మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు 76,000కోట్లు
రూ.1560 కోట్ల విలువైన మత్స్యపరిశ్రమ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన
సుమారు రూ.360 కోట్ల విలువైన నౌకా సమాచార, సహాయ వ్యవస్థ జాతీయ ప్రాజెక్టు ప్రారంభం
మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ సెట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులను అందించిన ప్రధాని
“మహారాష్ట్రలో అడుగుపెట్టగానే ఇటీవల సింధుదుర్గ్ ఘటన పట్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ పాదాలకు నమస్కరించి నేను క్షమాపణలు చెప్పాను”
“ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో వికసిత్ మహారాష్ట్ర – వికసిత్ భారత్ సాధన దిశగా వేగంగా ముందుకుసాగుతున్నాం”
“వికసిత్ భారత్ తీర్మానంలో వికసిత్ మహారాష్ట్ర అత్యంత ముఖ్యమైన భాగం”
“అభివృద్ధికి అవసరమైన సామర్థ్యాలు, వనరులు రెండూ మహారాష్ట్రలో ఉన్నాయి”
“ప్రపంచమంతా నేడు వధావన్ పోర్ట్ వైపు చూస్తున్నది”
‘‘డిఘి పోర్ట్ మహారాష్ట్రకు గుర్తింపుగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ కలల చిహ్నంగా మారుతుంది’’
“ఇది నవభారతం, చరిత్ర నుండి నేర్చుకుంటుంది, తన సామర్ధ్యాన్నీ, తన గొప్పతనాన్నీ గుర్తించగలదు’’
"21వ శతాబ్దపు మహిళా శక్తి సమాజానికి కొత్త దిశానిర్దేశం చేసేందుకు సిద్ధంగా ఉందనడానికి మ

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేసి, శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 76,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వధావన్ పోర్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, సుమారు రూ. 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే సుమారు రూ. 360 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న జాతీయ ప్రాజెక్టు అయిన నౌకా సమాచార సహాయ వ్యవస్థకు శ్రీ మోదీ శ్రీకారం చుట్టారు. ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్, ఆధునికీకరణ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణం సహా ముఖ్యమైన మత్స్యరంగ మౌలికవసతుల ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులైన మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ సెట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులను మోదీ అందజేశారు.

సంత్ సేనాజీ మహారాజ్ పుణ్య తిథి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2013లో తాను ప్రధానమంత్రి పదవికి నామినేట్ అయిన సమయంలో మొదటగా రాయగఢ్ కోటను సందర్శించి ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి ముందు ఆయన ఆశీస్సుల కోసం ప్రార్థించిన విషయాన్ని ప్రస్తావించారు. తన గురువును ఎంతగానో గౌరవించి, దేశానికి సేవ చేసేందుకు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన శివాజీ ‘భక్తి భవాన్ని’ తాను కూడా ఆశీర్వాదంగా పొందినట్లు మోదీ చెప్పారు. సింధుదుర్గ్ లో జరిగిన దురదృష్టకర సంఘటనను ప్రస్తావిస్తూ, శివాజీ మహారాజ్ కేవలం పేరు, గౌరవనీయ రాజు లేదా గొప్ప వ్యక్తిత్వం మాత్రమే కాదని, ఆయన దైవంతో సమానమని ప్రధాని కొనియాడారు. శ్రీ శివాజీ మహారాజ్ పాదాలకు నమస్కరించడం ద్వారా ఇటీవలి ఘటన పట్ల ఆయనను క్షమాపణలు వేడుకున్నట్లు మోదీ తెలిపారు. గొప్ప దేశ భక్తుడైన వీర్ సావర్కర్‌ను అగౌరవపరిచే వారికి, జాతీయవాద భావాన్ని తుంగలో తొక్కే వారికి భిన్నంగా తనను తయారు చేసినవి శివాజీ స్ఫూర్తి, సంస్కృతి మాత్రమే అన్నారు. “వీర్ సావర్కర్‌ను అగౌరవపరిచి, దాని గురించి పశ్చాత్తాపం చెందని వారి పట్ల మహారాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని ప్రధాన మంత్రి సూచించారు. మహారాష్ట్రలో అడుగుపెట్టిన వెంటనే తాను చేసిన మొదటి పని తన దైవమైన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పాదాల వద్ద శిరస్సు ఉంచి క్షమాపణ చెప్పడమేనని శ్రీ మోదీ స్పష్టం చేశారు. శివాజీ మహారాజ్‌ను దైవంగా ఆరాధించే వారందరికీ మోదీ క్షమాపణలు తెలిపారు.

