రూ. 11,200 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభం: జాతికి అంకితం చేసిన శ్రీ మోదీ
జిల్లాకోర్టు నుంచి స్వర్గేట్ వరకు పూణే మెట్రో మార్గం ప్రారంభం బిడ్కిన్ పారిశ్రామికవాడ జాతికి అంకితం సోలాపూర్ విమానాశ్రయ ప్రారంభం
భిదేవాడలో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే తొలి బాలికల పాఠశాల స్మారకానికి శంకుస్థాపన
“మహారాష్ట్రలో పలు ప్రాజెక్టుల ప్రారంభంతో పట్టణాభివృద్ధికి ఊతం, ప్రజల ‘జీవన సౌలభ్యం’ కోసం గణనీయ తోడ్పాటు”
“పూణేలో జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా వేగంగా దూసుకెళ్తున్నాం”
“షోలాపూర్‌కు నేరుగా విమానాలు: విమానాశ్రయ విస్తరణ పూర్తి”
“ప్రాథమిక విలువల ఆధారంగానే ఆధునిక భారత్‌, ఆధునీకరణ”
“అమ్మాయిల చదువు కోసం సావిత్రీబాయి ఫూలే వంటి దార్శనికులు మార్గాన్ని సుగమం చేశారు”
మహారాష్ట్రలో రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో అనుసంధానం ద్వారా శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

మహారాష్ట్రలో రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో అనుసంధానం ద్వారా శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. రెండు రోజుల కిందట ప్రతికూల వాతావరణం కారణంగా పూణేలో తన కార్యక్రమాలను రద్దు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నాటి వీడియో అనుసంధాన కార్యక్రమం ద్వారా మహనీయుల స్ఫూర్తి భూమి అయిన మహారాష్ట్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం ఈ సాంకేతిక కార్యక్రమం వల్ల సుసాధ్యం అయిందన్నారు. పూణేలో జిల్లాకోర్టు నుంచి స్వర్గేట్ వరకు మెట్రో మార్గ ప్రారంభోత్సవాన్నీ, పూణే మెట్రో ఫేజ్-1ను ఈరోజు స్వర్గేట్ నుంచి కత్రాజ్ వరకు పొడిగించే పనుల శంకుస్థాపననూ మోదీ ప్రస్తావించారు. భిదేవాడలో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే మొదటి బాలికల పాఠశాల కోసం స్మారక కేంద్రానికి శంకుస్థాపన గురించి మాట్లాడిన మోదీ పూణేలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించే పనుల వేగవంతమైన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

 

షోలాపూర్ విమానాశ్రయ ప్రారంభం ద్వారా నగరానికి నేరుగా విమాన అనుసంధానంతో భగవాన్ విఠల్ భక్తులు ప్రత్యేక కానుక పొందారని మోదీ పేర్కొన్నారు. టెర్మినల్ కెపాసిటీ పెంపు, ప్రస్తుత విమానాశ్రయ విస్తరణ పనులు పూర్తయితే కొత్త సర్వీసులు, సదుపాయాలతో భగవాన్ విఠల్ భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ విమానాశ్రయం వల్ల వ్యాపారాలు, పరిశ్రమలతో పాటు పర్యాటక రంగానికీ ప్రోత్సాహం లభిస్తుందన్న ప్రధాని, నేటి అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.

“నేడు, మహారాష్ట్రకు సరికొత్త తీర్మానాలతో అతిపెద్ద లక్ష్యాలు అవసరం” అని పేర్కొన్న ప్రధాన మంత్రి... పూణే వంటి నగరాలను ప్రగతికి, పట్టణాభివృద్ధికి కేంద్రంగా మార్చాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. పూణే పురోగతిని, పెరుగుతున్న జనాభా ఒత్తిడిని గురించి మాట్లాడిన ప్రధానమంత్రి, అభివృద్ధినీ, సామర్థ్యాన్నీ పెంపొందించడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ లక్ష్యాల సాధన కోసం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పూణే నగర ప్రజారవాణాను ఆధునీకరించేందుకు కృషి చేస్తోందన్న ప్రధానమంత్రి విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా కనెక్టివిటీకి ఊతమిస్తోందని తెలిపారు.

 

పూణే మెట్రో గురించి 2008లోనే చర్చలు ప్రారంభమైనా, పనులు ప్రారంభం కాలేదనీ అయితే తమ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంతో 2016లో దానికి పునాదిరాయి పడిందని ప్రధాని గుర్తు చేశారు. ఫలితంగా ఈ రోజు పూణే మెట్రో పనులు వేగంగా విస్తరిస్తున్నాయని ప్రధాని అన్నారు. నేటి ప్రాజెక్టుల గురించి శ్రీ మోదీ మాట్లాడుతూ, ఒకవైపు జిల్లా కోర్ట్ నుంచి స్వర్గేట్ వరకు పూణే మెట్రో మార్గాన్ని ప్రారంభించడంతో పాటు, మరోవైపు స్వర్గేట్ నుంచి కత్రాజ్ మార్గానికి శంకుస్థాపన కూడా జరిగిందని తెలిపారు. ఈ ఏడాది మార్చిలోనే రూబీ హాల్ క్లినిక్ నుంచి రాంవాడి వరకు మెట్రో సేవలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు పూణే మెట్రో విస్తరణ కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, అడ్డంకులను తొలగించేందుకు జరిగిన కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. గత ప్రభుత్వం 8 ఏళ్లలో ఒక్క మెట్రో పిల్లర్‌నూ నిర్మించలేకపోయిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం పూణేలో ఆధునిక మెట్రో నెట్‌వర్క్‌ను సిద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్ర పురోగతి కొనసాగింపులో అభివృద్ధి-ఆధారిత పాలన ప్రాముఖ్యతను శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏదైనా అంతరాయం కలిగితే అది రాష్ట్రానికి గణనీయమైన నష్టాలకు దారితీస్తుందన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాకముందు మెట్రో కార్యక్రమాల నుంచి ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు వరకు- ఆగిపోయిన వివిధ ప్రాజెక్టులను, రైతుల కోసం ఆలస్యమైన కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.


 

నాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హయాంలో రూపొందించిన ఆరిక్ సిటీలోని కీలకమైన బిడ్కిన్ పారిశ్రామికవాడ గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్‌లోని ఈ ప్రాజెక్ట్ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషితో సుసాధ్యం అయిందన్నారు. బిడ్కిన్ పారిశ్రామికవాడ ప్రాంతాన్ని దేశానికి అంకితం చేస్తున్నట్లు శ్రీ మోదీ ప్రకటించారు. ఈ ప్రాంతానికి గణనీయమైన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను తీసుకురావడంలో దాని సామర్థ్యాన్ని వివరించారు. "8,000 ఎకరాల్లో బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో, వేల కోట్ల పెట్టుబడులు మహారాష్ట్రకు రావడంతో పాటు వేలాది యువతకు ఉద్యోగాలు లభిస్తాయి" అని ప్రధాన మంత్రి అన్నారు. పెట్టుబడుల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలనే వ్యూహం నేడు మహారాష్ట్ర యువతకు ప్రధాన శక్తిగా మారుతున్నదని ఉద్ఘాటించారు. దేశ ప్రధాన విలువల ఆధారంగానే ఆధునీకరణ జరగాలన్నారు. భారత్ తన గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఆధునీకరణను, అభివృద్ధినీ సాధిస్తున్నదని తెలిపారు. భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రతి వర్గానికి చేరే అభివృద్ధి ప్రయోజనాలు రెండూ మహారాష్ట్రకు సమాన ప్రాధాన్యాలన్నారు. దేశంలోని ప్రతి వర్గం అభివృద్ధిలో పాలుపంచుకున్నప్పుడు అది వాస్తవరూపం దాల్చుతుందని శ్రీ మోదీ తెలిపారు.

 

సామాజిక పరివర్తనలో మహిళా నాయకత్వ కీలక పాత్రను ప్రధాన మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. మహిళా సాధికారతలో మహారాష్ట్ర వారసత్వానికి, ముఖ్యంగా మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం ద్వారా మహిళా విద్య కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన సావిత్రిబాయి ఫూలే కృషికి ఆయన నివాళులర్పించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రంథాలయంతో పాటు ఇతర అవసరమైన సదుపాయాలు గల సావిత్రీబాయి ఫూలే స్మారక కేంద్రానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ స్మారక కేంద్రం సంఘ సంస్కరణ ఉద్యమానికి శాశ్వత నివాళిగా నిలుస్తూ, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్యానికి పూర్వం భారత మహిళలు ఎదుర్కొన్న అనేక సవాళ్లను, ప్రత్యేకించి చదువు కోసం వారు పడిన ఇబ్బందులను ప్రధాన మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. సావిత్రిబాయి ఫూలే వంటి దార్శనికులు మహిళా విద్యకు మార్గాన్ని సుగమం చేశారని ప్రశంసించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, దేశం నాటి ఆలోచనలను పూర్తిగా విడనాడలేకపోయిందనీ, అనేక రంగాల్లో మహిళల ప్రవేశాన్ని పరిమితం చేసిన గత ప్రభుత్వాలే దీనికి కారణమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలు లేక బాలికలు చదువు మానేసే పరిస్థితులు నాడు ఉండేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సైనిక్ పాఠశాలల్లో, సాయుధ దళాల్లో మహిళలకు ప్రవేశం కల్పించడం అలాగే కాలం చెల్లిన వ్యవస్థలను సమూలంగా మార్చడంతో పాటు గర్భిణీ స్త్రీలు సైతం తమ పనిని కొనసాగించేలా చేసిందని శ్రీ మోదీ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన ఇబ్బందుల నుంచి విముక్తి పొందిన మన ఆడబిడ్డలు అతిపెద్ద లబ్ధిదారులుగా ఉన్న స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం గణనీయమైన ప్రభావాన్ని ప్రధాన మంత్రి వివరించారు. పాఠశాల పారిశుధ్యం మెరుగుదలతో బాలికలు బడిమానేయడం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాల అమలును, భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల నాయకత్వాన్ని మెరుగుపరిచే నారీ శక్తి వందన్ అధినీయమ్‌ను గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. సావిత్రిబాయి ఫూలే స్మారక కేంద్రం ఈ తీర్మానాలకు, మహిళా సాధికారత ప్రచారానికి మరింత శక్తిని ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, "మన ఆడబిడ్డల కోసం ప్రతి రంగం తలుపులు తెరచినప్పుడు మాత్రమే దేశ ప్రగతికి తలుపులు తెరుచుకుంటాయి" అని శ్రీ మోదీ అన్నారు.

 

ప్రసంగాన్ని ముగిస్తూ, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో మహారాష్ట్ర కీలక పాత్రపై తన నమ్మకాన్ని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి, “మనమంతా కలిసి ‘వికసిత్ మహారాష్ట్ర, వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు.

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి పి రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్, శ్రీ అజిత్ పవార్ సహా ఇతర ప్రముఖులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.

నేపథ్యం

పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ (ఫేజ్-1) పూర్తి చేసే జిల్లా కోర్ట్ నుంచి స్వర్గేట్ వరకు గల పూణే మెట్రో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. జిల్లా కోర్టు నుంచి స్వర్గేట్ మధ్య ఈ భూగర్భ రైలు మార్గం కోసం దాదాపు రూ.1,810 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే, దాదాపు రూ. 2,955 కోట్లతో అభివృద్ధి చేయనున్న పూణే మెట్రో ఫేజ్-1లోని స్వర్గేట్-కత్రాజ్ విస్తరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దాదాపు 5.46 కి.మీ. ఈ దక్షిణ ప్రాంత విస్తరణలో మార్కెట్ యార్డ్, పద్మావతి, కత్రాజ్ అనే మూడు స్టేషన్లు పూర్తిగా భూగర్భ మార్గంలో ఉంటాయి.

 

భారత ప్రభుత్వ జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద 7,855 ఎకరాల విస్తీర్ణంలో విస్తారమైన పరివర్తన ప్రాజెక్ట్ అయిన బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు దక్షిణాన 20 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్ కింద అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్ట్ మరఠ్వాడా ప్రాంతంలో శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. 3 దశల్లో అభివృద్ధి చేసేందుకు రూ.6,400 కోట్లకు పైగా ప్రాజెక్టు వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

పర్యాటకులు, వ్యాపారులు, యాత్రికులు అలాగే పెట్టుబడిదారులకు షోలాపూర్‌ మరింత అందుబాటులో ఉండేలా, కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచే షోలాపూర్ విమానాశ్రయాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. షోలాపూర్‌లోని ప్రస్తుత టెర్మినల్ భవనం సంవత్సరానికి 4.1 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా అభివృద్ధి చేశారు. అలాగే, భిదేవాడలో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే మొదటి బాలికల పాఠశాల స్మారక కేంద్రానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

Click here to read full text speech

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi calls upon everyone to make meditation a part of their daily lives
December 21, 2024

Prime Minister Shri Narendra Modi has called upon everyone to make meditation a part of their daily lives on World Meditation Day, today. Prime Minister Shri Modi remarked that Meditation is a powerful way to bring peace and harmony to one’s life, as well as to our society and planet.

In a post on X, he wrote:

"Today, on World Meditation Day, I call upon everyone to make meditation a part of their daily lives and experience its transformative potential. Meditation is a powerful way to bring peace and harmony to one’s life, as well as to our society and planet. In the age of technology, Apps and guided videos can be valuable tools to help incorporate meditation into our routines.”