Received numerous letters and messages primarily focused on two topics: Chandrayaan-3's successful landing and the successful hosting of the G-20 in Delhi: PM
Bharat Mandapam has turned out to be a celebrity in itself. People are taking selfies with it and also posting them with pride: PM Modi
India-Middle East-Europe Economic Corridor is going to become the basis of world trade for hundreds of years to come: PM Modi
The fascination towards India has risen a lot in the last few years and after the successful organisation of G20: PM Modi
Santiniketan and the Hoysala temples of Karnataka have been declared world heritage sites: PM Modi
During the last few years, in the country, a commendable rise has been observed in the numbers of lions, tigers, leopards and elephants: PM Modi

నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం! 'మన్ కీ బాత్' మరొక భాగంలో దేశం సాధించిన విజయాలను, దేశప్రజల విజయాలను, వారి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈ రోజుల్లో నాకు వచ్చిన ఉత్తరాలు, సందేశాలు చాలా వరకు రెండు విషయాలపై ఉన్నాయి. మొదటి అంశం చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం, రెండవ అంశం ఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడం. దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, సమాజంలోని ప్రతి వర్గం నుండి, అన్ని వయసుల వారి నుండి నాకు లెక్కపెట్టలేనన్ని లేఖలు వచ్చాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై దిగే సంఘటనలో ప్రతి క్షణాన్ని కోట్లాది మంది ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా ఏకకాలంలో చూశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యూట్యూబ్ లైవ్ ఛానెల్‌లో 80 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సంఘటనను వీక్షించారు. అందులోనే ఇదొక రికార్డు. చంద్రయాన్-3తో కోట్లాది మంది భారతీయుల అనుబంధం ఎంత గాఢంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. చంద్రయాన్ సాధించిన ఈ విజయంపై దేశంలో చాలా అద్భుతమైన క్విజ్ పోటీ జరుగుతోంది. ఈ ప్రశ్నల పోటీకి 'చంద్రయాన్-3 మహాక్విజ్' అని పేరు పెట్టారు. మై గవ్ పోర్టల్‌ ద్వారా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. మై గవ్ పోర్టల్ ను ప్రారంభించిన తర్వాత రూపొందించిన క్విజ్‌లలో పాల్గొన్నవారి సంఖ్యాపరంగా ఇదే అతిపెద్దది. మీరు ఇంకా ఇందులో పాల్గొనకపోతే ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇంకా కేవలం ఆరు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ క్విజ్‌లో తప్పకుండా పాల్గొనండి.

నా కుటుంబ సభ్యులారా! చంద్రయాన్-3 విజయం తర్వాత గొప్ప శిఖరాగ్ర సదస్సు జి-20 ప్రతి భారతీయుడి ఆనందాన్ని రెట్టింపు చేసింది. భారత వేదిక -మండపం- స్వయంగా సెలబ్రిటీలా మారిపోయింది. ప్రజలు సెల్ఫీలు దిగుతూ గర్వంగా పోస్ట్ చేస్తున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌ను జి-20లో పూర్తి సభ్యదేశంగా చేయడం ద్వారా భారతదేశం తన నాయకత్వాన్ని నిరూపించుకుంది. భారతదేశం సుసంపన్నంగా ఉన్న కాలంలో మన దేశంలోనూ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ సిల్క్ రూట్ గురించి చాలా చర్చలు జరిగేవి. ఈ సిల్క్ రూట్ వాణిజ్యానికి ప్రధాన మాధ్యమంగా ఉండేది. ఇప్పుడు ఆధునిక కాలంలో భారతదేశం జి-20లో మరొక ఆర్థిక కారిడార్‌ను సూచించింది. ఇది ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్. ఈ కారిడార్ రాబోయే వందల సంవత్సరాలకు ప్రపంచ వాణిజ్యానికి ఆధారం అవుతుంది. ఈ కారిడార్ భారతదేశ గడ్డపై ప్రారంభమైందని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

మిత్రులారా! జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారతదేశ యువశక్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తీరు గురించి, అనుసంధానమైన విధానం గురించి నేడు ప్రత్యేక చర్చ అవసరం. ఏడాది పొడవునా దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో జి-20కి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఈ వరుసలో ఇప్పుడు ఢిల్లీలో ‘జి20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రామ్’ అనే మరో ఉత్కంఠభరితమైన కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు పరస్పరం అనుసంధానమవుతారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, వైద్య కళాశాలల వంటి పలు ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. మీరు కాలేజీ విద్యార్థి అయితే సెప్టెంబర్ 26వ తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని తప్పక చూడాలని, అందులో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. భావి భారతదేశంలో యువత భవిష్యత్తుపై అనేక ఆసక్తికరమైన విషయాలను ఇందులో చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో నేను కూడా స్వయంగా పాల్గొంటాను. నేను కూడా మన కళాశాలల విద్యార్థులతో సంభాషించేందుకు ఎదురు చూస్తున్నాను.

నా కుటుంబ సభ్యులారా! నేటి నుండి రెండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 27వ తేదీన 'ప్రపంచ పర్యాటక దినోత్సవం' జరుగుతోంది. కొంతమంది వ్యక్తులు పర్యాటకాన్ని విహారయాత్రా సాధనంగా మాత్రమే చూస్తారు. అయితే పర్యాటకంలో చాలా పెద్ద అంశం 'ఉపాధి'కి సంబంధించింది. కనీస పెట్టుబడితో అత్యధిక ఉపాధి కల్పించే రంగం ఏదన్నా ఉందంటే అది పర్యాటక రంగమే. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో దేశం పట్ల సద్భావన, ఆకర్షణ చాలా ముఖ్యం. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంపై ఆకర్షణ చాలా పెరిగింది. జి-20 సమ్మేళనం నిర్వహణ విజయవంతమైన తర్వాత భారతదేశంపై ప్రపంచ ప్రజల ఆసక్తి మరింత పెరిగింది.

మిత్రులారా! జి-20 సమ్మేళనం జరుగుతున్న సమయంలో లక్షమందికి పైగా ప్రతినిధులు భారతదేశానికి వచ్చారు. ఇక్కడి వైవిధ్యం, విభిన్న సంప్రదాయాలు, వివిధ రకాల ఆహార పానీయాలు, మన వారసత్వ సంపద గురించి వారు తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు తమ వెంట తీసుకెళ్లిన అద్భుతమైన అనుభవాలు పర్యాటకాన్ని మరింత విస్తరింపజేస్తాయి.

భారతదేశంలో ఒక దానికి మించి మరొకటిగా ఉండే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని, వాటి సంఖ్య నిరంతరం పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితం శాంతినికేతన్ ను, కర్ణాటకలోని పవిత్ర హొయసాల దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించారు. ఈ అద్భుతమైన విజయానికి దేశప్రజలందరినీ నేను అభినందిస్తున్నాను. శాంతి నికేతన్‌ ను 2018లో సందర్శించే అవకాశం నాకు లభించింది. శాంతి నికేతన్‌తో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కు అనుబంధం ఉంది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పురాతన సంస్కృత శ్లోకం నుండి శాంతినికేతన్ పేరును తీసుకున్నారు. ఆ శ్లోకం -

“యత్ర విశ్వం భవత్యేక నీడమ్”

 అంటే యావత్ ప్రపంచమే ఒక చిన్న గూడు అయ్యే చోటు అని. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చిన కర్నాటకలోని హొయసాల దేవాలయాలు 13వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయాలు యునెస్కో నుండి గుర్తింపు పొందడం భారతీయ ఆలయ నిర్మాణ సంప్రదాయానికి కూడా గౌరవం. భారతదేశంలోని ప్రపంచ వారసత్వ సంపద మొత్తం సంఖ్య ఇప్పుడు 42 కు చేరుకుంది. మన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను వీలైనంత అధిక సంఖ్యలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. మీరు ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నప్పుడల్లా భారతదేశ వైవిధ్యాన్ని చూడాలని మీ అందరినీ కోరుతున్నాను. మీరు వివిధ రాష్ట్రాల సంస్కృతిని అర్థం చేసుకోవాలి. అందుకోసం ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించండి. దీనితో మీరు మన దేశ అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకోవడమే కాకుండా స్థానిక ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన మాధ్యమంగా కూడా మారతారు.