 

ఈ రాష్ట్రం అలాగే దేశం రెండింటి అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు చారిత్రాత్మకమైనదని మోదీ కొనియాడారు. గత 10 ఏళ్లలో మహారాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని అన్నారు. “వికసిత్ భారత్ తీర్మానంలో వికసిత్ మహారాష్ట్ర అత్యంత కీలకమైన అంశం" అని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర చారిత్రాత్మక సముద్ర వాణిజ్యాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి తీర ప్రాంత సామీప్యత కారణంగా అభివృద్ధి చెందగల సామర్థ్యం, వనరులు రెండూ ఉన్నాయన్నారు. భవిష్యత్తు కోసం అపారమైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “వధావన్ ఓడరేవు దేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ అవుతుందనీ, అలాగే ప్రపంచంలోని అత్యంత లోతైన తీరంగల నౌకాశ్రయాలలో ఒకటిగా ఉందనీ అన్నారు. ఇది మహారాష్ట్ర, భారతదేశ వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మారుతుంది” అని ఆయన అన్నారు. వధావన్ పోర్టు ప్రాజెక్ట్ శంకుస్థాపన సందర్భంగా పాల్ఘర్, మహారాష్ట్ర అలాగే యావత్ దేశ ప్రజలకు ప్రధాని అభినందనలు తెలిపారు.

డిఘి పోర్ట్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ, మహారాష్ట్ర ప్రజలకు ఇది రెట్టింపు సంతోషాన్ని కలిగించిందని ప్రధాని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సామ్రాజ్య రాజధాని రాయ్‌గఢ్‌లో పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. అందువల్ల, డిఘి పోర్ట్ మహారాష్ట్రకు గుర్తింపుగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ కలల చిహ్నంగా మారుతుందని ప్రధాని తెలిపారు. ఇది పర్యాటకం, ఎకో-రిసార్టులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.

 

మత్స్యకారులను అభినందిస్తూ, 700 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన మత్స్యకారుల ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేశామని, అలాగే దేశవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించామని ప్రధాని మోదీ తెలిపారు. వధ్వాన్ పోర్ట్, డిఘీ పోర్ట్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి అలాగే మత్స్య రంగం కోసం అనేక పథకాలను ఆయన ప్రస్తావించారు. మాతా మహాలక్ష్మీ దేవి, మాతా జీవదాని అలాగే భగవాన్ తుంగరేశ్వరుని ఆశీస్సులతో ఈ అభివృద్ధి పనులన్నీ సాధ్యమయ్యాయని అన్నారు.

 

భారతదేశపు స్వర్ణయుగాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశం తన సముద్ర వనరుల సామర్థ్యాల కారణంగా అత్యంత బలమైన, సంపన్న దేశాలలో ఒకటిగా పేరు గడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. "మహారాష్ట్ర ప్రజలు ఈ సామర్థ్యంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. దేశ అభివృద్ధి కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుసరించిన విధానాలు, బలమైన నిర్ణయాలతో భారతదేశ సముద్ర సామర్థ్యాలను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు" అని మోదీ పేర్కొన్నారు. దర్యా సారంగ్ కన్హోజీ యాగంటి ధైర్యం ముందు మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా నిలబడలేకపోయిందన్నారు. భారతదేశ సుసంపన్నమైన చరిత్రను గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాన మంత్రి విమర్శించారు. “ఇది చరిత్ర నుండి నేర్చుకునే, తన సామర్థ్యాన్ని, గర్వాన్ని గుర్తించే నవభారతం” అన్న మోదీ, బానిస సంకెళ్లకు సంబంధించిన ప్రతి గుర్తును విడిచిపెట్టి, సముద్ర సంబంధ మౌలిక సదుపాయాలలో నవ భారతం కొత్త విజయాలను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు.

 

భారతదేశ తీరప్రాంతంలో అభివృద్ధి గత దశాబ్దంలో అపూర్వమైన వేగం పుంజుకుందని ప్రధాని పేర్కొన్నారు. ఓడరేవుల ఆధునీకరణ, జలమార్గాల అభివృద్ధి అలాగే భారతదేశంలో ఓడల నిర్మాణాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలను ఆయన ఉదాహరించారు. "ఈ దిశలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు" చెప్పిన మోదీ, భారతదేశంలోని చాలా ఓడరేవుల నిర్వహణ సామర్థ్యం రెట్టింపు కావడం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం, అలాగే నౌకల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడం ద్వారా దీని ఫలితాలను చూడవచ్చని తెలిపారు. యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూనే, ఖర్చులను తగ్గించడం ద్వారా ఇది పరిశ్రమలు, వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చిందని ప్రధాని స్పష్టం చేశారు. "నావికుల సౌకర్యాలు కూడా పెరిగినట్లు", మోదీ పేర్కొన్నారు.

