నాగ్పూర్-విజయవాడ ఆర్థిక కారిడార్లోని కీలక రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన;
హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ పరిధిలో భారతమాల పథకం కింద నిర్మించిన రహదారి ప్రాజెక్టు జాతికి అంకితం;
కీలక చమురు-గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన;
హైదరాబాద్ (కాచిగూడ)-రాయచూర్ మధ్య కొత్త రైలుకు పచ్చజెండా;
తెలంగాణ పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన;
హన్మకొండ.. మహబూబాబాద్.. వరంగల్.. ఖమ్మం జిల్లాల యువతకు అనేక అవకాశాల సృష్టి దిశగా ఆర్థిక కారిడార్;
సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.900 కోట్లు

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో రూ.13,500 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప‌థ‌కాలను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాప‌న చేశారు. వీటిలో రహదారి, రైల్వే, పెట్రోలియం-సహజ వాయువు, ఉన్నత విద్య వంటి కీలక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగానే ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ సదుపాయం ద్వారా ఒక కొత్త రైలు‌ను కూడా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ- పండుగల సమయం ఆసన్నం అవుతున్నదని గుర్తుచేశారు. మరోవైపు పార్లమెంట్‌లో ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు (నారీశక్తి వందన్ అధినియం)కు ఆమోదం ద్వారా నవరాత్రి వేడుకల ఆరంభానికి ముందే నారీశక్తి పూజా స్ఫూర్తి ఆవిష్కృతమైందని ఆయన అభివర్ణించారు.

 

   ఈ ప్రాంత ప్రజల జీవితాన్ని పరివర్తనాత్మకం చేయగల అనేక రహదారి అనుసంధాన ప్రాజెక్టులకు ఇవాళ తాను శంకుస్థాపన చేయడంపై ప్రధాని హర్షం ప్రకటించారు. ఇందులో భాగమైన నాగ్‌పూర్-విజయవాడ ఆర్థిక కారిడార్‌ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రవాణా రంగాన్ని బలోపేతం చేసి, వ్యాపార సౌలభ్యానికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలకు చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కారిడార్‌ పరిధిలో 8 ప్రత్యేక ఆర్థిక మండళ్లు, 5 మెగా ఆహార పార్కులు, 4 నౌకాయాన, సముద్రాహార సముదాయాలు, 3 ఫార్మా/ఔషధ సముదాయాలు, 1 జౌళి సముదాయం సహా పలు కీలక ఆర్థిక కూడళ్లు ఏర్పడతాయని ప్రధాని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల యువతకు అనేక ఉపాధి అవకాశాలు అందివస్తాయని తెలిపారు.

   ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను ఓడరేవులకు చేర్చడంలో తెలంగాణ వంటి భూ-పరివేష్టిత రాష్ట్రానికి రైలు, రోడ్డు అనుసంధాన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. దేశంలోని అనేక కీలక ఆర్థిక కారిడార్లు తెలంగాణ మీదుగా వెళ్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఇవన్నీ తూర్పు, పశ్చిమ తీరాలతో కలిపే మాధ్యమం కానున్నాయని చెప్పారు. ముఖ్యంగా తూర్పు తీరానికి చేరడంలో హైదరాబాద్- విశాఖపట్నం కారిడార్‌ పరిధిలోని సూర్యాపేట-ఖమ్మం విభాగం ఎంతగానో తోడ్పడగలదని తెలిపారు. అంతేకాకుండా పరిశ్రమలు, వ్యాపారాల రవాణా, సంబంధిత ఇతర వ్యయాలు తగ్గుతాయని పేర్కొన్నారు. జక్లెయిర్-కృష్ణా విభాగంలో నిర్మిస్తున్న రైలు మార్గం కూడా ఇక్కడి ప్రజలకు ఎంతో ముఖ్యమైనది కానుందని చెప్పారు.

 

   తెలంగాణ పసుపు రైతుల ప్రయోజనార్థం జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రధాని ప్రకటించారు. పసుపు సరఫరా శ్రేణికి విలువ జోడింపుపై ఈ బోర్డు దృష్టి సారిస్తుందని, రైతుల కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు తోడ్పడుతుందని ఆయన వివరించారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణసహా దేశవ్యాప్తంగా పసుపు పండించే రైతులందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

   ప్రపంచవ్యాప్తంగా ఇంధనం-ఇంధన భద్రత రంగంలో తాజా పరిణామాలను ప్రధాని ప్రస్తావించారు. పరిశ్రమలకేగాక గృహావసరాల కోసం కూడా ప్రభుత్వం ఇంధన భద్రతపై భరోసా ఇస్తున్నదని ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు 2014లో 14 కోట్లుగా ఉన్న వంటగ్యాస్ కనెక్షన్ల సంఖ్య 2023నాటికి 32 కోట్లకు పెరగడాన్ని ఉదాహరించారు. అలాగే ఇటీవల గ్యాస్ ధర తగ్గించడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. “దేశంలో వంటగ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్ విస్తరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఇంధన భద్రత కల్పన దిశగా హసన్-చెర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించగలదని ప్రధాని తెలిపారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మధ్య బహుళ ఉత్పత్తుల పెట్రోలియం పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేయడాన్ని ప్రస్తావిస్తూ- దీనివల్ల తెలంగాణలో వేలాది ప్రత్యక్ష-పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందివస్తాయని చెప్పారు.

 

   అంతకుముందు ప్రధానమంత్రి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పలు భవనాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి ‘అత్యున్నత విద్యా సంస్థ’ హోదా కల్పించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నదని ప్రధాని ప్రకటించారు. ఇది దాదాపు రూ.900 కోట్లతో తెలంగాణ వాసుల ఆరాధ్య దైవాల పేరిట “సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం”గా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఈ ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటుపై రాష్ట్ర ప్రజలను శ్రీ మోదీ అభినందించారు. తెలంగాణ గవర్నర్‌ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి, పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

నేపథ్యం

   దేశవ్యాప్తంగా ఆధునిక రహదారి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రధానమంత్రి దూరదృష్టికి అనుగుణంగా ఇవాళ్టి కార్యక్రమంలో అనేక రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేయబడ్డాయి. ఇందులో భాగంగా నాగ్‌పూర్-విజయవాడ ఆర్థిక కారిడార్‌లోని కీలక రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటిలో ‘జాతీయ రహదారి నం.163జి’లో వరంగల్‌-ఖమ్మం మధ్య 108 కిలోమీటర్ల మేర నియంత్రిత సౌలభ్యంతో నాలుగు వరుసల కొత్త రహదారి కూడా ఒకటి. ఇదే జాతీయ రహదారి పరిధిలో ఖమ్మం-విజయవాడ మధ్య 90 కిలోమీటర్ల ‘నాలుగు వరుసల నియంత్రిత సౌలభ్య రహదారి కూడా ఉంది. ఈ రహదారి ప్రాజెక్టులను రూ.6400 కోట్లతో చేపట్టనుండగా, వీటిద్వారా వరంగల్- ఖమ్మం మధ్య ప్రయాణ దూరం దాదాపు 14 కిలోమీటర్లు, ఖమ్మం-విజయవాడ మధ్య దాదాపు 27 కిలోమీటర్ల దాకా తగ్గుతుంది.

   ఈ కార్యక్రమంలో భాగంగా ‘జాతీయ రహదారి నం.365బిబి’ పరిధిలో సూర్యాపేట-ఖమ్మం మధ్య 59 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్‌లో భాగంగా ‘భారతమాల పరియోజన’ కింద దాదాపు రూ.2,460 కోట్లతో దీన్ని నిర్మించారు. దీనిద్వారా ఖమ్మం జిల్లాతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలకు అనుసంధాన మెరుగుపడుతుంది. అలాగే 37 కిలోమీటర్ల జక్లెయిర్‌–కృష్ణా కొత్త రైలుమార్గాన్ని ప్రధాని’జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.500 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ మార్గం వెనుకబడిన జిల్లా నారాయణపేటలోని ప్రాంతాలకు తొలిసారి రైల్వే అనుసంధానం కల్పిస్తోంది. మరోవైపు హైదరాబాద్ (కాచిగూడ)- రాయచూర్ మార్గంలో కొత్త రైలును కృష్ణా స్టేషన్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలను కర్ణాటకలోని రాయచూర్ జిల్లాతో కలుపుతుంది. దీనివల్ల వెనుకబడిన జిల్లాలైన మహబూబ్‌నగర్, నారాయణపేటలోని అనేక కొత్త ప్రాంతాలకు తొలిసారిగా రైలు సదుపాయం లభిస్తుంది. విద్యార్థులతోపాటు రోజువారీ ప్రయాణికులు, కార్మికులుసహా స్థానిక చేనేత పరిశ్రమ భాగస్వాములకూ ప్రయోజనం చేకూరుతుంది.

 

   దేశంలో రవాణా, సంబంధిత సదుపాయాల మెరుగుపై ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో కీలక చమురు-గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ‘హసన్-చెర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టు’ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇది రూ.2170 కోట్ల వ్యయంతో నిర్మితం కాగా, దీనివల్ల కర్ణాటకలోని హసన్ నుంచి చెర్లపల్లి (హైదరాబాద్ శివారు)దాకా సురక్షిత, చౌక, పర్యావరణ హిత రీతిలో ఎల్పీజీ రవాణా-పంపిణీ సాధ్యమవుతాయి. మరోవైపు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ (మల్కాపూర్) వరకూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)కు చెందిన బహుళ ఉత్పత్తుల పెట్రోలియం పైప్‌లైన్‌కూ ఆయన శంకుస్థాపన చేశారు. ఇది 425 కిలోమీటర్ల పొడవున రూ.1940 కోట్లతో నిర్మితం కానుండగా, ఈ ప్రాంతంలో సురక్షిత, వేగవంతమైన, సమర్థ, పర్యావరణ హిత పెట్రోలియం ఉత్పత్తులను అందిస్తుంది.

 

   హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రధాన త్రి ఐదు కొత్త భవనాలను ప్రారంభించారు. వీటిలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌; స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్‌ స్టాటిస్టిక్స్;  స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్; ఉపన్యాస మందిర సముదాయం-III; సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్‌ కమ్యూనికేషన్ (అనెక్స్) ఉన్నాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులకు సౌకర్యాల మెరుగుదలలో ఈ మౌలిక సదుపాయాల కల్పన ఒక ముందడుగు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage