Quoteఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికే మా ప్రాధాన్యం, ఈ రంగంలో నేడు ప్రారంభించిన కార్యక్రమాలు /div> ప్రజలకు అత్యంత నాణ్యమైన, అందుబాటు ధరల్లోనే సదుపాయాలు... ఈ రోజు 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవం నిర్వహించుకోవడం మనందరికీ సంతోషకరమైన విషయం ఆరోగ్య విధానం కోసం అయిదు మూల స్తంభాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దేశంలోని 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులందరికీ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స వారందరికీ ఆయుష్మాన్ వయ వందన కార్డులు అందిస్తాం ప్రాణాంతక వ్యాధుల నివారణకు ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ ప్రచారం

ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా... ఈరోజు న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆరోగ్య రంగానికి సంబంధించి దాదాపు రూ.12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొన్నింటిని ప్రారంభించగా, మరికొన్నింటిని ఆవిష్కరించారు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి మాట్లాడుతూ... ధ‌న్వంత‌రి జ‌యంతి, దంతేరస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ పండుగ వేళ దాదాపుగా ప్రతి కుటుంబం ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేస్తుందనీ, అందుకు దేశంలోని వ్యాపార యజమానులందరికీ  ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దీపావళి పండుగ కోసం అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.

అయోధ్యలోని శ్రీరాముని ఆలయం వేలాది దీపాల వెలుగులతో ప్రకాశిస్తూ ఈ వేడుకలను అపూర్వమైనవిగా మార్చిన క్రమంలో ఈ దీపావళిని చరిత్రాత్మకమైనదిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. "ఈ సంవత్సరం దీపావళికి రాముడు మరోసారి తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే చివరకు ఈ నిరీక్షణ 14 సంవత్సరాలకు కాదు, 500 సంవత్సరాల తర్వాత ముగిసింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది దంతేరస్ పండుగ శ్రేయస్సు, ఆరోగ్యాల సమ్మేళనంగానే కాకుండా భారతదేశ సంస్కృతి, జీవన తత్వానికి ప్రతీకగా ఉండడం యాదృచ్ఛికం కాదని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రుషులు, సాధువులూ ఆరోగ్యాన్ని మహోన్నత సంపదగా పరిగణిస్తారనీ, ఈ పురాతన భావన యోగా రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందుతోందని ప్రధాని తెలిపారు. ఈ రోజు 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఆయుర్వేదం పట్ల పెరుగుతున్న ఆదరణకూ, పురాతన కాలం నుంచి ప్రపంచానికి ఆయుర్వేదం ద్వారా భారత్ అందించిన సహకారానికీ ఇది నిదర్శనమని అన్నారు.

 

|

ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక వైద్యంతో సమ్మిళితం చేయడం ద్వారా గడిచిన దశాబ్దంలో దేశ ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ అధ్యాయానికి అఖిల భారత ఆయుర్వేద సంస్థ కేంద్ర స్థానంగా ఉందన్నారు. ఏడేళ్ల కిందట ఆయుర్వేద దినోత్సవం రోజున ఈ సంస్థ మొదటి దశను జాతికి అంకితం చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాననీ, అలాగే ధన్వంతరి స్వామి ఆశీస్సులతో ఈ రోజు రెండో దశను సైతం ప్రారంభించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయుర్వేదం, వైద్య విజ్ఞాన రంగాల్లో అధునాతన పరిశోధన, అధ్యయనాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మిళితం చేసిన పంచకర్మ వంటి ప్రాచీన పద్ధతులను ఈ సంస్థలో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పురోగతి పట్ల దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఒక దేశ పురోగతి నేరుగా ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని పేర్కొన్న ప్రధానమంత్రి... ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆరోగ్య విధానం కోసం ఉద్దేశించిన అయిదు మూల స్తంభాలను ఆయన వివరించారు. నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, రోగాలను ముందుగానే గుర్తించడం, చికిత్స, మందులు ఉచితంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచడం, చిన్న పట్టణాల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండడం, చివరిగా ఆరోగ్య సేవల్లో సాంకేతికతను విస్తరించడం వంటి వాటిని అయిదు మూలస్తంభాలుగా అభివర్ణించారు. ‘భారత్ ఆరోగ్య రంగాన్ని సంపూర్ణాత్మక ఆరోగ్యంగా చూస్తోంది’ అని పేర్కొన్న ప్రధానమంత్రి... నేటి ప్రాజెక్టులు ఈ అయిదు మూల స్తంభాలను గురించి మనకు తెలియజేస్తాయన్నారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా, ఆయుష్ హెల్త్ స్కీమ్ కింద 4 ఎక్సెలెన్స్ సెంటర్ల ఏర్పాటు, డ్రోన్ల వినియోగంతో ఆరోగ్య సేవల విస్తరణ, రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో హెలికాప్టర్ సేవలు, న్యూఢిల్లీ, బిలాస్‌పూర్‌ ఎయిమ్స్‌లలో నూతన మౌలిక సదుపాయాలు, దేశంలోని మరో అయిదు ఇతర ఎయిమ్స్‌లలో సేవల విస్తరణ, వైద్య కళాశాలల స్థాపన, నర్సింగ్ కళాశాలలకు భూమి పూజ, ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. కార్మికుల చికిత్స కోసం అనేక ఆసుపత్రులను నెలకొల్పడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి... ఇది కార్మికుల చికిత్సా కేంద్రంగా మారుతుందన్నారు. అధునాతన ఔషధాలు, అధిక నాణ్యత గల స్టెంట్లు, వైద్య పరికరాల తయారీలో కీలకం కానున్న ఫార్మా యూనిట్ల ప్రారంభంతో దేశం మరింత అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

|

మనలో చాలా మంది అనారోగ్యం అంటే మొత్తం కుటుంబంపై మెరుపు దాడిగా భావించే నేపథ్యం నుంచి వచ్చినవారమేననీ, ముఖ్యంగా పేద కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే, కుటుంబంలో ప్రతి సభ్యునిపై దాని ప్రభావం ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వైద్యం కోసం ప్రజలు తమ ఇళ్లు, భూములు, నగలు, అన్నింటినీ అమ్ముకునే కాలం ఉండేదనీ, పేద ప్రజలు వారి కుటుంబ ఆరోగ్యం, ఇతర ప్రాధాన్యాల మధ్య ఏదైనా ఒకటే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆదాయానికి మించిన ఖర్చులను భరించలేని పరిస్థితి ఉండేదన్నారు. పేదల నిరాశను దూరం చేసేందుకు, మా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందనీ, పేదల ఆసుపత్రి ఖర్చులో రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. దేశంలోని దాదాపు 4 కోట్ల మంది పేద‌లు ఆయుష్మాన్ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించ‌కుండా చికిత్స అందుకుని ల‌బ్ది పొందార‌ని ప్ర‌ధానమంత్రి సంతృప్తి వ్య‌క్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ పథకం లబ్ధిదారులను తాను కలుసుకున్నప్పుడు, ఈ పథకంతో అనుబంధం గల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సహా ప్రతి వ్యక్తీ దీనిని ఒక వరంగా భావించడం సంతృప్తినిచ్చిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

ఆయుష్మాన్ పథక విస్తరణపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ మోదీ... ప్రతి వృద్ధుడు దాని కోసం ఎదురు చూస్తున్నారనీ, మూడోసారి అధికారంలోకి రాగానే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ పరిధిలోకి తీసుకువస్తామన్న ఎన్నికల హామీ నెరవేరుతోందని అన్నారు. దేశంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికీ ఆయుష్మాన్ వయ వందన కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ కార్డు సార్వత్రికమైనదని, పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అనే తేడా లేకుండా, ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండా దీనిని అందిస్తున్నట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం గొప్ప విజయమనీ, వృద్ధుల కోసం అందించే ఆయుష్మాన్ వయ వందన కార్డుతో, అనేక కుటుంబాల్లో ఆదాయానికి మించిన ఖర్చు చాలా వరకు తగ్గుతుందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ పథకం ప్రారంభమైన క్రమంలో దేశ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని ఆయన తెలిపారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల చికిత్స ఖర్చు తగ్గించడం పట్ల ప్రభుత్వ ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తూ, 80 శాతం తగ్గింపు ధరతో ఔషధాలు అందుబాటులో ఉంచుతూ, దేశవ్యాప్తంగా 14 వేల పిఎమ్ జన్ ఔషధి కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు చవక ధరలకు మందులు అందుబాటులోకి రావడంతో రూ.30 వేల కోట్లు ఆదా చేయగలిగామన్నారు. స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్లు వంటి పరికరాల ధరలను తగ్గించామనీ, తద్వారా సామాన్యులకు రూ. 80 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని నివారించగలిగామన్నారు. ప్రాణాంతక వ్యాధులను అరికట్టడంతో పాటు గర్భిణులు, నవజాత శిశువుల ప్రాణాలను కాపాడేందుకు గల ఉచిత డయాలసిస్ పథకం, మిషన్ ఇంద్రధనుష్ ప్రచారం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఖరీదైన వైద్య చికిత్సల భారం నుంచి పూర్తిగా విముక్తి పొందే వరకూ తాను విశ్రమించబోనని ప్రధాని హామీ ఇచ్చారు.

 

|

అనారోగ్యాల వల్ల కలిగే నష్టాలను, ఇబ్బందులను తగ్గించడంలో సకాలంలో రోగనిర్ధారణ కీలకమైనదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రోగ నిర్ధారణ చేసి, చికిత్సలను సత్వరమే అందించేందుకు దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య మందిరాల వల్ల కోట్లాది మంది ప్రజలు క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వాటి విషయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను సులభంగా చేయించుకుంటున్నట్లు చెప్పారు. సకాలంలో రోగనిర్ధారణ చేయడం ద్వారా సత్వరమే చికిత్స అందించే వీలుంటుందనీ, దీంతో రోగులకు ఖర్చులు తగ్గుతాయన్నారు. 30 కోట్ల మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించిన ఈ-సంజీవని పథకం కింద ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, ప్రజాధనం ఆదా చేయడానికి ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించుకుంటోందని ప్రధానమంత్రి వివరించారు. "ఉచితంగా, సంబంధిత వైద్యులను సంప్రదించడం ద్వారా ఆరోగ్యం కోసం చేసే ఖర్చులు గణనీయంగా తగ్గాయి" అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ యూ-విన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు శ్రీ మోదీ ప్రకటించారు. "మహమ్మారి సమయంలో మన కో-విన్ ప్లాట్‌ఫామ్ సాధించిన విజయాన్ని ప్రపంచం చూసింది. యూపిఐ చెల్లింపు వ్యవస్థ విజయం ప్రపంచంలో ఒక ప్రధాన విజయగాథగా నిలిచింది" అని ఆయన అన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆరోగ్య రంగంలో ఈ విజయాన్ని పునరావృతం చేయడమే ఇప్పుడు మన ముందున్న లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 ఈ దశాబ్ద కాలానికి ముందు గత ఆరు నుంచి ఏడు దశాబ్దాల్లో సాధించిన పరిమిత విజయాలతో పోల్చితే, గడిచిన దశాబ్దంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో మనం అపూర్వమైన పురోగతిని సాధించామని ప్రధానమంత్రి తెలిపారు. “గత 10 ఏళ్ల కాలంలో, రికార్డు సంఖ్యలో కొత్త ఎయిమ్స్, వైద్య కళాశాలల్ని స్థాపించడం మనం చూశాం" అని ఆయన పేర్కొన్నారు. నేటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో ఆసుపత్రులను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కర్ణాటకలోని నర్సాపూర్, బొమ్మసంద్ర, మధ్యప్రదేశ్‌లోని పితంపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో కొత్త వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. "అదనంగా, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కొత్త ఈఎస్ఐసీ ఆసుపత్రి పనులు ప్రారంభమయ్యాయి. ఇండోర్‌లోనూ కొత్త ఆసుపత్రి ప్రారంభమైంది" అని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఆసుపత్రుల సంఖ్య వైద్య సీట్లలో దామాషా పెరుగుదలను సూచిస్తోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. డాక్టర్ కావాలనే పేద పిల్లల కల ఇక చెదిరిపోదనీ, భారతదేశంలో తగినన్ని సీట్లు లేకపోవడం వల్ల మధ్యతరగతి విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవసరం ఉండదనీ ఆయన స్పష్టం చేశారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో కొత్తగా దాదాపు 1 లక్ష ఎంబీబీఎస్, ఎమ్‌డీ సీట్లు పెరిగాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. రాబోయే అయిదేళ్లలో మరో 75 వేల సీట్లను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

 

|

7.5 లక్షల మంది ఆయుష్ వైద్యులు ఇప్పటికే దేశ ఆరోగ్య సంరక్షణ కోసం తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మెడికల్, వెల్‌నెస్ టూరిజం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. భారతదేశం, విదేశాల్లో ప్రివెంటివ్ కార్డియాలజీ, ఆయుర్వేద ఆర్థోపెడిక్స్, ఆయుర్వేద పునరావాస కేంద్రాల వంటి రంగాలను విస్తరించేందుకు యువత, ఆయుష్ వైద్యులు సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. “ఆయుష్ వైద్యుల కోసం అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మన యువత ఈ అవకాశాల ద్వారా అభివృద్ధి చెందడమే కాకుండా మానవాళికి గొప్ప సేవను కూడా అందిస్తారు” అని ఆయన పేర్కొన్నారు.

21వ శతాబ్దంలో వైద్యరంగం వేగవంతమైన పురోగతినీ, గతంలో నయం చేయలేని వ్యాధుల చికిత్స విషయంలో నేడు సాధించిన పురోగతినీ ప్రధాని మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. "ప్రపంచం చికిత్సతో పాటు శ్రేయస్సుకూ ప్రాధాన్యమిస్తున్న క్రమంలో, ఈ రంగంలో మన దేశం వేల సంవత్సరాల జ్ఞానాన్ని కలిగి ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఆయుర్వేద సూత్రాలను ఉపయోగించి వ్యక్తులకు ఆదర్శవంతమైన జీవనశైలి, వ్యాధుల ముప్పు విశ్లేషణలను రూపొందించే లక్ష్యంతో ప్రకృతి పరిరక్షణ అభియాన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని నవీకరించడంతో పాటు, మొత్తం ప్రపంచానికి సరికొత్త దృక్పథాన్ని అందించగలదని ఆయన స్పష్టం చేశారు.

 

అశ్వగంధ, పసుపు, నల్ల మిరియాలు వంటి సంప్రదాయ మూలికలను అధిక-ప్రభావవంతమైన శాస్త్రీయ అధ్యయనాల ద్వారా ధ్రువీకరించాల్సిన అవసరముందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. "మన సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ప్రయోగశాలల్లో ధ్రువీకరిస్తే ఈ మూలికల విలువ పెరగడంతో పాటు గణనీయమైన మార్కెట్‌ కూడా ఏర్పడుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. అశ్వగంధకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తూ... ఈ దశాబ్దం చివరి నాటికి దీని మార్కెట్ విలువ 2.5 బిలియన్ డాలర్లకు చేరుకోగలదనే అంచనాలను ఆయన ప్రస్తావించారు.

ఆయుష్ విజయం ఆరోగ్య రంగాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆయుష్ తయారీ రంగం 2014లో 3 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు 24 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఇది కేవలం 10 ఏళ్లలో 8 రెట్లు పెరిగిందని తెలిపారు. భారతదేశంలో ఇప్పుడు 900 లకు పైగా ఆయుష్ అంకుర సంస్థలు పనిచేస్తూ, యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోందని పేర్కొన్న ప్రధానమంత్రి, స్థానిక మూలికలు, సూపర్‌ఫుడ్‌లను ప్రపంచస్థాయి సరుకులుగా మార్చడం ద్వారా భారతీయ రైతులకు ప్రయోజనం కలిగిస్తున్నట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గంగానది తీరం వెంబడి సేంద్రియ వ్యవసాయం, మూలికల సాగును ప్రోత్సహించే నమామి గంగే ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

 

|

ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల భారతదేశ నిబద్ధతను ప్రతిబింబిస్తూ, భారత జాతీయ స్వభావానికి, సామాజిక స్వరూపానికి ఇది ఆత్మ వంటిదని శ్రీ మోదీ అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' విధానంతో దేశ విధానాలను సమ్మిళితం చేసిందని ఆయన ఉద్ఘాటించారు. "రాబోయే 25 ఏళ్లలో, ఈ ప్రయత్నాలు అభివృద్ధి చెందిన, ఆరోగ్యకరమైన భారతదేశానికి బలమైన పునాది వేస్తాయి" అని పేర్కొంటూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జే పీ నడ్డా, కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధాన పథకం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎమ్-జెఎవై)ని విస్తరిస్తూ, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించే పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది వారి ఆదాయంతో సంబంధం లేకుండా వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీని అందించడంలో సహాయపడుతుంది.

దేశవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం కోసం ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక వసతులను మెరుగురచడం కోసం ప్రధానమంత్రి పలు ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.

దేశంలో మొదటి అఖిల భారత ఆయుర్వేద సంస్థ రెండో దశను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇందులో పంచకర్మ ఆసుపత్రి, ఔషధాల తయారీకి ఆయుర్వేద ఫార్మసీ, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్, సెంట్రల్ లైబ్రరీ, ఐటీ, అంకురసంస్థల ఇంక్యుబేషన్ సెంటర్, 500 సీట్లు గల ఆడిటోరియం ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్, నీముచ్, సియోనిలలో మూడు వైద్య కళాశాలలను కూడా ఆయన ప్రారంభించారు. ఇంకా, హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి, బీహార్‌లోని పాట్నా, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, అస్సాంలోని గౌహతి, న్యూఢిల్లీలోని వివిధ ఎయిమ్స్‌లలో సౌకర్యాలు, సేవల విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. ఇందులో జన ఔషధీ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని, ఒడిశాలోని బార్‌గఢ్‌లో క్రిటికల్ కేర్ విభాగాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.

 

|

మధ్యప్రదేశ్‌లోని శివపురి, రత్లాం, ఖాండ్వా, రాజ్‌గఢ్, మందసౌర్‌లలో అయిదు నర్సింగ్ కళాశాలలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పిఎమ్-ఎబిహెచ్ఐఎమ్) కింద హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, తమిళనాడు, రాజస్థాన్‌లలో 21 క్రిటికల్ కేర్ విభాగాలను, న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ ఎయిమ్స్‌లలో అనేక సౌకర్యాలు, సేవల విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈఎస్ఐసీ ఆసుపత్రిని ప్రధానమంత్రి ప్రారంభించారు. హర్యానాలోని ఫరీదాబాద్, కర్ణాటకలోని బొమ్మసంద్ర, నర్సాపూర్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురంలో ఈఎస్ఐసీ ఆసుపత్రులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు దాదాపు 55 లక్షల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందిస్తాయి.

అన్ని సేవలనీ అందించే వ్యవస్థలను మెరుగుపరచడం కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని విస్తరించడాన్ని ప్రధానమంత్రి బలంగా సమర్థిస్తారు. ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగించడానికి వీలుగా 11 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో డ్రోన్ సేవలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్, తెలంగాణలోని బీబీనగర్, అస్సాంలోని గౌహతి, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, బీహార్‌లోని పాట్నా, హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లలో, మణిపూర్‌లోని ఇంఫాల్‌లో గల రిమ్స్‌లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. అలాగే రిషికేశ్ ఎయిమ్స్ నుంచి అత్యవసర హెలికాప్టర్ వైద్య సేవలను సైతం ఆయన ప్రారంభించారు. ఇది అత్యంత వేగంగా వైద్య సేవలను అందించడంలో సహాయపడుతుంది.

యూ-విన్ పోర్టల్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. టీకా ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా గర్భిణులు, శిశువులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. టీకా ద్వారా నివారించగల 12 వ్యాధుల నుంచి రక్షణ కోసం, దీని ద్వారా గర్భిణులు, పిల్లల (పుట్టుక నుంచి 16 సంవత్సరాల వరకు) ప్రాణాలను రక్షించే టీకాలు సకాలంలో అందించవచ్చు. ఇంకా, అనుబంధ, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సంస్థల కోసం ఒక పోర్టల్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సంస్థల కేంద్రీకృత డేటాబేస్‌గా పని చేస్తుంది.

దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మెరుగుపరచడం కోసం పరిశోధన, అభివృద్ధి, పరీక్షల కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే అనేక కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌ గోతపట్నలో సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీని కూడా ఆయన ప్రారంభించారు.

 

|

ఒడిశాలోని ఖోర్ధా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో యోగా, నేచురోపతిలో రెండు సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఆయన శంకుస్థాపన చేశారు. వైద్య పరికరాల కోసం గుజరాత్‌లోని ఎన్ఐపీఈఆర్ అహ్మదాబాద్‌లో, బల్క్ డ్రగ్స్ కోసం తెలంగాణలోని ఎన్ఐపీఈఆర్ హైదరాబాద్‌లో, ఫైటోఫార్మాస్యూటికల్స్ కోసం అస్సాంలోని ఎన్ఐపీఈఆర్ గౌహతిలో, యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ డ్రగ్ ఆవిష్కరణ, అభివృద్ధి కోసం పంజాబ్‌లోని ఎన్ఐపీఈఆర్ మొహాలీలో నాలుగు ఎక్స్‌లెన్స్ సెంటర్‌లకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో మధుమేహం, జీవక్రియ సంబంధ రుగ్మతల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్, ఐఐటీ ఢిల్లీలో అధునాతన సాంకేతిక పరిష్కారాలు, అంకురసంస్థలకు మద్దతు, రసౌషధీల కోసం నెట్ జీరో సుస్థిర పరిష్కారాల కోసం సుస్థిరమైన ఆయుష్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్, లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో, ఆయుర్వేదంలో ప్రాథమిక, ట్రాన్స్‌లేషనల్ పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్; న్యూఢిల్లీలోని జేఎన్‌యూలో ఆయుర్వేదం, సిస్టమ్స్ మెడిసిన్‌పై ఎక్సెలెన్స్ సెంటర్ వంటి నాలుగు ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కేంద్రాలను ప్రధానమంత్రి ప్రారంభించారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం, గుజరాత్‌లోని వాపి, తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, హిమాచల్ ప్రదేశ్‌లోని నలాగఢ్‌లో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకం కింద అయిదు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ విభాగాలు ముఖ్యమైన బల్క్ డ్రగ్స్‌తో పాటు బాడీ ఇంప్లాంట్లు, క్రిటికల్ కేర్ పరికరాల వంటి అత్యాధునిక వైద్య పరికరాలను తయారు చేస్తాయి.

ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహనను పెంపొందించే లక్ష్యంతో "దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్" అనే దేశవ్యాప్త ప్రచారాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కోసం వాతావరణ మార్పులు, మానవ ఆరోగ్యంపై రాష్ట్ర నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ఆయన ప్రారంభించారు. ఇది వాతావరణాన్ని తట్టుకునే ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేయడానికి అనుసరణ వ్యూహాలను రూపొందించనుంది.

 

Click here to read full text speech

  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • Ganesh Dhore January 02, 2025

    Jay Bharat 🇮🇳🇮🇳
  • Avdhesh Saraswat December 27, 2024

    NAMO NAMO
  • Vivek Kumar Gupta December 25, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta December 25, 2024

    नमो ...........................🙏🙏🙏🙏🙏
  • Gopal Saha December 23, 2024

    hi
  • Aniket Malwankar November 25, 2024

    #NaMo
  • Chandrabhushan Mishra Sonbhadra November 25, 2024

    🚩
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's first microbiological nanosat, developed by students, to find ways to keep astronauts healthy

Media Coverage

India's first microbiological nanosat, developed by students, to find ways to keep astronauts healthy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi greets the people of Arunachal Pradesh on their Statehood Day
February 20, 2025

The Prime Minister, Shri Narendra Modi has extended his greetings to the people of Arunachal Pradesh on their Statehood Day. Shri Modi also said that Arunachal Pradesh is known for its rich traditions and deep connection to nature. Shri Modi also wished that Arunachal Pradesh may continue to flourish, and may its journey of progress and harmony continue to soar in the years to come.

The Prime Minister posted on X;

“Greetings to the people of Arunachal Pradesh on their Statehood Day! This state is known for its rich traditions and deep connection to nature. The hardworking and dynamic people of Arunachal Pradesh continue to contribute immensely to India’s growth, while their vibrant tribal heritage and breathtaking biodiversity make the state truly special. May Arunachal Pradesh continue to flourish, and may its journey of progress and harmony continue to soar in the years to come.”