ప్రధానంగా ఉంటూ వచ్చిన వ్యవస్థను ప్రస్తుతం న్యాయాన్ని అందించే వ్యవస్థగా మార్చడమైందని కూడా ఆయన చెప్పారు.  రాజకీయ వ్యవస్థలో మహిళలకు ప్రాతినిధ్యాన్ని పెంచడానికి చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చినట్లు ఆయన ప్రధానంగా చెప్పారు.  దివ్యాంగ జనులకు జీవన సౌలభ్యం కల్పించే చర్యలను తీసుకోవడంతోపాటు, థర్డ్ జెండర్‌కు చెందిన వారి హక్కులకు గుర్తింపును ఇచ్చే చర్యలను కూడా తీసుకొన్నట్లు ఆయన వివరించారు.

 ప్రస్తుతం భారతదేశం పౌరులకు జీవన సౌలభ్యం కల్పించడంపై ఎంతో శ్రద్ధను తీసుకొంటోందని శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ, వయోవృద్ధ పౌరులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌లను వారి ఇంటి ముంగిట్లోనే జారీ చేస్తున్న సంగతిని ప్రస్తావించారు.  ఇంతవరకు ఈ ప్రయోజనాన్ని దాదాపు కోటిన్నర మంది వయోవృద్ధులు అందుకొన్నారని ఆయన తెలిపారు.  ప్రతి పేద కుటుంబంలో రూ.5 లక్షల వరకు విలువైన వైద్య చికిత్స సంబంధిత సేవలను ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టిన దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని, అంతేకాకుండా 70 ఏళ్ళ వయస్సు పైబడిన వారికి సైతం ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను ఉచితంగా  ఇస్తున్నట్లు ఆయన వివరించారు.  దేశంలో వేల కొద్దీ జన్ ఔషధీ కేంద్రాల్లో మందులను వాటి ధరలలో 80 శాతం తగ్గింపును ఇస్తూ, అమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.  ఇదివరకు 60 శాతం బాలలకు టీకామందు రక్షణ లభిస్తే, ప్రస్తుతం మిషన్ ఇంద్రధనుష్ మాధ్యమం ద్వారా ఇది 100 శాతానికి చేరుకొంటోందని తెలియజేయడానికి తాను సంతోషిస్తున్నానని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  సుదూరాన ఉన్న గ్రామాల్లో చిన్న పిల్లలకు కూడా ప్రస్తుతం టీకామందును అందజేస్తున్నారని ఆయన చెప్పారు.  ఈ ప్రయత్నాలు పేద కుటుంబాలతోపాటు మధ్యతరగతి కుటుంబాలకు ఎన్నో ఇక్కట్లను తగ్గించివేశాయని ఆయన అన్నారు.
 

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాన్ని (యాస్పైరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్)  గురించి శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ, ఈ కార్యక్రమంలో 100 కన్నా ఎక్కువ వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసి, ప్రతి ఒక్క అభివృద్ధి కొలమానాన్ని ఆయా జిల్లాలు అందుకొనే దిశలో కృషి ముమ్మరంగా సాగుతోందన్నారు.  ఇతర జిల్లాల కన్నా మేలైన ఫలితాలను ఆకాంక్షాత్మక జిల్లాల్లో అనేక జిల్లాలు చూపుతున్నాయని ఆయన చెప్పారు.  ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం మాదిరిగానే ఇప్పుడు ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టిందని ప్రధానమంత్రి తెలిపారు.

పౌరుల జీవనంలో ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదిలేయడం లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.  కొన్నేళ్ళ కిందట విద్యుత్తు కనెక్షన్‌కు నోచుకోని కుటుంబాలలో రెండున్నర కోట్ల కన్నా ఎక్కువ కుటుంబాలకు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా విద్యుదీకరణ సదుపాయాన్ని అందించినట్లు ఆయన గుర్తుకు తెచ్చారు.  4జీ, 5జీ టెక్నాలజీల మాధ్యమం ద్వారా ప్రజలకు మొబైల్ కనెక్టివిటీ అందించడానికి సుదూర ప్రాంతాల్లో సైతం మొబైల్ టవర్లను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఆయన తెలిపారు.  సముద్ర జలాల్లో ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్‌లను ఏర్పాటు చేసి, అండమాన్, నికోబార్ దీవులలో, లక్షద్వీప్‌లో ప్రస్తుతం హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతిని వెల్లడించారు.  దేశంలో ఇళ్ళకు, వ్యవసాయ భూములకు భూమి రికార్డుల పద్ధతిని అమలు చేయడంలో  భారత్ అభివృద్ధి చెందిన దేశాలపైన ఆధిక్యాన్ని సంపాదించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పీఎమ్ స్వామిత్వ యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో భూములకు, గృహాలకు డ్రోన్ మాధ్యమం ద్వారా మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టి, చట్టబద్ధ దస్తావేజు పత్రాలను జారీ చేస్తున్న విషయాన్ని ఆయన తెలియజేశారు.
 

దేశం అభివృద్ధి చెందాలంటే ఆధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చడం శరవేగంగా జరగడం ఎంతైనా అవసరమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ఈ తరహా ప్రాజెక్టులను అనుకున్న కాలానికి పూర్తి చేయడంతో డబ్బు ఆదా కావడంతోపాటే ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు త్వరగా సిద్ధిస్తాయని ఆయన చెప్పారు.  మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను స్వయంగా ప్రధాని అధ్యక్షతన నిర్వహించే ‘ప్రగతి’ (పీఆర్ఏజీఏటీఐ) ప్లాట్ ఫాం మాధ్యమం ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.  రూ.18 లక్షల కోట్లకు పైచిలుకు విలువ కలిగిన ప్రాజెక్టులను ఈ వేదిక ద్వారా సమీక్షించి, ఆయా ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించడమైందన్నారు.  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసినందువల్ల ప్రజా జీవనంపై ఎన్నో విధాలైన సకారాత్మక ఫలితాలు ఆవిష్కారమయ్యాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ఈ ప్రయత్నాలు దేశ పురోగతికి దోహదం చేయడంతోపాటు రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తిని పటిష్ఠ పరుస్తున్నాయని ఆయన అన్నారు.

‘‘తమ సొంత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చే కొంత మంది నిజాయతీపరుల గుంపు కన్నా మరేదీ ప్రస్తుతం భారతదేశానికి అవసరం లేద’’ని 1949 నవంబరు 26న ఇచ్చిన ఉపన్యాసంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలను శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించే ముందు వల్లించారు.  ‘నేషన్ ఫస్ట్’ (దేశానికే ప్రాధాన్యం) స్ఫూర్తి భారత రాజ్యాంగాన్ని రాబోయే శతాబ్దాల్లోనూ చైతన్యవంతంగా నిలబెడుతుందని ప్రధాని అన్నారు.
 

నేపథ్యం

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి అయిన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకొని, సర్వోన్నత న్యాయస్థానంలోని పరిపాలన భవన సముదాయంలో గల సభా భవనంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ సంబంధిత కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు.  భారత సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు సర్వోన్నత న్యాయస్థానంలోని ఇతర న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు.

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand

Media Coverage

India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 జనవరి 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises