ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. గేట్స్ ఒక ట్వీట్ చేస్తూ, ఇటీవలి తన భారత పర్యటన మీద ఒక నోట్ జోడించగా ప్రధాని స్పందిస్తూ ట్వీట్ చేశారు:
“బిల్ గేట్స్ ను కలిసి కీలక అంశాలమీద సుదీర్ఘ చర్చలు జరపటం సంతోషంగా ఉంది. ఆయన వినయం, మెరుగైన సుస్థిర ప్రపంచాన్ని చూడాలన్న తపన స్పష్టంగా కనబడ్డాయి”.
Delighted to meet @BillGates and have extensive discussions on key issues. His humility and passion to create a better as well as more sustainable planet are clearly visible. https://t.co/SYfOZpKwx8 pic.twitter.com/PsoDpx3vRG
— Narendra Modi (@narendramodi) March 4, 2023
గేట్స్ తన నోట్ లో , “ఈ వారం నేను భారత్ లో ఉన్నా. ఆరోగ్యం, వాతావరణ మార్పు తదితర కీలక రంగాలలో నవకల్పనల గురించి తెలుసుకుంటూ గడిపా. ప్రపంచం అనేక సవాళ్ళు ఎదుర్కుంటున్న సమయంలో భారత్ లాంటి ఒక చురుకైన దేశాన్ని సందర్శించటం స్ఫూర్తిదాయకంగా ఉంది” అని రాశారు. ప్రధానితో జరిగిన ఈ భేటీని తన పర్యటనలో చాలా ముఖ్యమైనదిగా అభివర్ణిస్తూ, “ప్రధాని మోదీతో తరచూ మాట్లాడుతూనే ఉన్నా. ముఖ్యంగా కోవిడ్ -19 టీకా తయారీలోనూ, భారత ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టటం మీద చర్చించాం. సమర్థవంతమైన, సురక్షితమైన, సరసమైన ధరకే అందేలా టీకాలు తయారుచేయగల అద్భుత సామర్థ్యం భారతదేశానికుంది. దీనికి గేట్స్ ఫౌండేషన్ అండ ఉంది. భారత్ లో తయారైన టీకాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రాణాలు కాపాడాయి” అన్నారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్ వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ, “ ప్రాణాలు కాపాడే పరికరాలు తయారు చేయటమే కాకుండా వాటిని అందజేయటంలోనూ, దేశ ప్రజారోగ్య వ్యవస్థను కాపాడటంలోనూ, 2.2 బిలియన్ డోసుల కోవిడ్ టీకాలు అందజేయటంలోనూ గొప్పదనం చాటుకుంది. కో-విన్ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ ద్వారా కోట్లాది మంది తమ టీకాల షెడ్యూల్ నిర్ణయించుకోవటానికి, టీకాలు వేయించుకున్నవారు డిజిటల్ సర్టిఫికెట్లు పొందటానికి వీలయింది. ఈ ప్లాట్ ఫామ్ ను ఇప్పుడు విస్తరించటం ద్వారా భారదేశపు సార్వత్రిక టీకాల కార్యక్రమానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. కో-విన్ ప్రపంచనికే ఆదర్శమన్న ప్రధాని మోదీ మాటతో నేను ఏకీభవిస్తున్నా” అన్నారు.
డిజిటల్ చెల్లింపులలో భారతదేశ పురోగతిని బిల్ గేట్స్ అభినందించారు. “ కోవిడ్ సంక్షోభ సమయంలో 20 కోట్లమంది మహిళలతో సహా మొత్తం 30 కోట్లమందికి అత్యవసర నగదు బదలీ చేయటంలో భారత్ విజయం సాధించింది. ఆధార్ అనే డిజిటల్ గుర్తింపు వ్యవస్థలో పెట్టుబడి పెట్టటం ద్వారా ఆర్థిక సమ్మిళితికి ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే భారత్ ఈ డిజిటల్ బాంకింగ్ సౌలభ్యాన్ని సాధించగలిగింది. ఆర్థిక సమ్మిళితి అనేది అద్భుతమైన పెట్టుబడి” అన్నారు
పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్, జి-20 అధ్యక్షత, విద్య, నవకల్పనలు, వ్యాధులమీద యుద్ధం, చిరుధాన్యాలవంటి అనేక సాధనలను కూడా గేట్స్ తన నోట్ లో ప్రస్తావించారు
“ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం మీద ప్రధాని నరేంద్ర మోడీతో నా సంభాషణ భారతదేశ అభివృద్ధి మీద నా ఆశావహ దృక్పథాన్ని మరింత బలపరచింది. నవకల్పనలో పెట్టిన పెట్టుబడితో ఏం సాధ్యమో భారత్ చూపుతోంది. భారతదేశం ఈ పురోగతిని కొనసాగిస్తూ తన నవకల్పనలను ప్రపంచంతో పంచుకుంటుందని ఆశిస్తున్నా” అంటూ గేట్స్ ముగించారు.