* మన మందిరాలు, మన మఠాలు, మన పవిత్ర స్థలాలు.. ఇవి ఒక వైపు పూజాకేంద్రాలు, సాధన కేంద్రాలుగా ఉంటే మరోవైపు అవి విజ్ఞానంతోపాటు సామాజిక చేతన కేంద్రాలుగా కూడా నిలిచాయి: ప్రధాని
* మనకు ఆయుర్వేద విజ్ఞానాన్ని, యోగాకు చెందిన విజ్ఞానాన్ని ఇచ్చింది మన రుషులే, ఈ రెండిటినీ ఇవాళ ప్రపంచమంతటా అభినందిస్తున్నారు: ప్రధాని
* దేశం నాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినప్పుడు, నేను ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ మంత్రాన్ని ప్రభుత్వ సంకల్పంగా మలిచాను, మరి ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ సంకల్పానికి సైతం ఓ పెద్ద ఆధారం ఉంది.. అదే అందరికీ చికిత్స, అందరికీ ఆరోగ్యం: ప్రధాని

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా గఢా గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ సమయంలోనే రెండో సారి బుందేల్‌ఖండ్‌కు రావడం తనకు దక్కిన సౌభాగ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కేంద్రం బాగేశ్వర్ ధామ్ త్వరలోనే ఆరోగ్య కేంద్రంగా కూడా రూపుదాల్చుతుందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తారని, మొదటి దశలో 100 పడకల సదుపాయం అందివస్తుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర కార్యానికిగాను శ్రీ ధీరేంద్ర శాస్త్రిని ఆయన అభినందిస్తూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ కాలంలో ధర్మాన్ని రాజకీయ నేతల్లో ఒక వర్గం గేలి చేస్తున్నదని, వారు ప్రజలను విడదీయడంలో నిమగ్నం అయ్యారని ప్రధానమంత్రి అన్నారు. దేశాన్ని, ధర్మాన్ని బలహీనపరచడానికి ఈ  తరహా నేతలకు అప్పుడప్పుడూ విదేశీ సంస్థల నుంచి సమర్థన కూడా లభించిందన్నారు. హిందూ ధర్మాన్ని ఏవగించుకొనే వారు విభిన్న రూపాల్లో చాలా కాలంగా ఉంటూ వచ్చారని ఆయన అన్నారు. మన నమ్మకాలు, సంప్రదాయాలు, మందిరాలపై అదేపనిగా దాడులు చేస్తూ వచ్చారని ప్రధానమంత్రి చెబుతూ ఈ శక్తులు మన సాధుసంతులు, సంస్కృతి, సిద్ధాంతాలపై దాడి చేస్తుంటాయన్నారు. వారు మన పండుగలు, ఆచారాలు, అనుష్ఠానాలపై గురిపెడుతుంటారు. చివరకు వారు మన ధర్మం, మన సంస్కృతిలలోని అభ్యుదయ స్వభావాన్నే అపఖ్యాతి పాల్జేయడానికైనా తెగబడతారన్నారు. మన సమాజాన్ని ముక్కలుచేసి, సమాజ ఐకమత్యాన్ని భంగపరచడమే వారి అజెండా అని శ్రీ మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చాలా కాలం నుంచి దేశంలో ఏకతా మంత్రం గురించి అవగాహనను పెంపొందింపచేస్తున్న శ్రీ ధీరేంద్ర శాస్త్రి ప్రయత్నాలను ప్రధానంగా ప్రస్తావించారు. శ్రీ ధీరేంద్ర శాస్త్రి ఒక క్యాన్సర్ సంస్థను ఏర్పాటు చేస్తూ సమాజం కోసం, మావనజాతి సంక్షేమం కోసం మరో సంకల్పాన్ని చెప్పుకొన్నారని శ్రీ మోదీ ప్రకటించారు. దీని ఫలితంగా బాగేశ్వర్ ధామ్‌లో ఇక భక్తి, పోషణ, ఆరోగ్యదాయకమైన జీవనం.. వీటి ఆశీర్వాదాలు లభిస్తాయని ఆయన అభివర్ణించారు.

 

‘‘మన మందిరాలు, మఠాలు, పవిత్ర స్థలాలు అటు ఆరాధన కేంద్రాలు, సాధన కేంద్రాలుగాను, ఇటు విజ్ఞానశాస్త్ర సంబంధ, సామాజిక చేతన కేంద్రాలుగా కూడాను రెండు విధాలైన పాత్రలను పోషించాయి’’ అని ప్రధానమంత్రి అభివర్ణించారు. మన మునులు మనకు ఆయుర్వేద విజ్ఞానశాస్త్రాన్ని, యోగాను అందించారు. ఇవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకొన్నాయని ఆయన చెప్పారు. ఇతరులకు సేవ చేయడం, వారి కష్టాలను దూరం చేయడం నిజమైన ధర్మమని ఆయన స్పష్టం చేశారు. ‘‘నరునిలో నారాయణుడు’’ ఉన్నాడన్న భావనతో, ‘‘అన్ని ప్రాణుల్లో ఈశ్వరుడు ఉన్నాడు’’ అనే భావనతో జీవులన్నింటికీ సేవ చేసే మన సంప్రదాయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కోట్ల మంది పాలుపంచుకొంటున్న, పవిత్ర స్నానాలు చేస్తున్న, త్వరలో ముగింపు దశకు చేరుకొంటున్న మహా కుంభ్‌ విషయంలో విస్తృతంగా జరుగుతున్న చర్చలను దృష్టిలో పెట్టుకొని శ్రీ మోదీ... దీనిని ఒక ‘ఏకతా మహా కుంభ్’గా ప్రశంసించారు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు అధికారులు అంకిత భావంతో సేవ చేశారంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ‘మహా కుంభ్’ కాలంలో ‘నేత్ర మహా కుంభ్’ను కూడా నిర్వహిస్తున్నారని, అయితే దీని విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదన్నారు. అయినప్పటికీ, 2 లక్షలకు పైగా కంటి పరీక్షలు చేసి, సుమారు ఒకటిన్నర లక్షల మందికి ఉచితంగా మందులతోపాటు కళ్లద్దాలను ఇచ్చారని, దాదాపు 16,000 మంది రోగులకు శుక్లాల చికిత్సలను, ఇతర శస్త్రచికిత్సలను చేయించుకోవాల్సిందిగా వివిధ ఆసుపత్రులకు పంపించారని ఆయన వివరించారు. మన మునుల మార్గదర్శకత్వంలో మహా కుంభ్ సందర్బంగా లెక్కపెట్టలేనన్ని ఆరోగ్య, సేవా సంబంధ కార్యక్రమాలు అమలవుతున్నాయని, వేల మంది వైద్యులు, స్వచ్ఛంద సేవకులు నిస్వార్థంగా వాటిలో పాల్గొంటున్నారని ప్రధానమంత్రి అన్నారు. కుంభ్‌కు హాజరై పాటుపడుతున్న వారి ఈ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

 

భారతదేశంలో పెద్ద పెద్ద ఆసుపత్రులను నడుపుతూ ధార్మిక సంస్థలు పోషిస్తున్న పాత్రను ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. కోట్ల కొద్దీ పేద ప్రజానీకానికి చికిత్సలను, సేవలను అందిస్తూ... అనేక ఆరోగ్య, విజ్ఞానశాస్త్ర పరిశోధన సంస్థలను నిర్వహిస్తున్నదీ ధార్మిక ట్రస్టులేనని ఆయన వ్యాఖ్యానించారు. భగవాన్ రామునితో అనుబంధం కలిగి ఉన్న బుందేల్‌ఖండ్‌లోని పవిత్ర తీర్థస్థలం చిత్రకూట్... దివ్యాంగులకు, రోగగ్రస్థులకు సేవలందిస్తున్న ఒక ప్రముఖ కేంద్రంగా ఉండిందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ ఆరోగ్య ఆశీస్సులను అందజేసి ఈ గౌరవశాలి సంప్రదాయంలో ఒక కొత్త అధ్యాయాన్ని జోడిస్తోందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజుల తరువాత, మహాశివరాత్రి నాడు, 251 మంది పుత్రికల సామూహిక వివాహ మహోత్సవం జరగనుందని ఆయన ప్రకటించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి గాను బాగేశ్వర్ ధామ్‌ను ఆయన ప్రశంసించారు. నూతన వధూవరులకు పుత్రికలకు సంతోషభరిత భావి జీవనం ప్రాప్తించాలంటూ ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ధర్మ గ్రంథంలో ‘‘శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం’’ అని పేర్కొని ఉందని ప్రధానమంత్రి చెబుతూ, ఈ మాటలకు – మనం మన ధర్మాన్ని, సంతోషాన్ని, సాఫల్యాన్ని అందుకోవాలంటే అందుకు మన శరీరం, మన ఆరోగ్యాలే ప్రాథమిక సాధనాలు - అని అర్థమని వివరించారు. దేశం తనకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినప్పుడు తాను ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ మంత్రాన్ని ప్రభుత్వ సంకల్పంగా మార్చానని ఆయన చెప్పారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ మంత్రానికి ప్రధాన మూలాధారం ‘సబ్‌కా ఇలాజ్, సబ్‌కో ఆరోగ్య’ అని ఆయన తెలిపారు. అందరికీ ఆరోగ్య సేవలు దక్కడం అని ఈ మాటలకు అర్థం అని ప్రధాని వివరిస్తూ, వివిధ స్థాయిలలో వ్యాధి నివారణపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన సంగతిని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, టాయిలెట్ల నిర్మాణంతో అనారోగ్యకర పరిస్థితుల వల్ల జనించే రోగాలు తగ్గినట్లు తెలిపారు. టాయిలెట్లు కలిగిఉన్న కుటుంబాలు చికిత్సకవుతున్న వేల రూపాయలను మిగుల్చుకొన్నాయని ఒక అధ్యయనం సూచించిందని ఆయన అన్నారు.    

తమ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చే కన్నా ముందు, దేశంలో పేదలు జబ్బు కన్నా ఎక్కువగా చికిత్సకయ్యే ఖర్చులంటేనే భయపడేవారని, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే పూర్తి కుటుంబాన్ని సంకటంలో పడవేసేదని ప్రధానమంత్రి అన్నారు. తాను కూడా ఒక పేద కుటుంబంలో నుంచే వచ్చానని ఆయన చెబుతూ, ఇలాంటి కష్టాలను గురించి తనకు తెలుసని ఆయన అన్నారు. అందుకనే చికిత్స ఖర్చును తగ్గించి ప్రజలకు మరింత డబ్బు ఆదా అయ్యేటట్టు చూడాలని తాను సంకల్పం చెప్పుకొన్నానని ఆయన అన్నారు. ఏ ఆపన్న వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాల లాభాలు అందుకోకుండా మిగిలిపోకుండా చూడాలన్నదే తన నిబద్ధత అని శ్రీ మోదీ పునరుద్ఘాటిస్తూ, వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ కార్డుతో ప్రతి పేదకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందే ఏర్పాటు చేసిన సంగతిని ప్రధానంగా ప్రస్తావించారు. ఇంతవరకు ఈ కార్డును తీసుకోనివారు త్వరలో దీనిని తీసుకోవాలని ఆయన కోరారు.  

 

ఇప్పుడు 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు వారు పేదలు అయినా, మధ్యతరగతి వారయినా, లేక సంపన్నులు అయినా కూడా వారికి ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డులను జారీ చేస్తున్నారని శ్రీ మోదీ వెల్లడించారు. ఈ కార్డులను ఎలాంటి ఖర్చు లేకుండానే ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చని తెలిపారు. ఆయుష్మాన్ కార్డు కోసం ఎవరూ ఎలాంటి చెల్లింపు చేయనక్కరలేదనని, ఎవరైనా డబ్బు ఇవ్వాలని అడిగితే ఆ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు చెప్పారు. చాలా చికిత్సలకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వైద్యులు రాసి ఇచ్చిన మందులను ఇంట్లోనే ఉంటూ వేసుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. మందులకయ్యే ఖర్చులను తగ్గించడానికి, దేశం అంతటా 14,000కు పైగా జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఈ కేంద్రాలు చౌకధరలకు మందులను అందిస్తున్నాయన్నారు. మూత్రపిండాలకు వచ్చే వ్యాధి మనిషి ఆరోగ్యానికి మరో పెద్ద సమస్యను కొనితెస్తుందని ఆయన ప్రస్తావించారు. ఈ వ్యాధి వస్తే రోగికి నిరంతరం డయాలిసిస్ అవసరం పడుతుందని, 700కు పైచిలుకు జిల్లాల్లో 1,500కు పైగా డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఈ కేంద్రాలు ఉచితంగా డయాలిసిస్ సేవలను అందిస్తున్నాయని వివరించారు. అందరూ పరిచయమున్న వ్యక్తులకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అవగాహన కలిగించాలనీ, ఈ ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని అన్నారు.