 

ప్రపంచం మొత్తం నేడు వధావన్ ఓడరేవు వైపు చూస్తోందని, 20 మీటర్ల లోతుతో వధావన్ ఓడరేవు ప్రపంచంలోని అలాంటి అతి కొద్ది ఓడరేవుల సరసన చేరిందని ప్రధాని తెలిపారు. రైల్వే, ప్రధాన రహదారులతో అనుసంధానం కారణంగా ఓడరేవు ఈ ప్రాంత మొత్తం ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. డెడికేటెడ్ వెస్ట్రన్ ఫ్రైట్ కారిడార్‌కు అనుసంధానం, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ రహదారికి సమీపంలో ఉండటం వల్ల ఇది కొత్త వ్యాపారాలు, గిడ్డంగుల ఏర్పాటుకు అవకాశాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. "ఏడాది పొడవునా కార్గో సేవలకు వీలుండడం వల్ల, మహారాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది" అని ఆయన చెప్పారు.

 

'మేక్ ఇన్ ఇండియా' అలాగే 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' కార్యక్రమాల ద్వారా మహారాష్ట్ర పొందిన ప్రయోజనాలను ప్రధానంగా ప్రస్తావించిన మోదీ, "మహారాష్ట్ర అభివృద్ధి నాకు చాలా ప్రాధాన్యమైనది" అన్నారు. భారతదేశ పురోభివృద్ధిలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్న ప్రధాని, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాల పట్ల విచారం వ్యక్తం చేశారు.

 

దాదాపు 60 ఏళ్లుగా వధావన్ పోర్ట్ ప్రాజెక్టును నిలిపివేసేందుకు గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని, సముద్ర వాణిజ్యం కోసం భారతదేశానికి సరికొత్త, అధునాతన ఓడరేవు అవసరమన్నారు. అయితే దీనికోసం 2016 వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, 2020 నాటికి పాల్ఘర్‌లో ఓడరేవును నిర్మించాలని నిర్ణయించారన్నారు. అయితే, ప్రభుత్వం మారడంతో మళ్లీ రెండున్నరేళ్లుగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్నారు. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 12 లక్షల ఉద్యోగావకాశాలు దీని ద్వారా అందివస్తాయని ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టును కొనసాగించడానికి గత ప్రభుత్వాలు అనుమతించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

 

సముద్ర సంబంధ అవకాశాల విషయంలో భారత మత్స్యకారులు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నారని ప్రధాని తెలిపారు. ‘‘పీఎం మత్స్యసంపద’’ పథకం లబ్ధిదారులతో తన సంభాషణను గుర్తు చేసుకుంటూ, ప్రభుత్వ పథకాలు, సేవా స్ఫూర్తి కారణంగా గత పదేళ్లలో ఈ రంగం ఎంతగానో మారిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. 2014లో దేశంలో 80 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి కాగా, నేడు 170 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయని గుర్తుచేశారు. కేవలం పదేళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపు కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతదేశంలో పెరుగుతున్న మత్స్య ఎగుమతుల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే పదేళ్ల కిందట రూ. 20 వేల కోట్ల కంటే తక్కువ విలువ కలిగి ఉన్న రొయ్యల ఎగుమతి రంగం నేడు రూ. 40 వేల కోట్లకు పైగా విలువ కలిగి ఉండడాన్ని ఉదహరించారు. "రొయ్యల ఎగుమతి కూడా నేడు రెండింతలు పెరిగింది", లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంలో సహాయపడిన నీలి విప్లవ పథకం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు.

 

మత్స్య పరిశ్రమలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పేర్కొంటూ, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద వేలాది మంది మహిళలకు సహాయం చేయడాన్ని ప్రధాని ప్రస్తావించారు. అధునాతన సాంకేతికతలు, ఉపగ్రహాల వినియోగం గురించి మాట్లాడుతూ, ఈ రోజు నౌకా సమాచార వ్యవస్థను ప్రారంభించడాన్ని ప్రస్తావించారు. ఇది మత్స్యకారుల పాలిట వరం అవుతుందన్నారు. మత్స్యకారులు వారి కుటుంబాలతో, పడవ యజమానులతో, మత్స్యశాఖ అధికారులతో అలాగే కోస్టుగార్డులతో నిరంతరం సంబంధం కలిగి ఉండేలా, వారు ఉపయోగించే ఓడలపై 1 లక్ష ట్రాన్స్ పాండర్లను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీ మోదీ ప్రకటించారు. అత్యవసర సమయాల్లో, తుఫానులు లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనల సమయంలో ఉపగ్రహాల సహాయంతో మత్స్యకారులు సంభాషించడానికి ఇది సహాయపడుతుందని ప్రధాని చెప్పారు. "అత్యవసర సమయంలో మత్స్యకారుల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యత" అని ఆయన భరోసా ఇచ్చారు.

 

మత్స్యకారుల ఓడలు సురక్షితంగా తిరిగి రావడానికి 110కి పైగా ఫిషింగ్ పోర్టులు, ల్యాండింగ్ సెంటర్లను నిర్మిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కోల్డ్ చైన్, ప్రాసెసింగ్ సౌకర్యాలు, పడవలకు రుణ పథకాలు అలాగే ‘‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’’ వంటి పథకాలను ఉదహరించిన ప్రధాని, మత్స్యకారులకు సంబంధించిన ప్రభుత్వ సంస్థలను కూడా బలోపేతం చేస్తున్నామని, తీరప్రాంత గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అన్నారు.

 

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం నిరంతరం వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారి సంక్షేమం కోసం ప‌నిచేస్తోంద‌ని, అణగారిన వారికి తగిన అవ‌కాశాలు కల్పిస్తున్నదని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వాలు రూపొందించిన విధానాల వల్ల దేశంలో ఇంత పెద్ద గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కూడా గిరిజన సంఘాల సంక్షేమం కోసం ఒక్క విభాగం కూడా లేదన్నారు. వారు మత్స్యకారులు, గిరిజన సమాజాన్ని ఎల్లప్పుడూ వెనకబాటుకు గురిచేశారన్నారు. “మత్స్యకారులు, గిరిజన సంఘాల కోసం ఇప్పుడు వేర్వేరు మంత్రిత్వ శాఖలను మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాడు నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలు ప్రధానమంత్రి జన్‌మన్ యోజన ప్రయోజనాలను పొందుతున్నాయి. అలాగే మన గిరిజన, మత్స్యకారుల సంఘాలు మన దేశ అభివృద్ధికి భారీ సహకారం అందిస్తున్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

మహిళల నేతృత్వంలో అభివృద్ధి అనే విధానాన్ని అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు. అలాగే మహిళా సాధికారత విషయంలో మహారాష్ట్ర దేశానికి మార్గదర్శకం చేస్తుందని ప్రశంసించారు. మ‌హారాష్ట్ర‌లో అనేక అత్యున్న‌త స్థానాల‌లో అద్భుతంగా ప‌నిచేస్తున్న మ‌హిళ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, రాష్ట్ర చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రాష్ట్ర పరిపాలనకు మార్గనిర్దేశం చేస్తున్న సుజాత సౌనిక్ గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. డీజీపీగా రష్మీ శుక్లా రాష్ట్ర పోలీసు బలగాలకు నాయకత్వం వహిస్తుండగా, రాష్ట్ర అటవీశాఖ అధిపతిగా శోమితా బిస్వాస్, అలాగే రాష్ట్ర న్యాయ శాఖ అధిపతిగా సువర్ణ కేవాలే బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌గా జయా భగత్ బాధ్యతలు చేపట్టడం, ముంబైలో కస్టమ్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రాచీ స్వరూప్ అలాగే ముంబై మెట్రో ఎండీగా అశ్విని భిడే బాధ్యతలు స్వీకరించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఉన్నత విద్యారంగంలో రాణిస్తున్న మహారాష్ట్ర మహిళలను ప్రస్తావిస్తూ, మహారాష్ట్ర హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురీ కనిత్కర్ అలాగే మహారాష్ట్ర స్కిల్ యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సిలర్ డాక్టర్ అపూర్వ పాల్కర్ గురించి ప్రధాని ప్రస్తావించారు. "21వ శతాబ్దపు మహిళా శక్తి సమాజానికి కొత్త దిశను అందించడానికి సిద్ధంగా ఉందనడానికి ఈ మహిళల విజయాలే నిదర్శనం", ఈ మహిళా శక్తి వికసిత్ భారత్‌కు అతిపెద్ద పునాది అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