నా కుటుంబ సభ్యులారా! భారతీయ సంస్కృతి, భారతీయ సంగీతం ఇప్పుడు విశ్వవ్యాపితమయ్యాయి. వాటితో ప్రపంచవ్యాప్తంగా ప్రజల అనుబంధం రోజురోజుకూ పెరుగుతోంది. ఒక అమ్మాయి సమర్పించిన చిన్న ఆడియో రికార్డును వినండి.

### (MKB EP 105 AUDIO Byte 1)###

ఇది విని మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా! ఆమెది ఎంత మధురమైన స్వరం! ప్రతి పదంలో ప్రతిబింబించే భావోద్వేగాల ద్వారా భగవంతునిపై ఆమె ప్రేమను మనం అనుభూతి చెందగలం. ఈ మధురమైన స్వరం జర్మనీకి చెందిన ఒక అమ్మాయిది అని నేను మీకు చెబితే, బహుశా మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఈ అమ్మాయి పేరు కైసమీ. 21 ఏళ్ల కైసమీ ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ప్రసిద్ధి చెందారు. జర్మనీ నివాసి అయిన కైసమీ భారతదేశానికి ఎప్పుడూ రాలేదు. కానీ ఆమె భారతీయ సంగీతానికి అభిమాని. భారతదేశాన్ని కూడా చూడని ఆమెకు భారతీయ సంగీతంపై ఉన్న ఆసక్తి చాలా స్ఫూర్తిదాయకం. కైసమీ జన్మతః అంధురాలు. కానీ ఈ కష్టమైన సవాలు ఆమెను అసాధారణ విజయాల నుండి ఆపలేదు. సంగీతం, సృజనాత్మకతపై ఉన్న మక్కువతో ఆమె చిన్నతనం నుండి పాడటం ప్రారంభించారు. కేవలం 3 సంవత్సరాల వయస్సులో ఆఫ్రికన్ డ్రమ్మింగ్ ప్రారంభించారు. భారతీయ సంగీతంతో 5-6 సంవత్సరాల క్రితమే ఆమెకు పరిచయం ఏర్పడింది. భారతదేశ సంగీతం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె దానిలో పూర్తిగా మునిగిపోయింది. తబలా వాయించడం కూడా నేర్చుకున్నారు. చాలా స్ఫూర్తిదాయకమైన విషయం ఏమిటంటే ఆమె అనేక భారతీయ భాషలలో పాడటంలో ప్రావీణ్యం సంపాదించారు. సంస్కృతం, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ... ఈ అన్ని భాషల్లోనూ పాడారు. తెలియని భాషలో రెండు మూడు వాక్యాలు మాట్లాడాలంటే ఎంత కష్టమో ఊహించుకోవచ్చు కానీ కైసమీకి మాత్రం ఇదొక సులువైన ఆట. మీ అందరి కోసం కన్నడలో ఆమె పాడిన ఒక పాటను ఇక్కడ పంచుకుంటున్నాను.

###(MKB EP 105 AUDIO Byte 2)###

భారతీయ సంస్కృతిపై, సంగీతంపై జర్మనీకి చెందిన కైసమీకి ఉన్న మక్కువను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆమె ప్రయత్నాలు ప్రతి భారతీయుడిని ఉప్పొంగిపోయేలా చేస్తాయి.

నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! మన దేశంలో విద్యను ఎల్లప్పుడూ సేవగా చూస్తారు. అదే స్ఫూర్తితో పిల్లల చదువు కోసం కృషి చేస్తున్న ఉత్తరాఖండ్‌లోని యువత గురించి నాకు తెలిసింది. నైనిటాల్ జిల్లాలో కొంతమంది యువకులు పిల్లల కోసం ఒక ప్రత్యేక సంచార గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ గ్రంథాలయం ప్రత్యేకత ఏమిటంటే దీని ద్వారా అత్యంత మారుమూల ప్రాంతాలలో కూడా పిల్లలకు పుస్తకాలు చేరుతున్నాయి. అంతేకాదు- ఈ సేవ పూర్తిగా ఉచితం. ఇప్పటి వరకు నైనిటాల్‌లోని 12 గ్రామాలకు ఈ గ్రంథాలయం ద్వారా సేవలందించారు. పిల్లల చదువుకు సంబంధించిన ఈ ఉదాత్తమైన పనిలో స్థానిక ప్రజలు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ సంచార గ్రంథాలయం ద్వారా మారుమూల పల్లెల్లో నివసించే పిల్లలకు పాఠశాల పుస్తకాలే కాకుండా పద్యాలు, కథలు, నైతిక విద్యకు సంబంధించిన పుస్తకాలు చదివేందుకు పూర్తి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రత్యేకమైన లైబ్రరీని పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.

మిత్రులారా! గ్రంథాలయానికి సంబంధించి హైదరాబాదులో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం గురించి నాకు తెలిసింది. ఇక్కడ ఏడో తరగతి చదువుతున్న అమ్మాయి ‘ఆకర్షణా సతీష్’ అద్భుతం చేసింది. కేవలం 11 ఏళ్ల వయస్సులో ఆమె పిల్లల కోసం ఒకటి, రెండు కాదు- ఏడు లైబ్రరీలను నిర్వహిస్తోందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో ఈ దిశగా ఆకర్షణకు ప్రేరణ లభించింది. ఆమె తండ్రి పేదవారికి సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడి పిల్లలు వారిని 'కలరింగ్ బుక్స్' అడిగారు. ఈ విషయం ఆమె మనస్సును తాకింది. దాంతో వివిధ రకాల పుస్తకాలను సేకరించాలని ఆమె నిర్ణయించుకుంది. తన ఇరుగుపొరుగు ఇళ్ళు, బంధువులు, స్నేహితుల నుండి పుస్తకాలు సేకరించడం ప్రారంభించింది. అదే క్యాన్సర్ ఆసుపత్రిలో పిల్లల కోసం మొదటి లైబ్రరీ ప్రారంభించారని తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఈ బాలిక నిరుపేద పిల్లల కోసం వివిధ ప్రదేశాలలో ఇప్పటివరకు ప్రారంభించిన ఏడు లైబ్రరీలలో ఇప్పుడు సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ చిన్న 'ఆకర్షణ' విశేషంగా కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోంది. మిత్రులారా! నేటి యుగం డిజిటల్ టెక్నాలజీ, ఇ-బుక్స్‌తో కూడుకున్నదనడంలో వాస్తవముంది. అయితే ఇప్పటికీ పుస్తకాలు ఎల్లప్పుడూ మన జీవితంలో మంచి స్నేహితుని పాత్ర పోషిస్తాయి. అందుకే పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రేరేపించాలి.

నా కుటుంబ సభ్యులారా! మన గ్రంథాలలో ఇలా చెప్పారు-

జీవేషు కరుణా చాపి, మైత్రీ తేషు విధీయతామ్!

అంటే ప్రాణులపై కరుణ చూపి వాటిని మిత్రులుగా చేసుకొమ్మని అర్థం. మన దేవతల వాహనాలు చాలా వరకు జంతువులు, పక్షులు. చాలా మంది గుడికి వెళ్తారు. భగవంతుడి దర్శనం చేసుకుంటారు. కానీ భగవంతుడి వాహనాలుగా ఉండే జీవాలను పెద్దగా పట్టించుకోరు. ఈ జీవాలు మన విశ్వాసాలకు కేంద్రాలుగా ఉంటాయి. మనం వాటిని అన్ని విధాలుగా రక్షించుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా, దేశంలో సింహాలు, పులులు, చిరుతలు, ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ భూమిపై నివసించే ఇతర జంతువులను రక్షించడానికి అనేక ఇతర ప్రయత్నాలు కూడా నిరంతరం జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కూడా ఇలాంటి ప్రత్యేక ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ అడవి జంతువులను రక్షించడానికి సుఖ్‌దేవ్ భట్ జీ తో పాటు ఆయన బృందం కలిసికట్టుగా పని చేస్తోంది. వారి బృందం పేరు ఏమిటో మీకు తెలుసా? ఆఅ బృందం పేరు కోబ్రా. ఈ ప్రమాదకరమైన పేరు ఎందుకంటే ఆయన బృందం కూడా ఈ ప్రాంతంలో ప్రమాదకరమైన పాములను రక్షించడానికి పని చేస్తుంది. ఈ బృందంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. వారు కేవలం ఒక్క పిలుపుతో స్థలానికి చేరుకుని తమ పనిలో పాల్గొంటారు. సుఖ్‌దేవ్ జీ బృందం ఇప్పటి వరకు 30 వేలకు పైగా విష సర్పాల ప్రాణాలను కాపాడింది. ఈ ప్రయత్నం ద్వారా ప్రజలకు ప్రమాదం తొలగి పోవడంతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా జరుగుతోంది. ఈ బృందం ఇతర జబ్బుపడిన జంతువులకు సేవ చేసే పనిలో కూడా పాల్గొంటుంది.

మిత్రులారా! తమిళనాడులోని చెన్నైలో ఉండే ఆటో డ్రైవర్ ఎం. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నారు. ఆయన గత 25-30 సంవత్సరాలుగా పావురాలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఇంట్లో 200కు పైగా పావురాలున్నాయి. పక్షులకు ఆహారం, నీరు, ఆరోగ్యం మొదలైన ప్రతి అవసరాన్ని వారు పూర్తిగా చూసుకుంటారు. దీని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ ఖర్చుకు వెనుకకు పోకుండా తన పనిలో అంకితభావంతో ఉంటారు. మిత్రులారా! మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి పని చేస్తున్న వారిని చూడటం నిజంగా చాలా ప్రశాంతతను, చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు కూడా అలాంటి కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాల గురించి సమాచారాన్ని పొందితే తప్పకుండా వాటిని పంచుకోండి.

నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! ఈ స్వాతంత్య్ర అమృత కాలం దేశం కోసం ప్రతి పౌరుని కర్తవ్య కాలం కూడా. మన విధులను నిర్వర్తించడం ద్వారా మాత్రమే మనం మన లక్ష్యాలను సాధించగలం. మన గమ్యాన్ని చేరుకోగలం. కర్తవ్య భావన మనందరినీ కలుపుతుంది. ఉత్తరప్రదేశ్ లోని సంభల్‌లో దేశం అటువంటి కర్తవ్య భావానికి ఉదాహరణను చూసింది. నేను మీతో కూడా ఆ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ 70కి పైగా గ్రామాలు ఉన్నాయి. వేలాది జనాభా ఉంది. అయినా ప్రజలందరూ కలిసి ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏకమయ్యారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ సంభల్ ప్రజలు దీన్ని చేసి చూపారు. ఈ వ్యక్తులు సంఘటితమై ప్రజల భాగస్వామ్యం, సమష్టితత్వానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో 'సోత్' అనే నది ఉండేది. అమ్రోహా నుండి మొదలై సంభల్ గుండా బదాయూ వరకు ప్రవహించే ఈ నదికి ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రాణదాతగా పేరుండేది. ఇక్కడి రైతులకు వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన ఈ నదిలో నీరు నిరంతరం ప్రవహించేది. కాలక్రమేణా నది ప్రవాహం తగ్గింది. నది ప్రవహించే మార్గాలు ఆక్రమణకు గురయ్యాయి. ఈ నది అంతరించిపోయింది. నదిని తల్లిగా భావించే మన దేశంలో సంభల్ ప్రజలు ఈ సోత్ నదిని కూడా పునరుద్ధరించాలని సంకల్పించారు. గతేడాది డిసెంబరులో 70కి పైగా గ్రామ పంచాయతీలు కలిసి సోత్ నది పునరుద్ధరణ పనులను ప్రారంభించాయి. గ్రామ పంచాయతీల ప్రజలు తమతో పాటు ప్రభుత్వ శాఖలను కూడా భాగస్వాములుగా చేశారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఈ ప్రజలు నదిలో 100 కిలోమీటర్ల కంటే అధిక ప్రాంతాన్ని పునరుద్ధరించారు. ఎక్కువ పునరావాసం కల్పించారని తెలిస్తే మీరు సంతోషిస్తారు. వర్షాకాలం ప్రారంభం కాగానే ఇక్కడి ప్రజల శ్రమ ఫలించి సోత్ నది నిండుకుండలా నీటితో నిండిపోయింది. ఇది ఇక్కడి రైతులకు సంతోషం కలిగించే పెద్ద సందర్భం. ప్రజలు నది ఒడ్డు పూర్తిగా సురక్షితంగా ఉండేందుకు ఒడ్డుపై 10 వేలకు పైగా మొక్కలను కూడా నాటారు. దోమలు వృద్ధి చెందకుండా ముప్పై వేలకు పైగా గంబూసియా చేపలను కూడా నది నీటిలో వదిలారు. మిత్రులారా! మనం దృఢ సంకల్పంతో ఉంటే అతిపెద్ద సవాళ్లను అధిగమించి పెద్ద మార్పు తీసుకురాగలమని సోత్ నది ఉదాహరణ చెబుతోంది. కర్తవ్య మార్గంలో నడవడం ద్వారా మీరు కూడా మీ చుట్టూ ఉన్న అనేక మార్పులకు వాహకంగా మారవచ్చు.

