ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇవాళ జపాన్ మాజీ ప్రధాని/జపాన్-ఇండియా అసోసియేషన్ (జిఐఎ) చైర్మన్ మాననీయ యోషిడా సుగా సమావేశమయ్యారు. ‘గణేశ నో కై’ పార్లమెంటేరియన్లతోపాటు ‘కెడాన్‌రెన్’ (జపాన్ వాణిజ్య సమాఖ్య) పారిశ్రామిక ప్రతినిధులు, ప్రభుత్వాధికారులతో కూడిన 100 మంది బృందంతో శ్రీ సుగా తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం భారత-జపాన్‌ల మధ్య ప్రత్యేక-వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం విస్తరణపై వారిద్దరూ అభిప్రాయాలు వెల్లడించుకున్నారు. పెట్టుబడులు, ఆర్థిక సహకారం, రైల్వేలు, ప్రజల మధ్య స్నేహబంధాలు, నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యం తదితర అంశాలపైనా వారు చర్చించారు.
ఉభయ దేశాల మధ్య పార్లమెంటరీ సంబంధాల బలోపేతంపై “గణేశ నో కై’ పార్లమెంటరీ బృందంతోనూ ప్రధాని చర్చలు ఫలప్రదమయ్యాయి. జపాన్‌లో యోగాతోపాటు ఆయుర్వేదానికి ప్రజాదరణ పెరుగుతుండటంపై వారు హర్షం ప్రకటించారు. భారత్-జపాన్ల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత పటిష్టం చేసే మార్గాలపైనా వారు సంభాషించారు.
‘కెడాన్‌రెన్’ (జపాన్ వాణిజ్య సమాఖ్య) బృందానికీ ప్రధాని సాదర స్వాగతం పలికారు. దేశంలో వాణిజ్య పర్యావరణం మెరుగుకు ప్రభుత్వం చేపట్టిన విస్తృత సంస్కరణల గురించి ఆయన వారికి వివరించారు. భారత్‌లో జపాన్ ప్రస్తుత పెట్టుబడులను మరింత పెంచాలని, పరస్పర సహకారం దిశగా కొత్త రంగాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు.