పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడి) సందర్భంగా ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐవైడి’ నేపథ్యంలో సామూహిక యోగాభ్యాస వేడుకకు ఆయన నాయకత్వం వహిస్తూ యోగాసనాలు వేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ- ‘యోగా-సాధన’లకు పుట్టినిల్లయిన జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరు కావడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘‘యోగా వాతావరణం, శక్తి, అనుభూతిని నేడు జమ్ముకశ్మీర్‌లో అనుభవించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు. ‘ఐవైడి’ నేపథ్యంలో దేశ పౌరులందరితోపాటు ప్రపంచవ్యాప్త యోగా సాధకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవమని, ఐక్యరాజ్య సమితిలో దీనిపై ప్రతిపాదనకు ఆనాడు రికార్డు స్థాయిలో 177 దేశాలు మద్దతు తెలిపాయని ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత ‘ఐవైడి’ నిర్వహణలో భాగంగా నెలకొన్న కొత్త రికార్డుల గురించి ప్రధాని ప్రస్తావిస్తూ- 2015 నాటి వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 35,000 మంది ఏకకాలంలో యోగాసనాలు వేశారని పేర్కొన్నారు. ఇక నిరుడు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ నాయకత్వాన 130కిపైగా దేశాల ప్రతినిధులు ‘ఐవైడి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఏర్పాటు యోగా ధ్రువీకరణ బోర్డు ద్వారా దేశంలో 100కుపైగా సంస్థలు, 10 ప్రధాన విదేశీ సంస్థలు గుర్తింపు పొందడంపై ప్రధాని హర్షం వెలిబుచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా యోగా సాధకుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటంతోపాటు దాని ఆకర్షణ కూడా నిరంతరం ఇనుమడిస్తోందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. యోగాతో ఒనగూడే ప్రయోజనాలను ప్రజానీకం కూడా గుర్తిస్తున్నదని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రపంచ నాయకులతో తన మాటామంతీ సమయంలో యోగాపై చర్చించని నేత ఒక్కరు కూడా లేరని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘పలువురు దేశాల అధినేతలు నాతో ముఖాముఖి సంభాషణ సందర్భంగా యోగాభ్యాసంపై ఎంతో ఉత్సుకత కనబరుస్తుంటా’’ అని ప్రధాని గుర్తుచేశారు. ప్రపంచం మూలమూలలా దైనందిన జన జీవితంలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు.
ప్రపంచ దేశాలన్నిటా యోగాకు నానాటికీ ఆదరణ పెరుగుతున్నదని ప్రధాని మోదీ తెలిపారు. లోగడ 2015లో తుర్క్‌మెనిస్థాన్ పర్యటన సందర్భంగా తాను యోగా కేంద్రాన్ని ప్రారంభించగా, నేడు ఆ దేశవ్యాప్తంగా యోగాకు అత్యంత ప్రాచుర్యం లభిస్తున్నదని గుర్తుచేశారు. అక్కడి ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయాల్లో యోగా చికిత్సను ఒక కోర్సుగా చేర్చగా, సౌదీ అరేబియా తమ విద్యా విధానంలో యోగాను ఒక భాగం చేసిందని తెలిపారు. అలాగే మంగోలియా యోగా ఫౌండేషన్ అనేక యోగా పాఠశాలలు నడుపుతున్నదని చెప్పారు. ఇక ఐరోపా దేశాల్లో యోగాకుగల ఆదరణను వివరిస్తూ- ఇప్పటిదాకా 1.5 కోట్ల మంది జర్మన్ పౌరులు యోగాభ్యాసకులుగా మారారని ప్రధాని తెలిపారు. కాగా, జీవితంలో ఒక్కసారి కూడా భారత్ సందర్శించని 101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా గురువు సేవకు గుర్తింపుగా భారత్ ఈ ఏడాది ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించినట్లు ఆయన గుర్తుచేశారు. యోగా నేడొక పరిశోధనాంశంగా మారిందని, తదనుగుణంగా ఇప్పటికే అనేక పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు.
గడచిన 10 సంవత్సరాల్లో యోగా విస్తృతి ఫలితంగా దానిపై ఆలోచన దృక్పథంలో వస్తున్న మార్పు నేపథ్యంలో సరికొత్త యోగా ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆ మేరకు యోగా పర్యాటకంపై ఆకర్షణ పెరుగుతున్నదని, ప్రామాణిక రీతిలో యోగాభాస్యం కోసం భారత్ సందర్శించాలని ప్రపంచ ప్రజానీకం ఆకాంక్షిస్తున్నదని తెలిపారు. అందుకే యోగా రిట్రీట్, రిసార్ట్స్ వగైరాలతోపాటు విమానాశ్రయాలు, హోటళ్లలో యోగాభ్యాసానికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తదనుగుణంగా వివిధ సౌకర్యాలతోపాటు యోగా దుస్తులు, పరికరాలు, వ్యక్తిగత శిక్షకులు, యోగాసహిత ధ్యానం, ఆరోగ్య శ్రేయస్సు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వీటన్నిటిద్వారా యువతరానికి కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందివస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
ఈ ఏడాది ‘ఐవైడి’ని ‘మన కోసం.. సమాజం కోసం యోగా’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. యోగాను ప్రపంచ శ్రేయస్సుకు శక్తిమంతమైన ఉత్ప్రేరకంగా ప్రపంచం గుర్తిస్తోందని, భారమైన గతంతో నిమిత్తం లేకుండా వర్తమానంలో జీవించే ఉపకరణంగా యోగా రూపొందిందని
ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆ మేరకు ‘‘ప్రపంచ సంక్షేమమే మన సంక్షేమమని గ్రహించడంలో యోగా దోహదపడుతుందని, మన అంతరాంతరాల్లో ప్రశాంతత నిండినపుడు ప్రపంచంపై మనం సానుకూల ప్రభావం చూపగలం’’ అన్నారు.
యోగాకు శాస్త్రీయ లక్షణాలు కూడా ఉన్నాయని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఏకాగ్రత ఎంతో శక్తిమంతమైనదని, సమాచార భారంతో కుంగిన మెదడుకు అది సత్వర ఉపశమనం ఇవ్వగలదని పేర్కొన్నారు. అందుకే సైన్యం నుంచి క్రీడాకారుల దాకా దైనందిన కార్యకలాపాల్లో యోగాభ్యాసాన్ని ఒక భాగంగా చేరుస్తున్నట్లు వివరించారు. అలాగే వ్యోమగాములకూ యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తున్నారని గుర్తుచేశారు. ఖైదీల్లో పరివర్తనతోపాటు సానుకూల దృక్పథం అలవరచే దిశగా జైళ్లలోనూ యోగా ఉపయోగపడుతోందని చెప్పారు. మొత్తంమీద ‘‘సమాజంలో కచ్చితమైన మార్పు దిశగా యోగా కొత్త బాటలు పరుస్తోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
యోగా ద్వారా పొందే స్ఫూర్తి మన కృషికి నిర్దిష్ట శక్తిని జోడిస్తుందని ప్రధానమంత్రి దృఢ విశ్వాసం వెలిబుచ్చారు. యోగాపై జమ్ముకశ్మీర్... ముఖ్యంగా శ్రీనగర్ ప్రజలు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని ఆయన ప్రశంసించారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి ఇదొక వేదిక కాగలదన్నారు. ఒకవైపు వర్షాలు చికాకు పెడుతున్నా లెక్కచేయకుండా ప్రజలంతా వేడుకలలో పాల్గొని మద్దతు ప్రకటించారని కొనియాడారు. ‘‘జమ్ముకశ్మీర్‌లో యోగా కార్యక్రమంతో 50 వేల నుంచి 60 వేల మందికిగల అనుబంధం చాలా గొప్పది’’ అని ఆయన చెప్పారు. ఆ మేరకు కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ భాగస్వామ్యంతోపాటు మద్దతు చాటిన జమ్ముకశ్మీర్ ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ ప్రసంగం ముగించిన ప్రధానమంత్రి.. ప్రపంచవ్యాప్త యోగాభ్యాసకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
నేపథ్యం
పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడి) సందర్భంగా 2024 జూన్ 21న శ్రీనగర్‌లోని ‘ఎస్‌కెఐసిసి’లో నిర్వహించిన వేడుకలకు ప్రధానమంత్రి నాయకత్వం వహించారు. ఈ ఏడాది చేపట్టిన కార్యక్రమం యువతరం మనఃశరీరాలపై యోగా ప్రభావాన్ని నొక్కి చెప్పేదిగా రూపొందించబడింది. యోగా సాధనలో వేలాదిగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్యం-శ్రేయస్సుపై అవగాహన పెంచడం కూడా ఈ వేడుకల లక్ష్యం. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణలో భాగంగా 2015 నుంచి ఢిల్లీలోని కర్తవ్య పథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు, న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం సహా వివిధ ప్రసిద్ధ ప్రదేశాలలో వేడుకలకు ప్రధానమంత్రి నాయకత్వం వహించడం విశేషం.
ఈ ఏడాది వ్యక్తిగత-సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యంతో ‘మన కోసం.. సమాజం కోసం యోగా’ ఇతివృత్తంగా ‘ఐవైడి’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి నుంచి యోగా వ్యాప్తిని, అందులో అందరూ పాలుపంచుకోవడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
Click here to read full text speech
The number of people practising yoga is growing worldwide. pic.twitter.com/3Iezxq0XdB
— PMO India (@PMOIndia) June 21, 2024
Yoga – A powerful agent of global good. pic.twitter.com/P0ktMQi0XE
— PMO India (@PMOIndia) June 21, 2024
Yoga helps us live in the present moment, without baggage of the past. pic.twitter.com/ExCk1KUDt4
— PMO India (@PMOIndia) June 21, 2024
Yoga helps us realise that our welfare is related to the welfare of the world around us. pic.twitter.com/YtYApIc3Tu
— PMO India (@PMOIndia) June 21, 2024
योग केवल एक विधा नहीं है, बल्कि एक विज्ञान भी है। pic.twitter.com/yX64waQmj9
— PMO India (@PMOIndia) June 21, 2024