నా కుటుంబ సభ్యులారా! ఉద్దేశాలు దృఢంగా ఉండి ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ పనీ కష్టంగా ఉండదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీమతి శకుంతలా సర్దార్ ఇది ఖచ్చితంగా సరైనదని నిరూపించారు. ఈరోజు ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. శకుంతల గారు జంగల్ మహల్‌లోని శాతనాల గ్రామ నివాసి. చాలా కాలంగా ఆమె కుటుంబం ప్రతిరోజు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమె కుటుంబం బతకడం కూడా కష్టమైంది. ఆ తర్వాత కొత్త బాటలో నడవాలని నిర్ణయించుకుని విజయం సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఈ విజయాన్ని ఎలా సాధించారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నారు! సమాధానం- ఒక కుట్టు యంత్రం. కుట్టుమిషన్ ఉపయోగించి 'సాల్' ఆకులపై అందమైన డిజైన్లు చేయడం ప్రారంభించారు. ఆమె నైపుణ్యం మొత్తం కుటుంబ జీవితాన్నే మార్చేసింది. ఆమె తయారు చేసిన ఈ అద్భుతమైన క్రాఫ్ట్‌కు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. శకుంతల గారి ఈ నైపుణ్యం ఆమె జీవితాన్నే కాకుండా 'సాల్' ఆకులను సేకరించే చాలా మంది జీవితాలను కూడా మార్చింది. ఇప్పుడు ఆమె చాలా మంది మహిళలకు శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నారు. మీరు ఊహించవచ్చు- ఒకప్పుడు వేతనాలపై ఆధారపడిన కుటుంబం ఇప్పుడు ఇతరులకు ఉపాధి లభించేలా ప్రేరేపిస్తోంది. దినసరి కూలీపైనే ఆధారపడి బతుకుతున్న తమ కుటుంబాన్ని తమ కాళ్లపై నిలబెట్టింది. దీంతో ఆమె కుటుంబానికి ఇతర విషయాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. ఇంకో విషయం శకుంతల గారి పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఆమె పొదుపు చేయడం కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆమె జీవిత బీమా పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. తద్వారా తన పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది. శకుంతల గారి అభిరుచిని ఎంత ప్రశంసించినా తక్కువే. భారతదేశ ప్రజలు అలాంటి ప్రతిభతో నిండి ఉన్నారు. మీరు వారికి అవకాశం ఇవ్వండి. వారు ఎలాంటి అద్భుతాలు చేస్తారో చూడండి.

నా కుటుంబ సభ్యులారా! ఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పలువురు ప్రపంచ నేతలు కలిసి, రాజ్‌ఘాట్‌కు చేరుకుని బాపూజీకి నివాళులు అర్పించిన ఆ దృశ్యాన్ని ఎవరు మాత్రం మరిచిపోగలరు! బాపూజీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా నేటికీ ఎంత సందర్భోచితంగా ఉన్నాయనడానికి ఇదే పెద్ద నిదర్శనం. గాంధీ జయంతి మొదలుకుని దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ప్రారంభం కావడం పట్ల కూడా నేను సంతోషిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ‘స్వచ్ఛతా హీ సేవా అభియాన్’ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్‌లో కూడా చాలా మంచి భాగస్వామ్యం కనిపిస్తోంది. ఈ రోజు నేను ‘మన్ కీ బాత్’ ద్వారా దేశప్రజలందరికీ ఒక అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పరిశుభ్రతపై పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నాను. మీరు కూడా మీ సమయాన్ని వెచ్చించి పరిశుభ్రతకు సంబంధించిన ఈ ప్రచారంలో సహకరించండి. మీరు మీ వీధి, పరిసరాలు, పార్కులు, నది, సరస్సు లేదా ఏదైనా ఇతర బహిరంగ ప్రదేశంలో ఈ స్వచ్ఛత ప్రచారంలో చేరవచ్చు. అమృత్ సరోవర్ నిర్మితమైన ప్రదేశాలలో పరిశుభ్రత పాటించాలి. ఈ పరిశుభ్రత చర్య గాంధీజీకి నిజమైన నివాళి అవుతుంది. గాంధీ జయంతి సందర్భంగా తప్పనిసరిగా ఏదైనా ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నేను మీకు మళ్లీ గుర్తు చేయాలనుకుంటున్నాను.

నా కుటుంబ సభ్యులారా! మన దేశంలో పండుగల సీజన్ కూడా ప్రారంభమైంది. మీరందరూ కూడా ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. నవరాత్రులలో ఏవైనా శుభకార్యాలు ప్రారంభించాలని ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఉల్లాసం, ఉత్సాహంతో కూడిన ఈ వాతావరణంలో మీరు వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వీలైనంత వరకు, మీరు భారతదేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలి. భారతీయ ఉత్పత్తులను ఉపయోగించాలి. భారతదేశంలో తయారు చేసిన వస్తువులను మాత్రమే బహుమతిగా ఇవ్వాలి. మీ చిన్న ఆనందం వేరొకరి కుటుంబంలో గొప్ప ఆనందానికి కారణం అవుతుంది. మీరు కొనుగోలు చేసే భారతీయ వస్తువులు నేరుగా మన శ్రామికులు, కార్మికులు, శిల్పకారులు, ఇతర విశ్వకర్మ సోదరులు, సోదరీమణులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రస్తుతం చాలా స్టార్టప్‌లు కూడా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇస్తున్నాయి. మీరు స్థానిక వస్తువులను కొనుగోలు చేస్తే ఈ స్టార్టప్‌ల యువత కూడా ప్రయోజనం పొందుతుంది.

నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! ఈ రోజు 'మన్ కీ బాత్'లో ఇప్పటికి ఇంతే! వచ్చేసారి నేను మిమ్మల్ని 'మన్ కీ బాత్'లో కలిసేటప్పటికి నవరాత్రులు, దసరా గడిచిపోతాయి. ఈ పండగ సీజన్‌లో మీరు కూడా ప్రతి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని, మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. ఇదే నా కోరిక. ఈ పండుగల సందర్భంగా మీకు చాలా శుభాకాంక్షలు. మరిన్ని కొత్త అంశాలతో, దేశప్రజల కొత్త విజయాలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరు మీ సందేశాలను నాకు పంపుతూనే ఉండండి. మీ అనుభవాలను పంచుకోవడం మర్చిపోవద్దు. నేను ఎదురుచూస్తూ ఉంటా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.