‘‘క్యాన్సర్ ప్రతి చోటా ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది. ప్రభుత్వం, సమాజం, సాధువులు అందరు క్యాన్సర్‌పై పోరాటం సాగించడంలో ఒక్కటయ్యారు’’ అని శ్రీ మోదీ అన్నారు.  ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే పల్లెవాసులు పడే ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావించారు. ముందస్తుగానే గుర్తించలేకపోవడం, జ్వరం వచ్చినా, నొప్పిగా ఉన్నా ఇంటి చిట్కాలపై ఆధారపడే ధోరణి నెలకొందని ఆయన చెప్పారు. దీంతో స్థితి విషమించి ఆలస్యంగా రోగ నిర్ధారణ జరుగుతోందన్నారు. క్యాన్సర్ ఉందని తేలిన తరువాత కుటుంబాల్లో భయం, భ్రమ కమ్ముకొంటున్నాయని, వారిలో  చాలా మందికి ఢిల్లీ లేదా ముంబయిలలోనే చికిత్స కేంద్రాలు ఉన్న సంగతొక్కటే తెలుసని ఆయన అన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. క్యాన్సర్‌తో పోరాడడానికి ఈ సంవత్సరం బడ్జెటులో అనేక ప్రకటనలు పొందుపరిచామన్నారు. క్యాన్సర్ మందులను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాలని తాను సంకల్పించానని, రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డేకేర్ సెంటర్లను తెరవనున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాలు రోగనిర్ధారణ, ఉపశమనకారి సంరక్షక సేవలను అందిస్తాయని తెలిపారు. చికిత్సను ఇట్టే అందుబాటులోకి తీసుకువచ్చేటట్లు చూడడానికి జిల్లా ఆసుపత్రులు, స్థాతనికి వీధులలో సైతం కేన్సర్ క్లినిక్ లను ప్రారంభించగలమని శ్రీ మోదీ అన్నారు.

క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండడానికి, అవగాహనను పెంచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రధాని స్పష్టం చేశారు. దీని జాడను ముందస్తుగా గుర్తించడం ముఖ్యం, ఎందుకంటే క్యాన్సర్ తో పోరాడడం కష్టతరమైపోతుందని ఆయన అన్నారు. 30 ఏళ్ల వయస్సు మించిన వారినందనీ పరీక్షించడం కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యమాన్ని గురించి ఆయన వివరిస్తూ, ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానం కలిగితే, తక్షణం క్యాన్సర్ సంబంధిత పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.  క్యాన్సర్ విషయంలో సరైన సమాచారం తెలియడం ముఖ్యమంటూ, ఇది అంటురోగమేం కాదని, స్పర్శతో వ్యాపించదని అన్నారు. బీడీలు, సిగరెట్లు, గుట్కా, పొగాకు, మసాలాల వాడకం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరిగిపోతుందని, ఈ పదార్థాలకు దూరంగా ఉండాలని సలహానిచ్చారు. ప్రతి ఒక్కరు వారి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఏ రకమైన ఉపేక్ష పాలబడకుండా సావధానులై ఉంటూ ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

 

ప్రజలకు సేవ చేయాలన్న తన అంకితభావాన్ని ప్రధాని స్పష్టం చేస్తూ, ఇదివరకు తాను ఛతర్‌పుర్‌ను సందర్శించిన సంగతిని గుర్తుకు తెచ్చారు. అప్పట్లో తాను వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు వివరింవచారు. 45,000 కోట్ల కెన్-బెత్‌వా లింకు ప్రాజెక్టును ఆ ప్రాజెక్టులలో భాగం చేశామన్నారు. ఆ ప్రాజెక్టుల అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ, అనేక మంది నేతలు బుందేల్‌ఖండ్‌కు వచ్చినప్పటికీ దశాబ్దాల తరబడి అవి పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతం నిరంతరం నీటి ఎద్దడిని ఎదుర్కొందని శ్రీ మోదీ తెలియజేస్తూ, వెనుకటి ఏ ప్రభుత్వమైనా తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిందా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆశీస్సులు అందిన తరువాతే పనులు మొదలయ్యాయని ఆయన స్పష్టం చేశారు. తాగునీటి సంకట స్థితిని దూరం చేయడంలో శరవేగంగా చోటు చేసుకొంటున్న ప్రగతిని గురించి కూడా ఆయన వివరించారు. జల్ జీవన్ మిషన్ లేదా హర్ ఘర్ జల్ (ప్రతి ఇంటికీ నీరు) ప్రాజెక్టులో భాగంగా బుందేల్‌ఖండ్‌లోని గ్రామాల్లో గొట్టపుమార్గం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని ఆయన తెలిపారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలను తగ్గించడంతోపాటు వారి ఆదాయాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలను గురించి కూడా ఆయన ప్రధానంగా చెబుతూ, ప్రభుత్వం రాత్రింబగళ్లు అలుపెరుగక కృషి చేస్తోందన్నారు.

బుందేల్‌ఖండ్ సమృద్ధి చెందాలంటే మహిళలకు సాధికారతను కల్పించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉందని శ్రీ మోదీ చెబుతూ, ‘లఖ్‌పతి దీదీ’ (లక్షాధికారి సోదరి) కార్యక్రమం, ‘డ్రోన్ దీదీ’ (డ్రోన్ సోదరి) కార్యక్రమం వంటి వాటిని ప్రారంభించినట్లు చెప్పారు. 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా చేయాలన్నదే లక్ష్యమని ప్రకటించారు. డ్రోన్లను ఉపయోగించడంలో మహిళలకు శిక్షణనిస్తున్నారని, సేద్యపు నీరు బుందేల్‌ఖండ్ వరకు చేరుకొన్న అనంతరం నీటిని పైర్లపైన  చిమ్మడానికి, వ్యవసాయ పనుల్లో సాయాన్నందించడానికి డ్రోన్లను ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నాలు బుందేల్‌ఖండ్‌ను అభివృద్ధి వైపునకు పరుగుపెట్టించగలవని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.  

స్వామిత్వ యోజనలో భాగంగా గ్రామాల్లో కచ్చితమైన భూ కొలత, పక్కాగా ఉంటే భూమి రికార్డులను అందుబాటులోకి తీసుకురావడానికి డ్రోన్ టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించాలని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మధ్య ప్రదేశ్‌లో విజయవంతంగా అమలుచేస్తున్నారని తెలిపారు. మధ్య ప్రదేశ్‌లో ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలను సులభంగా పొందడానికి ఈ దస్తావేజుపత్రాలను ఉపయోగిస్తున్నారని, ఆ రుణాలను వ్యాపారాలకు వినియోగించుకొంటున్నారని, దాంతో ప్రజల ఆదాయం వృద్ది చెందుతోందని ఆయన వివరించారు.

ప్రధాని తన ప్రసంగాన్ని ముగిస్తూ, బుందేల్‌ఖండ్‌ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకొనేటట్లుగా చూడడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అలుపెరుగక పాటుపడాలని  స్పష్టంచేశారు. సమృద్ధి, అభివృద్ధిల మార్గంలో బుందేల్‌ఖండ్ ముందుకు పయనిస్తూనే ఉంటుందన్న ఆశను ఆయన వ్యక్తం చేస్తూ, ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ గవర్నరు శ్రీ మంగూభాయి ఛగన్‌భాయి పటేల్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్‌లతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

జీవనంలో అన్ని రంగాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే ఉద్దేశంతో మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లా గఢా గ్రామంలో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను నిర్మిస్తున్నారు. రూ.200 కోట్లకు పైగా ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ఈ క్యాన్సర్ ఆసుపత్రికి అత్యాధునిక యంత్రాలతోపాటు స్పెషలిస్టు డాక్టర్లను కూడా సమకూర్చుతారు. ఈ ఆసుపత్రి సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాలకు చెందిన క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స సేవల్ని అందించనుంది.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Regional languages take precedence in Lok Sabha addresses

Media Coverage

Regional languages take precedence in Lok Sabha addresses
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in the mishap in Chitradurga district of Karnataka
December 25, 2025
Announces ex-gratia from PMNRF

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to a mishap in Chitradurga district of Karnataka. Shri Modi also wished speedy recovery for those injured in the mishap.

The Prime Minister announced an ex-gratia from PMNRF of Rs. 2 lakh to the next of kin of each deceased and Rs. 50,000 for those injured.

The Prime Minister posted on X:

“Deeply saddened by the loss of lives due to a mishap in the Chitradurga district of Karnataka. Condolences to those who have lost their loved ones. May those injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"