తన ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధాన మంత్రి, ఈ ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ అనే నమ్మకం ఆధారంగా పనిచేస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రజల సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర గవర్నర్, శ్రీ సి పి రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్, శ్రీ అజిత్ పవార్, కేంద్ర ఓడరేవులు, నౌకాయాన మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నేపథ్యం

వధావన్ పోర్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.76,000 కోట్లు. పెద్ద కంటైనర్ షిప్‌లకు ఆశ్రయం కల్పించగల ప్రపంచ స్థాయి సముద్ర యాన కూడలిని ఏర్పాటు చేయడం ద్వారా దేశ వాణిజ్య, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం, ఈ ప్రాజెక్ట్ ద్వారా సముద్రతీర ప్రాంతాన్ని మరింత లోతుగా చేసి భారీ కార్గో నౌకలకు ఆశ్రయం కల్పించనున్నారు.

 

పాల్ఘర్ జిల్లాలోని దహను పట్టణానికి సమీపంలో ఉన్న వధావన్ ఓడరేవు భారతదేశంలోని అతిపెద్ద లోతైన నౌకాశ్రయాలలో ఒకటిగా నిలుస్తుంది. అంతర్జాతీయ నౌకా మార్గాలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తుంది. రవాణా సమయాలను, ఖర్చులను తగ్గిస్తుంది. అత్యాధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలతో కూడిన ఈ పోర్టులో లోతైన బెర్తులు, సమర్థవంతమైన కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాలు, అత్యాధునిక పోర్టు నిర్వహణ వ్యవస్థలు ఉంటాయి. ఈ నౌకాశ్రయం గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం అందిస్తుందని అలాగే ఈ ప్రాంతం మొత్తం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. వధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం, కఠినమైన పర్యావరణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంపై దృష్టి సారిస్తూ సుస్థిర అభివృద్ధి విధానాలను కలిగి ఉంది. దీనిలో కార్యకలాపాలు ప్రారంభమైతే, ఈ నౌకాశ్రయం భారతదేశ సముద్ర అనుసంధానతను మెరుగుపరుస్తుంది. అలాగే ప్రపంచ వాణిజ్య కేంద్రంగా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

 

దేశ వ్యాప్తంగా మత్స్య రంగంలో మౌలిక సదుపాయాలు, ఉత్పాదకతను పెంపొందించే లక్ష్యంతో సుమారు రూ.1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలు చేపల పెంపకం రంగంలో ఐదు లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించగలవని అంచనా.

అనంతరం సుమారు రూ.360 కోట్ల వ్యయంతో నౌకా సమాచార సహాయ వ్యవస్థను ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కింద 13 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మెకనైజ్డ్, మోటరైజ్డ్ ఫిషింగ్ ఓడలపై దశలవారీగా లక్ష ట్రాన్స్‌పాండర్లు అమర్చుతారు. షిప్ కమ్యూనికేషన్, సపోర్ట్ సిస్టమ్ అనేది ఇస్రో అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. మత్స్యకారులు సముద్రంలో ఉన్నప్పుడు వారితో ఇరువైపులా కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడంలో ఇది సహాయపడుతుంది. మత్స్యకారులను రక్షించే ఆపరేషన్లలో సహాయకరంగా ఉంటుంది. అలాగే వారి భద్రతకు భరోసానిస్తుంది.

 

ప్రధాన మంత్రి ప్రారంభించిన ఇతర కార్యక్రమాలలో, ఫిషింగ్ హార్బర్లు, ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్కులు, అభివృద్ధి, అలాగే పున:ప్రవాహ ఆక్వాకల్చర్ వ్యవస్థ, బయోఫ్లోక్ వంటి అధునాతన సాంకేతికతల అమలు వంటివి ఉన్నాయి. చేపల ఉత్పత్తిని పెంపొందించడానికి, పోస్ట్-హార్వెస్ట్ నిర్వహణను మెరుగుపరచడానికి అలాగే మత్స్య రంగంపై ఆధారపడిన లక్షలాది మందికి స్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి కీలకమైన మౌలిక సదుపాయాలు, అధిక-నాణ్యత కలిగిన ముడిసరుకును అందించడానికి ఈ ప్రాజెక్టులను పలు రాష్ట్రాలలో అమలు చేయనున్నారు.

 

ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, ఆధునికీకరణ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణంతో సహా ముఖ్యమైన మత్స్యరంగ మౌలికవసతుల ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఇది చేపలు అలాగే సముద్ర సంబంధ ఆహారం నిల్వకు అవసరమైన సౌకర్యాలను, పరిశుభ్రమైన పరిస్థితులను అందిస్తుంది. 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi